కడప, జూన్ 6 : ఇటు డిఎల్ రవీంద్రారెడ్డి అటు ఆయన వ్యతిరేకులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని లక్ష్యం చేసుకుని మాటల యుద్ధానికి దిగారు. తనను భర్తరఫ్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని వదిలిపెట్టనని మాజీ మంత్రి డిఎల్ విమర్శలు ఎక్కు పెడుతుండగా ఆయన వ్యతిరేకులు సిఎంకు అనుకూలంగా మాట్లాడుతూ డిఎల్‌పై ఆరోపణలు సంధిస్తున్నారు. సిఎం కిరణ్‌పై మరోసారి అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని డిఎల్ గురువారం ప్రకటించారు. సీనియర్లను నిర్లక్ష్యం చేస్తున్న సిఎం పార్టీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఆయన వల్ల పార్టీ నష్టపోతుందన్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి విధానాల వల్లే ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి ప్రజల్లో ఆదరణ లభిస్తోందని డిఎల్ వ్యతిరేకులు ప్రచారం చేస్తూనే ఆయనపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. ఎమ్మెల్యే వీరశివారెడ్డి మిగిలిన నేతలను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వి వరదరాజులురెడ్డి తదితరులతో కలిసి డిఎల్‌పై విరుచుకుపడుతున్నారు. ఒకడుగు ముందుకేసి డిఎల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆయనను చేర్చుకుంటే తేలుతో సావాసం చేసినట్లేనని ధ్వజమెత్తారు. అక్రమంగా సంపాదించుకున్నారని కూడా అన్నారు. డిఎల్ అటు సిఎం పనితీరును విమర్శిస్తూనే ఇటు వీరశివాపై బృందంపై కూడా వ్యాఖ్యలు చేశారు. వారంతా సిఎంకు చెంచాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. తనపై చౌకబారు విమర్శలు చేస్తున్నవారంతా వారి గతాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా మంత్రి పదవికి దూరమై డిఎల్ రవీంద్రారెడ్డి, మంత్రి పదవిని ఆశిస్తూ వీరశివారెడ్డి సృష్టిస్తున్న గందరగోళం పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ వ్యవహారం పార్టీ అధిష్ఠానానికి కూడా తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు మిగిలిన నేతలను పార్టీ కార్యకర్తలకు విస్మయం కలిగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధిష్ఠానం కల్పించుకుంటే తప్ప వేడి చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.
సమస్యలు పరిష్కరిస్తాం
* ఆర్టీపీపీ కార్మికులకు జెన్‌కో డైరెక్టర్ హామీ
ఎర్రగుంట్ల, జూన్ 6 : రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో కార్మికులు ఎదుర్కొంటున్న క్యాటగిరైజేషన్‌తోపాటు వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జెన్‌కో డైరెక్టర్ రాధాకృష్ణ హామీ ఇచ్చారు. గురువారం ఆర్టీపీపీలో 7 యూనియన్లకు చెందిన కార్మికుల నాయకులతో పాటు వందలాది మంది కార్మికులు విఐపి గెస్ట్‌హౌస్ వద్ద డైరెక్టర్‌ను కలసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ వీలైనంత త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సిల్క్, సెమీసిల్క్, సూపర్ సిల్క్ విషయంలో జెన్‌కో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. అలాగే ఒకే కార్మికుని ఒకే ఇపి ఎఫ్ నెంబరు ఉండేలా, మహిళలకు 26 రోజులు పని దినాలు కల్పించేందుకు, ప్రస్తుతం ఉన్న గేట్ పాసుల స్థానంలో మరింత నాణ్యమైన పాసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుబ్బిరెడ్డి, పుల్లారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్టీపీపీలో పలువురు అధికారుల తీరుపై సిఐ కుమార్‌బాబుతో పాటు కార్మిక నాయకులు పలువురు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన డైరెక్టర్ రాధాకృష్ణ ప్రాజెక్టు సవ్యంగా నడవాలంటే పట్టువిడుపులు ఉండాలని, నియంతలా వ్యవహరించ కూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా డికెటి పట్టా రైతులు నష్టపరిహారాన్ని మంజూరు చేయాలని భూములు కోల్పోయిన బాధితులు డైరెక్టర్‌కు వినతిపత్రాలు సమర్మించారు.
