రాత్రి పదిగంటలు కావస్తోంది తన రూమ్‌మేట్ అనూష ఇంకా రాలేదని ఆందోళన పడుతోంది శ్రీవర్ష.
రూమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. శ్రీవర్షను ఓవైపు ఆవలింతలు పలకరిస్తున్నాయి. మరోవైపు ఆమె కళ్లు తమ కిటికీలు మూసుకోవాలని ఉబలాటపడుతున్నాయి. కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పి.జి కళాశాలలో ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తెల్లవారితే... కెమిస్ట్రీ ప్రాక్టికల్ పరీక్ష. ప్రాక్టికల్ రికార్డు, టెక్ట్స్‌బుక్, ఇతరత్రా నోట్సు తిరగేస్తుంది శ్రీవర్ష.
అనూష కరీంనగర్‌లోని సహజ కళాశాలలో ఎం.బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. చాలా చలాకైన పిల్ల. చదువుల్లో తన ప్రతిభ కనబరస్తూ క్లాస్ ఫస్ట్‌గా నిలుస్తోంది. కనుక అందరి దృష్టి ఆమెవైపే! లెక్చరర్లలో సైతం ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని ముద్రవేసుకుంది. కోఎడ్యుకేషన్ కనుక.. అబ్బాయిలతోనూ క్లోజ్‌గా మూవయ్యే సోషల్ మెంటాలిటీ వున్న అమ్మాయి అనూష.
అనూష, శ్రీవర్షలది గోదావరిఖని. బాల్యమిత్రులు ఇద్దరి పేరెంట్స్ సింగరేణిలో పనిచేస్తున్నారు. పాత పరిచయమున్న కుటుంబాలు. హాస్టల్ భోజనం పడక, గత సంవత్సరం నుండి ఇద్దరూ కలిసి.. కరీంనగర్ మంకమ్మ తోట లేబర్ అడ్డా సమీపంలో ఓ రెండు రూముల పోర్షన్ అద్దెకు తీసుకుని వుంటున్నారు. వారిద్దరిమధ్య ఎప్పుడూ ఏ విషయంలోనూ గొడవ పడిన దాఖలాలులేవు. సొంత అక్కా చెల్లెళ్లుగా.. మసలుకుంటున్నారు. అంత క్లోజ్‌గా వుండే అనూష బర్త్‌డే పార్టీకని వెళ్లి ఇంకా రాకపోవడంవల్ల.. పరీక్షకు తయారయ్యే శ్రీవర్షకు ఒక్కక్షరం కూడా తలకెక్కడంలేదు.
చూస్తుంటే రాత్రి పదిన్నర కావస్తుంది. ఇంటి ఓనర్స్ క్రింది పోర్షన్‌లో ఉంటారు. వారు కూడా ఇవాళే ఏదో పనిపై హైద్రాబాద్‌కు వెళ్ళారు. ఒంటరిగా వుంది శ్రీహర్ష. అప్పటికే నాలుగైదు సార్లు అనూషకు ఫోన్ చేసింది. ‘స్విచ్డ్ ఆఫ్’ అని వస్తోంది.
ఇలా ఆలోచిస్తూ.. ఆందోళనకు గురవుతూ తెలియకుండా నిద్రలోకి జారుకుంది శ్రీవర్ష.
ఇంతలో తలుపు తట్టిన శబ్దం విని ఉలిక్కిపడి లేచింది. మళ్లీ శబ్దం రెట్టింపయింది. తేరుకుని సెల్‌ఫోన్‌లో టైం చూసుకుంది. పదకొండు కావస్తున్నది. కళ్ళు తుడుచుకుంటూ... ఆవలింతలు తీస్తూ నిద్రమబ్బులోనే డోర్ తెరిచింది శ్రీవర్ష.
అనూషతోపాటు మరో యువకుడు రావడం చూసి ఖంగుతింది!
‘రా పవన్’ అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది అనూష.
నిద్రమత్తులో వున్న శ్రీవర్షకు ఏమీ అంతుపట్టడంలేదు అనుకోని ఈ పరిణామం. శ్రీవర్షను ఆందోళనతోపాటు భయానికి గురిచేయడం జరిగింది. తాను చూస్తున్నది నిజమా! కలా అని పరీక్షించుకునేందుకు ఒకసారి చేయిని గిల్లుకుంది.
నిజమేనని నిర్థారించుకుని నిద్రలోంచి పూర్తిగా తేరుకుంది శ్రీవర్ష! పవన్‌ను ఓ కుర్చీలో కూర్చోబెట్టింది అనూష... ‘దెబ్బలేమైనా తగిలాయా పవన్’ అంటూ పవన్ చేతులూ కాళ్లూ పరిశీలించడం ప్రారంభించింది అనూష.
