Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాజకీయ క్రీనీడలో అధికారుల బదిలీలు!

$
0
0

ఒంగోలు, మే 14: జిల్లావ్యాప్తంగా రాజకీయాల నీడలో పెద్దఎత్తున బదిలీలు జరిగాయి. నాయకుల సిఫార్సుల మేరకే జిల్లాలో పలువురు ఎంపిడిఒల బదిలీలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం జరిగిన ఎంపిడిఒల బదిలీలకు రాజకీయరంగు అంటుకుంది. ఒంగోలు ఎంపిడిఒగా పనిచేస్తున్న కృష్ణారెడ్డిని కొనకనమిట్లకు, కొత్తపట్నంలో పనిచేస్తున్న నారాయణరెడ్డిని పొదిలికి, మార్టూరులో పనిచేస్తున్న ఇందురేఖను కొత్తపట్నానికి, టంగుటూరులో పనిచేస్తున్న వెంకటేశ్వరరావును ఒంగోలుకు, పొదిలిలో పనిచేస్తున్న రాజేష్‌ను దర్శికి, దర్శిలో పనిచేస్తున్న నరసింహారావును సంతమాగులూరు మండలానికి బదిలీ చేశారు. అదేవిధంగా తాళ్ళూరులో పనిచేస్తున్న ఎంపిడిఒ హనుమంతరావును వేరే మండలానికి, జె పంగులూరులో పనిచేస్తున్న శింగయ్యను మార్టూరుకు మంగళవారం రాత్రి బదిలీ చేశారు. ఆమేరకు ఆదేశాలు కూడా సిఇఒ జారీ చేసినట్లు సమాచారం. ఇదిలాఉండగా జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న నాగేశ్వరరావును అకస్మాత్తుగా కర్నూలు జిల్లాకు మంగళవారం బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో రాజేశ్వరరావును నియమించినట్లు సమాచారం. కాగా డిఇఒ బదిలీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక ముఖ్యనేత ఆయన్ను పట్టుబట్టి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆ విద్యాశాఖాధికారికి జిల్లాలోని ఒక శాసనసభ్యుడికి మధ్య కూడా సయోధ్య లేకపోవటంతో బదిలీ వేటుకు గురయ్యారు. తిరిగి మళ్ళీ డిఇఒగా వచ్చినప్పటికి ఆయన మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కాగా జిల్లాలో ప్రస్తుతం టీచర్ల బదిలీలు జరుగుతున్న నేపథ్యంలో డిఇఒ బదిలీ కావటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉండగా త్వరలో తహశీల్దార్ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది. తమకు అనుకూలమైన వారిని నియమించుకునేందుకు మండల స్థాయి నేతలు ఈపాటికే స్థానిక శాసనసభ్యులపై ఒత్తిడి పెంచినట్లు రాజకీయవర్గాల సమాచారం. కాగా ఎస్‌ఐలు, సిఐలు బదిలీలు కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈపాటికే ఒంగోలు డిఎస్‌పి రజనీకాంత్‌రెడ్డిని బదిలీ చేసి ఆయన స్థానంలో జాఘువాను నియమించారు. త్వరలో ఎస్‌ఐలు, సిఐల బదిలీలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించకుంది. జిల్లావ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. మొత్తంమీద జిల్లాలో రాజకీయ నేతల కనుసన్నల్లో బదిలీల పర్వం కొనసాగుతోంది.