నిర్మాణం పనులు పరిశీలన
6వ యూనిట్ నిర్మాణం పనులను డైరెక్టర్ రాధాకృష్ణ, కృష్ణమూర్తి, స్థానిక అధికారులు కుమార్‌బాబుతో పాటు సంబంధిత ఎస్‌ఇలు పరిశీలించారు. ఈ సందర్భంగా నత్తనడకన నడుస్తున్న పనుల పట్ల డైరెక్టర్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న మేరకు సివిల్ పనులు జరగడం లేదని ఇలా అయితే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయలేమన్నారు. కొన్ని కంపెనీల అధికారులు డైరెక్టర్ వచ్చినా అందుబాటులో లేకపోవడం పట్ల అగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగతిన 6వ యూనిట్ పనులను పూర్తి చేయాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు. ఆయన వెంట డైరెక్టర్ క్రిష్ణమూర్తితో పాటు జెన్‌కో సిఇ రత్నబాబు, స్థానిక సిఇ కుమార్‌బాబు, ఎస్‌ఇలు రమణారెడ్డి, శేషారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
* భారీగా నగదు, వాహనాలు స్వాధీనం
నందలూరు, జూన్ 6 : మండల పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసే స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుండి దాదాపు 30 లక్షలు విలువ చేసే 4 వాహనాలను, రూ. 1 లక్షా 5 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరసింహరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 23వ తేదీన ఆడపూరు సమీపంలోని చెట్ల పొదల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న ఎపి02 ఆర్ 456 స్కార్పియో, ఈ నెల 3వ తేదీ ఒక సఫారీ, మారుతి, ఇండికా వాహనాలు కూడా నందలూరు పరిసర ప్రాంతాలలో లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పటి నుండే ఈ స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా ఉంచడంతో గురువారం మధ్యాహ్నం ఈదరపల్లె క్రాస్ రోడ్ వద్ద స్మగ్లర్ల ఉన్న సమాచారం తెలిసి తిరుపతికి చెందిన వెంకటరమణ, కడప రామాంజనేయపురంకు చెందిన పెరుగు లక్ష్మీనరసయ్య, నందలూరుకు చెందిన ఎస్ ఖాదర్‌వలిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్దనున్న నగదు లక్షా ఐదు వేలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరితో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాకు నందలూరుకు చెందిన ఖాదర్‌బీ, రఫీ, భాషా, భాస్కర్ కలసి బాలపల్లెకు చెందిన బాబుతో వ్యాపార లావాదేవీలు జరిపేవారని విచారణలో తేలిందన్నారు. స్మగ్లర్లు బాబు వద్ద ఎర్రచందనం కిలో రూ. 300కు కొనుగోలు చేసి, బెంగుళూరు పాలెంలో కిలో రూ. 600లకు అమ్మేవారన్నారు. హైవేలోనే అక్రమ రవాణా నిర్వహించేవారన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను, నగదును కోర్టులో పెడతామని ఎస్సై తెలిపారు.