‘‘ఏమీ కాలేదు. దెబ్బలేమీ పెద్దగా తగలలేదు. కేవలం మోకాలుపై ప్యాంటు చినిగింది... మోకాళ్లు, మోచేతులూ ఒరుసుకుపోయాయంతే...’’ అంటూ సమాధానమిచ్చాడు పవన్.
లోపలినుండి డెట్టాల్, కాటన్ తెచ్చి ఒరుసుకుపోయిన గాయాలపై డెట్టాల్‌తో రుద్దుతోంది.. దాంతో బాధను భరించలేక ‘అమ్మా’ అంటున్నాడు పవన్. ‘కొంచెం ఓర్చుకో పవన్. అంతా మట్టితో నిండి వుంది... కాటన్‌తో శుభ్రం చేస్తానంటూ’’ డెట్టాల్‌నద్దుతోంది అనూష! బాధనోర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అనూష మృదువుగా సపర్యలు చేస్తుంటే.. ఊహాలోకాల్లోకి వెళ్ళాడు పవన్.
‘నావల్లే ఇదంతా జరిగింది పవన్’ అంటూ అనూష పశ్చాత్తాపపడటం ప్రారంభించింది. తేరుకుని ‘అదేం కాదులే’ అని బదులిచ్చాడు.
‘పార్టీలో నిన్ను డ్రింక్ తీసుకొమ్మని ఫ్రెండ్స్‌తో సరదాగా పాల్గొనమని నేనే వత్తిడి చేశా.. పవన్.. నేను అలా చేయాల్సింది కాదు. నీవిప్పుడు త్రాగి బైక్ నడపడం.. ఆక్సిడెంట్‌కు గురికావడం అంతా జరిగిపోయింది’ అంది.
‘‘మనం లక్కీ ఫెలోస్‌ము అనూష, పెద్ద దెబ్బలేమీ తగల్లేదు.. ముఖ్యంగా నీకేం కాకపోవడం’’ అన్నాడు పవన్. ఇద్దరి వాలకం చూస్తే పార్టీలో పాల్గొన్న తర్వాత సరదాగా బైక్‌పై వేగంగా వస్తూ... ప్రమాదానికి గురయ్యారని ఇట్టే తెలిసిపోయింది శ్రీవర్షకు.. చనువుగా వారిద్దరు మాట్లాడుతున్న సంభాషణ చూస్తుంటే... ఎప్పుడో అనూష తన క్లాస్‌మేంట్ బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పిన విషయం గుర్తుకొచ్చింది శ్రీవర్షకు. ఈయనే ఆయననుకుంది.. ఆరడుగుల అందగాడు.. చక్కని ముఖవర్చస్సు.. తాగిన నిషాలో కూడా హుషారుగా కనిపిస్తున్నాడు. చెదిరిపోయిన వుంగరాల జుట్టు, జీన్‌ప్యాంటు, టీషర్టు.. మెడలో చైన్, చేతికి బంగారు రింగులు చూస్తుంటే ఏ ఆడపిల్లకైనా మతి చెదరాల్సిందేనన్న వీర లెవల్లో వున్నాడు పవన్. ఆయన అందాన్ని చూసి అనూష ఎంత అదృష్టవంతురాలని ఒకింత అసూయకు
గురైంది శ్రీవర్ష.
అనూషతోపాటు సపర్యలు పొందుతూ ఆమె మృదుస్పర్శతో... తనను తాను మరిచిపోతూ తన్మయత్వానికి గురవుతున్నాడు పవన్. ఇంతలో... ‘మీ రూమ్‌మేట్ పేరేమో అన్నావ్’ అనూష అని ప్రశ్నించాడు.
‘శ్రీవర్ష’ అంది. ‘వెరీ గుడ్ నేం.. వెరీ గుడ్ ఫిగర్’ అన్నాడు. ‘అలా మాట్లాడుతున్నావేం? పవన్’ అంది అనూష. ‘ఏం లేదు, చాలా బ్యూటిఫుల్ గర్ల్ అండ్ స్మార్ట్ గర్ల్’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.
‘‘ఏంటి నాకన్నా గుడ్ ఫిగరా’’ అంది. కాదులే అనూష... మొదటి లుక్‌తోనే కిక్కిచ్చింది. నా మత్తు దించి గమ్మతె్తైన లోకంలోకి తీసుకెళ్ళింది’ అన్నాడు పవన్.
