‘‘నిద్రపోయేటప్పుడు పొగ తాగకుండా ఉండటం, మేలుకున్నప్పుడు పొగ తాగకుండా ఉండలేకపోవడం నా పద్ధతి’’ అంటారు మార్క్‌ట్వయిన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వాడకం వ్యాధులతో ఏటా 60 లక్షల మంది, మన దేశంలో ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ స్మోక్ (ఇతరులు పొగతాగి విడిచే పొగ)తో వచ్చే జబ్బులతో ఏటా 6 లక్షల మంది చనిపోతున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే 2030 నాటికి ఈ సమస్యలతో ఏటా 80 లక్షల మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఈ సమస్యలవల్ల జీవితకాలంలో 4.1 శాతం సంవత్సరాలు పొగాకు వాడే వ్యక్తులు నష్టపోతున్నారు. దీనినే డ్యాలీ అంటారు. డ్యాలీ అంటే డిసేబిలిటీ అడ్జెస్టెడ్ లైఫ్ ఇయర్స్ అని అర్థం. మే 31న మరో పొగాకు వ్యతిరేకదినం వస్తుంది. పోతుంది కూడా! 1987వ సంవత్సరం నుండి మనం పొగాకు వ్యతిరేక దినం జరుపుకుంటున్నాం. ఈ దినానికి రజతోత్సవం కూడా అయిపోయింది. అయినప్పటికీ పొగాకు వాడకం, పొగాకు సంబంధించిన వ్యాధులు తీవ్రస్థాయికి చేరుకుంటూనే ఉన్నాయి.
పొగాకు అలవాటుకు ప్రధాన కారణం పొగాకులో ఉండే నికోటెన్. పొగతాగే వారు వారికి కావాల్సిన నికోటెన్‌ను ఎన్నిసార్లు పొగతాగాలో, ఎప్పుడు తాగాలో నిర్ణయించుకుని కావాల్సిన మేర పొందుతుంటారు. నోటి ద్వారా తీసుకునే సాధారణ పొగాకులో నికోటెన్, కేన్సర్ కారకాలు, ఇతర అనేక విషపదార్ధాలుంటాయి. పొగాకు కాలినప్పుడు వచ్చే పొగాకు పొగలో దాదాపు నాలుగువేల రసాయనాలుంటాయి. వీటిలో 250 రసాయనాలు అపకారం కలిగిస్తాయి. 50 రసాయనాలు కేన్సరు కలిగిస్తాయి. సిగరెట్టులో ఉండే తారు అనే పదార్థం శ్వాసనాళాలకు అతుక్కుపోతుంది. శ్వాసనాళాలను గాయపరుస్తుంది. పొగాకు నుండి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని ఆక్సిజన్‌ను తగ్గిస్తుంది. అందువల్ల శరీరంలోని కణాలకు తగినంత ఆక్సిజన్ లభించదు. పొగాకు మన కణాల్లోని డి.ఎన్.ఎ.ను నాశనం చేస్తుంది.
దాదాపు 40 శాతం పొగాకు వాడేవారు అకాల మరణానికి గురవుతారు. ఇందువల్ల వీరు కుటుంబాలకు ఆదాయం లేకుండా చేస్తారు. వీరు ఆరోగ్యానికయ్యే ఖర్చులు పెంచుతారు. ఆర్థికాభివృద్ధిని కుంటుపరుస్తారు. పొగాకువల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ ఎంగ్ డిసీజ్ (సిఓపిడి) ఎక్కువగా వస్తాయి. పొగాకువల్ల ఊపిరితిత్తుల కేన్సర్, లారింగ్స్ కేన్సర్, పెదవి కేన్సర్, అన్నవాహిక కేన్సర్, ఫారింక్స్ కేన్సర్, మూత్రాశయ కేన్సర్, మూత్ర పిండాల కేన్సర్, పాంక్రియాస్ కేన్సర్, కడుపు కేన్సర్ రావచ్చు. పొగాకుతో మైలాయిడ్ లుకీమియా వ్యాధి రావచ్చు. గర్భిణులు పొగాకు వాడితే బరువు తక్కువ పిల్లల జననాలు, గర్భస్రావాలు, ప్రాణం లేని శిశు జననాలు జరగవచ్చు. పెద్దలు పొగతాకితే, పిల్లలకు తరచుగా శ్వాసకోశ వ్యాధులు రావచ్చు. పొగతాగే వారిలో, పొగాకు పొగపీల్చే వారిలో ఆస్తమా వ్యాధి తీవ్రం కావచ్చు. పొగాకు వాడేవారిలో కడుపులో పుండు మానడం ఆలస్యం కావచ్చు. ఆస్టియో పొరోసిస్ అనే ఎముకల వ్యాధి రావచ్చు. వీరిలో తొందరగా కంటి శుక్లం రావచ్చు. కంటిలోని మ్యాక్యులా క్షీణతకు గురి కావచ్చు. బీడీలు చుట్టేవారిలో కేన్సర్, ఊపిరితిత్తులవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. పొగాకు పొలాల్లో పనిచేసే పిల్లలకు, తడిపొగాకు ఆకులతో పనిచేయడంవల్ల వారికి ‘గ్రీన్ టొబాకో సిక్‌నెస్’ అనే సమస్య రావొచ్చు.
