
‘‘ఏంటమ్మా ననే్న తలుకొంటున్నట్లున్నవ్’’ అంటూ వచ్చాడు వంశీ.
‘‘ఆంటీ నువ్వూ ఒకటేనట’’ అన్నారు పిల్లలిద్దరు ఒకేసారి. ఆ మాటలు ఇద్దరకీ మధురంగా అన్పించాయి.
‘బాలవాక్కు బ్రహ్మవాక్కన్నట్లు ఈ ఇద్దరూ ఒకటైతే బావుణ్ణు’ అనుకొంది శాంతమ్మ.
‘‘అబ్బే ఏం లేదండి, పులకిత గురించి చెప్పాగా, తనకీ ఫీవరే- అందుకని’’ ఆమె మాటలు పూర్తిగాకుండానే ‘‘ఏముంది, వెళ్ళి మీ సేవలందించి ఉంటారు. మీ స్నేహం అటువంటిది. మాగిన కొద్దీ పరిమళించే పనసపండులా అవసరంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన స్నేహితుల లక్షణం కదా’’.
‘‘అబ్బో చూసినట్లే చెప్పేస్తున్నారే’’ అంది రవళి. స్నేహాన్ని గుర్తించి అతడిచ్చిన కాంప్లిమెంట్‌కి మురుస్తూ.
‘‘అన్నం ఉడికిందీ లేందీ తెలీడానికి ఒక్క మెతుకు పట్టి చూసినా చాలంటారుగా. మొన్నటివరకూ మా ఇద్దరికీ చేసి చేసి చిక్కిపోయారు. అన్నట్లు చక్కనమ్మ చిక్కినా అందమే అనుకోండి గానీ మళ్ళీ ఇంకా ఇంకా ఇలా అందరికీ చేస్తూపోతే ఎలాగ?’’ అన్నాడు.
చాలా క్లుప్తంగా మాట్లాడే వంశీ అలా గలగలా మాట్లాడటంతో పిల్లలకూ శాంతమ్మకూ ఎక్కడలేని ఉత్సాహం కలిగింది.
‘‘నాన్నా, ఇవాళెలాగూ తొందరగా వచ్చారుగా. డాన్స్‌క్లాస్ కాన్సిల్- మనమందరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్లొద్దాం’’ అంటూ మారాం మొదలుపెట్టారు పిల్లలు.
‘‘మరి మీ మేడం ఏమంటారో’’ క్రీగంట చూస్తూ అన్నాడు వంశీ.
‘‘ఆంటీ, చెప్పండి, ఎక్కడికైనా వెడదాం’’ అంది స్వాతి, ఆమె గడ్డం పట్టుకుంటూ. శాంతమ్మ కూడా ఆసక్తిగా రవళి వంక చూసింది. అది గమనించిన రవళి, పిల్లల సంతోషం మీద నీళ్ళు చల్లడం దేనికని ‘బిర్లా మందిర్’ వెడదామా. ఆ తర్వాత అట్నుండి నెక్లెస్ రోడ్‌కైనా, లుంబినీకైనా వెళ్ళొచ్చు’’ అంది శాంతమ్మని కూడా దృష్టిలో పెట్టుకొని.
‘‘నిజమే. ఆ టెంపుల్ని చూసి ఎన్నో ఏళ్ళు అయింది’’ అంది శాంతమ్మ.
‘‘ఇకనేం, కదలుదామా’’ అన్నాడు వంశీ.
‘‘మీరు డోర్ లాక్ చేసి కారు బైటకు తీసుకొచ్చేసరికి నేను డ్రెస్ మార్చుకొని వస్తాను. ఇందాక పనివల్ల బాగా నలిగిపోయిందీ డ్రెస్’’ తన కాటన్ డ్రెస్ వంక చూసుకొంటూ అంది రవళి.
‘అలాగే’ అన్నారు వాళ్ళు.
అన్నట్లే కారువచ్చి ఆగేసరికి, రవళి చీర కట్టుకొని వచ్చింది.
ఎప్పుడూ ఆమెని చుడీదార్లో చూట్టానికి అలవాటయినవారికి ఆమెను లేత నీలంరంగు శారీలో చూసేసరికి ఆనందం కలిగింది.
ఆకాశకన్యలా, ముగ్ధమనోహరంగా కనిపిస్తోన్న ఆమెవంక చూస్తూ వంశీ రెప్పలార్చడం మరిచిపోవడాన్ని శాంతమ్మ గమనించింది.
