కర్నూలు, మే 21: వేసవి తాపాన్ని ప్రజలు మరో 10 రోజులు భరించాల్సిందే. జిల్లా ప్రజలకు వేసవి నుంచి ఉపశమనం లభించాలంటే జూన్ 5వ తేదీ వరకూ ఆగాల్సిందేనని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అండమాన్ దీవుల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అవి కేరళ తీరం వైపు అంచనాల మేరకు కదులుతూ జూన్ ఒకటి, రెండవ తేదీల్లో కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అనుకోని తుపానులు ఏమీ లేకపోతే అవి రాష్ట్రంలో జూన్ 10వ తేదీ నాటికి ప్రవేశిస్తాయని వారు పేర్కొంటున్నారు. కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు కురవడం ప్రారంభిస్తే రాష్ట్రంలో భానుడు శాంతించి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వెల్లడిస్తున్నారు. జిల్లాలో రానున్న 10 రోజుల వరకూ 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు.
డోన్ కమిషనర్‌పై చర్యకు డిమాండ్
డోన్, మే 21: లైంగిక వేధింపులకు గురిచేస్తున్న డోన్ మున్సిపల్ కమిషనర్ రామ్మూర్తిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సునీత కోరారు. మంగళవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ గత మూడు నెలలుగా కమిషనర్ తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, పొదుపు మహిళలను తన వద్దకు పంపాలని వత్తిడి తీసుకువస్తున్నారన్నారు. కమిషనర్ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న కమిషనర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఆళ్లగడ్డ టికెట్ ఇరిగెలకే..
* టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
ఆళ్లగడ్డ, మే 21: 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ టిడిపి అభ్యర్థి ఇరిగెల రాంపుల్లారెడ్డి అని జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పట్టణంటోని పార్టీ కార్యాలయంలో మంగళవారం టిడిపి మినీమహానాడు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సోమిశెట్టి మాట్లాడుతూ ఆళ్లగడ్డకు సంబంధించి టిడిపి అభ్యర్థి ఇరిగెల రాంపుల్లారెడ్డి వుంటారని తెలిపారు. చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. టిడిపి పాలనలో నాణ్యమైన విద్యుత్‌ను అందిచామని, అయితే నేడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్ సమస్య అధికంగా వుందన్నారు. పేదల కష్టాలను టిడిపి మాత్రమే తొలగిస్తుందన్నారు. ఇరిగెల మాట్లాడుతూ ఇరు పార్టీలు కుమ్మక్కై మా కార్యకర్తలపై కేసలు పెడుతున్నారని, అలాంటి కేసులకు భయపడేదే లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా వుండేది టిడిపేనన్నారు. పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందన్నారు. గత ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిందని నిరాశ పడకుండా వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుదామని ఇరిగెల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో బిసి ఓట్లు ఎక్కవ వచ్చింది ఆళ్లగడ్డలోనేనన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి తప్పకుండా వస్తుందన్నారు. కార్యక్రమంలో పరిశీలకుడు గోవర్ధన్‌రెడ్డి, ఇరిగెల సోదరులు, నాయకులు వీరభద్రుడు, జున్ను ప్రసాద్‌రెడ్డి, మల్లేశ్వరచౌదరి, సుబ్బరాయుడు, రాంపుల్లయ్య పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
* నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి:ఆర్‌ఐఓ
కర్నూలు స్పోర్ట్స్, మే 21: జిల్లాలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకూ జరిగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆర్‌ఐఓ పుష్పరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 76 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో 26,840 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,298 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సుల్లో 11,346 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,349 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించామన్నారు. వేసవి దృష్ట్యా అత్యవసర వైద్యం అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య వైద్య బృందాలను పరీక్ష కేంద్రాల వద్ద నియమించామన్నారు. విద్యార్థులు పరీక్ష సమయానికి చేరేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని, అలాగే పరీక్ష సమయంలో విద్యుత్ కోత లేకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారులను కోరామన్నారు. హాల్ టికెట్లు లేని వారు జిరాక్స్ హాల్ టికెట్లతో పరీక్షకు హాజరవచ్చన్నారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, జిల్లా పరీక్షల కమిటీ, హై పవర్ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. పరీక్ష ముగిసిన తరువాత సమాధాన ప్రతాలను భద్రంగా ప్యాక్ చేసి బోర్డు కార్యాలయానికి పంపాలన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్‌ఐఓ తెలిపారు.
