రాక్షసులు, వానరులు ఇరువంకలవారు గర్జించగా గర్జించగా ధారుణి, దిక్కులు చలించి పోయాయి. దిగ్గజాలు బెదరి ఘీంకరించాయి. నవ్విన రాక్షసుల గతి సముద్ర జలాలు ఇంకిపోయాయి. కుల పర్వతాలు పైకెత్తిన రాతి గుండ్లను పోలి అందందు నేలపై శిరస్సులపై పడ్డాయి. నాగరాజు విషములు క్రక్కి పోశాడు. కూర్మము, ముందరము తలక్రిందులయాయి. అప్పుడు రావణుడు లంక మధ్యలో వున్న బీకర సైనికుల్ని పిలిచి, పొగడి, ఉబ్బించి, వానర సేనలను లంక బయల్వెడలి ఎదుర్కొనండి అని పురికొల్పాడు. అంత భేరీ నినాదాలు, భీకర కాహళరావాలు, శంఖభాంకారాలు, పటహద్వానాలు, నిస్సాణ భాంకృతులు, బహుతూర్యనాదాలు, హయహేషలు, గజబృంహితాలు, రథ చక్రనేమి ధ్వనులు, హయహేషలు, గజ బృంహితాలు, రథ చక్రనేమి ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ తరిని భుజాస్ఫాలనములు, చిత్తాలు భీతిల్ల సల్పు సింహగర్జనలు బ్రహ్మాండం నిండా నిండ, దిక్పాలురు వెరగొంద రాక్షస సైన్యములు జాతవక్త్రమునందు తప్ప ప్రళయకాలరుద్రుడికి వున్న తక్కిన నాల్గు ముఖాలనుండి వెడలుతూ వున్న మంటలు మాడ్కి నాలుగు వాకిళ్ల నుండి బయల్వెడలాయి.
వానర రాక్షసుల ద్వంద్వ యుద్ధము
అంత రాక్షస వానరసేనలకి తుములాగా ద్వంద్వయుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు గదతో ఇంద్రుడు అరిగి వజ్రాయుధంతో పర్వతాల పక్షాలు తెగగొట్టినట్లు- అంగదుణ్ణి బెట్టిదంగా కొట్టాడు. అంగదుడు ఇంద్రజిత్తుని సంగరంలో తాకి సమశక్తితో వరలి పర్వత శిఖరంతో బలంకొద్దీ కొట్టాడు. హతికి సారథి, రథము, అశ్వములు కూలిపోయాయి.
ప్రజంఘుడు అనే నిశాచర యోధుడు అనివార్యుడై మూడు క్రూరాస్త్రాలు సంపాదిమీద ప్రయోగించాడు. సంపాతి వెనువెంటనే అశ్వకర్ణవృక్షం పెరికి ప్రజంఘుణ్ణి కూల్చివేశాడు. అతికాయుడు పలు శరాలతో వినతుణ్ణి, రంభుణ్ణి నొవ్వకొట్టాడు. ఆ ఇర్వురూ పెనుకొండలతో ఆ అతికాయుణ్ణి వ్యథ చెందించారు. మహోదరుడు సుషేణుడిని కదిపి కుపితుడై అయిదు శరాలు వక్షాన నాటాడు. మూడు సాయకాలు ఫాలాన ఏశాడు. సుషేణుడు ఆర్చి, చెలరేగి ఒక శైలాన్ని పైకెత్తి వాడి రథం శిథిలం చేశాడు. సారథిని సంహరించాడు. రథ్యములను చూర్ణం కావించాడు. భల్లూక నాయకుడు ఒకపెద్ద మ్రాను పెరికి, బిరబిర త్రిప్పుతూ మకరాక్షుడి మీదికి విసరాడు. మకరాక్షుడు ఆ వృక్షాన్ని నడుమనే త్రుంచివేశాడు. ఉగ్రుడై పెక్కు నారాచాలు జాంబవంతుడి భుజముల, ఫాలమున, వక్షమున అతి లాఘవంతో నాటించాడు. అంత జాంబవంతడు ఆగ్రహోదగ్రుడై పర్వతం రువ్వగా మకరాక్షుడి రథం, అశ్వాలు, చూస్తూ వుండగానే చూర్ణం చూర్ణం అయాయి. మహాబలుడు విద్యుజ్జిహ్వుడు శతబలిని సమీపించి పలుసాయకాలతో గాయపరిచాడు. శతబలి ఒక వృక్షాన్ని ఎత్తి విద్యుజ్జిహ్వుడి రొమ్మున తగులునట్లు విసిరాడు. అనేక దానవుల పీచం అణచి పలు రీతులు అతిశయించిన గజుణ్ణి విక్రమధనుడు క్రుద్దుడై అతడి విశాల వక్షస్థలమున శూలంతో పొడిచాడు. అప్పుడు గజుడు ఆ రజనీచరుణ్ణి సాలవృక్షంతో కొట్టగా అతడు మృతి చెందాడు. కుంభకర్ణుడి అగ్రనందనుడు కుంభుడు మర్కటములను తన కుత్తుకలో పడవేసుకొంటూ మ్రింగసాగాడు. ధూమ్రుడు వాడిపైన ఏడు భూరుహాలు విసరివేశాడు. గవాక్షుడు క్రూరుడై రొమ్మున ఏడు అమ్ములు ప్రయోగించగా నొచ్చుకొని అతడు ఒక మద్ది చెట్టుతో కొట్టాడు. కుంభుడు ఏడు విశిఖాలతో ఆ తరువుని ముక్క చెక్కలు కావించాడు. తొమ్మిది నారాచాలు నాటించాడు. గవాక్షుడు గిరిని పెకలించి వాడిని పారద్రోలాడు.
సారణుడు ఋషభుణ్ణి ముసలంతో కొట్టాడు. ఋషభుడు ఒక వృక్షాన్ని పెరికి సారణుడి విశాల వక్షస్థలమున వేశాడు. విల్లు, బాణాలు జారిపోగా వాడు అవనిపై పడి మూర్ఛిల్లాడు. శైలాన్ని పోలిన దంతావళం ఎక్కి త్రిశిరుడు తోమరంతో శరభుడి తలమీద మొత్తాడు.
-ఇంకాఉంది