పొగాకు వాడకం మానడం చాలా కష్టమైన సమస్య. చాలామంది పొగతాగే వారు చాలాసార్లు పొగమానే ప్రయత్నం చేస్తారు. ఎన్నోసార్లు విఫలమయ్యాకే విజయం సాధిస్తారు. ‘వైద్యం చేస్తే డాక్టరు’ పొగాకు మానమని సలహా ఇస్తే పొగాకు వాడేవారిలో చాలా ప్రభావం చూపుతుంది. ఈ రోజుల్లో డాక్టర్లు ఎక్కువగా పొగాకు సమస్యలకు వైద్యం చేస్తున్నారు. కానీ పొగాకు వాడకం మానమని చెప్పడం లేదు. పొగాకు వాడకం ఎప్పుడు మానినా ఆరోగ్యానికి మంచిదే. పొగాకు అనర్థాల గురించి పాఠశాల స్థాయి నుంచే అవగాహన కలిగిస్తే ఎంతో మంచిది. ‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫ్రేమ్ వర్క్ కనె్వన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్’’ పొగాకు వ్యాధుల నియంత్రణలో ఒక పెద్ద మైలురాయి. 2008లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందుకు సంబంధించి ఆరు అంశాల కార్యక్రమం ప్రకటించింది. (1) పొగాకు వాడకాన్ని, నిరోధపు కార్యక్రమాలను గమనించడం. (2) ప్రజలను పొగాకు వాడకాన్నుండి రక్షించడం. (3) పొగాకు వాడకం మానాలనే వారికి సహాయం అందించడం. (4) పొగాకు వల్ల జరిగే నష్టాల గురించి హెచ్చరించడం. (5) పొగాకు ప్రకటనలపై, పొగాకు ప్రోత్సాహకాలపై అనేక కార్యక్రమాల నిర్వహణకు సహాయం అందించే అంశాలపై నిషేధం (6) పొగాకు సంబంధించిన ఉత్పత్తులపై పన్నులు పెంచడం.
మన దేశంలో 2003లో ‘‘సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్ యాక్ట్, 2003’’ (కోప్టా, 2003) వచ్చింది. ఈ చట్టం ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పొగతాగరాదు. పొగాకు వాడకం గురించి ప్రకటనలను చేయరాదు. పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మడం కానీ, పిల్లలలతో పొగాకు వస్తువులు అమ్మించడం కానీ చేయరాదు. విద్యా సంస్థలకు 100 గజాల దూరంలో పొగాకు ఉత్పత్తులు అమ్మరాదు. పొగాకు వస్తువులపై ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరికలు ఉండాలి.
ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినానికి ఒక సందేశమిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ సందేశం - ‘‘బ్యాన్ టొబాకో అడ్వెర్టైజింగ్, ప్రొమోషన్ అండ్ స్పాన్సర్ షిప్’’. పొగాకు పరిశ్రమలు తమ ఉత్పత్తుల వాడకాన్ని పెంచడానికి ప్రకటనలపై విపరీతంగా డబ్బు ఖర్చుపెడుతున్నది. సాధారణంగా ఆరోగ్య అవగాహనకు, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఏ దేశం కూడా ఇంతగా డబ్బు ఖర్చు పెట్టదు. ప్రకటనలు, ప్రోత్సాహకాలు, స్పాన్సర్‌షిప్‌లు నిషేధించాలి. పొగాకు వాడకాన్ని తగ్గించడానికి పొగాకు వ్యతిరేకదినంతోపాటు నిరంతరం కృషి చేయాలి. పొగాకు కావాలో, ఆరోగ్యం కావాలో ఇప్పుడే నిర్ణయించుకోవాలి మనం.
సబ్‌ఫీచర్
english title:
anti tobacco day
Date:
Friday, May 31, 2013