నల్లకుంట, మే 22: నాడు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వేమన, సుమతి శతకాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహద పడతాయని ప్రముఖ సాహితీవేత్త డా.ద్వానా శాస్ర్తీ అన్నారు. చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో వంగూరి ఫౌండేన్ ఆఫ్ అమెరికా, శ్రీ త్యాగరాయ గానసభల సంయుక్త ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెనె్నల కార్యక్రమంలో భాగంగా తెలుగు కవిత్వంలో వ్యక్తిత్వ వికాస ప్రసంగ సభ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.ద్వానా శాస్ర్తీ మాట్లాడుతూ నేడు యువత పాశ్చాత్య పోకడలతో వ్యక్తిత్వం వికాసం కోసం పాశ్చాత్య పుస్తకాలు ఉదువుతున్నారని అవి మన పురాణాలు, కథలు, శతకాలలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఒక స్ర్తి సమస్య ఎదురైనప్పుడు దిగులు పడకుండా శకుంతలలా మహారాజు కొలువులో పోరాడిన వైనాన్ని స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. వ్యక్తి వికాసం తను నివసిస్తున్న పరిసరాలపై కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు. తెలుగు అకాడమి సంచాలకులు ఆచార్య కె.యాదగిరి మాట్లాడుతూ నన్నయ, పోతన, శ్రీనాధుడు మొదలగు వారు ప్రబంధకాల ద్వారా వ్యక్తిత్వ వికాసం వివరించారని అన్నారు. దార్శనికమైన శక్తి కలిగి కాలాతీతమైన అంశాలను తన కవిత్వంలో అక్షరబద్దం చేసి ప్రజలకు కవి అందిస్తాడని అన్నారు. ఈకార్యక్రమంలో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జె.చెన్నయ్య, డా.కళావేంకట దీక్షితులు, డా.తెనే్నటి సుధాదేవి పాల్గొని ప్రసంగించారు.
బ్యాగరి కులవృత్తిదారుల సమస్యలను
శాసనమండలిలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్
ముషీరాబాద్, మే 22: శ్మశానవాటికల్లో పనిచేసే బ్యాగరి కులవృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర మాల సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బ్యాగరి వృత్తిదారుల సదస్సు జరిగింది.
బ్యాగరి వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించడం ద్వారా నేటి తరానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. బ్యాగరి కుల వృత్తిదారుల న్యాయపరమైన డిమాండ్‌లను పరిష్కరిస్తామని అన్నారు. ఐక్యవేదిక కన్వీనర్ ఆవుల బాలనాధం మాట్లాడుతూ పూర్వకాలం నుంచి సంక్రమిస్తున్న పవిత్ర బ్యాగరి వృత్తిని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని అన్నారు.
మనుగడ దెబ్బతింటున్న వృత్తి పరిరక్షణకు ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ శ్మశాన వాటికలను బ్యాగరిలకే పరిమితం చేయాలని అన్నారు. కార్యక్రమంలో మాల సంఘాల నేతలు రొడ్డం కిష్టయ్య, ఎం.ప్రేమ్‌కుమార్, కరణం కృష్ణ, దాసరి సత్యనారాయణ, మాన్యం శ్రీధర్ పాల్గొన్నారు.