జూలై 1 నుంచి ఆర్‌యు బి.ఎడ్ పరీక్షలు
* ఫీజు చెల్లింపునకు 5 గడువు
కర్నూలు స్పోర్ట్స్, మే 21: రాయలసీమ యూనివర్శిటీ పరిధిలోని బి.ఎడ్ కళాశాలల్లో జూలై 1 నుంచి 17 తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్శిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మధుసూదన్‌వర్మ తెలిపారు. జూలై 1న పేపర్-1 ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, 3న పేపర్-2 సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, 5న పేపర్-3 ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, 8న పేపర్-4 స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, 10న పేపర్-5 పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, 12న పేపర్-6 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథ్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, 15, 17 తేదీల్లో పేపర్-7 మెథడ్స్ ఆఫ్ టీచింగ్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఫిజికల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి స్పెల్ ప్రాక్టికల్ పరీక్షలు జూలై 22 నుంచి 27 వరకు, రెండవ స్పెల్ ప్రాక్టికల్ పరీక్షలు 29 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ జరుగుతాయన్నారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రిన్సిపాళ్ల ద్వారా దరఖాస్తు చేసుకునేలా కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు జూన్ 5వ తేదీలోగా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఆర్‌యుఎగ్జామ్స్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలకు రూ. 1800 చెల్లించాలని, ఒక పరీక్ష రాసే వారు రూ. 700 చెల్లించాలన్నారు. జూన్ 6 నుంచి 10వ తేదీ వరకూ రూ. 500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
* అధికారుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
ఆదోనిటౌన్, మే 21: విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని సరి చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ స్తంభం ఎక్కిన జయన్న (30) అనే యువకుడు విద్యుదాఘాతంతో తీగలపైనే ప్రాణం వదిలాడు. మంగళవారం ఉదయం పట్టణ శివారులోని బసాపురం రోడ్డులో ఈ సంఘటన జరిగింది. విద్యుదాఘాతంతో తీగలపైనే ప్రాణం వదిలి వేలాడుతున్న జయన్న మృతదేహం చూసిన అందరికి కంటితడి పెట్టించింది. సంఘటన స్థలం వద్ద బంధువుల రోదనలు ప్రజలను కలిచివేశాయి. మంగళవారం బసాపురం వద్ద ఉన్న మున్సిపల్ పంప్‌హౌస్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మరమ్మతు కోసం మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్ జయన్నను కాంట్రాక్టు సిబ్బంది బాషా, రసూలు పిలిపించి మరమ్మతు చేయాలని కోరారని బంధువులు తెలిపారు. అలాగే లైన్‌మెన్ రఫీక్‌ను పిలిపించి ఎల్‌సికూడా తీసుకున్నామని చెప్పి తీరా జయన్న స్తంభంపై ఎక్కి విద్యుదాఘాతంతో మృతి చెందడం ఏమిటని బంధువులు ఆందోళనకు దిగారు. శవాన్ని కిందకు దింపడానికి కూడ వారు సాహసించలేదు. చివరకు వన్‌టౌన్ సిఐ రమణ, ఎస్సై సుబ్బరామిరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని కిందకు దించారు. కేవలం కాంట్రాక్టు సిబ్బంది నిర్లక్ష్యం వలన జయన్న మృతి చెందాడని తల్లిదండ్రులు ఈరమ్మ, రామాంజనేయులు, భార్య శారదమ్మలు ఆరోపించారు. గత ఏడాది క్రితమే జయన్నకు వివాహమైందని, పట్టణంలో విద్యుత్ మోటా ర్లు మరమ్మతు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. జయన్న మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బంధువుల ఫిర్యాదు మేరకు బాషా, రసూల్, రఫీక్‌లపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బరామిరెడ్డి తెలిపారు.
