హత్నూర,మే 21: రైతు సంక్షేమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందులో భాగంగానే రైతు చైతన్య యాత్రలు, రైతు సదస్సులు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర స్ర్తి శిశుసంక్షేమశాఖ మంత్రి సునీతారెడ్డి తెలిపారు. మంగళవారంనాడు దౌల్తాబాద్‌లో నిర్వహించిన మెదక్ డివిజన్ స్థాయి రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీ లేని రుణం పొందవచ్చని అన్నారు. రైతులకు వ్యవసాయ ఆధారిత యంత్రాలకు పని ముట్లకు 50శాతం సబ్సిడీ ఇస్తుందని అన్నారు. అంతేగాకుండా వ్యవసాయ అనుబంధ సంస్థలకు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం వల్ల సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హబ్ కింద వెజిటబుల్ జోన్‌గా గుర్తించడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ఖరీప్ సీజన్‌లో 730 కోట్ల పంట రుణాలు అందంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం తగ్గి పంటల దిగుబడులు తగ్గుతాయని అన్నారు. సేంద్రియ ఎరువుల విధానాలపై దృష్టిసారించాలని సూచించారు. నకిలి విత్తనాలను విక్రయించే వ్యాపారులను జైలుకు పంపడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. భూగర్భ జలాలు అడుగంటిన సందర్భంగా రైతులు చిన్న చిన్న గుంతలు ఏర్పాటు చేసుకొని వాటర్ షెడ్డు ద్వారా నీటిని వినయోగించుకోవాలని సూచించారు. రైతు సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ అనుబంధ సంస్థల పనిముట్ల స్టాల్లు రైతులను ఆకర్శించాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భారతీ హోల్లికేరి, వ్యవసాయ సంచాలకులు ఉమామహేశ్వరమ్మ,మార్కెట్ కమిటి చైర్మన్ నారాయణరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్,ఎడిఎ కరుణాకర్‌రెడ్డి, సహకార సంఘాల అధ్యక్షుడు వివిధ గ్రామాల ఆదర్శలు పాల్గొన్నారు.
ఉగ్రవాద నిర్మూలనలో యువత పాత్రే కీలకం
సంగారెడ్డి,మే 21: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యువత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.నాగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఎంఎన్‌ఆర్ కళాశాల మందిరములో ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా యువజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎం.ఎన్.ఆర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.జి.నాగయ్య మాట్లాడుతూ ఉగ్రవాదం ఏర్పడడానికి కొన్ని ప్రాథమిక కారణాలు ఉన్నాయని వాటిని మనందరము ప్రభుత్వ సహకారంతో సరిచేసినట్లైతె ఉగ్రవాదాన్ని రూపుమాపవచ్చన్నారు. ముఖ్యంగా యువత ఉగ్రవాద వ్యతిరేక భావాలను పెంపొందించుకోవాలన్నారు. ఉగ్రవాద ఉన్మాదానికి చిన్న దేశాలే కాక అగ్ర దేశాలు కూడా భయందోళనలకు గురైవుతున్నాయన్నారు. ఉగ్రవాదుల ప్రతాపం సామాన్య జనులపై చూపడంవల్ల ఎందరో అమాయక ప్రజలు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిఇడి కళాశాల ప్రిన్సిపల్ డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రబలడానికి మత, ఆర్థిక, రాజకీయకీయ, ప్రాంతీయ కారణాలు దోహదపడుతున్నాయన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నా అవేవీ పనిచేయడంలేదన్నారు. చదువుకున్న నిరుద్యోగు ఉగ్రవాదం వైపు ఎక్కువగా ఆకర్షితవౌతున్నారని వారందరికీ ఉద్యోగాలు కల్పిస్తే ఉగ్రవాద కార్యకలాపాలు కొంతమేరకైనా తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా యువజన సంక్షేమాధికారి యన్.రామచంద్రయ్య మాట్లాడుతూ ఉగ్రవాదం అనేది రెండు రూపాల్లో కనబడుతుందని అందులో జాతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదాలున్నాయని తెలిపారు. ఉగ్రవాదం మానవాళికి పట్టిన చీడ అని, కులం, మతం, జాతి భేదాల్లేకుండా ఇది అందరిని కబళిస్తుందని అన్నారు. జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు కూన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి కొన్ని పొరుగు దేశాలు ప్రయత్నిస్తున్నాయని, భారతీయ యువశక్తి దైర్యంగా ఇట్టి ఉగ్రవాద శక్తులను ఎదుర్కొనడమేగాక, ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే శక్తి యుక్తులు నేటి యువతకు ఉన్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా కలిసిమెలిసి బతుకుతున్న దేశ ప్రజలందరూ ఉగ్రవాద నిర్మూలనలో కార్యోన్ముఖులు కావాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి డి.నాగార్జున్,నెహ్రూ, యువకేంద్రం కోఆర్డినేటర్ క్రిష్ణారావు,యువజన సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షులు గాల్‌రెడ్డి,జిల్లా యువజన సంఘాల స్టీరింగ్ కమిటీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి మరియు ఎం.ఎన్.ఆర్ సిబ్బంది,కళాశాలల విదార్థులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
* టిడిపి మినీమహానాడులో కార్యకర్తలకు పార్టీ పరిశీలకుడు అమర్‌నాధ్‌బాబు పిలుపు