‘ఆపు పవన్. శ్రీవర్ష గురించి నీవలా మాట్లాడకు’ అంది. ‘నేనేం మాట్లాడాను డియర్, నీ ఫ్రెండ్ అందాన్ని మెచ్చుకున్నానంతే’ అన్నాడు. మత్తులో ఏదేదో పిచ్చిమాటలు మాట్లాడుతున్న తీరును చూస్తూ అసహనంతోనే.. ఫ్రిజ్‌లోనుంచి వాటర్ బాటిల్ తెచ్చి యిచ్చింది.
పవన్ నీళ్లు త్రాగుతూనే శ్రీవర్ష ఆచూకీ కోసం.. తన కళ్ళకు పనిపెట్టాడు. ఆయన కళ్లు రూమంతా గాలించాయి. రూంబయట వరండాలో కుర్చీలో చదువుతున్న శ్రీవర్షను తాకాయి పవన్ చూపులు! ‘అనూష.. నీ ఫ్రెండ్ శ్రీవర్ష ఎంత బుద్ధిమంతురాలో’ అంటూ మళ్లీ సంభాషణను కొనసాగించాడు.
‘్థ్యంక్స్ అనూష. ఈ రెండేళ్ల మన పరిచయంలో ఈరోజే నాతో చాలా క్లోజ్‌గా బిహేవ్ చేశావు. ఎన్నడూ లేని విధంగా ఇందాక మనం బైక్‌పై వస్తున్నప్పుడు.. మెత్తగా గమ్మత్తుగా హత్తుకుని కూర్చుని.. గట్టిగా నన్ను పెనవేసుకున్న తీరు నన్నింకా వెంటాడుతోంది’ అన్నాడు పవన్.
‘కొంచెం మెల్లగా మాట్లాడు. బయట శ్రీవర్ష వింటుంది’ అంది. ఎం.బి.ఏలో చేరినప్పటినుండి చాలా హుందాగా వున్న అనూష, పవన్‌ల మధ్య మొగ్గతొడిగిన స్నేహం క్రమంగా ప్రేమగా వికసించింది. అలాగే కొనసాగుతోంది. అయితే ఎప్పుడూ హద్దులు దాటలేదు. అప్పుడప్పుడు హద్దులు దాటుదామని పవన్ మారాం చేసినా సున్నితంగా తిరస్కరిస్తూ వస్తోంది అనూష.
బుద్దిమంతుడిలా అందుకు ఎదురుచెప్పడంలేదు పవన్. బైక్‌పై చాలాసార్లు ప్రయాణం చేశారు. కానీ ఏరోజంతా చనువుగా ఎప్పుడూ లేరు. బైక్‌పై పొందిన అనుభూతులు మధురస్మృతులై హృదిని గుచ్చుకుంటూ అనూషలో అలజడి రేకెత్తించినా.. ఆమె నియంత్రించుకుంటోంది.
శ్రీవర్ష తమను గురించి పట్టించుకోవడంలేదని గ్రహించిన పవన్, ఓ అడుగు ముందుకేశాడు. ‘‘పరీక్షలు పూర్తవ్వగానే పెద్దల ఆశీర్వాదంతో ఎట్లయినా పెళ్లిచేసుకుందాం.. ఒక్కటవుతాం కదా! పెళ్లయ్యాక మనం పొందే.. వైవాహిక జీవితం సుగంధ సుమాల పరిమళాలను ఇప్పుడు ఆస్వాదించడం ప్రారంభిద్దాం అనూష’’ అంటూ కవిత్వంతో వేడుకున్నాడు పవన్. ఆ మాటలతో ఖంగుతిన్న అనూష ‘‘మత్తు వీడినట్టుంది. నీవు పిచ్చిగా మాట్లాడుతున్నావు?’’ అని కోపంగా అంది.
‘‘అవును ఈరోజు నాకు పిచ్చే పట్టింది’’ అన్నాడు అనూషవైపు అడుగు వేస్తూ పవన్. ‘‘అక్కడే ఆగు పవన్, బాగుండదు. నీకే చెప్పేది’’ అంటూ కోపాన్ని రెట్టింపు చేసింది అనూష. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేని పవన్ అనూషను వాటేసుకోబోయాడు. గట్టిగా నెట్టేసింది.. పవన్ క్రిందపడి మళ్లీలేచాడు. ఈసారి చేయి పట్టి దగ్గరికి లాక్కున్నాడు. అనుకోని సంఘటనకు బెదిరిపోయింది అనూష. షాక్ నుంచి తేరుకుని.. టేబుల్‌పై వున్న నైఫ్‌తో తన చేతిపై అడ్డంగా రెండు గాట్లు వేసుకుంది. ‘ఇంకా ముందుకొచ్చావా దీనితో పొడుచుకుని చస్తా’ అని బెదిరించింది. ఇదంతా బయటనుండి భయంగా గమనిస్తోంది శ్రీవర్ష. అనూషను ఎలా రక్షించాలో తోచడంలేదు శ్రీవర్షకు.. లోనికెళ్తే వాడు తన మీద ఏం అఘాయిత్యం చేస్తాడోననుకుంది. అనూష చేతి నుండి రక్తం ధారలై కారుతోంది. కళ్ళ వెంట నీళ్లు ప్రవహిస్తున్నాయి. ‘ఇడియట్ నీకు దెబ్బ తగిలిందని, ఫస్ట్‌ఎయిడ్ చేసి పంపిద్దామని తెస్తే.. నా ఫ్రెండ్ ముందే ఇలా పశువులా ప్రవర్తిస్తావా? స్నేహమంటే ఇదేనా!’’ ఉగ్రరూపంతో అంది అనూష.
