నల్లగొండ, మే 14: మాతృభాష తెలుగును పాలన భాషగా విజయవంతంగా అమలు చేస్తున్న నల్లగొండ జిల్లా తెలుగు జాతి చరిత్రలో అపూర్వ స్థానం సాధించిందని అధికార భాష సంఘం చైర్మన్ మండలి బుద్దప్రసాద్ అన్నారు. మంగళవారం మహాత్మగాంధీ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అధికార భాష దినోత్సవం కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి ప్రసంగించారు. 1966మే 14న అధికార భాష సంఘం ఏర్పడిందని, 1974లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలుగు భాషను అధికార భాషగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుని, 1975లో అన్ని జిల్లాల్లో అమలు దిశగా చర్యలు ప్రారంభించారన్నారు. తదుపరి 47సంవత్సరాల పిదప ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవతో ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో తెలుగును పాలన భాషగా అమలు చేసే ధృడసంకల్పంతో ప్రభుత్వం, అధికార భాష సంఘం ముందుకు సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఫైళ్లను తొలిసారిగా తెలుగులో రూపొందించడం జరిగిందన్నారు. తెలుగును పాలన భాషగా అమలు చేయడంలో ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే నల్లగొండ కలెక్టర్ నందివెలుగు ముక్తేశ్వర్‌రావు అందుకు చొరవ తీసుకుని ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో అధికార భాషగా తెలుగును అమలు చేస్తుండటం రాష్ట్రానికి ఆదర్శప్రాయమైందన్నారు. ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుండి తెలుగు భాషోద్యమాన్ని తీసుకరావడం చరిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. ఇతర జిల్లాల్లో తెలుగు భాష అమలుకు మార్గదర్శకం చేసేందుకు ‘అధికార భాష అమలులో నల్లగొండ నమూనా’ అనే పుస్తకాన్ని తయారు చేయాలని కలెక్టర్ ముక్తేశ్వర్‌రావును మండలి కోరారు. ఈ పుస్తకాన్ని అన్ని జిల్లాలకు అందించి నల్లగొండ స్ఫూర్తితో పాలన భాషగా తెలుగును అమలు చేసేందుకు అధికార భాష సంఘం కృషి చేస్తుందన్నారు. అధికార భాష సంఘం చైర్మన్‌గా తాను ఏ జిల్లాకు వెళ్లిన తెలుగును పాలన భాషగా అమలు చేసేందుకు నల్లగొండనుమార్గదర్శిగా ఉదహరిస్తానన్నారు. 2013సంవత్సరాన్ని తెలుగు భాష, సంస్కృతి వికాస సంవత్సరంగా ప్రభుత్వం పరిగణిస్తుందన్నారు. రాబోయే తరాల కోసం తెలుగు భాషను ప్రోత్సహించేందుకు, పరిరక్షించేందుకు ప్రతి జిల్లాకు ప్రభుత్వం అధికార భాష సంఘం ద్వారా కోటి రూపాయలు కేటాయించనున్నట్లుగా తెలిపారు. సమావేశంలో నల్లగొండ జిల్లాలో పాలన భాషగా తెలుగు అమలు జరుగుతున్న తీరుతెన్నులపై కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పాలన భాషగా తెలుగును అమలు చేయడంతో పాటు మరుగున పడిన జిల్లా చరిత్రను, శాసనాలను వెలికి తీసేందుకు ప్రభుత్వ సహాకారం కావాలన్నారు. పాలన భాషగా తెలుగు విస్తృతికి ప్రభుత్వ శాఖల వారీగా తెలుగు పదకోశాల పుస్తకాలను ముద్రించి అధికార భాష సంఘానికి అందిస్తామన్నారు. జిల్లాలో తెలుగు అమలు విజయవంతం కావడం జిల్లా పాలన యంత్రాంగం స్ఫూర్తిదాయకమైన సహకారంతోనే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా అధికార భాష సంఘం తరుపునా జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావును చైర్మన్ బుద్దప్రసాద్ సహా అధికార భాష సంఘం సభ్యులు ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికార భాష సంఘం కార్యదర్శి మనోరంజని, సభ్యులు జూలూరు గౌరిశంకర్, ఎన్.ఆర్.వెంకటేశ్వర్లు, ఎఎస్.గోపాలరావు, జెసి హరిజవహర్‌లాల్, భువనగిరి సబ్ కలెక్టర్ దివ్య, ఎంజి యూనివర్సిటీ కట్టా నర్సింహ్మరెడ్డి, చరిత్రకారుడు సూర్యకుమార్, రాములు, ఎడవెల్లి సుధాకర్‌రెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా, డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
కోదాడ, మే 14: నాలుగు నెలల క్రితం పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకుగురై హైద్రాబాద్ ప్రైవేట్ నర్సింగ్‌హోంలో చికిత్స పొందుతున్న గోపతి గోపి (19) కి ముఖ్యమంత్రి సహాయనిధినుండి మంజూరైన లక్షా 60 వేల చెక్కును రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి యన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడలో మంగళవారం గోపి తండ్రి శ్రీనుకు అందచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, వంగవేటి రామారావు, ముత్తవరపు పాండురంగారావు, వంటిపులి గోపయ్య, ఫయాజ్‌అలీ, అంబడికర్ర శ్రీనివాస్, వంటిపులి వెంకటేశ్, ఆవుదొడ్డి ధనమూర్తి, చిత్తలూరి శివయ్య, కందుల కోటేశ్వర్‌రావు, వనపర్తి పుల్లయ్యలు పాల్గొన్నారు.