ఉన్మాదిని పట్టుకుంటాం
* ఐపిఎస్ అధికారి విజయకుమార్
ఒబులవారిపల్లె, జూన్ 6 : మండలంలోని జివి పురంలో ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న నిందితుడు తోట రమణను అతి త్వరలో పట్టుకుంటామని ఐపిఎస్ అధికారి విజయకుమార్ అన్నారు. గురువారం ఆయన గ్రామంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివి పురంలో గత రెండేళ్లగా కనబడకుండా తిరుగుతున్న ఉన్మాది రమణను త్వరలో పట్టుకుంటామని, నిందితుడు ఎక్కడ ఉండేది తెలిసి ఉంటే చెప్పాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, అదనపు బలగాలతో గాలింపు చర్యలు చేపడతామన్నారు. నిందితుని అచూకీ తెలిసిన వారు గ్రామంలోని పోలీసులకు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ అన్యోన్య, సిఐ రమాకాంత్, ఎస్సై సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వీరారెడ్డిగారిపల్లెలో ఈతకెళ్లి
ఇద్దరి మృతి
రాయచోటి, జూన్ 6 : ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన గురువారం లక్కిరెడ్డిపలె మండలం దప్పేపల్లె పంచాయతీలోని వీరారెడ్డిగారిపల్లెలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం వీరారెడ్డిగారిపల్లెలో గ్రామానికి చెందిన వెంకటుసబ్బయ్య కుమారుడు, రెడ్డిశేఖర్(8), చంద్ర కుమారుడు రెడ్డిశేఖర్(8), జనే్మజయుడు(8) కలిసి మధ్యాహ్నం గ్రామం సమీపంలోని చెరువుకు ఈతకెళ్లారు. అయితే ఈతఆడుతూ లోతులోకి పోవడంతో మునిగిపోయి మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ వీరన్న కేసు నమోదు చేసి, శవాలను పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అటవీ సంరక్షణ అందరి బాధ్యత
* అటవీశాఖ రాష్ట్ర చీఫ్ కన్జర్వేటర్ హెచ్‌సి మిశ్రా
రైల్వేకోడూరు, జూన్ 6 : అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ హెచ్‌సి మిశ్రా అన్నారు. గురువారం స్థానిక అటవీశాఖ పార్క్ ఆవరణలో రాజంపేట డివిజన్ స్థాయి వన సంరక్షణ సమితి అధ్యక్షులు, సభ్యులతో అటవీ సంరక్షణపై సమావేశం జరిగింది. స్థానిక డిఎఫ్‌ఓ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాజంపేట, కోడూరు, చిట్వేలి, సానిపాయి, బాలపల్లె అటవీశాఖల అధికారులు, సిబ్బంది, విఎస్‌ఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్‌సి మిశ్రా మాట్లాడుతూ అడవులను సంరక్షణ చేయడం కేవలం అటవీ శాఖ అధికారుల బాధ్యత కాదని, పోలీసులు, ప్రజలు, విఎస్‌ఎస్ సభ్యులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. అడవులు అంతరించిపోతే వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చి మానవాళి మనుగడకే ప్రమాదం ఏర్పడే సూచనలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అడవులను కాపాడుకుంటే వాతావరణ బాగుంటుందని, తద్వార సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. చెన్నైలో ఎర్రచందనం విలువ విపరీతంగా ఉండడంతో అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసేందుకు స్మగ్లర్లు వస్తున్నారని, వారిని ఎదుర్కొనాలంటే అటవీ శాఖ అధికారులకు ప్రజలు, విఎస్‌ఎస్ సభ్యులు సహకరించాలన్నారు. ఇప్పటికే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తిరుపతి, కోడూరు అటవీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలోనే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కాకుండా ప్రతి ఒక్కరు అటవీశాఖ అధికారులకు సహకరించాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతంలో వెళుతుంటే వారి సమాచారాన్ని స్థానికులు అటవీ అధికారులకు చెప్పాలన్నారు. స్మగ్లర్లు ఇచ్చే డబ్బులకు ఎవరు కూడా ప్రలోభాలకు గురికాకుండా ఉండాలన్నారు. అడవితల్లిని పది కాలాల పాటు సంరక్షణ చేసుకుంటే భావి తరాలకు ఏలాంటి ప్రమాదం ఉండదన్నారు. అక్రమ రవాణా సమాచారాన్ని సకాలంలో తెలిపేవారికి అటవీ శాఖ తరపున పారితోషకాన్ని అందిస్తామన్నారు. తమిళనాడు, కర్నూలు, నెల్లూరు ప్రాంతాల నుండి వందలాది మంది స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనాన్ని నరికివేయడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తెరిగి వారిని ఎదుర్కొనాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. అడవులు దెబ్బతింటే తద్వారా అటవీ ప్రాంతంలోని జంతువులన్నీ గ్రామాలపైకి వస్తాయని, దీంతో ప్రజలకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం త్వరలో సిబ్బంది కొరతను భర్తీ చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి వాల్‌పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పీలేరు, తిరుపతి డిఎఫ్‌ఓలు నాగార్జునరెడ్డి, పవన్‌కుమార్, సబ్ డిఎఫ్‌ఓ శ్రీనివాసులు, అటవీ అధికారులు వెంకటసుబ్బయ్య, హేమచందర్, ఖాదర్‌బాషా, శివరామప్రసాద్, టివైఎన్ గౌడ్, సాయిబాబా తదితరులు పాల్గొని, ప్రసంగించారు.
