Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నేటితో ముగియనున్న బదిలీల కౌనె్సలింగ్

$
0
0

నెల్లూరు, మే 14: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి వివిధ శాఖల్లో చేపట్టిన బదిలీల కౌనె్సలింగ్ ప్రక్రియ బుధవారం నాటితో ముగియనుంది. మంగళవారం స్థానిక జడ్పీ సభా మందిరంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కౌనె్సలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఉపాధ్యాయ కౌనె్సలింగ్‌లో భాగంగా నాలగవరోజున ఎస్‌జిటిలు 305 మంది బదిలీ అయ్యేందుకు సమ్మతించారు. ఎస్‌జిటిల జాబితాలో 101 నుంచి 800 వరకు కౌనె్సలింగ్ చేపట్టారు. 801 నుంచి మిగిలిన వారందరికీ నేడు కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే ఉపాధ్యాయ కౌనె్సలింగ్‌లో తాము కోరుకున్నచోటికి బదిలీల కోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురయ్యారు. సస్పెన్షన్లు పడటంతో తప్పుడు ధృవీకరణ సమర్పించిన సంగతి ముందుగానే గుర్తెరిగిన పలువురు ఉపాధ్యాయులు కౌనె్సలింగ్‌కు దూరం పాటిస్తుండటం గమనార్హం.