‘‘వావ్, ఈ చీరెలో మీరు చాలా బాగున్నారాంటీ’’ అని స్వాతి అంటే, ‘‘ఎప్పుడూ ఇలా చీరెల్నే కట్టుకోవచ్చుగా?’’ అంది ఖ్యాతి.
‘‘డ్రెస్‌లైతేనే కన్వీనియెంట్‌గా వుంటాయ్ డైవింగ్‌కైనా, డాన్స్‌కైనా. ఎప్పుడన్నా చీరలు కట్టుకొంటే ఇబ్బందిగా వుంటుంది’’ అంది రవళి.
‘‘ఎంతైనా ఆడవాళ్ళకు చీరెలే ఆందం’’ అంది శాంతమ్మ.
‘‘అమ్మ కూడా అలాగే అంటూంది. అందుకే ఈ మాత్రమయినా చీర కట్టుకోడం వచ్చిందిగానీ, కట్టుకొన్నప్పుడల్లా వచ్చి చీరె మార్చుకొనేదాకా టెన్షనే’’ అంది రవళి నవ్వుతూ.
పున్నమి రోజులు కావడంవల్లనేమో వెనె్నల బిర్లా మందిరపు గోడలపైపడి వింతగా మెరుస్తోంది చల్లటి మలయ సమీరాలు మేనిని మృదువుగా స్పర్శిస్తూంటే, క్యూలో నిలబడిన అలసటే తెలీలేదు. దర్శనమయ్యాక అమ్మవార్ని కూడా దర్శించుకొని ఆమె ముందున్న గంథాన్ని గడ్డం కిందుగా రాసుకొంటూ ‘‘ఈ పరిమళం చాలా చాలా బావుంటుంది’’ అంది రవళి. దాంతోవంశీ తన మునివేళ్ళతో గంధాన్ని అద్దుకొని ఆ సువాసనన్ని చూస్తూ ‘‘నిజమే. చాలా బావుంది’’ అన్నాడు రవళి వంక చూస్తూ.
కొత్తగా వున్న అతని చూపులు, రవళిలో గిలిగింతలు రేపాయి. ఆ చూపుల్లోని ఆరాధనా, కాంక్షా హృదయపు లోతుల్లోకి దూసుకుపోయాయి.
‘పాలరాతి బొమ్మకు ఈ సొగసెక్కడిది?’’ అంటూ ఎప్పటి పాత పాటో మదిలో మెదిలి హం చేయసాగాడు. బహుశా మమత పోయాక, అలా పాడుకోవాలన్న కోరిక రావటం ఇదే మొదటిసారేమో అతనికి.
‘అబ్బో నాన్నకి పాటలొచ్చా’ అని పిల్లలు చప్పట్లు కొట్టేసారికి, ఆ పాటలోని భావం తనగురిచేనని గ్రహించేసరికి, అడుగు తడబడింది. చీరె కుచ్చెళ్ళూ అడ్డుపడటంతో ముందుకు తూలిపడింది. వెంటనే వంశీ స్పందించి ఆమెను పట్టుకోకపోతే పడిపోయేదే. తన నడుం చుట్టూ బిగిసిన అతని చేతులు జిల్లుమన్పిస్తూంటే ఆ చేతుల్ని విడిపించుకుంటూ సిగ్గుతో తలెత్తలేకపోయింది రవళి. అతని స్పర్శకి తనలో వడివడిగా పరుగులుదీసిన రక్తమంతా బుగ్గల్లోకి తన్నుకొచ్చినట్లు చెంపలు కెంపులయ్యాయి. ఆ మనోహర రూపం వంశీ హృదయంలో ముద్రించుకుపోయింది.
ఓ చేత్తో శాంతమ్మ చేతిని, మరో చేతిని రవళీకి కాజువల్‌గా అందించాడు వంశీ. క్షణకాలం సంశయించినా మెట్లు సజావుగా దిగడానికి, అతని చేతిని గట్టిగా పట్టుకొంది రవళి. అట్నుండి పబ్లిక్ గార్డెన్‌కి దారితీశారు. పిల్లలిద్దరూ ఫౌంటెన్ దగ్గరికి పరుగులు పెట్టారు ఆడుకోవటానికి. వంశీ, రవళి, శాంతమ్మలు పచ్చికలో కూర్చున్నారు.
- ఇంకాఉంది