ఇబ్రహీంపట్నం, మే 22: భార్యను గొంతు నులిమి హత్యచేసి ఇంటిముందు సంపులో గుట్టుచప్పుడు కాకుండా పడేసిన భర్త తనకేమీ తెలియనట్టు నటించడాన్ని పసిగట్టిన గ్రామస్తులు భర్తకు దేహశుద్ధి చేసిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోల్కంపల్లి గ్రామస్తులు, బంధువులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం- గ్రామానికి చెందిన కావలి వెంకటేశ్(32) ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య అనురాధ (26)తో బుధవారం ఉదయం గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో వెంకటేశ్ భార్య గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హత్యకు గురైన భార్య శవాన్ని ఏమిచేయాలో తెలియక ఎవరూ లేకుండా చూసి తన ఇంటిముందు ఉన్న సంపులో అనురాధ మృతదేహాన్ని పడేసి సంపుకు మూతపెట్టి ఏమీ తెలియనట్టుగా డ్యూటీకి వెళ్లి పోయాడు. భార్యాభర్తల మధ్య గొడవ జరిగినప్పుడు ఇంట్లో వెంకటేశ్ తల్లిదండ్రులు లేరు. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటిముందు ఉన్న సంపులో చీర తేలి ఉండటాన్ని చుట్టుపక్కలవారు గమనించారు. ఇంట్లో ఎవరూ లేరు, చీర సంపులో ఉందని అక్కడకు వెళ్లి చూడగా అనురాధ సంపులో పడివుండటాన్ని గమనించారు. వెంటనే బయటకు తీయగా అనురాధ అప్పటికే చనిపోయి ఉంది. గొంతు నులిమి చంపినట్లుగా మెడకు గాట్లు, గాయాలు ఉన్నాయి. విషయం తెలుసుకుని గ్రామస్తులు, బంధువులు అక్కడకు చేరుకుని గుమికూడగా అదే సమయంలో స్కూటర్‌పై భర్త వెంకటేశ్ తనకేమీ తెలియనట్లుగా వచ్చాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులు, బంధువులు వెంకటేశ్‌ను పట్టుకుని భార్యను హత్య చేసి ఎలా బతకుతావురా? అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తు దేహశుద్ధి చేశారు. గ్రామస్తుల దాడితో స్పృహతప్పడంతో కొంతమంది వెంకటేశ్‌ను అక్కడనుండి తప్పించారు. కాగా మృతురాలు అనురాధ ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెంది కావలి కలమ్మ, శ్రీనుల కూతురు. ఏడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు అన్ని లాంఛనాలతో వెంకటేశ్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి బాబు పుట్టి చనిపోయాడు. మళ్లీ పిల్లలు పుట్టలేదు. పిల్లల విషయంలో , ఆర్థిక అంశాల విషయంలో ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు అంటున్నారు. మృతురాలి తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడు. సంఘటనా స్థలానికి వచ్చిన పట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులకు అస్వస్థత
కీసర, మే 22: కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కీసరలోని హశ్విత ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు కళాశాల నిర్వహించే హాస్టల్‌లో ఉంటున్నారు. మొదటి సంవత్సరం ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థులు మంగళవారం హాస్టల్‌లో భోజనం చేశారు. రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు అవుతుండటంతో తోటి విద్యార్థుల సహకారంతో కీసరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసి తల్లిదండ్రులు కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించే హాస్టల్‌కు అనుమతి లేదని విద్యార్థులు తెలిపారు. గత ఏడాది అడ్మిషన్లప్పుడు ఉచిత వసతి కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదని వాపోయారు.
కాంగ్రెసు ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మహేందర్‌రెడ్డి
నేరేడ్‌మెట్, మే 22: కాంగ్రెసు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2014 ఎన్నికల్లో టిడిపి గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టిడిపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. మహేందర్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బుధవారం నేరేడ్‌మెట్‌లోని మహబోధి ఫంక్షన్ హల్‌లో నియోజకవర్గ ఇంచార్జి వికె మహేష్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినీమహానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, మంత్రులు, ఉన్నతాధికారులు జైలుకెళ్లారని తెలిపారు. శాంతభద్రతలు లోపించి మహిళలకు రక్షణ కరవైందన్నారు. పథకాల పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
టిడిపి స్థాపించక ముందు రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌నాయక్, గౌలికర్ రవీందర్, రావుల అంజయ్య మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారని విమర్శించారు.