ఆదాలను తిరస్కరించండి:కాకాణి2
వెంకటాచలం, మే 14: ప్రజలకు అందుబాటులోలేని సర్వేపల్లి శాసనసభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ప్రజలు తిరస్కరించాలని సర్వేపల్లి వైకాపా సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం మండలంలోని గొలగమూడి పంచాయతీ నాగులవరం గ్రామంలో ప్రజాదీవెన యాత్ర చేపట్టారు. ఈసందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రతి ఇంటి గడప గపడ తిరుగుతూ వైఎస్‌ఆర్ పార్టీ కరపత్రాలు పంపిణీ చేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సమస్యలు తిష్టవేసుకొని ఉన్నాయన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యుడైన ఆదాల ప్రభాకర్‌రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ఇలాంటి నాయకుడిని రానున్న ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జగన్‌ను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా వేధిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈప్రభుత్వానికి ప్రతిపక్షమైన టిడిపి తోడై కుట్రపన్నుతున్నాయని అన్నారు. ఈరెండు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ను ఏమి చేయలేదని ధీమా వ్యక్తం చేసారు. జగన్‌ను సిఎంగా చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వారి దీవెనలే జగన్‌ను కాపాడతాయని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లాలో 10 స్థానాలూ మావే: మేరిగ
సూళ్లూరుపేట, మే 14: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను వైకాపా కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.మురళి అన్నారు. మంగళవారం సూళ్లూరుపేటలోని వైకాపా నాయకులు దబ్బల రాజారెడ్డి ఇంటికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చిన తమ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్‌రెడ్డికి వస్తున్న జనాధరణ చూసి చూడలేక కుట్రపన్ని జైలుకు పంపారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన జగన్ సిఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు. త్వరలోనే జగన్ జైలు నుంచి విడుదల అవుతాడని ఆశాభావ వ్యక్తం చేశారు. జిల్లాలో తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని అందరూ కలసి కట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఏ నాయకులకు ప్రత్యేక వర్గం లేదని అందరూ జగన్ వర్గమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దబ్బల రాజారెడ్డి, కళత్తూరు శేఖర్‌రెడ్డి,గండవరం సురేష్‌రెడ్డి తదితరుల పాల్గొన్నారు.
రైతులకు 52 వేల కోట్ల రుణాలు: మంత్రి ఆనం
పొదలకూరు, మే 14: రాష్ట్రంలోని కోటి మంది రైతులకు ఈఏడాది 52 వేల కోట్ల రూపాయలను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈమేరకు ఆదేశాలు జారీ చేసామని రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదలకూరులో మంగళవారం జరిగిన నెల్లూరు డివిజన్ స్థాయి రైతు సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రుణాలకు సంబంధించిన వడ్డీని రైతులు చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గత ఏడాది రైతులకు 46 వేల కోట్ల రూపాయలను రుణాల కింద ఇచ్చామన్నారు. తమ కుటుంబాల త్యాగాల ఫలితమే ఈప్రాంతాలకు నీళ్లందుతున్నాయని చెప్పారు. 1999లో తాను చేసిన త్యాగం, చేపట్టిన ఉద్యమం వల్లే కండలేరు దక్షిణ ప్రాంతాలకు నీరందుతున్నట్టు తెలిపారు. జిల్లాలో 2 లక్షల 45 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాల్సి ఉండగా, ఇప్పటికే లక్షా 65 వేల ఎకరాలకు నీరిచ్చామన్నారు. తమ కుటుంబం ఈప్రాంత రైతుల అభివృద్ధి కోసమే పాటుపడుతోందన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా జిల్లా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో సెంటు భూమి కూడా ఉండదన్నారు. గనులు, మైన్స్ ఏమీ ఉండవని, అన్ని జగన్ బొక్కసంలోకి వెళతాయని విమర్శించారు. ఇదే జగనన్న ఇచ్చే రాజ్యమంటూ దుయ్యబట్టారు. తండ్రిని అడ్డం పెట్టుకొని భూములు, గనులు దోచుకున్నాడని, వేల కోట్ల రూపాయలు దోచుకొని జైలు గోడల మధ్య ఉన్నాడని పేర్కొన్నారు. జగన్ వింటినుండి వెలువడిన షర్మిల అనే బాణం బయ్యారం గనుల కోసం వెదుకుతోందని, అవి కనపడకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి తెలియకుండా, విద్యార్థుల స్థితిగతులను తెలుసుకోకుండా అభూత కల్పనలతో పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో 5.6 లక్షల మంది విద్యార్థులకు 600 కోట్ల రూపాయలు ఫీజు రీయంబర్స్‌మెంట్ కింద చెల్లించగా, తమ ప్రభుత్వం 27 లక్షల మంది విద్యార్థులకు ఐదు వేల కోట్ల రూపాయలను రీయింబర్స్‌మెంట్ కింద చెల్లిస్తుందన్నారు. తాము చేరదీసి పదవులిస్తే తమ నెత్తినే కుండ పెట్టాడని పరోక్షంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కాకాణి గోవర్దన్‌రెడ్డిని విమర్శించారు. ప్రస్తుతం దీవెన యాత్ర పేరుతో ప్రజలను దీవించమంటున్నారని, ప్రజల నెత్తిన కుండ పెడతాడని దుయ్యబట్టారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఎడమగట్టు కాలువ ద్వారా 2400 ఎకరాలకు నీరు అందించారని చెప్పారు. దుగరాజపట్టణంలో ఏర్పాటు చేయనున్న ఓడరేవుకు రాజీవ్‌గాంధీ పోర్టుగా పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. కండలేరు ఎడమగట్టు కాలువపై 70 కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయిస్తామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాకాణి గోవర్దన్‌రెడ్డి గ్రామాలలో చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తొలుత మంత్రి ఆనం రైతు సదస్సును ప్రారంభించారు. సదస్సు ప్రారంభానికి ముందు ఆర్ అండ్ బి విశ్రాంతి భవనం నుండి రైతు సదస్సు వేదిక వద్దకు కిలోమీటరు దూరం జరిగిన భారీ ర్యాలీ ప్రదర్శనలో ఆనం ముందు భాగాన నిలిచారు. ఈ సందర్భంగా ఆనంకు ఘనస్వాగతం లభించింది. రైతుసదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు.
అనంతరం ఆయన మండలంలోని ముదిగేడు గ్రామంలో కోటి 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిమెంట్‌రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. ఎంఎల్‌సి వాకాటి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, అడిషినల్ జెసి పెంచలరెడ్డి, ఎన్‌డిపిసి చైర్మన్ ధనుంజయరెడ్డి, డిసిఎంసి చైర్మన్ సుమంత్‌రెడ్డి, రాపూరు ఎఎంసి చైర్మన్ చెన్ను బాలకృష్ణారెడ్డి, పొదలకూరు మాజీ జడ్పీటిసి దేవరం అనురాధ, మండల కాంగ్రెస్ నాయకులు మోపూరు శ్రీనివాసులురెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, దర్శి విజయబాబు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

