Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మూస.. నస.. నిరాశ..!

$
0
0

చిత్ర పరిశ్రమలో ప్రతీ నిర్మాతా, దర్శకుడూ చిన్న సినిమా బ్రతకాలని చిలకపలుకు పలుకుతారు. కానీ, చేతలకి వచ్చేసరికి ఆ మాట మారిపోతుంది. ముందుగా హీరోను దృష్టిలో పెట్టుకుని, ఆ హీరోతో ఎంత బడ్జెట్‌లో చిత్రం నిర్మిస్తే కాల్షీట్లు ఇస్తాడోనని తర్జనభర్జనలుచేసి చివరికి ఎన్నో కోట్లు బడ్జెట్ అనుకొని సదరు ఆ హీరోను సంప్రదిస్తున్నారు. అంత ఖర్చుపెట్టగలడా లేడా అని హీరోలు ఆలోచించి, ఆ నిర్మాతకు కాల్షీట్లు ఇస్తున్నారు. ఇదంతా నాణేనికి ఓ వైపు. మరోవైపు చిన్నసినిమాను ఎటువంటి పేరుతో నిర్మించాలని ఆయా నిర్మాతలు ఆలోచిస్తుంటారు. వీలైనంతవరకూ యవతను ఆకర్షించడానికి లవ్ మంత్రాన్ని జపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్ ‘లవ్’యుడు, లవ్ టచ్, లవ్‌లాంగ్వేజ్, లవ్ సైకిల్, లవ్ యట్ ఫస్ట్ సైట్, లవ్ రంగం, లవంగం, లవ్ లవ్ లవ్, లవ్ 420, లవ్ బిజినెస్, వీకెండ్ లవ్ - ఇలా పేర్లు పెట్టుకుంటూ కొన్ని సన్నివేశాలు కాలేజీ నేపథ్యంలో అల్లుకుంటూ చిన్న సినిమా అంటూ వీలైనంత తక్కువబడ్జెట్‌లో తీసేసి ప్రేక్షకులమీదకి వదిలేస్తున్నారు.

చిన్న సినిమాల సంఖ్య పెరిగితే పరిశ్రమలో పదిమందికి ఉపాధిదొరుకుతుందని కథలు చెబుతూ పబ్బం గడుపుకునే కొందరి మాటలు ఇక్కడ మంత్రంలా పనిచేస్తాయి. అయితే చిన్న సినిమాల విజయాలు ఎక్కువగా నమోదు చేసుకున్న దాఖలాలు కనిపించవు. దాదాపుగా అన్నీ తిరుగుటపా కడుతున్నవే. పరిశ్రమలో ప్రస్తుతం తెలుగు సినిమాలు 5-డి కెమెరాతో ఇబ్బడిముబ్బడిగా తీసివేయచ్చని ఆలోచనతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో, బస్టాప్ లాంటి చిత్రాలు కలెక్షన్లు బాగా రాబట్టడంతో అదేస్థాయి కలెక్షన్లు వచ్చేస్తాయని కొందరు నిర్మాతలు ఆశపడుతున్నారు. కానీ ఆయా చిత్రాల్లో వున్న అండర్ కరెంట్ లాంటి సందేశం, యువతకి నచ్చే పాయింట్లను వదిలేస్తున్నారు. దీంతో ఎక్కువశాతం మొదటివారానికే థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇదే సందడిలో హాలీవుడ్, బాలీవుడ్‌నుంచి దిగుమతి అవుతున్న డబ్బింగ్ సినిమాలు కూడా దాడిచేస్తున్నాయి. చిన్న బడ్జెట్ అంటే బడ్జెట్ తక్కువని కొంతమంది చెబుతుంటే, స్టార్లు లేని చిత్రమని కొందరి అభిప్రాయం. అయితే విడుదల తరువాత అవి సాధించే విజయాలతో భారీ చిత్రాలుగా కొందరు విశే్లషకులు చెబుతున్నారు. ఒక చిత్రం కనుక హిట్ అయిందీ అంటే అదే మూసలో అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వాలుతున్నాయి. 90 శాతం చిత్రాలు ప్రేక్షకాదరణ నోచుకోకపోవడానికి కారణం సరైన కథ, కథనాలు లేకపోవడమే. కేవలం యూత్‌ని టార్గెట్ చేసి తీస్తున్న చిత్రాలు వారిని ఆకట్టుకోలేకపోతున్నాయి. గతంలో చిన్న సినిమాలు రకరకాల కథలతో ప్రేక్షకులముందుకు వచ్చేవి. అందులో కథనాలు కూడా సరికొత్తగా ఉండేవి. ప్రస్తుతం చిన్న సినిమాలకు యువ ప్రేక్షకులే ఆధారం కనుక వెకిలి కథలు, వెటకారపు డైలాగులతో సరైన మేకింగ్ లేని చిత్రాలు పుట్టపగిలినట్లుగా వస్తున్నాయి. వీటిపట్ల సినీ విమర్శకులు ఎంత చెప్పినా, డబ్బు సంపాదనే ధ్యేయంగా చిత్రాలు నిర్మించే దర్శక నిర్మాతలకు స్పందన ఉండడంలేదు. మంచి చెడుల సమ్మేళనంగా నిర్మించాల్సిన సినిమాలు చెడునే ఎక్కువగా చూపిస్తూ ఇలా చేయకూడదని చెప్పడంతో మళ్లీ పాత మూస చిత్రాలవైపే ఆయా చిత్రాలు ప్రయాణిస్తున్నాయి. ఇటీవల కొన్ని చిత్రాల్లో సన్నివేశాలతోపాటుగా మాటలుకూడా శృతిమించి పిల్లలు, పెద్దలు సైతం వినలేని విధంగా వుంటున్నాయి.
కుటుంబ కథా చిత్రాల ఊసు ఎక్కడా కనబడడంలేదు. ఒకవేళ ఎవరైనా నిర్మాతలు అలాంటి చిత్రాలనునిర్మిస్తే ఆ చిత్రం విడుదలవడం గగనమే. సొంత ఖర్చులు పెట్టుకుని థియేటర్లు అద్దెలకు తీసుకుని ప్రదర్శించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అదే నాలుగు బూతు డైలాగుల గుప్పించి ట్రైలర్ విడుదల చేశారంటే బయ్యర్లు ఎగబడి వస్తున్నారు. థియేటర్లు కూడా దొరకని మంచి చిత్రాలకు, శృంగారం ఒలకబోస్తున్న చిత్రాలకు తేడా థియేటర్లు దొరికే విధానాన్ని బట్టే తెలుస్తోంది.
