హైదరాబాద్, మే 22: వేసవి ఎండలు మండిపోతుంటే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కేవలం మంచినీటి కొరత తప్పదనుకుంటే విద్యుత్ కోతల వెతలు కూడా తప్పేట్టు లేవు. ఒకవైపు రోజురోజుకీ పెరిగిపోతున్న ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజల ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించటంలో రోజురోజుకీ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. అవసరాలకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోవటంతో సరఫరాలో మున్ముందు కోతలు అనివార్యమయ్యే పరిస్థితి కన్పిస్తోంది. దీనికితోడు ఎప్పటికపుడున్న విద్యుత్ కనెక్షన్లలో ప్రతిఏటా అయిదు శాతం కనెక్షన్లు పెరగటంతో పాటు, విద్యుత్ చౌర్యం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ కనెక్షన్లు కూడా లక్షల్లో ఉండటంతో మున్ముందు కోతలు తప్పేట్టు లేవు. ప్రస్తుతం మహానగరంలో అధికారికంగా కోతలేమీ లేకపోయినా, అధికారులు మాత్రం అనధికారికంగా రోజుకీ దాదాపు గంట నుంచి గంటన్నర సేపు వివిధ ప్రాంతాల్లో కోతలు అమలుచేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు తలెత్తనున్న కొరతను అధిగమించేందుకు సిపిడిసిఎల్ మల్లగుల్లాలు పడుతోంది. మరోవైపేమో ప్రతి వేసవి కాలంలో తలెత్తుతున్న విద్యుత్‌కొరత సమస్యను అధిగమించేందుకు అదనంగా విద్యుత్‌ను ఉత్పత్తి కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఎప్పటికపుడు కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన డిఆర్సీలో ఇన్‌ఛార్జి మంత్రి గీతారెడ్డి ఈ కేంద్రాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సంవత్సరం కరెంట కష్టాలెలాగో చివరి దశకొచ్చాయని, కనీసం వచ్చే సంవత్సరం వేసవి ప్రారంభం నాటికైనా దాన్ని అందుబాటులోకి తేవాలని నగర వాసులు కోరుతున్నారు. గడిచిన అయిదేళ్లలో విద్యుత్ కనెక్షన్లు పెరిగిన తీరును గమనిస్తే మున్ముందు నగరంలో ప్రత్యేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయకుంటే మున్ముందు నగరంలో విద్యుత్ సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చనుందని చెప్పవచ్చు.
నగరంలో కేవలం వేసవికాలంలోనే గాక, మిగిలిన కాలాల్లోనూ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే పెరుగుతున్న కనెక్షన్లలో కేవలం నలభై శాతం కనెక్షన్లు మాత్రమే అధికారుల లెక్కల్లో కన్పిస్తుండగా, మిగిలిన అరవై శాతం కనెక్షన్లు అక్రమంగా ఏర్పాటై విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నవేనని తేలింది. గడచిన అయిదేళ్లుగా నగరంలో గృహ అవసరాల విద్యుత్ కనెక్షన్లు సుమారు 18.22 లక్షలుండగా, వీటి సంఖ్య ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 23 లక్షల 64వేలకు పెరిగాయి. అలాగే నగరంలోని వ్యాపార సంస్థలకు చెందిన విద్యుత్ కనెక్షన్లు అయిదేళ్ల క్రితం సుమారు 2.97 లక్షలుండగా, సుమారు నాలుగున్నర లక్షలకు పెరిగాయి. అలాగే వ్యవసాయ, పరిశ్రమలకు సంబంధించి అయిదేళ్ల క్రితం విద్యుత్ కనెక్షన్లు 60వేల 300 వరకుండగా, లక్షా 35వేలకు పెరిగాయి. అలాగే కేవలం 1930 వరకున్న భారీ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్లు కూడా 3700లకు పెరిగాయి. ఈ రకంగా ఏటా నగరంలో విద్యుత్ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతమున్న కనెక్షన్లలో నాలుగు నుంచి అయిదు శాతం పెరుగుతోంది. ఈ రకంగా ప్రతి ఏటా విద్యుత్ వినియోగం పెరుగుతున్నా, ఉత్పత్తి మాత్రం పెరగకపోవటం మున్ముందు సమస్య తీవ్రతకు సంకేతంగా భావించవచ్చు. నగరంలో రోజుకి 40 మిలియన్ యూనిట్ల వినియోగం దాటనుంది. ఇక వేసవికాలం ప్రారంభం కాగానే ఈ వినియోగం మరింత పెరగనుంది. ప్రస్తుతం ఎండలు బాగా మండిపోతున్నందున ఈ వినియోగం 43 మిలియన్ యూనిట్లకు పెరిగిన్నట్లు ఓ అంఛనా.
పెరుగుతోన్న వృథా, చౌర్యం!
ప్రస్తుతమున్న అవసరాలకు అనుకూలంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేయలేని పరిస్థితి ఉండగా, మరోవైపేమో ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్‌లో శాఖకు కేవలం 46శాతం విద్యుత్‌కు బిల్లులు వస్తున్నాయి. విద్యుత్ శాఖకు సంబంధించిన నగరంలోని సెంట్రల్ జోన్, సౌత్, నార్త్ జోన్లలో మొత్తం కలిపి ప్రస్తుతం జరుగుతున్న సరఫరాలో 64.15శాతం కరెంటు వృథా అవటమో, చౌర్యానికి గురవటమో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎక్కువగా సౌత్ జోన్‌లో విద్యుత్ వృథా, చౌర్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన అధికారులు, దాన్ని నివారించేందుకు సరైన చర్యలు చేపట్టలేకపోతున్నారు.
ఇందుకు రాజకీయ వత్తిళ్లే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒకరకంగా సౌత్ జోన్‌లో అధికారిక కనెక్షన్ల కన్నా, అక్రమ కనెక్షనే్ల ఎక్కువగా ఉన్నా, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్పా, వాటిని క్రమబద్ధీకరించేందుకు గాను, చౌర్యానికి అడ్డుకట వేసేందుకు గాను చర్యలు చేపట్టకపోవటం కూడా సమస్య తీవ్రతకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.
వేసవి ఎండలు మండిపోతుంటే
english title:
m
Date:
Thursday, May 23, 2013