లంచావతారుల భరతం పడతాం

నెల్లూరు, మే 14: జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, మరెక్కడైనా అవినీతి సాగుతుంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు అందుకున్న వెంటనే లంచావతారుల భరతం పడతామని ఏసిబి డిఎస్పీ జె భాస్కర్‌రావు వెల్లడించారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ లంచం తీసుకునే ఎంతటి వారైనా వదలమని హెచ్చరించారు. వేదాయపాళెంలో సునీల్‌కుమార్‌రెడ్డి అనే బిల్డర్ చేపట్టిన నిర్మాణంలో భారీ అక్రమాలు ఉన్నాయని ఐదు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వకుంటే కూల్చేస్తామని మున్సిపల్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ టి మధుసూధన్‌రావు బెదిరించడంతో బాధితుడు తమను సంప్రదించాడన్నారు. గత నెల 22న నిఘా ఉంచి కార్పొరేషన్ కార్యాలయంలో బిల్డర్ నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుంటుండగా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌పాటు మరో ఇద్దరు అటెండర్లను అరెస్ట్ చేశామన్నారు. 26న తడ తహశీల్దార్ కార్యాలయంలో పొలం పొజిషన్ ధ్రువపత్రం ఇచ్చేందుకు గాను రైతు ఆరంబాకం మణిరెడ్డి నుంచి 4వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా కారూరు విఆర్వో టి నాగూర్‌రెడ్డిని మాటువేసి రెడ్‌హ్యాండెట్‌గా పట్టుకున్నామన్నారు. గే వింజమూరు హైస్కూల్‌లో ఆత్మకూరు డిపిఎం బిఎడ్ కళాశాల విద్యార్థులు బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్) కోసం హాజరైనట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు హెచ్‌ఎం బుజ్జయ్య లంచం డిమాండ్ చేశారని, మార్చి 16వ తేదిన నిఘా ఉంచి 6500 రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నామన్నారు. ఈ నెల ఒకటవ తేది రాత్రి చేజర్ల హౌసింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్ పెంచలయ్య ఇందిరమ్మ ఇంటికి బిల్లు మంజూరు కోసం 4వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి నెల్లూరులోని అయ్యప్పగుడి సెంటర్ ప్రాంతంలో మడపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్ వద్ద నగదు తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా, ఎవరైనా లంచాలు అడిగినా నిర్భయంగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు. నేరుగా గానీ, లేఖల ద్వారా గానీ, ఫోన్‌ల ద్వారానైనా సమాచారం ఇస్తే స్పందిస్తామన్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచి అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతామని హెచ్చరించారు.
తనకు కాని, ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, చంద్రవౌళి, శ్రీనివాసులు, కృపానందంకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చన్నారు. ఎసిబి కార్యాలయం 0861- 2331833నెంబర్‌లో కాని ఫిర్యాదు చేయవచ్చన్నారు.సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

