Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇక ఫల్లెల్లోకి ఫ్లోరోసిస్ ప్రచార బృందాలు

$
0
0

నల్లగొండ, మే 21: జిల్లా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరోసిస్ నివారణ దిశగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాల పరంపర మరో అడుగు ముందుకు పడనుంది. త్వరలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఫ్లోరోసిస్ వ్యాధుల నివారణ దిశగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సుశిక్షితులైన అధికారుల బృందాలతో విస్తృత ప్రచారం చేపట్టేందుకు కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు సూచనలతో జిల్లా ఫ్లోరైడ్ నియంత్రణ విభాగం కార్యాచరణ సిద్ధం చేసింది. ఫ్లోరైడ్ పీడిత 48మండలాల్లో ఆర్‌విఎం పరిధిలోని సిఆర్‌పిలను ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ఫ్లోరోసిస్ నివారణ చర్యలపై ముందుగా శిక్షణ అందించనున్నారు. ఇందుకు ఇప్పటికే సిఆర్‌పిల ఎంపిక పూర్తి చేశారు. ఈ అంశంపై సుశిక్షితులైన సిఆర్‌పిలతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగ, సిబ్బందికి ఫ్లోరోసిస్ నివారణ చర్యలపై అవగాహాన కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. తదుపరి వారంతా గ్రామాల్లోకి చేరుకుని అక్కడే బస చేసి కళాబృందాలతో పాటు స్వీయ ప్రసంగాలతో ప్రజలకు ఫ్లోరోసిస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహాన కల్పిస్తారు. ముందుగా ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు మండలంగా తీసుకోనున్నారు. మర్రిగూడ మండలం పూర్తయినా పిదప ఫలితాలను విశే్లషించి మునుముందు మిగతా మండలాలకు సైతం ఫ్లోరోసిస్ చైతన్య ప్రచార కార్యక్రమాన్ని విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించుకోనున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా 17మండలాల్లో ఉండగా, పాక్షికంగా మరో 31మండలాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికే కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు చొరవతో జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణ కార్యక్రమాల అమలు ఊపందుకోగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ చొరవతో వాటికి ప్రభుత్వ పరంగా ఆర్ధిక చేయూత సైతం లభించడంతో ఫ్లోరైడ్ పీడితులకు మేలు చేసింది. ఫ్లోరైడ్ పీడిత మండలాల్లో అంగన్‌వాడీ విద్యార్థులకు పాలు, గుడ్డు పౌష్టికాహారం పంపిణీతో పాటు ప్రత్యేక వికలాంగులుగా పెన్షన్ సౌకర్యం అమలులోకి వచ్చింది. 952మంది బాధితులకు 35కిలోల బియ్యం, 650మందికి ట్రైసైకిళ్లు అందించారు. 15కోట్ల ఖర్చుతో ఫ్లోరైడ్ అవాసాల 959పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులకు రక్షిత మంచినీటి కోసం ట్యాంకుల నిర్మాణానికి నిధులు సైతం మంజూరయ్యాయి. అదిగాక ఫ్లోరైడ్ నియంత్రణ గుణాలు ఉన్న జామ, ఉసిరి, బొప్పాయి, కరివేపాకు, శ్రీతులసి మొక్కలను ఇంటింటికి సరఫరా చేసేందుకు, కాల్షియం, మెగ్నిషియం, సి విటమిన్ కిట్స్‌ను అందించేందుకు మరో కార్యాచరణ సిద్ధం చేశారు.

ప్లోరోసిస్ బాధితులకు వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ
నల్లగొండ, మే 21: జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితులకు వైద్య సేవలు అందించడంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, డాక్టర్లు నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం ఫ్లోరైడ్ పీడిత 17మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బందితో ఆయన ఫ్లోరోసిస్ పీడితులకు అందుతున్న వైద్య సేవల విషయమై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లా కేంద్రంలో ఫ్లోరైడ్ బాధితుల కోసం ప్రత్యేకంగా 10పడకల వార్డును ప్రభుత్వం మంజూరు చేసిందని దీనిపై ముందుగా డాక్టర్లు తగిన అవగాహాన సాధించి ఫ్లోరైడ్ బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఫ్లోరైడ్ బాధితులకు అందించే వైద్య సేవలపై కరపత్రాలు ముద్రించి పంపిణీ చేయాలని కోరారు.

