Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సచ్చిదానంద సాధన

$
0
0

పుష్పం వికసిస్తుంది. అందులో మకరందాన్ని ప్రోది చేసుకొని ఉంటుంది. దాన్ని ఆస్వాదించడానికి ఏదో ఒక తుమ్మెద రావాలి. స్వీకరించాలి. అపుడే ఆ పుష్పం యొక్క జన్మ సార్థకత చెందుతుంది.
వానచినుకు పంట పండటానికి ఉపయోగపడే స్థలంలో కురియాలి. ఎక్కడో ఎడారిలో బీడు భూములపై కురవటంవలన ఎలాంటి ప్రయోజనం లేదు. పంటను పండించి, ఆకలి తీర్చినపుడే ఆ వాన చినుకుకు, పండిన పంటకూ, సార్థకత ఉంటుంది. ఇవన్నీ భాస్కర శతకకారుడు సూత్రీకరించిన ఉదాహరణలు. ఎంతో వాస్తవాలు! మనిషి జీవితమూ అంతే. దీనికీ సార్థకత కావాలి. బ్రతికినన్నిరోజులూ కేవలం సంపాదన, అందులోని సుఖాలు, వారి వారి సుఖాలూ చూసుకొని మురిసిపోవటంతో సార్థకత చేకూరదు. నిష్కామ కర్మలు చేస్తూ, ఆ కర్మఫలాన్ని భగవదర్పితం చేసినపుడే సార్థకత చేకూరుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు తన అనుంగు శిష్యులు మహిమ చరణాదులతో ‘సచ్చిదానందాన్ని పొందకుంటే అంతా వ్యర్థమే నాయనా!’’ అని.
సచ్చిదానందాన్ని పొందటానికి భగవంతునికి మరింత దగ్గర కావటమొక్కటే మార్గమంటారు. ఆ దగ్గర కావటానికి మనో వ్యాకులత కావాలి. భగవంతుడొక్కడే సత్యం. తక్కినవన్నీ అనిత్యాలు. నిత్యమైనదని తెలిసినపుడు దానికోసం విచారణ సాగించండని సూచిస్తారు రామకృష్ణ పరమహంస.
శిష్యులు ‘‘స్వామీ! వాటికంత తీరిక ఎక్కడుంది’’ అంటారు.
స్వామి- ‘తీరిక ఉన్నవారు ధ్యానం, భజనలు చేయాలి. బొత్తిగా తీరిక దొరకనివారు రోజూ రెండుసార్లు హృదయపూర్వకంగా భగవంతునికి ప్రణమిల్లాలి. ఆయన అంతర్యామి. మనం ఏం చేస్తున్నామో ఆయనకు తెలుసు. మీకు అనేక వ్యాపకాలు. ఆయన్ను ప్రార్థించడానికి మీకు తీరిక ఉండదు. ఆయనకు ముఖతా వివరించండి. ఆయన్ను పొందకుంటే ఆయన దర్శనం కాకుంటే మీరెన్ని గొప్ప అద్భుతాలు సృష్టించినా వ్యర్థమే’ అంటారు. మనసును శుద్ధి చేసుకొమ్మంటారు. ‘‘నేనొక గొప్ప వ్యక్తిని. నేను ఇలాంటివాడను. నాకు గొప్ప అధికారం ఉంది- ఇటువంటి అహంకారం నశించకుంటే భగవంతుని దర్శించలేం. ‘‘నేను’’ అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీళ్ళతో కరిగించి నేలమట్టం చేసివేయాలని సూచిస్తారు.
భౌతిక ప్రపంచంలో ఇవన్నీ సాధ్యమేనా అన్న సంకోచం రాకమానదు. సాధ్యమే అంటారు రామకృష్ణ పరమహంస. భవబంధాలను ఒక క్రమపద్ధతిలో దూరం చేసుకుంటూ, ఉన్న సమయాన్ని భగవత్ సాన్నిధ్యంలో గడపటం, భగవంతుని గురించి చింతించటం, ఆయనను కావాలని కోరుకోవటం, ఐక్యం (మనసును) చెందించటంలో సాధన చేయాలి. శ్రీరామకృష్ణులు జగజ్జనని ఇలా ప్రార్థించసాగారు- ‘‘అమ్మా! నేను ఏం తప్పు చేశాను? అమ్మా, నేను స్వయంగా ఏదన్నా చేస్తున్నానా? నువ్వే కదా సమస్తం చేస్తున్నావు! నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు’’. వ్యాకులత ఇలా కొనసాగుతుంది. అంతటి వ్యాకులత కావాలంటారు. తన వాటా ఆస్తికై కుమారుడు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని, నిర్ణీత కాలానికి ముందే అతడికి వాటా పంచి ఇస్తారు. మనోవ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు. ఆయన మనకు జన్మనిచ్చినపుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది. ఆయన మన సొంత తండ్రి, సొంత తల్లి. ఆయన వద్ద మనం పట్టుపట్టవచ్చు. ‘నా ముందుకు రా, లేకుంటే నేను తిండి తినను!’’ అంటూ ఆయన్ను నిలదీయవచ్చు’’ అంటూ శిష్యులతో వివరించారు శ్రీరామకృష్ణులు 1884లో దక్షిణేశ్వరంలోని కాళికాలయంలో. ఇవన్నీ రసగుళికలు.
భోగవాంఛలు తీరనంతవరకు మనోవ్యాకులత కలగదు. కనుక ఈ భోగవాంఛలు క్రమపద్ధతిలో, మెల్లమెల్లగా దూరం చేసుకోవాలి. అపుడు భగవంతుని గురించిన చింతన మనకుతెలియకుండానే మొదలవుతుంది.

మంచిమాట
english title: 
manchi maata
author: 
-చెన్నా రామమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>