మనీస్కీమ్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
ఏర్పాటు చేయాలి
చంద్రబాబుకు జిల్లా తెలుగు తమ్ముళ్లు విజ్ఞప్తి
నెల్లూరు, మే 14: జిల్లాలో జరిగిన దాదాపు 200 కోట్లపై చిలుకు మనీస్కీమ్ స్కామ్‌పై తక్షణం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో చర్చించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుకు మంగళవారం జిల్లా తెలుగుతమ్ముళ్లు వినతిపత్రం ఇచ్చారు. వివిధ సంస్థల ద్వారా ప్రజలను ప్రలోభపెట్టి కోట్లాది రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులను అరెస్టు చేసి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో బాబును కలిసిన వారిలో నెల్లూరు రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామినాయుడు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు పమిడి రవికుమార్‌చౌదరి, నాయకులు సింగంశెట్టి రవిచంద్ర, దోర్నాల హరిబాబు తదితరులు ఉన్నారు.
నాటకాలరాయుడు చంద్రబాబు: ప్రసన్న
ఇందుకూరుపేట, మే 14: నాటకాలరాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఘనతికెక్కుతున్నాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండల పరిధిలోని గంగపట్నం గ్రామంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీకే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. కేంద్రంలో అవినీతి మంత్రులు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తుండటం చూస్తుంటే ఆయన విజ్ఞత ఏపాటిదో అర్ధమవుతుందన్నారు. ఆయన మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ మావులూరి శ్రీనివాసులరెడ్డి, గొల్లపల్లి విజయకుమార్, వెంకట్రామిరెడ్డి, ఫకీరయ్య తదితరులు పాల్గొన్నారు.
దాడులు చేసిన వారిని ఉపక్షించం
తడ, మే 14: మండలంలోని రామాపురం గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా ఎస్సీ కాలనీ వారిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని, జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్, ఎస్పీ బివి రమణకుమార్ చెప్పారు. మంగళవారం సాయంత్రం రామాపురంలోని ఎస్సీ కాలనీని వీరు సందర్శించి దెబ్బతిన్న వాహనాలను, ఇళ్లను సందర్శించి బాధితులను ఓదార్చారు. అనంతరం వారు గ్రామస్థులతో మాట్లాతూ జిల్లాలో తమ పదవీ కాలంలో ఇటువంటి సంఘటనలు జరగడం ఇదే తొలిసారిగా పేర్కొంటూ స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయినా ఇంకా ప్రజల్లో మార్పు రాక పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని పేరుతో కొట్టుకోవడం తగదని హితవు పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో బాధితులతో సమావేశం ఏర్పాటు చేసి జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా సింధూ అనే బాలికతో మాట్లాడారు. ఆ బాలిక సోమవారం జరిగిన సంఘటనను భయంతో వివరించడంతో అధికారులు చలించి పోయారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. గ్రామంలో జరిగిన దాడులకు కారకుడు ఒక అధికార పార్టీ నాయకుడని, ఆ గ్రామ ప్రజలు ప్రస్తావించడం విశేషం. దీంతో అధికారులు స్పందించి ఇటువంటి సంఘటనలకు కారణమైన వారిని వదిలేదన్నారు. గ్రామంలో బియ్యం, కూరగాయలు, పాలు పంపిణీ చేశారు. మరో నెలరోజులకు సరిపడా ఆహార దినుసులు అందచేస్తామని అదికారులు భరోసా ఇచ్చారు. భయపడకుండా సాధారణ జీవితానికి అలవాటు పడేంత వరకు గ్రామంలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. రక్షణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు. గ్రామంలో కూరగాయల దుకాణం ఏర్పాటుచేసుకొంటే ప్రభుత్వం ద్వారా రుణం మంజూరు చేస్తామన్నారు. తమిళనాడు పోలీసులతో చర్చించామని, రెచ్చగొట్టే వారి ప్రసంగాలకు లొంగవద్దని హితవు పలికారు. కలెక్టర్ ఎస్పీలతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం. సబ్ కలెక్టర్ నివాస్, గూడూరు, గుమ్మడిపూడి డిఎస్పీలు చౌడేశ్వరీ, జోష్ తంగయ్య, సిఐ రత్తయ్య, ఎస్సై శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
రామాపురంలో పోలీసు బలగాల మోహరింపు
రామాపురంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. జిల్లా ఎస్పీ బివి రమణకుమార్ పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. పది చోట్ల పోలీస్ ఔట్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గ్రామంలో మరో వర్గం వారు తమపై అక్రమ కేసులు బనాయించారని తడ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. వారిని అతి కష్టంమీద స్వగ్రామానికి పంపేందుకు నానా తంటాలు పడ్డారు.