సాక్షర భారత్ లక్ష్య సాధనను వేగవంతం చేయండి
* ఎంపిడివోలకు ఎజెసి పిలుపు
నల్లగొండ, మే 21: సాక్షర భారత్ లక్ష్య సాధన కార్యక్రమాలను పగడ్భందిగా అమలు చేసే ప్రయత్నాలను వేగవంతం చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ నీలకంఠం ఎంపిడివోలకు సూచించారు. సాక్షర భారత్‌పై డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎంపిడివోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతు సాక్షర భారత్ అభ్యాసకులను అక్షరాస్యులను చేయడంలో కోఆర్డీనేటర్లు, వాలంటీర్లు సేవా, అంకితాభావంతో పనిచేయాలన్నారు. స్ర్తి, పురుష అక్షరాస్యత శాతాన్ని 10శాతం వరకు తగ్గించేలా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అభ్యాసకులను కేంద్రాలకు క్రమం తప్పకుండా రప్పించడంతో పాటు వారికి వివిధ సామాజిక, రాజకీయ, ప్రభుత్వ, ఆర్ధిక అంశాలపై తగిన అవగాహాన కల్పించాలన్నారు. అందరికి విద్యను అందించే లక్ష్యంతో చేపట్టిన సాక్షర భారత్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు ఎంపిడివోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సాక్షరాభారత్ రాష్ట్ర వనరుల కేంద్రం ప్రతినిధి కృష్ణారెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 2010లో జరిపిన సర్వేతో జిల్లాలో 9లక్షల 74వేల మంది నిరక్షరాస్యులను గుర్తించి సాక్షరాభారత్ కింద మొదటి విడతలో 90వేలు, రెండవ విడతలో 90వేల మందిని అక్షరాస్యులుగా చేసే కార్యక్రమం అమలు చేశామన్నారు. మూడో విడతో 2లక్షల 50వేల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు 2376కోఆర్డీనేటర్లు, 17900మంది వాలంటీర్లు పని చేస్తున్నారన్నారు.

వారంలోగా ఆధార్ కార్డుల ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలి
నల్లగొండ , మే 21: వారంలోగా ఆధార్‌కార్డుల ఎన్‌రోల్‌మెంట్ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ కళాశాలల ప్రిన్సిపల్స్‌లకు, సాంఘీక సంక్షేమ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌జి కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2లక్షల 67వేల మంది లబ్దిదారులు 26పథకాల ద్వారా ఉపకార వేతనాలు పొందుతున్నారన్నారు. బ్యాంకు అకౌంట్లను, ఆధార్ కార్డు నెంబర్లను ఆయా కళాశాలల ప్రధానాచార్యులు విద్యార్థుల నుండి సేకరించి ఎన్‌రోల్‌మెంట్‌ను పూర్తి చేయాలన్నారు. బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులు లేనివారు పూర్తి వివరాలను దరఖాస్తులో సమర్పించిన యెడల తిరిగి వారికి ఆధార్ కార్డు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తల్లెత్తకుండా నేరుగా జులై 1 నుండి తమ ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని ఆయన తెలిపారు.