బాబునగర్‌కు 78 ఇండ్లు మంజూరుకి మంత్రి హమీ
కోదాడ పట్టణ శివారు బాబునగర్‌లోని అర్హులైన 78 మందికి పక్కా ఇండ్లను మంజూరుచేయిస్తానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హమీ ఇచ్చారు. కోదాడలో మంగళవారం ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన మంత్రి ఉత్తమ్‌ను బాబునగర్‌వాసులు కలిసి తమకు ఇండ్లు మంజూరుచేయాలని కోరడంతో మంత్రి స్పందించి మంజూరీకి హమీ ఇచ్చారు. కార్యక్రమంలో వంటిపులి గోపయ్య, వెంకటేశ్, మంగయ్య, శ్రీనివాస్, ఎల్లయ్య, సోమయ్య, నాగేశ్వర్‌రావు, పాష తదితరులు పాల్గొన్నారు.
సజావుగా ధాన్యం కొనుగోలు :జెసి
నల్లగొండ , మే 14: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మార్కెంటింగ్ శాఖ, మార్కెట్ యార్డు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఉందని జెసి హరిజవహర్‌లాల్ అన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో సూర్యాపేట మార్కెట్‌యార్డులో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డు సమస్యలు లేకుండా చూడాలని, మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు చేసేందుకు 150 మంది కమీషన్ ఏజెంట్లు, 53మంది దడువాయిలు ఉన్నారని, దడువాయిలు తక్కువగా ఉండడం వలన ధన్యం సేకరణ, సీజన్‌లో ఎక్కువ బస్తాలు ధాన్యం వచ్చినప్పుడు ఎగుమతులకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అందువల్ల దడువాయిల నియామకాన్ని చేపట్టాలని మార్కెట్ చైర్మన్, కార్యదర్శులకు తెలిపారు. జీవో 278 ప్రకారం నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. హమాలీల సమస్యను పరిష్కరించాలని, హమాలీల సంఘం నాయకులతో మాట్లాడేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ఎడికి సూచించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ ఎడి ప్రసాదరావు, పౌరసరఫరాల అధికారి నాగేశ్వర్‌రావు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్, కార్యదర్శులు బుజంగరావు, పిచ్చిరెడ్డి, రవిందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జలాలు వృథా...