‘మద్య నియంత్రణకు ఐక్య పోరాటాలే శరణ్యం’
ఒంగోలు, మే 14 : రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించేందుకు అందరూ ఐక్యంగా పోరాడాలని మద్య నియంత్రణ ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ వి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఆచార్య రంగా భవన్‌లో మద్య నియంత్రణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని మద్య నియంత్రణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య రంగా కిసాన్ సంస్థ అధ్యక్షులు ఆళ్ళ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాల వల్ల పేద ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, వారి కుటుంబాలు గుల్ల అవుతున్నాయని అన్నారు. మద్యం వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తెనాలిలో ఓ యువతిని కొంతమంది యువకులు మద్యం సేవించి ఇబ్బందికరంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోబోయిన తల్లిని వాహనం కిందకు నెట్టేయడంతో ఆమె మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ రహదారులు, బడి, గుడి ఉన్న ప్రాంతాల్లో బెల్టుషాపులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. మద్యాన్ని నిషేధిస్తేనే తాము ఓటు వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పే విధంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మరో ముఖ్యఅతిధి మాజీ మంత్రి, బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ తాను గతంలో ఎక్సైజ్ శాఖా మంత్రిగా పని చేశానని, అయినప్పటికీ మద్యం సేవించడం వల్ల నష్టాలను తెలియజేస్తూ ప్రజలను చైతన్యం చేసి మద్యం నియంత్రణకు కట్టుబడి పని చేసినట్లు తెలిపారు. ఆనాడు బెల్టు షాపులు పెద్దగా లేవని, ఈనాడు బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బెల్టుషాపులు ఎత్తివేసేందుకు ఆదేశాలు జారీ చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం మద్యాన్ని రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. తెలుగు మహిళా నాయకురాలు పి అరుణ మాట్లాడుతూ మద్య నిషేధం, బెల్టుషాపుల ఎత్తివేత కోసం తాము నిరంతరం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. లోక్‌సత్తా పార్టీ నాయకురాలు డాక్టర్ రాధాదేవి మాట్లాడుతూ మద్య నిషేధం కోసం లోక్‌సత్తా పార్టీ మొదట్నుంచీ పని చేస్తున్నట్లు తెలిపారు. భారత వర్జీనియా పొగాకు రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు చుండూరి రంగారావు, తెలుగు మహిళా జిల్లా నాయకురాళ్ళు టి అనంతమ్మ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యవతి, వైఎస్‌ఆర్‌సిపి నాయకురాళ్ళు కావూరి సుశీల, జెవివి నాయకులు ప్రసాద్, డాక్టర్ చుంచు చలమయ్య, న్యాయవాది దేవకుమారి, వినియోగదారుల ఫోరం నాయకులు నాగేశ్వరరావు, హేతువాద సంఘం నాయకులు నార్నె వెంకటసుబ్బయ్య, నాయకులు డిఎస్ క్రాంతికుమార్, నాగబోయిన భాస్కర్‌రావు, బైరపనేని సూర్యనారాయణ, రాజ్యలక్ష్మి, రాయపాటి జగదీష్, కుర్రా ప్రసాద్‌బాబు, మిడసల మల్లికార్జున్‌రావు తదితర నాయకులు పాల్గొని బెల్టు షాపులను వెంటనే ఎత్తివేయాలని, ప్రభుత్వం మద్య నియంత్రణ చేసేంత వరకు పోరాటం సాగిస్తామని తెలిపారు. ఆ మేరకు ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వారు ప్రకటించారు.