దెయ్యాల భయంతో ఖాళీ అయిన సుబ్రమణ్యం దిబ్బ
కోట, మే 14: అదిగో దెయ్యం, ఇదిగో భూతం, ఆడమనిషి ఎడుపు, నక్కల కూతలు వినిపిస్తూన్నాయంటూ దెయ్యాల భయంతో సుబ్రమణ్యం దిబ్బలోని గిరిజన కాలనీవాసులు ఏడాదిగా ఇళ్లను ఖాళీ చేసి బయటప్రాంతాలో జీవిస్తున్నారు. వివరాలిలా వున్నాయి. కోట మండలం కర్లపూడి గ్రామంలోని సుబ్రమణ్యం దిబ్బలో సుమారు 40 కుటుంబాల గిరిజనులు జీవించే వారు. దీంతో ప్రభుత్వం గిరిజనులకు పక్కాగృహాలు నిర్మించింది. అంతేకాకుండా తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించింది. దీంతో గిరిజనులు ఈ కాలనీలో కొంత కాలం సజావుగా జీవనం గడిపారు. అయితే ఏమైనదో కాని ఈ కాలనీవాసులకు దెయ్యం భయం పట్టుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆడమనిషి ఏడుపులు వినిపిస్తున్నాని, నక్కలు భీకరంగా కూతలు పెడుతున్నాయని, కాలనీకి ఏదో అరిష్టం సోకిందని, తాము ఇక కాలనీలో వుంటే ప్రాణాలు పోతాయని వీరు భయపడిపోయారు. ఆభయంతోనే కర్లపూడి - కాకువారిపాళెం గ్రామాల మధ్య ఇసుక దిబ్బలపై నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. దీంతో సుబ్రమణ్యం దిబ్బపైన ప్రభుత్వం నిర్మించిన పక్కాగృహాలు నిరుపయోగంగా మారాయి.

జోరుగా సాగుతున్న క్రికెట్ పోటీలు
కోట, మే 14: స్థానిక జిల్లాపరిషత్ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో జరుగుతున్న వైఎఆర్ స్మారక జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 జట్లు పాల్గొనగా మంగళవారం జరిగిన పోటీల్లో కొత్తపట్నం - చెందోడు జట్లు తలబడినట్లు క్రికెట్ పోటీల నిర్వాహకులు తెలిపారు.

కొంప ముంచిన ఈదురుగాలులు
* ఆందోళనలో మామిడి రైతులు
కోట, మే 14: అసలే వడగాలులు, వేసవి తాపానికి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో రెండురోజుల నుంచి ఏకధాటిగా ఈదురుగాలులు వీస్తుండటంతో దుమ్ముధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి కోట మండలంలో ఆకాశం మేఘావృతమై జోరుగా ఈదురు గాలులు వీచాయి. దీంతో మండలంలోని తినె్నలపూడి, గూడలి, చంద్రశేఖరపురం, చిట్టేడు, వూనుగుంటపాళెం, వజ్జావారిపాళెం గ్రామాల్లోని సుమారు 500 ఎకరాల మామిడి తోటల్లో మామిడి కాయాలు నేలరాలిపోవడమే కాకుండా, గాలులకు వృక్షాలు సైతం నేలకొరిగాయి. ఈ ప్రాంతాల్లోని మామిడి తోటలను లీజుదారులు పోటీపడి వేలాదిరూపాయలకు లీజుకు తీసుకుంటారు. కాయలు చేతికి వచ్చేదశలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీచడంతో కాయలన్ని నేలరాలాయి. వేలాది రూపాయలు అప్పులుచేసి మామిడితోటలను లీజుకు తీసుకున్నామని, గాలుల పుణ్యమా అంటూ మామిడికాయలు నేలరాలాయని, ఇక తాము చేసిన అప్పులను ఏలా తీర్చాలంటూ లీజుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాలిన కాయలకు మార్కెట్‌లో సరైన ధర వుండదని, తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైయిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిఇలా వుండగా ఈదురుగాలుల కారణంగా విద్యానగర్ సమీపంలో అనేక ఫ్లెక్సి బ్యానర్లు నేలకొరిగాయి.

సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు
కోట, మే 14: ప్రకృతి వైపరీత్యాల ప్రభావంతో ఏర్పడిన మార్పుల కారణంగా కోట మండలంలోని గోవిందుపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీనివాససత్రం, యమదినె్నపాళెం, గున్నంపడియ వద్ద బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి అలలు ఎగిసిపడుతున్నాయి. వేటకు ప్రభుత్వ నిషేధాజ్ఞలు వుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వారివారి సామాగ్రిని ఒడ్డున జాగ్రత్త చేసుకున్నారు. అయితే మంగళవారం సముద్రంలోని అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఒడ్డును తాకడంతో మత్స్యకారులు హడలిపోయారు.

ఆనం సోదరుల మాటలను ఎవరూ నమ్మరు
వైఎస్‌ఆర్సీపి నాయకుడు అనిల్ ఎద్దేవా
నెల్లూరుసిటీ, మే 14: విశ్వాసఘాతానికి మారు పేరు అయిన ఆనం సోదరుల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితులో లేరని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ అనిల్‌కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. మంగళవారం 14వ డివిజన్‌లోని బాలాజీనగర్‌లోని బ్యాంకు కాలనీ ప్రాంతాలలో ప్రజాదీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులుగా చేశారని అయితే ప్రజాప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలు ముఖ్యంగా రైతులు పడుతున్న బాధలను దగ్గరగా చూసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలిసంతకం రైతులకు ఉచిత విద్యుత్, రుణామాఫీ పథకాన్ని అమలు చేసిన ఆయనకే దక్కిందన్నారు. వైఎస్‌ఆర్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వంలో అధికారం అనుభవిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు వైఎస్ కుటుంబాన్ని గురించి, షర్మిల మాటలు చిలక పలుకులనని హేళన చేసి మాట్లాడితే సహించేది లేదన్నారు. ప్రజాదీవెన కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, డి ప్రసాద్ నాయుడు, ఎస్‌కె సుభాన్, టిఎం కొండారెడ్డి, నక్కా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

దళితులకు రక్షణ కల్పించాలి
నెల్లూరుసిటీ, మే 14: తడ మండలం రామాపురంలో దళితులకు తక్షణమే ప్రభుత్వ యంత్రాగం కల్పించి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్ష విధించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో గిరిజనులపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ద్రౌపదమ్మ తిరునాళ్ళ సందర్భంగా ఊరేగింపును దళిత కాలనీకి రాకుండా అడ్డుకోవడం సిగ్గు చేటు అన్నారు. ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఎస్సీలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి బాధిత కుటుంబాలను అదుకోవాలని కోరారు.
రామాపురం దళిత కాలని దాడులపై సమగ్ర విచారణ జరిపించాలి
కాగా తడ మండలం రామాపురం దళిత కాలని దాడులపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని బిజెపి దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు ఎకె జయరాజ్ డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించాలని కోరుతూ మంగళవారం జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తడ మండలం రామాపురం దళిత కాలనికి ద్రౌపదమ్మ తిరునాళ్ళ సందర్భంగా ఊరేగింపును రాకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు. స్వాతంత్య్రం వచ్చి అరవై ఆరేళ్ళు దాటిన కూడా నేటికి దళితులపై వివక్ష కొనసాగడం సరికాదన్నారు. దళితులకు పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇలాంటిటి ఘటనలు జరగకుండా చూడటంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. నగర దళిత మోర్చ అధ్యక్షుడు కాయల మధు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించకపోతే బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి మద్దు భాస్కర్, బండారు శ్రీనివాసులు, ఎస్పీ పరశురామ్, ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