ఇప్పుడు వస్తున్న చిన్న చిత్రాలలో ఎక్కువ శాతం కొత్త తారాగణం, సాంకేతిక నిపుణులు కనిపిస్తున్నారు. ఇలాంటి చిత్రాలు ఒకటో అరో విజయాలు సాధించినా ఆ తరువాత వారికి భవిష్యత్తు ఉండడంలేదు. మరో చిత్రం రాక, చిత్రసీమను వదిలివెళ్ళలేక జీవచ్ఛవాల్లా అక్కడే బ్రతుకు వెళ్లదీస్తున్నారు. ఇలాంటివారితో సినిమాను అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ రోజుల్లో తీయవచ్చన్న నిర్మాతల ఆశకు కొందరు సాంకేతిక నిపుణులు, నటులు బలైపోతున్నారు. ఇటీవల వచ్చిన సాంకేతిక విప్లవంలో భాగంగా 5-డి కెమెరా చిన్న సినిమాలకు ఉపయోగపడుతోంది. అందుకే ప్రతి నిర్మాత ఈ టైపు చిత్రాలవైపు మొగ్గుచూపుతున్నారు. చిత్ర విచిత్రమైన పేర్లతో, పేలవమైన కథతో అతుకుల బొంతగా చిత్రాలు రూపొందుతున్నాయి. యువతలోని వెకిలి చేష్టల కోణాలను ఎక్కువగా చూపిస్తూ పెద్దలు, చిన్నపిల్లలు చూడలేనంత వ్యంగ్యంగా సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయా చిత్రాల్లో ఇచ్చే సందేశం చివరిలో ఓ మాటగా వింటే సినిమా అంతా బూతుబాగోతంలా సాగిస్తున్నారు. థియేటర్లు ప్రేక్షకులు లేకపోయినా తమ చిత్రం హిట్టయిందని, విజయయాత్రలు జరపడం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిపోయింది. యువత కూడా చిత్రంలోని కథా కథనాలవైపు ఎక్కువ ఆసక్తి చూపడంలేదు. కొద్దిసేపు టైమ్‌పాస్ అయితే చాలన్నట్లుగా చిత్రాలకు వస్తున్నారు. అలా వస్తున్నా కానీ బాగోలేని చిత్రాలవైపు వారి చూపు పడడంలేదు. సమాజానికి నీతి చెప్పకపోయినా ఫర్వాలేదు కానీ చెడు చెప్పవద్దని నేటి నిర్మాతలకు చెప్పేదెవరు? దిగజారుడు మాటలను అవలీలగా రాస్తున్న రచయితలు వాటిని పలుకుతున్న నటీనటులు, పాటలు రాస్తున్న రచయితలు- వీరందరినీ చూసి ఆయా కుటుంబాలు గర్వపడతాయో, తలదించుకుంటాయో వారికే తెలియాలి. నేడు సినిమా వ్యాపారంగా భావించబట్టే సెన్సార్ సర్ట్ఫికెట్ ఇచ్చే సమయంలో అనేక బీప్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ప్రతి నిమిషానికి ఒక్క బీప్ శబ్దం వినిపిస్తే ఇక ఆ సినిమాలో ఉన్న విషయం అర్థమవుతుందా? కనీస విలువలు కూడా పాటించకుండా చిన్నసినిమాను పలువురు దుశ్శాసనుల్లా మారి ఊబిలో నెడుతున్నారు.
చిన్న సినిమా నిర్మాతలు ఆడియోవేడుకల్లో, సక్సెస్‌మీట్‌లలో తమ చిత్రం చాలా గొప్పదని, యువతలో మంచి మార్పును తీసుకొస్తుందని చెబుతుంటారు. ఆయా వేడుకల్లో ప్రేక్షకులు చూడలేని విధంగా అనేక రకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. చిన్నసినిమాలు బ్రతికితే పెద్ద పరిశ్రమకు మంచిదని చెప్పేవాళ్ళే పెద్ద సినిమాను పంపిణీ చేసి లాభాలను పొందుతుండడం ఇక్కడ కొసమెరుపు. చిన్న సినిమా బూతుకు ముడిసరుకు కాదని గ్రహించగలిగితే కొంతవరకు పరిశ్రమలో మంచి చిత్రాలు వస్తాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇక వారు వారికి నచ్చిన విధంగానే చిత్రాలు తీస్తారుకాని, ప్రేక్షకులకు నచ్చిన విధంగా తీయరన్న మాట ప్రేక్షకుల్లో ఎప్పుడో రూఢీ అయిపోయింది. అందుకే మంచి చిత్రాలు తీస్తే తామెప్పుడూ ఆదరిస్తామని అనేకసార్లు నిరూపిస్తూనే ఉన్నా రు. అయినా దర్శక నిర్మాతల అభిరుచిలో మార్పు రానంతవరకూ చిన్న సినిమా ఊబిలో కూరుకుపోతూనే ఉంటుంది.

దశ, దిశలేని చిన్న సినిమా
english title: 
m
author: 
-ఎమ్.డి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>