రిమ్స్‌పై నిర్లక్ష్యం తగదు
పనులు వెంటనే పూర్తిచేయాలి
కలెక్టర్ విజయ్‌కుమార్ ఆదేశం
ఒంగోలు, మే 14: రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (రిమ్స్)పై నిర్లక్ష్యం తగదని, ఆసుపత్రిలో వివిధ బ్లాక్‌ల నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రిమ్స్ హాస్పటల్ అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిమ్స్ హాస్పటల్, వైద్య కళాశాలల్లో భవనాల నిర్మాణం ఏళ్ళ తరబడి కొనసాగుతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు తనిఖీకి వచ్చే ముందు హడావిడి చేసి తరువాత పట్టించుకోకుండా వదిలివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రిమ్స్‌లో నాల్గో తరగతి ఉద్యోగులకు 206 పోస్టులు ఉండగా 26 మంది మాత్రమే పని చేస్తున్నారని, 180 పోస్టులు ఖాళీ గా ఉన్నాయని రిమ్స్ డైరెక్టర్ బి అంజయ్య సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. నాల్గో తరగతి సిబ్బంది కొరత వల్ల పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందన్నారు. దీంతోపాటు గతంలో పాత రిమ్స్‌కు కేటాయించిన సిబ్బందే ప్రస్తుతం కొనసాగుతున్నందున సిబ్బంది సంఖ్యను కూడా పెంచాల్సి ఉందని తెలిపారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. రిమ్స్‌లో అల్ట్రాసౌండ్ మిషన్ మరమ్మతులకు లక్ష రూపాయలు ఖర్చుచేయడానికి ఆమోదం తెలుపుతూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈసమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుధాకర్‌బాబు, వైద్యవిధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ చలమయ్య, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ రామప్రసాద్, ప్రొఫెసర్ ఐ మల్లికార్జున్, డాక్టర్ ఎ కృష్ణారావు, డాక్టర్ బాలాజీనాయక్, ప్రొఫెసర్ సూర్యకుమారి, ఎపిఎస్‌ఎం ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వి కోటేశ్వరరావు, ఇందిరా క్రాంతిపధం మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.

టిడిపిని వీడను
ఎమ్మెల్యే కందుల స్పష్టం
మార్కాపురం, మే 14: తానెప్పుడూ పార్టీ ఫిరాయిస్తానని ఎవరికీ చెప్పలేదని, అయితే కొందరు తనపై దుష్ప్రచారం చేశారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఈ విలేఖరి ఆయనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపికే ప్రజలు పట్టం కడతారని, చంద్రబాబు సిఎం కావడం ఖాయమని అన్నారు. నీతికి, అవినీతికి మధ్య ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో టిడిపిని ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేసిన మాట వాస్తవమేనని, అయితే తానెప్పుడు అలా ఆలోచించలేదని అన్నారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన కన్నతల్లి లాంటి పార్టీని వీడి మరోపార్టీలో చేరాల్సిన అవసరం లేదని, అధికారం లేకపోయినా ప్రతిపక్ష శాసనసభ్యునిగా తనకు చేతనైనంతలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కందుల అన్నారు. పార్టీలో కార్యకర్తలతో ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉన్నా వాటిని కుటుంబ సమస్యలుగా భావించి అందరిని కలుపుకొని రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడైనా ఏదైనా దుష్ప్రచారం జరుగుతుంటే కార్యకర్తలు తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. జిల్లాతోపాటు రాష్ట్రంలో కూడా పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, విజయం టిడిపిదేనని ధీమా వ్యక్తం చేశారు. కొందరు తమ రాజకీయ భవితవ్యం కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారని, అలాంటి వారివలన పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని, పాతనీరు పోతే కొత్తనీరు వస్తుందని అన్నారు.

మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
ఒంగోలు ఎంపి మాగుంట స్పష్టం
ఒంగోలు, మే 14:మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ప్రకాశం భవన్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో ఇందిరాక్రాంతిపథం మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. మహిళా సాధికారతే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని పొదుపు గ్రూపులు చక్కగా పనిచేస్తు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మహిళల సంక్షేమం కోసం స్ర్తినిధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దీంతోపాటు పొదుపుగ్రూపులు సమావేశాన్ని ఏర్పాటుచేసుకునేందుకు ఒంగోలు నగరంలో ఒక్కొక్కటి 25 లక్షల రూపాయల వ్యయంతో రెండు మహిళా సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పిల్లల భవిష్యత్తుకోసం బంగారుతల్లి పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. 2011-12, 12-13 సంవత్సరాల్లో వడ్డీలేని రుణాలు తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన పొదుపుగ్రూపులకు 45 లక్షల రూపాయల వడ్డీ రాయితీని ఇప్పుడు పంపిణీ చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో నగరంలోని 3212 గ్రూపులు వడ్డీరాయితీ రుణాలు పొందేందుకు అర్హత సాధించాలని కోరారు. ఈసందర్భంగా నగరపాలక కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో రెండువేల మహిళా గ్రూపులుంటే 426 గ్రూపులు వడ్డీరాయితీకి అర్హత సాధించాయన్నారు. మిగిలిన గ్రూపులు కూడా బ్యాంకు రుణాల వాయిదాలు సక్రమంగా చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని సూచించారు. ఆంధ్రాబ్యాంకు జోనల్ మేనేజరు సురేంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంకు రుణాల్లో 40శాతం రుణాలు స్వయంసహాయక సంఘాలకు ఇచ్చామని పేర్కొన్నారు. గ్రూపులు వాయిదాలు సక్రమంగా చెల్లిస్తే ఒక్కొక్క గ్రూపునకు పది లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నిగ్రూపులు బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి అర్హత పొందేందుకు కృషి చేయాలని కోరారు. మెప్మా పిడి నాగేంద్రప్రసాదు మాట్లాడుతూ జిల్లాలోని ఎనిమిది మునిసిపాలిటీల పరిధిలో 8527 పొదుపు గ్రూపులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. గత సంవత్సరం వివిధ బ్యాంకుల ద్వారా 2297 పొదుపుగ్రూపులకు 62 కోట్ల రూపాయల రుణాలను ఇప్పించామన్నారు. వీటితోపాటు మహిళల స్వయం ఉపాధికోసం 365 మందికి మెప్మాద్వారా 3.70 కోట్ల రూపాయల వ్యక్తిగత రుణాలు 25 శాతం సబ్సిడీతో అందించామని వివరించారు. రాజీవ్ యువకిరణాల పథకం కింద 2196 మందికి శిక్షణ ఇచ్చి 1213 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగాలను కల్పించినట్లు చెప్పారు. అనంతరం నగరంలోని 426 మహిళా గ్రూపులకు 45 లక్షల రూపాయల వడ్డీ రాయితీని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజరు జెవిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాతృభాష పరిరక్షణకు కృషి చేద్దాం
సాహిత్య సంస్థల ఐక్యవేదిక పిలుపు
ఘనంగా అధికార భాషా దినోత్సవం
ఒంగోలు, మే 14:మన సంస్కృతి, నాగరికతల బలోపేతానికి సామాజిక అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న మాతృభాష తెలుగు పరిరక్షణకు కృషి చేద్దామని పలు సాహిత్య సంస్థల ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అధికార భాషా సంఘం మే 14వ తేదీని అధికార భాషా దినోత్సవంగా ప్రకటించి పిలుపునిచ్చిన సందర్భంగా ప్రకాశం జిల్లా సాహిత్య సంస్థల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులోని పలువురు విశిష్ట సాహితీ ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సాహిత్యసంస్థల ఐక్యవేదిక గౌరవాధ్యక్షులు మిడసల మల్లికార్జున్‌రావు, అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూకతోటి రవికుమార్ , నూనె అంకమ్మరావులు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఒంగోలు చర్చి సెంటర్‌లోని మహాభారత ఇతిహాస కవి, ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడ, ప్రకాశం భవనం ప్రాంగణంలోని మహాకవి, కవితా విశారదుడు గుర్రం జాషువా, ఒంగోలు కొండమీద చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా జాషువా ప్రాంగణంలోని జాషువా విగ్రహ సమీపంలో జాషువా రచించిన పలు పద్యాలను, పద్యనాటక కళాకారులు కనమాల రాఘవులు, కవులు, మల్లవరపు రాజేశ్వరరావు, కొలకలూరి స్వరూపరాణి, ఆంధ్ర పద్య కవితా సదస్సు కార్యదర్శి భువనగిరి పురుషోత్తం, సింహాద్రి జ్యోతిర్మయి, ఈవి రత్నంలు రాగయుక్తంగా ఆలపించారు. అనంతరం త్యాగయ్య విగ్రహ సమీపంలో గౌరవాధ్యక్షులు మిడసల మల్లికార్జున్‌రావు త్యాగయ్య కృతిని ఆలపించగా అంతా బృందగానం చేశారు. ఈసందర్భంగా ఐక్యవేదిక అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ నూకతోటి రవికుమార్, అంకమ్మరావులు మాట్లాడుతూ త్వరలో కార్మిక, కర్షక కవితా సంకలనాన్ని సాహిత్య సంస్థల వేదిక ప్రచురణగా తీసుకొని రానున్నందున సంస్థ ప్రతినిధులు వారం లోపు కవితలు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు జి ఓబుల్‌రెడ్డి, కుర్రా ప్రసాద్‌బాబు, తెలుగు సాహిత్య సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎల్ కాంతారావు, యువి రత్నం, మల్లవరపు జాన్, మధుర సాహిత్య భారతి సాహితీ సంస్థ అధ్యక్షులు మల్లవరపు రాజేశ్వరరావు, జిల్లా రచయిత్రుల వేదిక కన్వీనర్ డి రాజ్యలక్ష్మి, ప్రకాశిని - విశిష్ట సాహిత్య ప్రసంగాల వేదిక కన్వీనర్ డాక్టర్ వంకాయలపాటి రామకృష్ణ, గుండ్లకమ్మ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీరామకవచం సాగర్, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సూదనగుంట వెంకటేశ్వర్లు, రచయితలు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, కెఎస్‌వి ప్రసాద్, పద్యకవులు కారుమంచి బాదరయ్య, చనగపల్లి సుబ్బారావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎస్‌డి ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

నలుగురు దొంగలు అరెస్టు
రూ.3.91 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
పొదిలి, మే 14 : ఇటీవల కొంతకాలంగా పొదిలి ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3.91 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరచుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో దర్శి డిఎస్‌పి కె వెంకటలక్ష్మి చోరీలకు సంబంధించిన వివరాలను తెలిపారు. పామూరు మండలం కమ్మవారిపాలెంపల్లికి చెందిన ఎన్ జార్జి, పి దేవసహాయం, ఇట్టా హనుమంతరావు, దేవరకొండ బాబు అనే నలుగురు గత కొంత కాలంగా పొదిలి ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డిఎస్‌పి తెలిపారు. పొదిలిలో పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, వరికూటి మహేష్ ఇళ్లతో పాటు బిసి కాలనీలోని మరో ఇంటిలో కూడా వీరు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. సోమవారం జార్జిని కనిగిరి నుండి కంభం వెళ్ళే దారిలో పోలీసులు అరెస్టు చేశారన్నారు. మిగతా ముగ్గురిని మంగళవారం ఉదయం స్థానిక చిన బస్టాండ్ సెంటర్‌లో పట్టుకొని వారు దొంగిలించిన బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నలుగురిని స్థానిక కోర్టులో హాజరు పరస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో పొదిలి సిఐ సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ కె కమలాకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. కాగా దొంగలను అరెస్టు చేయడంలో కీలకపాత్ర వహించిన హెడ్ కానిస్టేబుల్ గౌస్‌బాషా, కానిస్టేబుళ్ళు హరి, హుస్సేన్, అంజిబాబు, వౌలాలి, శివ తదితరులను డిఎస్‌పి వెంకటలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు.