డిఎల్‌కు మతిభ్రమించింది
* ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రసాద్‌రెడ్డి
ప్రొద్దుటూరు, జూన్ 6 : మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవి పోవడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రొద్దుటూరు మార్కెట్ యార్డు చైర్మన్ శంకరాపురం ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులోని తన చాంబర్‌లో గురువారం విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కించపరచే విధంగా, తరచూ పథకాలను, ముఖ్యమంత్రి విధానాలను విమర్శించడం డిఎల్‌కు ఎంత వరకు సబబు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దొడ్డిదారిన సూట్‌కేసులను మోసి పదవులు తెచ్చుకున్నాడని విమర్శించడం సోనియాగాంధీని విమర్శించినట్లు కాదా అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సోనియాగాంధీ ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టారన్నారు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీని ఆరోపించడం వల్లే మంత్రిగా డిఎల్‌ను బర్తరఫ్ చేశారన్నారు. రాజీనామాను అడిగి వుంటే ఎడమచేతితో వదిలేసేవాడినని డిఎల్ చెప్పడం విడ్డూరంగా వుందని ముఖ్యమంత్రి తీరు నచ్చనప్పుడు రాజీనామా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సోనియాగాంధీ మీద ఏ మాత్రం గౌరవం వుందో డిఎల్ విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. బుధవారం ఆయన మైదుకూరు నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభల్లో తాజాగా వైఎస్ తన ప్రాణమిత్రుడని చెప్పుకుంటున్న డిఎల్ వైఎస్ హయాంలో పథకాలను ఎన్నిసార్లు విమర్శించారో గుర్తు చేసుకోవాలన్నారు. ప్రాణమిత్రుని కొడుకు వైఎస్ జగన్‌మోహన్ దేశాన్ని అమ్మేస్తాడని తన ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన సంగతి మరవడం చాలా హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూ అనేక సార్లు ఒడిదుడుకుల మధ్య ఎన్నికల్లో గెలుపొందుతూ కేవలం ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి 2009 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో ఆయన మాజీ ఎమ్మెల్యే వరదపై చెంచాలు, గరిటలంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఏ పార్టీలో వున్నా ఆయనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా వున్నప్పుడు తన శాఖలో వున్న ఉద్యోగాల విషయంలో స్పీపర్ స్థాయి నుంచి డాక్టర్ల స్థాయి నియామకాల్లో ప్రత్యేక గ్యాంగ్‌లను తయారు చేసుకొని డబ్బులు వసూలు చేయడం వాస్తవం కాదా అని విమర్శించారు. ప్రొద్దుటూరు ప్రజలకు ప్రధాన అవసరమైన మంచినీటి కోసం కుందూపెన్నా వరదకాల్వను ఏర్పాటు కోసం మాజీ ఎమ్మెల్యే వరద పాటుపడుతుంటే ఆయన చేసే పనిని అడ్డుకోవడం జరుగుతుందన్నారు. ప్రొద్దుటూరులో ఆయనతో మంచి సంబంధాలు కలిగిన నేతలు, లోపాయికారి గ్యాంగ్‌లు ప్రజలకు నీళ్ళు రాకుండా అడ్డుకుంటే ఈ పట్టణం నుండి బహిష్కరించాల్సిందిపోయి అందరూ కలిసి ఒకటవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు బేపారి బషీర్‌అహమ్మద్, కాంగ్రెస్ నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, షబ్బీర్, పెద్దశెట్టిపల్లె వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ ప్రభుత్వంలో రూ.500 కోట్లపై
శే్వత పత్రం విడుదల చేయాలి
* టిడిపి నేతలు అమీర్, గోవర్ధన్‌రెడ్డి