నల్లగొండ , మే 14: ప్రజలు దాహర్తిని తీర్చే కృష్ణా జలాలు లీకేజీల పుణ్యమానని ప్రజలకు దాహర్తిని తీర్చలేకపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతుండడంతోపాటు కృష్ణా జలాలు మూడు నాలుగు రోజులకు ఒకసారి గ్రామాలలోని ఓవర్‌హెడ్ ట్యాంకులకు సరఫరా కావడం, ట్యాంకుల నుండి నీటిని దఫాల వారిగా కాలనీలకు సరఫరా చేయడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మరో వైపు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో లీకేజీల వద్ద నెలల తరబడి మరమ్మత్తులను విస్మరిస్తున్నారు. గ్రామాల లింకురోడ్డు రహదారుల వెంబడి పెద్ద ఎత్తున పైపు లైన్లు పగులడం, గేటు వాలుల వద్ద నీరు లీకేజీలు అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లు
వ్యవహరించడంతో పానగల్ నుండి వివిధ మండలాలకు సరఫరా అవుతున్న నీరు కలుషితం అవ్వడమే కాకుండా మురుగు నీరు రావడంతో ప్రజలు తాగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు వివిధ విష జ్వరాల భారిన పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొంది. చర్లపల్లి గ్రామం నుండి బుద్దారం వెళ్లే రహదారి వెంట నాలుగు చోట్ల పెద్ద ఎత్తున పైపు లైన్లు లీకేజీలు సుమారు నెల రోజుల నుండి లీకేజీలు అయి నీరు చేళ్లలోకి వృథాగా పోతునప్పటికి అధికారులు, సిబ్బందిలో చలనం లేకుండా పోయింది. అదేవిధంగా బుద్దారం నుండి అప్పాజీపేట, కల్వలపల్లి, పులిపల్పుల, మునుగోడు మండలానికి వెళ్లే పైపు లైన్లు అక్కడక్కడ లీకేజీలయ్యాయి. గ్రామాలలో నీటి సరఫరా తగ్గిన సమయంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి పలు మార్లు తీసుకెళ్తేనే కొద్దిమేరా ఫలితం ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఒక వేళ సమాచారాన్ని అందించకుంటే విశ్రాంతి దొరికినట్లు వ్యవహరిస్తూ కృష్ణా జలాల సరఫరాపై కనె్నత్తి కూడా చూడరని పలువురు వాపోతున్నారు. మరోవైపు తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తున్నామంటూ ప్రగల్బాలు పలుకుతున్న అధికారులకు ఈ లీకేజీలు, పైపులైన్లు పగలడం కనబడడం లేదానని ప్రశ్నిస్తున్నారు.
అంతరాయాల నడుమ సాగిన కౌనె్సలింగ్
* సీనియార్టీ జాబితాలో తప్పులు
* అర్ధరాత్రి దాక ఉపాధ్యాయుల తిప్పలు
నల్లగొండ టౌన్, మే 14: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియలో సీనియార్టీల జాబితాను నిబంధనల మేరకు సరిచేసి నిర్వహించాలని ఆది నుండి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికి పట్టించుకోని విద్యాశాఖ నిర్వాకంతో మంగళవారం జరుగాల్సిన ఎస్‌జిటి ఉపాధ్యాయుల కౌన్సిలింగ్ ఉదయం నుండి అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉదయం 9గంటలకు ప్రారంభంకావాల్సిన కౌన్సిలింగ్ సీనియార్టీ జాబితా..స్పౌజ్ కేసుల వివాదంతో మధ్యాహ్నం 1గంటకు ప్రారంభమైంది. పదోనెంబర్ ముగిసిన వెంటనే స్ఫౌజ్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పాయింట్లు కేటాయించారంటు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. దీంతో కౌన్సిలింగ్ 6గంటల వరకు నిలిచిపోయింది. అనంతరం తిరిగి ప్రారంభమైన కౌన్సిలింగ్ ఎస్‌జిటి ప్రభుత్వ పాఠశాలల్లోని 137మంది ఉపాధ్యాయులకు రాత్రి 8-30నిమిషాలకు ముగించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను 1నుండి 1500వరకు కౌన్సిలింగ్ పిలిచినప్పటికి వారి జాబితాల్లో కూడా స్పష్టత లేకపోవడంతో మళ్లీ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియార్టీ జాబితాను సవరించి రాత్రి 9గంటలకు కౌన్సిలింగ్ మొదలుపెట్టడంతో అర్ధరాత్రి దాటక కూడా కౌన్సిలింగ్ సాగుతునే ఉంది. ఈ కారణంగా ఉపాధ్యాయులు రాత్రి వేళల్లో తగిన సదుపాయలు లేక తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ముఖ్యంగా తమ పిల్లలతో వచ్చిన మహిళా ఉపాధ్యాయులు, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారు అర్ధరాత్రి వరకు సాగుతున్న కౌనె్సలింగ్‌తో నానా అవస్థలు పడ్డారు. తమ వంతు కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుందోనంటు కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూపులు పడ్డారు. కౌన్సిలింగ్ కేంద్రం నుండి ఎవరు వెళ్లవద్ధని డిఇవో ఆచార్య జగదీష్ ఆదేశించడంతో ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కేంద్రంలోనే తిండి తిప్పలు, తాగునీరు లేక పడిగాపులు పడ్డారు. కాగా బుధవారం జరుగాల్సిన ఎస్‌జిటి కౌన్సిలింగ్ 1600నుండి చివరి నెంబర్ వరకు కొనసాగిస్తామని, వారంతా ఉదయం 9గంటలకే హాజరుకావాలని డిఇవో సూచించారు.
