హైదరాబాద్, మే 22: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ అందించే సేవలను మరింత త్వరితగతిన అందించేందుకు, అలాగే ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రౌండ్ ది క్లాక్ కాల్ సెంటర్ పనితీరుపై ఇకపై వారానికోసారి సమీక్ష నిర్వహించాలని మేయర్ మాజీద్ హుస్సేన్ కమిషనర్ ఎం.టి.కృష్ణబాబును ఆదేశించారు. నగరంలోని సిటీమేనేజర్స్‌లో బల్దియా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ పనితీరుపై ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వారానికోసారి కాల్‌సెంటర్ పనితీరు పరిస్థితిని కమిషనర్ సమీక్షించి అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. కాల్‌సెంటర్ పనితీరుపై అకస్మిక తనిఖీలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఆయన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. కాల్‌సెంటర్ విషయంలో తప్పుడు సమాచారమిచ్చే వారిని, అలాగే ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే సిబ్బంది తమ విధి నిర్వహణలో విఫలమైతే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కృష్ణబాబు మాట్లాడుతూ కాల్‌సెంటర్ విషయంలో ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసే సిబ్బందితో పాటు డిప్యూటీ కమిషనర్లపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాల్ సెంటర్‌కు ఫిర్యాదుదారుడి నుంచి వచ్చిన ఫిర్యాదును సక్రమంగా సంబంధిత అధికారులకు, క్షేత్ర స్థాయికి సిబ్బంది తెలియజేయటంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్
english title:
c
Date:
Thursday, May 23, 2013