ఇదంతా చూసి.. ఇక లాభంలేదని తన ప్రయత్నాన్ని విరమించి బయటకు పరుగులు తీశాడు పవన్. వెంటనే లోపలికొచ్చి డోర్ లాక్ చేసింది శ్రీవర్ష.. శ్రీవర్షను గట్టిగా పట్టుకొని రోదించడం ప్రారంభించింది అనూష! ‘‘ఈ మృగాన్నా నీవు ప్రేమిస్తున్నది? భగవంతుని దయవల్ల ఎంత ప్రమాదం తప్పిందే’’ అంటూ అనూషను అనునయిస్తోంది.. ఏడుస్తూ శ్రీవర్ష.
‘‘ఇదంతా నా కర్మ. ఇందులో పొరపాటంతా నాదేనని ఒప్పుకుంది. ఇక జీవితంలో వాడి జోలికి పోనే’’ అంటూ ప్రమాణం చేసింది అనూష. అనూష చేతులకు కారుతున్న రక్తపుధారలకు పసుపు దట్టించి కాటన్ పెట్టి కర్చ్ఫీ చుట్టింది శ్రీవర్ష.. మంచినీళ్ళు త్రాగించింది. జరిగిందంతా పీడకలగా మరిచిపో అనూష అంది శ్రీవర్ష.
‘‘ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు శ్రీవర్ష’’ అంటూ రెట్టింపుతో ఏడ్వసాగింది... అనూష. ‘‘ఏం మాట్లాడుతున్నావే.. ఇతరులకు నేనెందుకు చెబుతానే, అయినా ఇవేమైనా చెప్పే విషయాలా?’’ అంటూ అనూషను బెడ్‌రూంలోకి తీసుకెళ్లింది శ్రీవర్ష. ‘‘్థ్యంక్స్ శ్రీవర్ష’’అంది. దీనికెందుకే థ్యాంక్స్ అంది శ్రీవర్ష. ‘‘నీవు లేకపోతే ఈ రోజు నా పరిస్థితేంటని’’ మళ్ళీ భోరున ఏడ్వడం ప్రారంభించింది అనూష.
‘ఉండి నేనేం చేశానే... నిస్సహాయకురాలిగా ఉండిపోయాను కదే’ అంది శ్రీవర్ష. ‘నీవే గనక లేకపోతే... నిజంగా నేడు వాడి పశుత్వానికి బలయ్యేదానే్న.. నీవున్నావనే వాడు చేసేది లేక బయటకు పరిగెత్తాడంది’ అనూష. అదంతా ఇప్పుడెందుకే అంది శ్రీవర్ష. జీవితంలో మళ్ళెప్పుడూ వాడితో మాట్లాడను అంటూ ఏదో మాట్లాడబోయింది’ అనూష.
‘‘మన లిమిట్స్‌లో మనం వుంటే... మనకేం సమస్యలు ఎదురుకావే!’’ అంది శ్రీవర్ష. ‘‘ఇక నుంచి అలానే వుంటానే’’ అంది అనూష.. ‘‘బాగా అలసిపోయావు. బెడ్‌పై పడుకో’’ అని పడుకోబెట్టి దుప్పటి కప్పింది.
‘శ్రీవర్ష నీవుకూడా పడుకోవే’ అంది అనూష. లైట్ ఆఫ్ చేసి అనూష దుప్పట్లోకి దూరింది శ్రీవర్ష. ఒకరికొకరు తోడన్నట్లు... పడుకున్నారిద్దరు! చీకటి సాక్షిగా రాత్రంతా ఇరువురి కళ్లు వర్షిస్తూనే వున్నాయి...
======
-దాస్యం సేనాధిపతి
ఎంఐజి-2-90, ఎపిహెచ్‌బి కాలనీ,
కరీంనగర్ - 505 001.
9440 52 5544
రాత్రి పదిగంటలు కావస్తోంది తన రూమ్‌మేట్ అనూష
english title:
ekatha
Date:
Sunday, May 26, 2013