నర్సాపూర్,మే 21: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ పార్లమెంటు నియోజకవర్గం టిడిపి పరిశీలకుడు అమర్‌నాథ్‌బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారంనాడు నర్సాపూర్‌లోని భావాణి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని అన్నారు. నాయకులు పార్టీ వీడినంత మాత్రనా కార్యకర్తలు,అభిమానుల బలం టిడిపికి ఉందని స్పష్టం చేశారు. బడుగు బలహిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేసేది టిడిపి ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్ పూర్తిగా అవినీతి మయంగా తయారైందని కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వైసిపి,టిఆర్‌ఎస్ పార్టీలు ఎన్నటికి కాంగ్రెస్‌లో కలిసే పార్టీలేనని టిడిపిని బలహిన పర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ కట్ర పూరిత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సాధన పట్ల చిత్తశుద్ధితో ఉన్న టిడిపిపై లేని పోనివి సృష్టిస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ఒక శక్తిగా తయారై కంకణబద్ధులై పని చేసి తిరిగి టిడిపిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ కోసం కలిసి పోరాడుదాం
తెలంగాణ సాధన కోసం కలిసి కట్టుగా పోరాటం చేయవలసిన అవసరముందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతారావు అన్నారు. మంగళవారంనాడు నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన మినీ మహానాడులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాలని అన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన స్థానాల్లో తెలంగాణ వచ్చే వరకు పోటి చేయవద్దని అన్నారు. కార్యదక్షతకు,క్రమశిక్షణకు తెలుగుతమ్ముళ్లకు ఎవరు సాటిరారని అన్నారు. అధికారంలో లేకపోయినా మొక్కబోని అత్మ విశ్వాసంతో ముందుకు సాగడమే లక్ష్యంగా పని చేస్తున్న కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మినీ మహానాడులో నాయకులు తెలంగాణ కోసం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గోపాల్‌రెడ్డి, పబ్బారమేశ్, రఘువీరారెడ్డి, అశోక్‌గౌడ్, మల్లేశ్‌యాదవ్, సత్యనారాయణ, గోవర్ధన్‌రెడ్డి, మహేష్‌గుప్త, హకీం, కొండికుమార్, శ్రీనివాస్‌గౌడ్, బాల్‌రాజ్‌గౌడ్, రమేశ్‌నాయి, వినోద్, సంతోష్‌గుప్త, వెంకటేశ్, మల్లేశ్‌యాదవ్, హైదర్‌బేగ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి
మునిపల్లి,మే 21: మునిపల్లి మండలంలోని కంకోల్ గ్రామ శివారులో గల అరువై ఐదవ జాతీయరహదారి పక్కన ఉన్న పినాకిని ఎడ్యుకేషన్ ట్రస్టు అధ్వర్యంలోని 4ఎకరముల 10గుంటల సీలింగ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని బిసి, ఎస్సీ ఎస్టీ విద్యార్థిసంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రమేష్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలో బుధేరా చౌరస్తాలో స్థానిక విలేకర్ల తో మాట్లాడుతూ కంకోల్ గ్రామశివారులోని 234 సర్వేనంబర్ లోని 4ఎకరముల 10 గుంటల భూమిని ప్రభుత్వం స్వాదినం చేసుకుని అర్హులైన గ్రామ ప్రజలకు పంపిణీ చేయాలని అయన అన్నారు. ట్రస్టు యాజసమాని మాగ్రామ సీలింగ్ భూమిని గ్రామ ప్రజలకు ఇప్పించాలని అధికారులను కోరుకుంటున్నమని అన్నారు. ట్రస్టు యాజమానికి పెదల భూమిని తమరు విడిచి పెట్టాలని ప్రశ్నించగా అయన సరైన సమాదానం ఇవ్వటం లేదని అయన పేర్కోన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రస్టు అధ్వర్యంలో ఉన్న 4-10 గుంటల భూమిని పేదప్రజలకు పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకుని స్వాధీనపరుచుకున్న యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదెవిదంగా ఇట్టి భూమిపై ప్రగతిశీల యువజన సంఘం అధ్వర్యంలో గత సోమవారంనాడు జిల్లా జెయింట్‌కలెక్టర్ శరత్‌కు ఫిర్యాదు చేసినట్లు అయన తెలిపారు.
ఫల పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన మహారాష్ట్ర మంత్రి
సంగారెడ్డి, మే 21: జిల్లా కేంద్రంలో ఉన్న ఫల పరిశోధన కేంద్రాన్ని మహారాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి విజయ్‌కుమార్ మంగళవారం సందర్శించారు. ఈసందర్భంగా అక్కడ నర్సరీలో మామిడి తోటను మరియు నర్సిరీని మామిడి పండ్లను పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా అధికారులు రామలక్ష్మీ ఇతర అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం పలు సందేహాలను కూడా నివృత్తి చేశారు.
ధర్మ రక్షణకు కంకణబద్ధులు కావాలి
* హిందూ దేవాలయాల పరిరక్షణ సంస్థ అధ్యక్షుడు కమలానందభారతి
సంగారెడ్డి,మే 21: హిందూ ధర్మ రక్షణకు అందరం కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉందని హిందూ దేవాలయాల పరిరక్షం సంస్థ అధ్యక్షుడు కమలానందభారతి పేర్కొన్నారు. మంగళ వారం స్థానిక రెవెన్యూ కాలనీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజ నిర్మాణానికి దేవలయాలు కేంద్రంగా ఉంటాయని ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను మరిచి ఇతర సంస్కృతి కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి కుటుంబ ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరలను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సంగ్రాం మహారాజ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా జాతిని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీరాముడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకమ నిర్వహాకుడు ఏ కేశవరాజు మాట్లాడుతూ దేశ ఉద్దరణకు రామచరిత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అయోధ్యలో హిందూ జాతి కోరిక మేరకు రామ మందిరాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసం రాజకీయాలను చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భజరంగ్‌దళ్ నేత సుభాష్‌చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పన్యాల ప్రభాకర్, మర్పల్లి రాంరెడ్డి, శ్రీధర్‌గౌడ్, విష్ణు, మందుల నాగరాజు, అనంతరామలు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.