మన దేశంలో చిరుతిళ్లు ఇళ్లల్లో ఆడవాళ్లు తయారుచేసి పెడుతూంటారు. జంతికలు, అరిసెలు, చెక్కలు, పాలకాయలు, చేగోడీలు.. ఇలా. కాని విదేశాల్లో పెద్దపెద్ద కార్పొరేషన్స్ అత్యధిక క్వాంటిటీని తయారుచేసి చవకగా పాకెట్లలో అమ్ముతూంటాయి. రీసెర్చ్ శాఖ వారే వీటన్నింటినీ కనిపెట్టేది. ప్యాకింగ్ నించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధని తీసుకుంటారు. ఐతే నేడు ప్రాచుర్యం పొందిన అనేక చిరుతిళ్లని అమెరికాలో ప్రమాదవశాత్తు కాకతాళీయంగా కనిపెట్టారు. వాటిలో మొదటి చాక్‌లెట్ చిప్ కుకీస్.
1930లో మసచుసెట్స్ రాష్ట్రానికి చెందిన రూత్‌లేక్ ఫీల్డ్ టాల్‌హౌస్ ఇన్‌ని నడిపేది. ఆమె ఓసారి చాక్లెట్ కుకీని తయారుచేసేప్పుడు అందులోకి అవసరం అయిన బేకింగ్ చాక్లెట్ నిండుకుంది. ఆమె బయటకి వెళ్లి దాన్ని కొనడానికి బద్దకించి సెమీ స్వీట్ చాక్లెట్ బార్‌ని చిన్నచిన్న ముక్కలుగా చేసి పిండిలో కలిపింది. ఆ ముక్కలన్నీ పిండిలో కరిగిపోతాయని ఆమె నమ్మింది. ఐతే అవి కరగక ఆ కుకీస్ (బిస్కెట్లు)లో చిన్న చాక్లెట్ ముక్కలు బయటికి కనపడ్డాయి. ఆ విధంగా పుట్టిన చాక్లెట్ చిప్ కుకీని వినియోగదారులంతా ఇష్టపడ్డారు. త్వరలోనే అది అమెరికా అంతటా వ్యాపించి ప్రాచుర్యం పొందింది.
పొటాటో చిప్స్ నేడు మన దేశంలో కూడా యువతలో పాపులర్ స్నాక్. దీని పుట్టుక కూడా అనుకోకుండా జరిగింది. 1853లో న్యూయార్క్‌లోని సరటోగా స్ప్రింగ్స్‌లోని ఓ బార్‌కి వచ్చిన ఓ కస్టమర్‌కి బంగాళా దుంపల ఫ్రైని ఇస్తే ఆ ముక్కలు మరీ లావుగా ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. దాంతో చెఫ్ జార్జ్‌క్రమ్ ఇంకాస్త సన్నగా కోసి వేయించి ఇచ్చినా అతనికి తృప్తి కలగలేదు. దాంతో కోపం వచ్చిన జార్జ్ వాటిని అత్యంత సన్నగా రేకుల్లా తరిగి వేయించి ఉప్పు చల్లి ఇచ్చాడు. ఐతే అవి అతనికే కాక మిగిలిన కస్టమర్లకి కూడా నచ్చడంతో పొటాటో చిప్స్ ఆవిర్భవించాయి. ‘సరటోగా చిప్స్’ పేర త్వరలోనే వాటిని జార్జ్‌క్రమ్ పేకెట్లలో విక్రయించడంతో అవి అమెరికన్ ఇళ్లల్లోకి స్నాక్‌గా వెళ్లాయి. ఇంకా వెళ్తున్నాయి. ఇప్పుడు వాటిని అనేక వెజిటేరియన్, నాన్‌వెజిటేరియన్ ఫ్లేవర్స్‌లో కూడా తయారుచేస్తున్నారు.
పిల్లలకి నచ్చే పాప్సికల్ (ఐస్‌ఫ్రూట్) 1905లో శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆవిర్భవించింది. పదకొండేళ్ల ఫైంక్ ఎప్పర్‌సన్ తన ఇంటి పోర్బ్‌లో నీళ్లల్లో రుచిని ఇచ్చే పౌడర్‌ని కలిపి దాంతో సోడా చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కొద్దిసేపటికి విసుగు పుట్టి ఆ నీటిని అలాగే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ రాత్రి శాన్‌ఫ్రాన్సిస్కోలో బాగా చలి వచ్చి ఆ ద్రవం మొత్తం గడ్డ కట్టింది. మర్నాడు దాన్ని అతను నాకితే తియ్యగా, పుల్లగా ఉందనిపించింది. తండ్రి సలహా మీద పుల్లని ఆ ద్రవంలో ఉంచి గడ్డ కట్టించాడు. అంతే. పాప్సికల్ పుట్టింది. దీన్ని పిల్లలే కాక పోర్నోగ్రఫీ చిత్రాల్లో కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు. పద్దెనిమిదేళ్ల తర్వాత అతను కాలిఫోర్నియాలోని ఓ ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లో పళ్ల రుచిగల పాప్సికల్స్‌ని తయారుచేసి తొలిసారిగా అమెరికన్స్‌కి దాన్ని పరిచయం చేశాడు. నేడు దాని తయారీ ఓ పెద్ద పరిశ్రమగా మారింది.
బ్రాందీ కూడా ప్రమాదవశాత్తు తయారైన ఆల్కహాల్ ద్రవమే. 12వ శతాబ్దంలో వైన్ సీసాకింత అని సుంకం విధించేవారు. అప్పటికప్పుడు నీళ్లల్లో కలుపుకుని తాగే వైన్ వల్ల ఒకే సీసాకి ఎక్కువ గ్లాసుల వైన్‌ని తక్కువ సుంకంతో అమ్మొచ్చు అనే ఆలోచనతో అలాంటి వైన్‌ని కనిపెట్టబోతే, అది బ్రాందీగా మారింది. దీన్ని ఎవరు కనిపెట్టారో వివరాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
డయాబెటిక్ వాళ్లు వాడే ఆర్ట్ఫిషియల్ స్వీట్‌నర్ సేక్రిన్‌ని 1878లో కాన్‌స్టేన్‌టిన్ ఫాల్‌బెర్గ్ అనే శాస్తజ్ఞ్రుడు కనిపెట్టాడు. జాన్‌హోప్కిన్స్ యూనివర్సిటీలోని రెమ్‌సైన్ లేబొరేటరీలో కోల్ తారు మీద ఆయన పరిశోధన చేస్తూ ఓ రాత్రి తన చేతులు తియ్యగా ఉండటం గమనించాడు. ఆ తీపి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తే తెలిసింది. అదే సేక్రిన్. అతను వివిధ రసాయనాలు ముట్టుకున్నాక చేతులు కడుక్కునేవాడు కాదు. లేకపోతే సేక్రిన్ ప్రపంచానికి లభ్యమయ్యేది కాదు.
మన దేశంలో చిరుతిళ్లు ఇళ్లల్లో ఆడవాళ్లు
english title:
snacks
Date:
Sunday, May 26, 2013