తన కోపమే తన శత్రువు....తన శాంతమె తనకు రక్ష- నిజమే కానీ, ఎంత వదలించుకొందామనుకొన్నా వదలని కోపాన్ని దూరం చేసుకోవడమెలా అన్నది చిక్కు ప్రశ్న. దీనికి సులభమైనమార్గాన్ని బుద్ధ భగవానుడు చెప్పాడు.
కోప ప్రేరకానికి సైతము చోటివ్వని స్వభావాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలను సాధించవచ్చును. సకల ప్రాణుల పట్ల ప్రేమానందాలను మాత్రమే వర్షించే మనస్సును కల్గి ఉండడం ఎంతో మంచిది. దీనిని బుద్ధుడు మగధ చక్రవర్తికి ఉపదేశించాడు. ‘సర్వే జనా సుఖినోభవంతు’ అని చిత్తశుద్ధితో భావించేవారు. ఈ విశ్వ జనీన ప్రేమాదర్శ నైజాన్ని అలవరచుకోమని బుద్ధుడు అందరికీ బోధించాడు.
‘‘సర్వులూ ఆనందంగా, సురక్షితంగా ఉంటారుగాక. వారు మానసిక ఆనందంతో మనగలుగుతారుగాక. బలమైనవి, దుర్బలమైనవి పెద్దవి, చిన్నవి, కనిపించేవి కళ్ళకు కానరానవి, దగ్గరివి, అతి దూరములోనివి, జన్మించినవి జన్మించబోతున్నవి- ఇలా మనుగడ సాగిస్తున్న సమస్త ప్రాణకోటి ఆనందమయంగా ఉండాలిగాక- ఎవరూ ఎవరినీ మోసగించకుందురుగాక. ఎక్కడా ఎవరూ ఎవరినీ నిరసించుకుంటారుగాక, కోపంతో గాని ఎవరూ ఎవరికి హాని తలపెట్టుకుంటారుగాక.. తల్లి తన ప్రాణాన్ని తెగించి అయినా సరే బిడ్డ సంక్షేమాన్ని చూసుకొనే తీరులో ప్రతి ఒక్కరూ సర్వులపట్ల అపరిమితమైన ప్రేమాదరణలను అలవరచుకొంటారుగాక’’- ఇదంతా బుద్ధుని గొప్ప బోధ.
ఇంకా బుద్ధుడు కోపనివారణమునకు ఏం చెబుతున్నాడనగా-
ద్వేషమూ, శత్రుత్వమూ కించిత్తు కూడా వహించకుండా లోకంలోని సర్వులపట్ల సర్వత్రా ఆదరణను, సౌహార్తాన్ని అలవరచుకోగల మనసును కలిగి ఉండండి.
నిలబడ్డప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేదా పడుకొన్నప్పుడు (జాగ్రదవస్థలో ఉన్నప్పుడు) ఈ తరహా మనస్సును కలిగి ఉండండి. ఈ రకంగా జీవించడమే లోకంలో శ్రేష్టతరమైనదని అంటారు. ఈ బోధనను జీవితమందున ఆచరించెదరో వారు కాలక్రమంలో కోపాన్ని అధిగమించగలుగుతారు. అలా జరిగినప్పుడు ఆ వ్యక్తి ప్రేమానందాలకు ఆధారంగా, కేంద్రంగా, ప్రతీకగా పరిణమిస్తాడు. తద్వారా అందరూ తరిస్తారు.
‘‘జిహ్వచాపల్యాన్ని నియంత్రించగలిగితే, తక్కినవన్నీ నియంత్రించబడతాయి’’ అని చెబుతుంది శ్రీమద్భాగవతం. ‘‘ఇంద్రియాలను ముందు నియంత్రించు, తద్వారా జ్ఞానాన్ని నశింపజేసే వాంఛను రగిలించే దుష్ప్రభావాన్ని రూపుమాపు’’- దీన్ని భగవద్గీత చెపుతోంది.
‘‘కోపాన్ని ప్రత్యక్ష శత్రువుగా గుర్తించి, తదనుగుణంగా వ్యవహరించాలి’’ అని అంటారు శ్రీకృష్ణులవారు.
‘‘ప్రసన్నత, ఆత్మానుభూతి, పరమ ప్రశాంతత, సంతృప్తి, పారవశ్యం, ఆత్మపట్ల అనన్య భక్తి అనేది శుద్ధ తత్త్వ లక్షణాలు. ఈ లక్షణాలను ప్రాప్తించుకొన్న వ్యక్తి పరమానందాన్ని చిరస్థాయిగా చవిచూస్తాడు అని చెప్తోంది వివేక చూడామణి.
...........................................
మంచిమాట శీర్షికకు
ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు
తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
మంచిమాట
english title:
k
Date:
Thursday, May 30, 2013