లారీ, ఆటో ఢీ.. ఇద్దరి దుర్మణం
కర్నూలు, మే 21: నగర శివారులోని నందికొట్కూరు రోడ్డులో మంగళవారం నాపరాయిలోడ్‌తో వెళ్తున్న లారీ, ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నగరంలోని బాపుజీ నగర్‌కు చెందిన శంకరయ్య (35), బాబురావు(42) మృతి చెందారు. స్థానిక వెంకాయపల్లె ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు సాయంత్రం శంకరయ్య, బాబురావు, అర్జున్, బెనహర్ కలిసి పెంచలయ్య ఆటోలో వెళ్తుండగా 3 గంటల ప్రాంతంలో నందికొట్కూరు నుంచి నాపరాయి లోడ్‌తో కర్నూలుకు వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. గింది. ఈ ప్రమాదంలో బాబురావు అక్కడికక్కడే మృతి చేందగా తీవ్రగాయాలకు గురైన శంకరయ్యతో పాటు స్వల్పగాయాలకు గురైన అర్జున్, బెనహర్, ఆటో డ్రైవర్ పెంచలయ్యను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా శంకరయ్య చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కర్నూలు 3వ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్‌ఐ లింగన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా.. యువకుడి మృతి
అవుకు, మే 21: మండల పరిధిలోని వేములపాడు మిట్ట వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఆటో బోల్తా ఘటనలో జలదుర్గం గ్రామానికి చెందిన బాబు (24) మృతి చెందాడు. బనగానపల్లె నుంచి అవుకుకు వస్తుండగా ఆటో వేములపాడు మెట్ట వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న బాబు మృతి చెందగా సురేష్, మహాలక్ష్మి తీవ్రంగా గాయపడగా వెంటనే బనగానపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎస్‌ఐ రామసుబ్బయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
బేతంచర్ల, మే 21:పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని ఇంటిలో ఫణీంద్రనాథ్ (21) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఫణీంద్రనాథ్ బిటెక్ చదివేటప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడని, ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆమెకు వేరే వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని మనస్థాపానికి గురై తన ఇంట్లో ఇవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫణి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
* అధికారుల నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన
ఆదోనిటౌన్, మే 21: విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని సరి చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేసి విద్యుత్ స్తంభం ఎక్కిన జయన్న(30)అనే యువకుడు విద్యుదాఘాతంతో తీగలపైనే ప్రాణం వదిలాడు. మంగళవారం ఉదయం పట్టణ శివారులోని బసాపురం రోడ్డులో ఈ సంఘటన జరిగింది. విద్యుదాఘాతంతో తీగలపైనే ప్రాణం వదిలి వేలాడుతున్న జయన్న మృతదేహం చూసిన అందరికి కంటితడి పెట్టించింది. సంఘటన స్థలం వద్ద బంధువుల రోదనలు ప్రజలను కలిచివేశాయి. మంగళవారం బసాపురం వద్ద ఉన్న మున్సిపల్ పంప్‌హౌస్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మరమ్మతు కోసం మున్సిపల్ కాంట్రాక్టు వర్కర్ జయన్నను కాంట్రాక్టు సిబ్బంది బాషా, రసూలు పిలిపించి మరమ్మతు చేయాలని కోరారని బంధువులు తెలిపారు. అలాగే లైన్‌మెన్ రఫీక్‌ను పిలిపించి ఎల్‌సికూడా తీసుకున్నామని చెప్పి తీరా జయన్న స్తంభంపై ఎక్కి విద్యుదాఘాతంతో మృతి చెందడం ఏమిటని బంధువులు ఆందోళనకు దిగారు. శవాన్ని కిందకు దింపడానికి కూడ వారు సాహసించలేదు. చివరకు వన్‌టౌన్ సిఐ రమణ, ఎస్సై సుబ్బరామిరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని కిందకు దించారు. కేవలం కాంట్రాక్టు సిబ్బంది నిర్లక్ష్యం వలన జయన్న మృతి చెందాడని తల్లిదండ్రులు ఈరమ్మ, రామాంజనేయులు, భార్య శారదమ్మలు ఆరోపించారు. గత ఏడాది క్రితమే జయన్నకు వివాహమైందని, పట్టణంలో విద్యుత్ మోటా ర్లు మరమ్మతు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. జయన్న మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బంధువుల ఫిర్యాదు మేరకు బాషా, రసూల్, రఫీక్‌లపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బరామిరెడ్డి తెలిపారు.