కాలువ పూడికతీత పనులు పరిశీలన
నెల్లూరుసిటీ, మే 14: నగరంలోని రామిరెడ్డి కాలువ పనులను మంగళవారం శానిటరీ సూపర్‌వైజర్ శివనాగేశ్వరరావు పరిశీలించారు. ఇన్‌చార్జ్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న అన్ని పంట కాలువలను పూడిక తీస్తున్నట్లు తెలిపారు. వర్షపునీరు, మురికి నీరు పోయేందుకు వీలుగా చెత్తచెదారాలను జెసిబి ద్వారా తొలగించారు. ఈకార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

బిఎల్‌ఓలకు శిక్షణ తరగతులు
నెల్లూరుసిటీ, మే 14: ఓటరు జాబితాను పక్కాగా తయారు చేసేందుకు బూత్ లెవల్ అధికారులకు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటీ కమిషనర్ కె భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితాలో ఉన్న తప్పులు, మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల జాబితాను తయారు చేయాలని సూచించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు.

డెంగ్యూ కేసులపై విచారణ
ఆత్మకూరు, మే 14: ఆత్మకూరు పట్టణ పరిధిలో జిల్లా మలేరియా అధికారి, ఆత్మకూరు క్లస్టర్ ఎస్‌యుఓ ఖాదర్‌బాషా, మహిమలూరు ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, పట్టణ ఆరోగ్య కేంద్రసిబ్బందితో కలిసి ఇటీవల వచ్చిన అనుమానిత డెంగ్యూ కేసులపై విచారణ చేపట్టి, చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో దోమల ‘లార్వా’ ఉన్నదేమోనని పరిశీలించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల బ్రాహ్మణవీధిలోని మల్లు స్రవంతి చనిపోగా క్రిస్టియన్‌పేటలోని సియోనికుమారి చెన్నైలో కోలుకుంటున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు, దోమల నివారణా చర్యలు తీసుకొనుటకు ఆత్మకూరు మునిసిపల్ కమిషనర్‌తో కూడా చర్చించినట్లు చెప్పారు. అవసరమైన కొత్త ఫాగింగ్ మిషిన్ కూడా కొనుగోలు చేసేందుకు అంగీకరించారన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ సబ్‌యూనిట్ అధికారి షేక్ ఖాదర్‌బాషా, మహిమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర హెల్త్ సూపర్‌వైజర్ షేక్ హిదయతు, హెల్త్ అసిస్టెంట్ కె చిన్నపనాయుడు, పట్టణ ఆరోగ్య కేంద్ర ఎంపిహెచ్‌ఎ షేక్ గుల్జార్ పాల్గొని ప్రజలకు దోమల ద్వారా వచ్చు వ్యాధుల నియంత్రణ విషయమై తగు సూచనలు ఇచ్చారు.

ఉచిత వైద్యశిబిరానికి ప్రత్యేక డాక్టర్లు డుమ్మా
ఉదయగిరి, మే 14 : మండల పరిధిలోని తిరుమలాపురం ఎస్టీ కాలనీలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి ప్రత్యేక డాక్టర్లు డుమ్మా కొట్టారు. తొలుత తిరుమలాపురం గ్రామంలో నిర్వహించిన ఈ శిబిరం వెంటనే ఎస్టీ కాలనీకి మార్చడంతో తిరుమలాపురం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కీళ్ళు, ఎముకల డాక్టర్లు పాల్గొనాల్సి ఉండగా ఒక్క డాక్టర్ కూడా వైద్య శిబిరానికి హాజరుకాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. జిల్లా వైద్యాధికారి మాశిలామణి పాల్గొని మాట్లాడుతూ గిరిజన కాలనీలో ఎక్కువగా మాతాశిశు మరణాలు జరుగుతున్నాయన్నారు. వీరికి వైద్యం పట్ల అవగాహన లేకపోవడంతో వైద్య శిబిరాలను ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు.ఈ శిబిరంలో గండిపాళెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్, ఉదయగిరి సామాజిక ఆరోగ్యకేంద్ర డాక్టర్లు మాత్రమే పాల్గొన్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ వైద్యాధికారి బి విశ్వనాధయ్య, నాగయ్య, బాలనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి వివిధ శాఖల్లో
english title: 
transfer

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>