కడప (అర్బన్), జూన్ 6 : దివంగత ముఖ్యమంత్రి ప్రభుత్వ హయాంలో 2006లో కడప నగరాభివృద్ధికి మం జూరు చేసిన రూ.500 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ద్వారా శే్వతపత్రం విడుదల చేయాలని టిడిపి రాష్ట్ర నాయకులు విఎస్ అమీర్‌బాబు, ఎస్. గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో వారు మా ట్లాడుతూ వైఎస్ హయాంలో కడప నగరాభివృద్ధి పేరుతో ప్రభుత్వం నుంచి మంజూరైన కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్న ప్రస్తుత వైకాపా నేతలు నేడు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నగరాన్ని మరో సింగపూర్‌ను చేస్తామన్న అప్పటి మేయర్ పి రవీంద్రనాథ్‌రెడ్డి సింగపూర్ కాదు కదా కడపను కడపలా ఉంచి ఉంటే ప్రజలు సంతోషించేవారన్నారు. అండ ర్ డ్రైనేజీ పనులను సంపూర్ణంగా చేయకపోవడంతో ఏ రోడ్డులో చూసి నా మ్యాన్‌హోల్స్ హెచ్చు తగ్గులతో నగర ప్రజలకు అనునిత్యం కష్టాలకు గురవుతున్నారన్నారు. కొన్ని ప్రాంతా ల్లో వర్షం నీరు కూడా బయటకు మళ్లించలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఒక్కొక్క వార్డుకు రూ.5 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన నిధులు ఎక్కడ ఖర్చు చేశారో శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు పీరయ్య, రవిశంకర్‌రెడ్డి, మీనాక్షి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
రైతులకు త్వరగా విత్తనాలివ్వాలి
* ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి, జూన్ 6 : రైతులకు త్వరగా విత్తనాలను అందివ్వాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం కురిసినందున రైతులు వేరుశెనగ విత్తనాలు విత్తేందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు త్వరగా అందిస్తే అదునులో విత్తనం పడుతుందన్నారు. నియోజకవర్గంలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె మండలాలకు 2వేల క్వింటాళ్లు సరఫరా చేస్తే రైతులకు సరిపోతాయన్నారు. ప్రస్తుతం వెయ్యి క్వింటాళ్లు వస్యాయని, వ్యవసాయాధికారులు చెబుతున్నారని, అవి ఏ మూలకూ సరిపోవన్నారు. ఇక రుణాలు రెన్యూవల్ సమయంలో బ్యాంకు అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం సరి కాదన్నారు. మీ సేవా ద్వారా 1బి, అడంగల్ తీసుకొస్తేనే రుణాలు రెన్యువల్ చేస్తామని చెబుతారని, అయితే కొందరి రైతుల పాసుపుస్తకాలు కంప్యూటర్‌లో ఎక్కించకపోకవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కనుక తహశీల్దార్ కార్యాలయంలో 1బి, అడంగల్ అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఎ రాధాదేవి, వ్యవసాయాధికారి దివాకర్‌బాబు, ఎఇఓ నవంత్‌కుమార్, మాజీ కౌన్సిలర్ దశరథరామిరెడ్డి, జాఫర్, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం
మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గురువారం అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు మంచి పౌష్ఠికాహారం అందించాలన్నారు. అప్పుడే కేంద్రాలపై పిల్లలకు మక్కువ ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భారతి, ఎంఇఓ చిన్న రెడ్డెన్న, సూపవైజర్లు తదితరులు పాల్గొన్నారు.
‘సినిమా నేను తీస్తా’ లఘు చిత్రం
ఆడియో ఆవిష్కరణ
కడప ,జూన్ 6 : ‘సినిమా నేను తీస్తా’ లఘు చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం నగర మాసాపేట నిర్మల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఆర్‌ఐ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు టింబర్ డిపో సుధీర్, న్యాయవాది అజయ్ కుమార్ వీణా, బ్లడ్ 2 లివ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు పి పవన్‌కుమార్, నిర్మల్ హైస్కూల్ ప్రధానో ఉపాధ్యాయురాలు మేరి క్యాతీరీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో కళాకారుల కొదవ లేదన్నారు. ఇంత చిన్నవయస్సులోనే ఆర్ట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ లఘు చిత్రానికి కడప వాసి దీపక్ దర్శకత్వం వహించడం చాలా అభినందిందచ దగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, రమణస్వామి, ప్రసాద్, లక్ష్మి, ఆదిల్, సందీప్, సందు, శివ, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.