ఉపాధ్యాయుల రిలీవ్‌కు ప్రధానోపాధ్యాయుల బ్రేక్ !
ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌ను అనుసరించి ప్రస్తుతమున్న చోటు నుండి మరోచోటికి బదిలీయైన ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బదిలీ ఉత్తర్వుల మేరకు రిలీవ్ చేయకపోవడం కొత్త సమస్యలకు దారితీస్తుంది. విద్యాశాఖ నుండి సరైన మార్గదర్శకాలు అందకపోవడంతోనే ఉపాధ్యాయులను రిలీవ్ చేయడం లేదని టి.పిఆర్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపురం బీమ య్య తెలిపారు. స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడంతో పాటు రిలీవ్ చేయని ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నిమ్స్ అధికారులతో సమీక్ష
బీబీనగర్, మే 14: మండలంలోని రంగాపురం గ్రామంలో నిర్మించిన నిమ్స్ ఆసుపత్రిని జూన్ మాసంలో ప్రారంభించనున్న సందర్భంగా మంగళవారం నిమ్స్ భవనంలో డైరెక్టర్ ధర్మరక్షక్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జూన్ మాసంలో వంద పడకల ఆసుపత్రితో పాటూ భవనంలో ఏర్పాటు చేయబోయే వైద్య అధికారుల సదుపాయాలతో పాటూ విద్యుత్, మంచినీటి సౌకర్యాలు భవన అంతర్గత మరమ్మత్తులను సమీక్షించారు. అనంతరం ఎన్‌సిసి కాంట్రాక్టర్ రామకృష్ణారెడ్డితో ఆసుపత్రి భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ భవనంలో ఎ నుంచి ఇ బ్లాక్ వరకు వైద్య సేవల కోసం ఉపయోగించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ కెటి రెడ్డి, నిమ్స్ వైద్య బృందం పాల్గొన్నారు.
మహిళలపై దాడులు అరికట్టాలి
ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి
నల్లగొండ టౌన్, మే 14: మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం విఫలమైందని, మహిళా రక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైమావతి డిమాండ్ చేశారు. మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టౌన్‌హాల్‌లో జరిగిన మహిళాలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చర్చగోష్టిలో ఆమె మాట్లాడుతు పోలీస్ శాఖ ద్వారా నిర్వహిస్తున్న 100నెంబర్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, నిర్భయ చట్టం పై కూడా ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో పోలీస్ నిఘా పెంచాలన్నారు. బాధిత మహిళలకు న్యాయ, చట్టపరమైన సహాయం అందించడంలో అధికార యంత్రాంగం చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మల్లు లక్ష్మీ, నాయకురాలులు ప్రభావతి, కొండూరు ఎల్లమ్మ, సత్యవతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కోట రమేష్ తదితరులు ఉన్నారు.
బడి బయటి పిల్లలందరిని బడిలో చేర్పించాలి
నల్లగొండ , మే 14: బడి బయట పిల్లలందరిని బడిలో చేర్పించి అందరికి విద్య లక్ష్యాల సాధనకు సిఆర్‌పిలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాధిత్య సభ భవనంలో జరిగిన ఆర్‌విఎం క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సమావేశంలో ఆయన మాట్లాడుతు అన్ని గ్రామాల్లో సిఆర్‌పిలు ఇంటింటికి తిరిగి బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాల యాజమాన్య కమిటీల ద్వారా సమీప పాఠశాలలు, కస్తూరిభా విద్యాలయాల్లో చేర్పించాలన్నారు. ఆరు నుండి 14సంవత్సరాల బడి పిల్లలను గుర్తించి ఈ నెల 26నుండి 31వరకు మండల స్థాయిలో వివరాలను కంప్యూటరీకరించాలన్నారు. జూన్ రెండవ వారంకల్లా ఆయా విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రందించి బడిలో చేర్పించాలన్నారు.