రేషన్ బియ్యం పట్టివేత
వేటపాలెం, మే 14:వేటపాలెం పంచాయతీలోని నాయనిపల్లి ఏరియాలో 21.5 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. షేక్ జీనాబి ఇంట్లో 7 క్వింటాళ్ళు, షేక్ నాగూర్ ఇంటిలో 14.5 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో దర్శి ఎన్‌ఫోర్సుమెంట్ డిటి బ్రహ్మయ్య, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ వి హనుమంతరావులు పాల్గొన్నారు. వీరిరువురిపై 6ఎ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

త్వరలో కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకం
పార్టీ పరిశీలకుడు సివి శేషారెడ్డి వెల్లడి
ఒంగోలు అర్బన్, మే 14: జిల్లాలోని 56 మండలాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి ఆ జాబితాను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించామని, ఆమోదం వచ్చిన వెంటనే జాబితాను ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా పరిశీలకులు సివి శేషారెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, నాయకుల సూచనల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ఎంపిక చేశామన్నారు. ఒంగోలు నగర పాలక పరిధిలోని 50 డివిజన్లలో డివిజన్‌ల చైర్మన్‌లను ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు ఇన్‌చార్జిలను నియమించామన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో మండల కమిటీలను త్వరగా పూర్తిచేయాలని పిసిసి నుండి ఆదేశాలు వచ్చాయన్నారు. మండల, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన జాబితాలు పిసిసికి పంపించినట్లు తెలిపారు. ఆమోదం వచ్చిన వెంటనే జాబితాలు వెల్లడిస్తామన్నారు. మండల కమిటీల్లో మండల అధ్యక్షులతోపాటు ఉపాధ్యక్షులు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి, కోశాధికారి పదవులు ఉంటాయన్నారు. ఈ పదవులలో ఓసితోపాటు మహిళ, ఎస్సీ, ఎస్టీలను నియమించారన్నారు. అవసరమైతే అదనంగా మరొకరిని నియమించుకునే అవకాశం ఉందన్నారు. త్వరలో జరుగనున్న పంచాయతీ, ఎంపిపి, జడ్పీటీసీల ఎన్నికలకు సమాయత్తం కావాలంటే నూతన కమిటీ పూర్తికావాలన్నారు. అసత్య, సిద్ధాంతాలు లేని ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టే విధంగా పార్టీశ్రేణులు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో లబ్థిదారులకు తెలుసన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల కంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అంతకంటే మెరుగైన పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్ మాట్లాడుతూ కమిటీలు పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదుపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వేమా శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షులు జడా బాలనాగేంద్ర యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాళం నర్సమ్మ, నగర మహిళా అధ్యక్షురాలు చెరుకూరి ఆదిలక్ష్మి, మాజీ ఎంపిపి బెల్లం సత్యం, జిల్లా అధికార ప్రతినిధులు శ్రీపతి ప్రకాశం, కుసుమకుమారి, కనకారావు మాదిగ, మాదాల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లు
చీమకుర్తి, మే 14 : మండల పరిధిలోని కూనంనేనివారిపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 12వ వార్షికోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. 2001లో గ్రామంలోని దేవాలయాన్ని 30 లక్షల వ్యయంతో నిర్మించారు. దాతల సహకారంతో దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అప్పటి నుండి ప్రతి ఏడాది మే 14న వార్షికోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ దేవాలయంలో నవగ్రహ పూజా మండపం కూడా ఉంది. మంగళవారం ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండి పూజా కార్యక్రమాలు జరిగాయి. మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక విద్యుత్ ప్రభ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో విద్యుత్ మండపాలు, సిపిఎం ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శనలు ప్రజలను అలరించాయి. వివిధ రాజకీయ పార్టీలు పోటాపోటీగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తిరునాళ్ళ కావడంతో కెవిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఆర్యవైశ్యులు గర్వించాలి:రామదూత స్వామి