సాగునీటి కాలువలను పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం
వలిగొండ, మే 21: రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న నియోజకవర్గంలోని బునాదిగాని, బొల్లేపల్లి, పిల్లాయిపల్లి కాలువలను పూర్తి చేయాలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యురాలు, భువనగిరి ఎమ్మెల్యే ఏలిమినేటి ఉమామాధవరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని శివసాయి పంక్షన్‌హాల్‌లో భువనగిరి నియోజకవర్గం మినిమహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ టిడిపి పార్టీ ఉన్నంత కాలం పార్టీలోనే కొనసాగుతానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలో ఉన్న సాగునీటి కాలువలను పూర్తి చేయలేదని, టిడిపి అధికారంలో ఉంటే ఎప్పుడో పూర్తయ్యేవని, నిమ్స్ ఆసుపత్రి పనులు నిలిచిపోవడానికి కాంగ్రెస్ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడమేనని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకై టిడిపి ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, కొంతమంది స్వలాభం కోసం టిడిపి అధినేత చంద్రబాబుపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయలేనని కిలోమీటర్ల పాదయాత్రను చంద్రబాబు చేశారని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి, రాబోయే రోజుల్లో పరిష్కరం చేయడానికే వస్తున్న మీకోసం పాదయాత్ర చేపట్టారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకోవాలని, భువనగిరి నియోజకవర్గం నుండి తిరిగి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, ప్రధాన కార్యదర్శి అయిలయ్య, రాష్ట్ర తెలుగు యువత నాయకులు గూడూరు శివశాంత్‌రెడ్డి, చిట్టెడి జనార్థన్‌రెడ్డి, చెర్కు శివయ్య, సోమనబోయిన రమేష్, పబ్బు ఉపేందర్‌బోస్, అయిటిపాముల రవి, పల్లెర్ల రాంచందర్, అయిటిపాముల ప్రభాకర్, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీసేవతో ప్రజలకు సేవలందించాలి: జెసి
నల్లగొండ , మే 21: అధికారులంతా మీ సేవా కార్యక్రమంపై పూర్తి స్థాయి అవగాహన కల్గి ఉండి ప్రజలకు అన్ని రకాల సేవలందించాలని జెసి హరిజవహర్‌లాల్ కోరారు. మంగళవారం మీ సేవా కార్యక్రమంపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖకు ఇద్దరు ఆర్పిలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 18శాఖలకు సంబంధించి 129సేవలు ప్రస్తుతం మీ సేవా ద్వారా అందుతున్నప్పటికి కేవలం 10సేవలు మాత్రమే ప్రజలకు అందుతున్నాయన్నారు. విద్యా, ఆరోగ్య, ఆర్టీఎ, పోలీసు, ట్రాన్స్‌కో శాఖలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ సేవా కేంద్రాలలో త్వరలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పనితీరు పర్యవేక్షిస్తామని జిల్లాలో ఉన్న 220 మీ సేవా కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నిర్దేశించిన ఫీజుల కంటే అదనంగా తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి లైసెన్స్‌లను రద్దు చేయాలని తహశీల్దార్‌లను ఆదేశించారు.
రెవెన్యూ పహాణీలను మీసేవాల ద్వారా జారీ చేయాలన్నారు. మీ సేవా అమలులో బి కేటగిరిలో ఉన్న జిల్లాలను ఎ కేటగిరిలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో మీ సేవా ఇన్‌చార్జి రమాదేవి, డి ఇవో జగదీష్, సబ్ రిజిస్ట్రర్ మోహన్, ఎ ఎస్‌వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
నల్లగొండ , మే 21: ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 22నుండి 30వరకు నిర్వహిస్తున్నందున పరీక్ష కేంద్రాల పరిధిలో 144సెక్షన్ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వర్‌రావు తహశీల్దార్‌లను కోరారు. పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో జీరాక్స్‌సెంటర్‌లు విధిగా మూసి వేయాలని ఆయన ఆదేశించారు.

కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు
మిర్యాలగూడ, మే 21: విద్యార్ధులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవ్చని జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో విద్యనభ్యసించి 10వ తరగతి పరీక్షల్లో 10 పాయింట్లు సాధించిన కలకొండ భాగ్యలక్ష్మి ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్‌ను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యలో రాణించినప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆయన అన్నారు. పోటీ పరీక్షల్లో విరివిగా హాజరై తమ ప్రతిభకు పదునుపెంచుకోవాలని ఆయన సూచించారు. రోజురోజుకు విద్యార్ధుల్లో పోటీ పెరుగుతుందని, పెరుగుతున్న పోటీకి అనుగుణంగా మెదడుకు పదునుపెట్టుకోవాలని ఆయన సూచించారు. పేదరికం చదువుకు ఆటంకం కారాదని , విద్యలో రాణిస్తే వారిని ప్రోత్సహించేందుకు ఎంతోమంది దాతలు ముందుకొస్తారని ఆయన అన్నారు. భవిష్యత్‌లో కూడా మంచిఫలితాలు సాధించి పేరుప్రఖ్యాతలు తీసుకరావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాద్యాయులు వెంకటకృష్ణ, ఉపాధ్యాయులు చందు, రాఘవరెడ్డి, గోపి, అరవింద్, వీరారెడ్డి, వెంకటేశం, బాను, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరోసిస్ నివారణ దిశగా జిల్లా
english title: 
publicity campaign

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>