ఇన్‌చార్జి వికె మహేష్ మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. తిరిగి తేదేపా అధికారంలోకి వస్తేనే ప్రజాసమస్యలు పరిష్కరమవుతాయని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు మండల రాధాకృష్ణయాదవ్, ఆకుల నర్సింగ్‌రావు, వై సుధాకర్‌రెడ్డి, బివికెరావు, తుపాకుల జనార్ధన్, కటికల రమేష్, వాసంశెట్టి, గొపి, పిట్ల శ్రీను, కృష్ణగౌడ్, వగ్గుచంద్రశేఖర్, నర్సింహ్మగౌడ్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మినీ మహానాడుకు
కార్పొరేటర్ల గైర్హాజర్
టిడిపి నిర్వహించిన మినీమహనాడుకు స్థానికంగా ఉన్న టిడిపి కార్పొరేటర్లు హాజరుకాలేదు. దీంతో తిరిగి ఇన్‌చార్జికి కార్పొరేటర్ల మధ్య ఉన్న దూరం మరింత పెరిగిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
కొంతకాలంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి మల్కాజిగిరిలో కార్పొరేటర్లను వెంటతిప్పుకుంటూ పలు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవిషయం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అయినప్పటికీ ఇంచార్జి కార్పొరేటర్లు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు. పార్టీ పిలుపుమేరకు నిర్వహించిన కార్యక్రమానికి కార్పొరేటర్లు హజరుకాకపోవడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని స్థానిక కార్యకర్తలు అనుకోవడం కనిపించింది. ఇలా ఉంటే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎలా సాధ్యమవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు.
మల్కాజిగిరిలో టిడిపి బలోపేతమే ధ్యేయం
మల్కాజిగిరి, మే 22: మల్కాజిగిరిలో టిడిపిని బలోపేతం చేసేందుకు తాము చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని రంగారెడ్డిజిల్లా అధికార ప్రతినిధి ఆర్.జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఓల్డ్‌మల్కాజిగిరి డివిజన్‌లో డివిజన్ అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో మినీ మహానాడు సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జితేందర్ రెడ్డితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నర్సింగరావు, డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ తాము పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నిత్యం కృషి చేస్తూనే ఉన్నామని అన్నారు.
మల్కాజిగిరిలో రానున్న ఎన్నికల్లో తప్పకుండా ఇక్కడ టిడిపి జెండా ఎగురవేస్తామని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రల వల్ల పార్టీలో నూతనోత్తేజం ఉరకలేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్, నాయకులు ఆకుల నర్సింగరావు, జిల్లా శంకర్, జలంధర్‌రెడ్డి, భాస్కర్, మురళీధర్‌రావు, ఎం.వెంకటేష్, సత్యమూర్తి, శ్రీ్ధర్, సచ్చిన్ తదితరులు పాల్గొన్నారు.
దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి: ఆకుల
నేరేడ్‌మెట్, మే 22: మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ అన్నారు. బుధవారం వౌలాలి డివిజన్ పరిధిలోని హనుమాన్‌నగర్, సాయినాథపురంలో 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసిరోడ్డు, భూగర్భడ్రైనేజీ పనులను కార్పొరేటర్ భారతీరాజ్‌తో కలసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ ద్వారా దళితవాడలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అన్నిప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కుద్దుస్, చందు, చంద్రకళ, విఠోబా పాల్గొన్నారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
ఇబ్రహీంపట్నం, మే 22: యాచారం మండలం నందివనపర్తి గ్రామ పరిధిలోని బొల్లిగుట్ట తండాలో బుధవారం బాల్య వివాహాన్ని యాచారం పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. తండాకు చెందిన తవుర్య, అంజమ్మ దంపతులు. తన 15 ఏళ్ల కూతురు చిట్టికి మంచాల మండలం బోడకొండకు చెందిన హరినాధ్ నాయక్(22)తో బుధవారం ఉదయం తండా వేదికగా వివాహం కుదిర్చారు. ఉదయం పెద్ద ఎత్తున తండాలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. బంధువులు చేరుకుని కొద్దిసేపు అయితే వివాహం జరుగుతందన్న సమయంలో పోలీసులు రంగ ప్రవేశంచేసి పెళ్లిని అడ్డుకున్నారు. బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న ఎస్సై ఆశీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తండాకు చేరుకున్నారు. తహశీల్దారు విజయలక్ష్మీ, యండివో ఉషలు అక్కడకు చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 2013 మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాసిన ముక్కుపచ్చలారని విద్యార్థినికి వివాహం చేసి తన జీవితాన్ని నాశనం చేయవద్దని సూచించారు. పైచదువులు చదివించడంకోసం ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహాలను అందిస్తుందని అన్నారు. పెళ్లి కొడుకును పోలీసులు అక్కడనుండి స్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా వివాహం కోసం చాలా ఖర్చు చేశానని, బంధువులు అందరూ వచ్చారని , ఇప్పుడు పెళ్లి ఆగిపోయిందని బాలిక తల్లిదండ్రులు భోరున విలపించారు.
తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు
చేవెళ్ల, మే 22: తెలంగాణ రాష్ట్రం వస్తే యువతకు ఉద్యోగాలు మెండుగా వస్తాయని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. టిఆర్‌ఎస్ పిలుపుమేరకు ఇక్కడ జరిగిన శిక్షణ తరగతుల్లో స్వామిగౌడ్, ఎమ్మెల్యే కె.హరీశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామిగౌడ్ మాట్లాడుతూ, టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఎల్‌కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందిస్తుందని అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కేసిఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మించి రంగారెడ్డి జిల్లాకు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు వెయ్యి, వికలాంగులకు 17 వందలు పింఛన్ అందిస్తామని అన్నారు. హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని నీరు, ఉద్యోగాలు ఇక్కడివారికే ఇవ్వాలని, సోనియా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసారని అన్నారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసి స్థానిక ఎన్నికలకు సిద్ధం చేయాలని అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి డి.ఆంజనేయులు మాట్లాడుతూ, రాజకీయ లబ్దికోసమే తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నారని, ఇప్పటికైనా తెలంగాణవాదులు రాష్ట్ర సాధనకు ఐక్యంగా పోరాడాలని అన్నారు. శిక్షణ తరగతుల్లో గోరెటి వెంకన్న, కిషోర్, శ్రీనివాస్ బృందం పాటలతో అందరినీ చైతన్య పరిచారు. కార్యక్రమంలో నాగేందర్‌గౌడ్, స్వప్న, కార్తీక్ మాధవరెడ్డి, రాంరెడ్డి, మాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ఉప్పల్, మే 22: ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా, కనీస సౌకర్యాలను కల్పించకుండా సరైన క్రీడాస్థలం లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఉప్పల్ అధ్యక్ష, కార్యదర్శిలు మధు, బాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఉప్పల్ విజయపురికాలనీలో ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల నుండి ఫీజుల రూపంలో అక్రమంగా డబ్బులను వసూలు చేస్తూ విద్యాసంస్థలు స్థాపిస్తూ ఎలాంటి సౌకర్యాలను కల్పించకుండా అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ విద్యా దందాను యథేచ్ఛగా స్వాగతిస్తున్న విద్యాశాఖ అధికారులపై మండిపడ్డారు. ఎలాంటి సౌకర్యాలను కల్పించకుండానే ప్రారంభించే పాఠశాలలపై విచారణ చేపట్టకుండా వారు ఇచ్చే లంచాలకు కక్కుర్తిపడి సిబ్బంది నివేధికను జారీ చేసి చేతులు దులుపుకుంటే విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అనుమతి లేని సంస్థలపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సీజ్ చేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు యాదగిరి, ఫణీంద్ర, సతీష్, విజయ్, లక్ష్మికాంత్, నందు, వెంకట్, రాకేష్, కిషోర్ పాల్గొన్నారు.
నీరు, జీవవైవిధ్యంపై దృష్టి పెట్టాలి
కెపిహెచ్‌బి కాలనీ, మే 22: అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లి సర్కిల్‌పరిధిలో భూగర్బ జలాల పెంపు, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతూ బుధవారం సర్కిల్ జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ గంగాధర్‌రెడ్డికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కట్టా నర్సింగరావు, డివిజన్ ప్రధాన కార్యదర్శి యడ్ల సత్యనారాయణతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో కార్పొరేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా బయోమెడికల్ వ్యర్ధ రసాయనాలను రోడ్లపై, వర్షపు నాళాలలో డంపింగ్ చేస్తున్నారని, అలాగే మాంసపు దుకాణాలు నివాస ప్రాంతాల నుండి తరలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు. పలు హోటల్ నిర్వాహకులు శుభ్రతను పాటించడం లేదని, నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా ఉపయోగించడం వలన ఆయా కాలనీలలోని పచ్చదనం కనుమరుగవుతోందని, వాణిజ్య సముదాయాలకు అనుమతులను మంజూరు చేయవద్దని కోరారు. ఆయాప్రాంతాలలో రోడ్లపై ఊడ్చిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్ధాలను కాల్చడం వలన విషవాయువులు విడుదలై ప్రజలకు అనారోగ్యం కలిగే అవకాశం ఉందని, ఈ విషయంలో జిహెచ్‌ఎంసి స్వీపింగ్ సిబ్బందికి సూచనలు ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు.
ఆకట్టుకున్న ‘ఆదిపరాశక్తి’ నాటకం
జీడిమెట్ల, మే 22: చిత్తారమ్మ దేవి ఆలయ ప్రాంగణంలో నవరాత్రి కల్చరల్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘ఆదిపరాశక్తి’ నాటకాన్ని నిర్వాహకులు అర్జున్‌రావు ఆధ్వర్యంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా విచ్చేసిన కూన కృష్ణగౌడ్, మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ కూన శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకి నాటకాలు కనుమరుగవుతున్నాయని తెలిపారు. నాటకాల ద్వారా వారిలోని కళలు బయటపడతా యన్నారు. ప్రతి కళాకారుడు మరిచిపోతున్న నాటక ప్రదర్శనలను ప్రజలకు మళ్లీ గుర్తు చేయాలని సూచించారు. ప్రతిఒక్కరు నాటకాలను ఆదరించి వారి కళలను గుర్తించాలన్నారు. ఆది పరాశక్తి నాటక ప్రదర్శనను తిలకించిన ప్రజలు మంత్ర ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, ఆలయ ఛైర్మన్ కూన అంతయ్యగౌడ్, ఇంద్రసేనాగుప్త తదితరులు పాల్గొన్నారు.