టంగుటూరు, మే 14: జాతిపిత మహాత్మాగాంధీ, అమరజీవి పొట్టిశ్రీరాములు లాంటి మహాత్ములు ఆర్యవైశ్య కులంలో జన్మించినందుకు ఆర్యవైశ్యులందరూ గర్వించాలని రామదూత స్వామి అన్నారు. మండలంలోని వల్లూరు గ్రామంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామదూత స్వామి మాట్లాడుతూ, అహింసా ధర్మాన్ని లోకానికి చాటిచెప్పిన మహాత్ముడు మహాత్మాగాంధీ అని, సహజంగా మత ధర్మాల మూలంగా శ్రీరాముడ్ని, శ్రీకృష్ణున్ని ద్వేషించేవారు మహాత్మాగాంధీని ద్వేషించేవారు మచ్చుకైనా లేరన్నారు. ఆర్యవైశ్యులు క్రమశిక్షణతో మెలుగుతారని, మిగతా వర్గాల వారిలా సొమ్ములు దుర్వినియోగం చేయకుండా సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కల్లుకూరి నాగబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ చైతన్యవంతం కావాలన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తిరుమల కాశీరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ పేద ప్రజలకు సేవ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జలదంకి కృష్ణారావు, రాష్ట్ర అధ్యక్షులు కె నాగబాబు, ఇమ్మడిశెట్టి వెంకటేశ్వర్లు, వి సత్యనారాయణ, పి కాశీరావు, పి వెంకటేశ్వర్లు, డి వెంకటేశ్వర్లు, వి కోటేశ్వరరావు, కె. ప్రసాద్, డి వాసు, అచ్యుత పద్మ, బైసాని సుబ్బారావు, సిహెచ్ శ్రీనివాసరావు, ఎ సుధాకర్‌రావు, జె సురేష్, కె హరికృష్ణ, డి వెంకట నాగేశ్వరరావు, నాగభూషణం, టి సుబ్బారావు, గౌరీశంకర్, ఎన్ సామ్రాజ్యం, టివి యాంకర్లు చక్రి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత వల్లూరమ్మ గుడిలో రామదూత పూజలు నిర్వహించి అనంతరం మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను ఆవిష్కరించారు.

కళంకిత మంత్రులను మంత్రివర్గం నుండి తొలగించాలి
మాజీ ఎంపి చిమటా డిమాండ్
చీరాల, మే 14: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించాలని టిడిపి మాజీ ఎంపి చిమటా సాంబు డిమాండ్ చేశారు. స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఓడరేవు నిర్మిస్తామని అధికారులు ప్రకటించారని మొదటగా మోటుపల్లిలో ఏర్పాటుచేస్తామని చెప్పి ఆ తరువాత రామాయపట్నంలో ఏర్పాటుచేస్తామని అన్నారని పేర్కొన్నారు. అయితే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతగానితనం వల్ల పోర్టు నెల్లూరు జిల్లాకు పోయిందని, ఇపుడు తమిళనాడు వెళ్ళినా ఆశ్చర్యపడవలసి ఉందన్నారు. ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిలపై మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ చట్టం చెప్పి దళిత గిరిజనులను మోసం చేస్తోందని అన్నారు. హాస్టల్‌లో కనీస వసతులు కూడా లేకుండా విదేశాల్లో ఉచిత విద్య చెప్పిస్తామని చెప్పి వారిని మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి కార్పోరేషన్‌లు లేవని, కమిషన్ లేదని దీనివలన ఎస్‌సి, ఎస్‌టిలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. టిడిపి అధినేత చంద్రబాబు అమలు చేస్తామని ప్రకటించిన హామీలను కాంగ్రెస్ పార్టీ కాపీకొట్టి అమలు చేస్తోందన్నారు. చంద్రబాబు వ్యాట్ రద్దుచేస్తామని, బెల్ట్‌షాపులు ఎత్తివేస్తామని, రుణాలు మాఫీ చేస్తామని ప్రకటిస్తే ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందన్నారు. తమకు కావలసింది కూడా ప్రజలకు మేలు జరగటమేనన్నారు. పట్టణ అధ్యక్షులు డేటా నాగేశ్వరరావు మాట్లాడుతూ చీరాల హత్యలు, అత్యాచారాలతో అట్టడుకుతోందన్నారు. మహిళలకు రక్షణ కరవైందని పోలీసులు, పాలకులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పియుసిఎల్ అధ్యక్షురాలు జయ వింధ్యాల ఆమంచిపై చేసిన ఆరోపణలను నిజంకావని ఆయన నిరూపించుకోవలసిన అవసరం ఉందన్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కలవటం ఖాయమని, ఇప్పటికే వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భవానీప్రసాద్, కోటా సాంబయ్య, చంద్రవౌళి, కర్ణ శ్రీనివాసరావు, పి చిన అంకిరెడ్డి, చిలుకోటి శ్రీను, నాదెండ్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