గిరిజన తండాల్లో, హరిజన వాడల్లో బాలికలపై వివక్ష కొనసాగుతున్నందునా పాఠశాల యాజమాన్య కమిటీలు, స్వచ్చంద సంస్థల సహకారంతో తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకవచ్చి వారిని కస్తూర్భా పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఏజెసి నీలకంఠం, ఆర్‌విఎం పివో బాబుభూక్యా, డిఇవో ఆచార్య జగదీష్, సెక్టోరియల్ అధికారులు ఎం.బాలాజీనాయక్, దాడి రవింద్రరెడ్డి, ఎంవి.రామకృష్ణ, శివకుమార్, అరుణ, డ్వామా ఏపిడి నర్సింహులు, కాళిందినీలు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కళా ప్రదర్శనలు
* కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు
నల్లగొండ రూరల్, మే 14: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలలో జిల్లాలో ఈ నెల 14నుండి జూన్ 12వరకు 30రోజులు రోజుకు రెండు ప్రదర్శనలు కళాబృందాలచే సంగీత, నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తునట్లు జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. పగటి వేళ్లల్లో మండల కేంద్రాలలో 9 నుండి 11గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 6గంటల వరకు ఆరోజు జరిగే సంతలలో లేదా మండలానికి సంబంధించిన పెద్ద గ్రామంలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ప్రదర్శనల ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పల్లె పల్లెల్లో ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార శకటాలు జిల్లాలోని నాలుగు డివిజన్లలో ప్రచారం చేయడం జరగుతుందన్నారు.
ప్రజా సమస్యలపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
చింతపల్లి, మే 14: ప్రజా సమస్యలపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బిజెపి జిల్లా కార్యదర్శి సిహెచ్.రాములు ఆరోపించారు. మండల కేంద్రంలోని విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు కె.రామకృష్ణ, శేఖర్, అక్కోజి తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌనె్సలింగ్
నల్లగొండ టౌన్, మే 14: గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రశాంతంగా ముగిసింది. డిపివో కృష్ణమూర్తి, జడ్పీ డిప్యూటీ సిఇవో మోహన్‌రావుల పర్యవేక్షణలో కౌన్సిలింగ్‌ను నిర్వహించారు. కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన కార్యదర్శులతో కలెక్టరేట్ ప్రాంగణం సందడిగా కనిపించింది. కార్యదర్శులు తాము కోరుకున్న పంచాయతీల పోస్టింగ్ కోసం పరస్పరం చర్చల్లో మునిగి తేలడం కనిపించింది.
‘నీచ రాజకీయాలు నా నైజాం కాదు’
* పాల్వాయి రజనీ ఆరోపణలను ఖండించిన రేగట్టే
* ఫోర్జరీ సంతకంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
నార్కట్‌పల్లి, మే 14 తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా పనిచేస్తూ జిల్లా నాయకత్వం వరకు ఎదిగిన తాను ఏనాడు కూడా నీచ రాజకీయాలకు పాల్పడలేదని అలాంటి నైజాం నాది కాదని సస్పెండ్‌కు గురైన జిల్లా టిడిపి నేత, సింగిల్‌విండో చైర్మన్ రేగట్టే మల్లిఖార్జున్ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం నార్కట్‌పల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి పాల్వాయి రజనీ కుమారి తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. మండలంలో పార్టీ పటిష్టతకు ఎంతగానే కృషి చేశానని ఇటివలీ కాలంలో ఆమె గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని, అంతేకాక రజనీ కుమారి భర్త మనోజ్‌కుమార్‌పై తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజిలెన్స్ ఇన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినట్లుగా వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
తన పేరుతో కావాలని ఆ శాఖలకు గత నెల ఏప్రిల్ 10న ఫిర్యాదు చేశారని ఆఫిర్యాదును పరిశీలించగా అందులోని సంతకం తనది కాదని తేలిపోయిందన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా కార్యకర్తలకు అండగా ఉంటున్న తనపై కక్ష సాధింపు కోసం ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.
టిడిపిలో కొనసాగిన ప్రస్తుత నల్లగొండ ఎంపి గుత్తా సుఖందర్‌రెడ్డి వెంట పనిచేసి పార్టీని ఎంతో అభివృద్ధి పథంలోకి తెచ్చానని గుత్తా పార్టీ నుండి వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లిన కష్ట కాలంలో కార్యకర్తలకు అండగా నిలిచి పనిచేసిన నైజాం నాదని అన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో రేగట్టే ఫిర్యాదు
పాల్వాయి రజనీకుమార్ భర్త ప్రభుత్వ ఉద్యోగి మనోజ్‌కుమార్‌పై హైద్రాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులకు తన పేరున ఫోర్జరీ సంతకంతో ఫిర్యాదు చేశారని ఫోర్జరీ సంతకం చేసిన నిందితులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
రేగట్టే వెంట జిల్లా టిడిపి కార్యదర్శి బాజె యాదయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చిరుమర్తి యాదయ్య, నాయకలు బోయపల్లి శ్రీను, కమ్మంపాటి రాములు, మేడబోయిన శ్రీను, లింగస్వామి ఉన్నారు.