Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జనంతోనే...

$
0
0

‘‘జనం’’తో‘నే’
జనంతోనే వుంటా!
అనని నాయకుడు ఎవరు చెప్పు? ముఖ్యమంత్రిదీ అదే మాట! ప్రతిపక్ష నేతదీ అదే మాట! ఉద్యమకర్తదీ అదే మాట! ఉగ్రవాదిదీ అదేమాట’’ అన్నాడు ప్రసాదు.
‘‘అసలు ‘జనం’ అంటే ఎవరు? ముందు అది నిర్వచించాలి. ‘జనం, జనం’ అంటారు గానీ- అలా అనేవారి దృష్టిలో ‘జనం’ నిర్వచనం మారిపోతుంది. ‘పెళ్లికి జనం బానే వచ్చారు’ అన్నామనుకో! అప్పుడు ‘జనం’ అంటే బంధువులు, మిత్రులూ గట్రా! ‘దైవదర్శనానికి పోటెత్తిన జనం’ అన్నప్పుడు ‘జనం’ అంటే భక్తులు. ‘సభకు జనం బాగా వచ్చారు’ అన్నప్పుడు ఆ ‘జనం’ ప్రేక్షకులు. అదే నాయకుడు - ‘జనం’ అంటే మటుకు, కడుపులో ఉద్దేశ్యం- వాళ్లు ‘ఓటర్లు’ అనే! ‘ఓటు’కోసమే ఆ మాట అనేది కూడాను. ‘జనం’ ఒకరిని నేతగా ఎన్నుకున్నాక, చచ్చినట్లు ఆ నేత మాట వినడమే విధాయకమై తీరుతుంది’’. అన్నాడు శంకరం.
‘‘జనం అభిప్రాయం అది కాకపోయినా, నేత అభిప్రాయం మటుకు అదే! తానేది చేసినా జనం కోసమూ, జనం మేలుకోసమే చేస్తున్నాననీ, తాను చేస్తున్న పనుల్లో అణువంతయినా స్వార్థంలేదనీ అంటాడు నాయకుడు. తనను ‘జనం’ నాయకుడిగా ఎన్నుకునే ముందు, తాను ఏ పార్టీకి, ఏ విధానాలకూ, ఏ అభిప్రాయాలకూ కట్టుబడి జనం ముందుకొచ్చాడో, ఆ విషయం- ఎన్నికయ్యాక నిలుపుకుంటాడన్న నమ్మకం లేదు. తాను ఒపీనియన్ ఛేంజ్ చేసుకుని, మరో పార్టీలోకి మారినా, పార్టీలోనే వుంటూ ఏ అసమ్మతి జెండానో ఎగురవేసినా- అప్పుడు తనను ఎన్నుకున్న ‘జనం’ అభిప్రాయం అనుసరించే అంటూ, బుకాయిస్తాడు గానీ, అసలు గెలిచాక జనాభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకుంటాడన్న నమ్మకం లేదు. అసలు జనానికి ‘కాల్ బ్యాక్ ఫెసిలిటీ’యే వుండివుంటే, ఇప్పుడున్న సగం నేతలను జనం నిర్దాక్షిణ్యంగా వెనక్కి పిలిచి పదవి పీకి కూచోబెడతారు’’ అన్నాడు సన్యాసి.
‘‘జనాన్ని నేతలు తక్కువ అంచనావేస్తున్నారు అనడం లేదుగానీ, నిజానికి జనంమీద గౌరవం వుందనడానికి దాఖలాలు దొరకడం లేదు. అది ఏ జనం- అవనీ! ఇవాళ ‘జనం’ విషయం ‘ప్రభంజనం’గానో, ‘సమ్యక్ యోచనం’గానో లేదు. ఒకింత ‘దుఃఖ భాజనంగానే వుంటోంది. పెళ్ళికి భోజనానికి పిలిస్తే ‘జనం’ తరలివస్తున్నారు గానీ, నిజంగా ఆ పెళ్ళిముహూర్తం- ఏ అర్థరాత్రి పూటో వుంటే, ఎందరు ముహూర్తంవరకూ వుండి, వధూవరులను ఆశీర్వదించి వెడుతున్నారు? భోజనమూ, రిసెప్షన్ అనేవే ముఖ్యవౌతున్నాయి గానీ, అసలు ముహూర్తం కాదు. పెళ్ళిపీటలమీద కూర్చుని మాంగల్య ధారణం, తలంబ్రాలు వంటి తంతు జరగకుండానే- వధూవరులు ఒక్కటిగా ముందే రిసెప్షన్‌లో నిలబడి, అక్షింతలు, పూల బొకేలు, పెళ్ళికానుకలు అందుకుంటూనే వున్నారు. నిజానికి అది సక్రమమైన తంతు కాదు. కానీ జనం ఆ తీరుకి అలవాటుపడిపోతున్నారు. జనాన్ని ఆ వైఖరికి అలవాటుపడేలా చేస్తున్నాము. అంటే ఏమిటన్నమాట? ఏ వెసులుబాటుకయినా సంసిద్ధంకావడమే ముఖ్యమై, అసలు నియమ నిబంధనలూ, సక్రమాచరణం వైశేషికమైపోతున్నాయి. ఇది ఏదో ఒక ఉదాహరణాత్మకమైన మార్పే జనం విషయంలో! కానీ ‘జనం’ ఇలాంటి మార్పులకు అధీనమైపోవడంలోనే ఇతరత్రా అంశాలూ చోటుచేసుకుంటున్నాయి. రాజకీయంగానూ అదే వైఖరి వస్తోంది! తాము ఎన్నుకున్న నేత- తాము ఎన్నుకున్నప్పుడు ఏ పార్టీలో వున్నాడో, ఏ ఆశలు, ఆశయాలు, వైఖరులు వెల్లడించాడో వాటిని నిలుపుకోక- పరివర్తనం చెందినప్పుడు, ఆ నేత తిరిగి ‘జనామోదం’పొందాలన్నది న్యాయం! కానీ జనమూ నిలదీయడం లేదు. నేత కూడా జనంతోనే వున్నాననీ, వుంటాననీ అంటూనే- తనకు తోచినట్లు, తాననుకుంటున్నట్లే వుంటాడు, వుంటున్నాడు’’ అన్నాడు ప్రసాదు.
‘‘ ‘మనవాళ్ళు వట్టి వెధవాయిలోయ్!’ అని గిరీశం చేత గురజాడ ఊరికే అనిపించలేదు. నేతలకు ‘బొర్రలు’ పెరుగుతున్నా, జనానికి ‘బుర్రలు’ పెరుగుతున్న దాఖలాలు ఒక్కోసారి కనబడవు. అమోఘమైన ‘ఓటు’ అనే శక్తివంతమైన తమ చేతి ఆయుధాన్ని, తమకే ప్రయోజనదాయకంగా ఉపయుక్తమయ్యే దానిని, తామే చేజేతులా సారాబుడ్డికో, ఓ పచ్చనోటుకో వివేక రహితంగా వృధాచేసుకుంటున్నారంటే ఏమనుకోవాలి? ఆకలో, దరిద్రమో ఆ పని చేయించడం లేదు. అధిగమించలేని తాత్కాలిక బలహీనతే అందుకు కారణం.’’ అన్నాడు శంకరం.
‘‘జనంతో-నే ఉంటా!
జనంతోనే వుంటా! అనే నేత నిజానికి ‘జనం తన వెంట ఉంటారా? ఉన్నారా’ అనేది విశే్లషించుకోవడం ముఖ్యం! జనం అమాయకుల్లా, పిచ్చోళ్ళలానే కనిపిస్తారు గానీ, నిజంగా ఎన్నికలు జరిగినపుడు, నేతల దిమ్మతిరిగే ఫలితాలూ వస్తూ వుంటాయి. కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల్లో- అంతవరకూ అధికారంలో వున్న పార్టీ చతికిలబడి, కాంగ్రెస్ పుంజుకుంది! ఇప్పుడు కాంగ్రెస్ బలంగా వుందనుకున్నచోట్లలో- మున్ముందు పరిణామాలు ఎలా వుంటాయో చెప్పలేం! జనంలోని జనమే ‘ప్రభంజనం’ పుట్టించగలరు. ఎంత దిగ్గంతనేతనయినా ‘దద్ద్యోజనం’ గాడిలా మార్చి చరిత్రను తిరగరాయనూ గలరు’’ అంటూ లేచాడు సన్యాసి.

‘‘జనం’’తో‘నే’ జనంతోనే వుంటా!
english title: 
janamthone

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>