24 నుండి బాపట్లలో
ప్రథమాంధ్ర మహాసభ
శతాబ్ది ఉత్సవాలు
మాజీ మంత్రి గాదె వెల్లడి
ఒంగోలు, మే 14:గుంటూరు జిల్లా బాపట్లలో ఈనెల 24, 25, 26 తేదీల్లో ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి, బాపట్ల శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆచార్య రంగాభవన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రోద్యమానికి బాపట్ల గడ్డమీదే బీజం పడిందన్నారు. ఆంధ్రుల స్వరాష్ట్ర వాంఛకు బాపట్ల రూపురేఖలు దిద్దినట్లు ఆయన పేర్కొన్నారు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం 1903 మే 26వ తేదీన బాపట్ల టౌన్‌హాలులో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ బాపట్ల కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేసిందన్నారు. తెలుగువారి వ్యక్తిత్వం, గౌరవం, గుర్తింపుకోసం కృషిచేయాలన్న పూనిక ఆ సభల్లోనే జరిగినట్లు ఆయన తెలిపారు. అది ఎంతో చారిత్రాత్మకమైన, ప్రతిష్ఠాత్మకమైన మహాసభ అని ఆయన కొనియాడారు. బాపట్ల కీర్తిపతకాన్ని జాతీయస్థాయిలో ఎగురవేసింది ప్రథమాంధ్ర మహాసభ అని, ఈ మహాసభల్లోనే భాషాప్రయుక్త రాష్ట్రాల వాదనకు అంకురార్పణ జరిగిందన్నారు. అంతటి ఘనమైన ప్రథమాంధ్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవటం మన కనీస కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. ఆనాటి ఆంధ్రోద్యమ స్ఫూర్తిని తిరిగి రగిలించాల్సిన ఆవశ్యకత నేడు ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. తెలుగువారందరినీ ఒకేతాటి మీదకు, ఒకే పరిపాలన వ్యవస్థ కిందకు తీసుకువచ్చేందుకు నాలుగు శతాబ్దాలపాటు జరిగిన మహోద్యమంలో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినట్లు ఆయన వివరించారు. ఈనెల 24వ తేదీన బాపట్ల టౌన్‌హాలులో క్రీడాపోటీలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 25వ తేదీన బాపట్లలోని టౌన్‌హాలులో క్రీడాపోటీలు, మునిసిపల్ హైస్కూలులో విద్యా సాంస్కృతిక పోటీలు, టౌన్‌హాలులో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. 26వ తేదీన బాపట్లలోని మునిసిపల్ హైస్కూలులో మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, గజల్ శ్రీనివాస్‌చే గజల్స్ ఆలాపన ఉంటాయన్నారు. అదేరోజు సాయంత్రం నాలుగు గంటలకు మునిసిపల్ హైస్కూలు మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు రాజకీయాలకు అతీతంగా మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఈసభలను జయప్రదం చేయాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం పోర్టు ఏర్పాటైతే ఆ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఏర్పడతాయన్నారు. పోర్టు ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని తెలుగువారందరూ కలసికట్టుగా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఓట్లకోసమే మద్యాన్ని ఏ రాజకీయపార్టీ అయిన ప్రోత్సహిస్తే దేశ భవిష్యత్తుకు మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించటాన్ని ఆయన స్వాగతించారు. బెల్టుషాపులు ఎంత త్వరితగతిన తొలగిస్తే ప్రజలకు అంత త్వరగా శాంతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళలు కూడా అందుకు సహకరించాలని ఆయన కోరారు.

పలువురు ఎంపిడిఒలు, డిఇఓ బదిలీ
english title: 
deo

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>