
మన దేశంలో నాయకత్వపు లేమి స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాలయాలు చివరకు కుటుంబాలలో కూడా నాయకులు కరువయ్యారనేది నిర్వివాదాంశం. నిర్ణయాలు తీసుకోలేక, సమస్యలను తాత్కాలికంగా పక్కనపెట్టేసి కాలం వెళ్లబుచ్చుదామనుకునే ఆలోచనా ధోరణి నేడు ఎక్కువైపోయిందంటే అందుకు కారణం నాయకత్వపు లక్షణాలు కొరవడడమే!! విదేశాలలో అయితే జ్ఞానం కంటే నాయకత్వపు లక్షణాలు వున్నవారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల స్థాయిలోనే నాయకత్వపు లక్షణాలు పెంపొందించే దిశగా అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఆ దిశగా మనం కూడా అడుగులు వేయాల్సిన అవసరం వుంది. నాయకులు పుట్టరు, తయారుచెయ్యబడతారు అనే సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని చిన్నప్పటినుండి పిల్లల్లో నాయకత్వ లక్షణాలనుపెంచడమే ధ్యేయంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషిచేయాలి! చిన్నప్పటి నుండి భావ ప్రకటనను ప్రోత్సహించడం, స్పష్టంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఇత్యాది లక్షణాలను ప్రోత్సహించాలి. దేశభవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ధారించబడుతుందని కొఠారి సందేశం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
పేపర్లు చదవని విద్యార్థులు
హెబ్బార్ నాగేశ్వరరావుగారు రాసిన ‘‘శత వసంత వి‘చిత్ర’ ప్రభావం విశే్లషణ చదివాను. ఈ కాలపు విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వ్యాసాన్ని తప్పక చదవాలి. పబ్ కల్చరు పెడదోవ పట్టిస్తోంది. ఫేస్‌బుక్కులు, ట్విటర్లు మంచికన్నా చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. విద్యార్థులు పేపర్లు చదవరు. క్రీడా వార్తలో, సినిమా విశేషాలో మాత్రమే చూస్తారు. టి.విల్లో వచ్చే క్విజ్‌లకు క్లూలు యిచ్చినా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు- ప్రథమ రాష్టప్రతి ఎవరు? భారతంలో ‘కిరీటి’ అని ఎవరిని పిలుస్తారు? దశావతారాలలో ‘వినాయకుడు’ఉన్నాడా? చదరంగంలో విశ్వవిఖ్యాతిగాంచిన భారతీయుడెవరు? ఈ రకమైన ప్రశ్నలకు సమాధానం తెలియని యువత రేపు దేశాన్ని ఎలా ఏలుతుంది? పేపర్లు చదవని మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఎంతమంది లేరు మన దేశంలో.పేపర్లే కనుక నిత్యం చదివితే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. పరీక్షలకు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగక్కరలేదు కదా!
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాదు