Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విద్యతోనే పేదల అభివృద్ధి

$
0
0

బుక్కరాయసముద్రం, జూన్ 6: పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖా మంత్రి డా.సాకే శైలజానాథ్ అన్నారు. గురువారం బుక్కరాయసముద్రం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మండలంలోని జంతులూరు గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభం అనంతరం గ్రామవాసులు పాఠశాల ఉపాధ్యాయులపై ఫిర్యాదు చేయడంతో వెంటనే వారిపైన స్పందిస్తూ ఇక నుంచి ఇటువంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అంతేకాకుండా పిల్లల పట్ల ఉపాధ్యాయులకన్నా తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ వహించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. నీలంపల్లిలో కమ్యూనిటీ హాలు, చెదుల్ల, వెంకటాపురం గ్రామాలలో రోడ్లను ప్రారంభించారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణంలో ప్రహరి గోడకు భూమిపూజ చేశారు. అనంతరం ఇందిరాస్ర్తి శక్తి మహిళా సమాఖ్య భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల చైతన్యమే జాతికి శ్రీరామరక్ష అన్నారు. బుక్కరాయసముద్రం మహిళా సంఘ సమాఖ్య భవనం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇరవై ఐదు లక్షల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ప్రతి ఒక్కరికి స్వంత ఇంటి అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. మండలంలో 90 శాతం ఇందిరమ్మ ఇళ్లు, పి.కొత్తపల్లి రోడ్డు మినహా మండలంలోని సిసి రోడ్లు, తారు రోడ్లు పూర్తయ్యాయన్నారు. సకాలంలో వితంతు వికలాంగ, వృద్ధులకు ప్రతి నెలా పెన్షన్ ఇచ్చే ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం పీడిస్తున్న తాగునీటి సమస్యను తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డితో చర్చించి యంపిఆర్ డ్యాం నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ తప్పక పాఠశాలలకు పంపించాలని, ఇక నుంచి పాఠశాలలో వేయబోయే కమిటీలలో పిల్లల తల్లులను కమిటీ మెంబర్లుగా నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి ఢిల్లీరావు, ఆర్డిఓ డి.హుస్సేన్‌సాబ్, మండల తహశీల్దార్ నాగరాజు, మండల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, పి.లింగమయ్య, భాస్కరరెడ్డి, నాగభూషణం(బూసి), శ్రీకాంత్, మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ యస్.రామకృష్ణ, సింగిల్‌విండో అధ్యక్షుడు కె.నాగలింగారెడ్డి, చంద్రమోహన్, పెద్దకొండయ్య, ముసలన్న, పూల నారాయణస్వామి, శ్రీనివాసులు, సత్తి, ఆదినారాయణ, మారుతి, కొండమ్మ పలువురు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

న్యాయమే గెలిచింది
అనంతపురం కల్చరల్, జూన్ 6: మిస్సమ్మ స్థలం విషయంలో న్యాయమే గెలిచిందని, ఇది మిత్రపక్షాలు సాధించిన విజయమని ఆ పార్టీల నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి మహలక్ష్మి శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్‌రెడ్డిలు గురువారం మిస్సమ్మ స్థలంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఒకప్పుడు మిస్సమ్మకు పట్టా ఇచ్చారని, దీనిపై బిఎన్‌ఆర్ సోదరులు బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలతో ఆక్రమించుకున్నారన్నారు. 2ఎ నమూనా ప్రకారం ఎక్కడా బిఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ గురించి కనబరచలేదన్నారు. రూ.150 కోట్ల విలువ చేసే స్థలాన్ని కోటి రూపాయలకే తాము పొందినట్లు చెప్పుకువచ్చారని, స్థలాన్నిప్రభుత్వ మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి విస్తరణ కోసం ఉపయోగించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటికైనా బిఎన్‌ఆర్ సోదరులు తక్షణమే మిస్సమ్మ స్థలం నుండి వైదొలగాలన్నారు. వెంటనే తమ బోర్డులను తామే తొలగించుకోవాలన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులపై, అక్కడ నివాసమున్న పేదలపై బిఎన్‌ఆర్ సోదరులు దౌర్జన్యం చేశారని ఇకపై ఇటువంటి దౌర్జన్యాలను మానుకోవాలన్నారు. ఇన్ని రోజులు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బిఎన్‌ఆర్ సోదరుల అక్రమాలను చూస్తూ, వారు దౌర్జన్యాలకు పాల్పడినా ఒక్కరినీ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, నివాసమున్న వారికి సర్వహక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు కలసికట్టుగా పోరాటం సాగస్తామన్నారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేషయ్య, టిడిపి కృష్ణకుమార్, సరిపూటి రమణ, స్వామిదాస్, సిపిఐ మల్లికార్జున, సిపిఎం రామ్మోహన్, వీరనారప్ప పాల్గొన్నారు.

అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో
అక్రమాలపై విజిలెన్స్!
హిందూపురం, జూన్ 6: హిందూపురం మహిళా, శిశు ప్రాజెక్టు పరిధిలో ఇటీవల జరిగిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలపై 3ఆంధ్రభూమి2లో ప్రధానంగా శీర్షిక వెలువడిన విషయం విదితమే. దీనికితోడు పోస్టుల భర్తీలో చోటు చేసుకున్న అక్రమాలపై ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కలెక్టరేట్ ఎదుటధర్నా నిర్వహించి అప్పటి పెనుకొండ ఆర్డీఓ ఈశ్వర్ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలుచేశారు. ఈ నేపథ్యంలో గురువారం విజిలెన్స్ అధికారులు అంగన్‌వాడీ పోస్టుల భర్తీపై విచారణ నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం చేరుకున్న అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. అదే విధంగా అప్పట్లో హిందూపురం సిడిపిఓగా విధులు నిర్వహించిన ఇందిరాదేవిని వివిధ అంశాలపై విచారణ సాగించారు. ఏఏ పోస్టులను భర్తీ చేశారు, ఆయా పోస్టులకు ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, దేని ప్రతిపాదికన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అన్న అంశాలపై సిడిపిఓ ఇందిరాదేవిని దాదాపు రెండు గంటల పాటు ఎస్పీ విచారించారు. అదే విధంగా ఇందుకు సంబంధించి ఐసిడిఎస్ కార్యాలయంలో నమోదైన వివరాలను ఫైళ్లు, వివరాల సిడిలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, హిందూపురం ప్రాజెక్టు పరిధిలో ఇటీవల భర్తీచేసిన అంగన్‌వాడీ పోస్టులపై పెక్కు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై విచారణ సాగించేందుకు ప్రస్తుతం వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఈ వివరాలతో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలనను జరపడం జరుగుతుందన్నారు. విచారణ పూర్తిఅయిన తర్వాత సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు. కాగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో కొందరు అధికారులు ముందుగా అభ్యర్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని అనర్హులు, స్థానికేతరులకు పోస్టులు కట్టబెట్టారని పెద్దఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుండి రూ.లక్ష దాకా అభ్యర్థులను వసూలు చేసుకొన్నట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. స్థానికులకు మాత్రమే ప్రాధాన్యత కల్పించాల్సిన పోస్టుల్లో కొన్నింటిని లోపాయికారి ఒప్పందాలతో స్థానికేతరులకు కట్టబెట్టినట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పలువురు అర్హత కలిగి ఉద్యోగాలు రాని అభ్యర్థులు ఉన్నతాధికారులకు నేరుగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా చేశారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో జరిగిన అవకతవకలపై అప్పటి ఆర్డీఓ ఈశ్వర్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తం కాగా ఆయన ఇటీవలే ఇతర ప్రాంతానికి బదిలీ అయ్యారు. విచారణ పూర్తి అయిన తర్వాత అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొంటారా లేక కాగితాలకే విచారణ పరిమితమవుతుందా అన్నది వేచి చూడాల్సిందే.

చౌక ధాన్యపు డిపో తనిఖీ
మున్సిపల్ పరిధిలోని రహమత్‌పురంలో నిర్వహిస్తున్న తొమ్మిదో నెంబర్ చౌక ధాన్యపు దుకాణాన్ని విజిలెన్స్ ఎస్పీ బ్రహ్మారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న స్టాక్, రికార్డులను పరిశీలించారు. అదే విధంగా డిపో పరిధిలో ఎన్ని రేషన్‌కార్డు ఉన్నాయన్న విషయమై ఆరా తీయగా దాదాపు 1750 దాకా ఉన్నట్లు డీలర్ షఫీవుల్లా పేర్కొన్నారు. అయితే తనకు 500 కార్డులు మాత్రమే చాలని సంబంధిత డీలర్‌తో విజిలెన్స్ అధికారులు లిఖిత పూర్వకంగా తీసుకొన్నట్లు సమాచారం.

కీలక పోస్టులన్నీ ఖాళీ
భర్తీకి నోచని మేనేజర్ పోస్టు
అనంతపురం టౌన్, జూన్ 6: కార్పొరేషన్‌లో పాలనాపరంగా కీలకమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఆదాయం ఉండే పోస్టులపైనే పలువురు ఉద్యోగులు మక్కువ చూపుతున్నారు. పదోన్నతులలో భాగంగా సీనియారిటీ జాబితా ప్రకారం సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పించారు. మే 31వ తేదీన మేనేజర్ శకుంతలమ్మ పదవీవిరమణ చేయటంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. అకౌంటెంట్ సతీష్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు లోను కావటంతో లాంగ్ లీవ్‌లో వెళ్ళిపోయారు. ఆయన యుబిఎస్‌పి సెక్షన్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనితో ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ విజయకుమార్‌ను అకౌంటెంట్‌గా నియమించారు. దీనితో ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ పోస్ట్ ఖాళీగా ఉండిపోయింది. అలాగే యుబిఎస్‌పి సెక్షన్ సూపరింటెండెంట్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఆదాయం ఉండే పోస్టుల వైపు మొగ్గు చూపుతున్న సిబ్బంది మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించటానికి విముఖత చూపుతున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం మేనేజర్ పోస్ట్ నియమించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. మేనేజర్ పోస్ట్ అడ్మినిస్ట్రేషన్‌పరంగా ఎంతో కీలకమైంది కావటం విశేషం. మేనేజర్‌గా అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ మున్సిపల్ ఆర్.డి, మున్సిపల్ పరిపాలనా శాఖలు కోరే నివేదికలను తయారుచేసి పంపాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. పాలనాపరంగా మేనేజర్ పోస్ట్ కీలకమేకాని గంపెడు పని భారంతో సతమతం కావాల్సి ఉంటుందని వాపోతున్నారు. ఎంత పనిచేసినా సరైన గుర్తింపులేకపోగా అందరితోను మాటలు పడాల్సి వస్తుందన్నారు. అయితే పదోన్నతులలో సీనియర్లమంటూ పోటీపడ్డవారిని కీలకమైన మేనేజర్ పోస్టులో నియమిస్తే బాగుంటుందని వ్యంగ్యంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా పదోన్నతులు కల్పించిన తర్వాత కూడా పలువురు ఉద్యోగులు వారికి కేటాయించిన సూపరింటెండెంట్ పోస్టుల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆ విధులు నిర్వహించటానికి విముఖత చూపుతున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో కీలకమైన అకౌంటెంట్, మేనేజర్, రెవెన్యూ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం, టౌన్ ప్లానింగ్, యుబిఎస్‌పి సెక్షన్ సూపరింటెండెంట్ పోస్టులను నియమిస్తే ఉద్యోగుల అసంతృప్తిని నివారించటంతోపాటు పాలనాపరంగా నెలకొన్న వివిధ సెక్షన్లలో స్తబ్ధతను తొలగించవచ్చునంటున్నారు. అయితే గతంలో సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న శకుంతలమ్మకు ప్రాధాన్యతా క్రమంలో అకౌంటెంట్ పోస్టును కేటాయించకుండా మేనేజర్‌గానే కొనసాగించారు. దీనితో సీనియారిటీ జాబితాను పక్కనపెట్టి జూనియర్లకు ప్రాధాన్యతా పోస్టులలో ప్రాధాన్యతను కల్పించినట్లైంది. దీనితో ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. సీనియారిటీ జాబితాను తోసి సూపరింటెండెంట్ పోస్టుల భర్తీలో అప్పటి ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు సిబ్బందిలో తిరుగుబాటు ధోరణికి దారితీసింది. ఇప్పటికైనా సీనియారిటీ జాబితా ప్రకారం వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్ల పోస్టుల భర్తీని చేపడితేకాని నగరపాలక సంస్థ 3గాడి2లో పెట్టేందుకు వీలుకాదంటున్నారు. లేదంటే పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తి మరింత అస్తవ్యస్తంగా మారుతుందనటంలో సందేహం లేదు.
ఫిర్యాదు చేస్తే కేసు నమోదు
అనంతపురం, జూన్ 6 : ఎవరైనా పోలీసుస్టేషన్‌లకు వచ్చి ఫిర్యాదులు ఇస్తే కేసులు నమోదు చేస్తామని అనంతపురం రేంజ్ డిఐజి బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం పోలీసు సమావేశ మందిరంలో విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా గురించిన సమాచారం, జిల్లాలో నెలకొన్న సమస్యలు, ఏఏ ప్రాంతాల్లో ఏఏ సమస్యలు నెలకొని ఉన్నాయి లాంటి వాటి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఆయా పోలీసుస్టేషన్‌ల్లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ మహిళా, పురుష హోంగార్డులను ఉంచి ఫిర్యాదుదారుల పట్ల మంచి నడవడిక కలిగి ఉండేలా వారిని తీర్చిదిద్దుతామన్నారు. ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే భయపడే పరిస్థితిని తొలగిస్తామన్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యల గురించి తెలుసుకుని వ్యవస్థను గాడిలో పెడతానన్నారు. అంతకు ముందుగా అతను తన స్వగతాన్ని వివరించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో డిఐజిగా పనిచేస్తూ అనంతపురము రేంజ్‌కు బదిలీ అయ్యానన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఆయన మొదట్లో ఆంధ్రయూనివర్శిటీలో కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ లెక్చరర్‌గా పనిచేశానని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లా రాజంపేట, ఖమ్మం, తిరుపతి, నెల్లూరు, ప్రొద్దుటూరులలో డిఎస్‌పి పనిచేశానన్నారు. అనంతరం కడప, రంగారెడ్డి జిల్లాల ఎయస్‌పిగా పనిచేశానన్నారు. హైదరాబాదు నగరంలోని ఈస్ట్‌జోన్, వెస్ట్‌జోన్, విశాఖపట్నంలో డిసిపిగా పనిచేశానన్నారు. కొంతకాలం పాటు ట్రాఫిక్ విభాగంలోకూడా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. రెండున్నర సంవత్సరాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలోని విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో బాధ్యతలు నిర్వర్తించినట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ రిజర్వు స్థలం అన్యాక్రాంతమైతే సహించం
అనంతపురం టౌన్, జూన్ 6: నగరంలోని ఆర్.టి.సి బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ రిజర్వ్ స్థలం 5.20 ఎకరాల స్థలాన్ని గురువారం ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ, కమిషనర్ రంగయ్యలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణకిశోర్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణకిశోర్, చైన్‌మెన్లు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్‌లో గుర్తించిన రిజర్వ్ స్థలం 5.20 ఎకరాల స్థలంలో 72 సెంట్లు గల్లంతు కావటం గుర్తించారు. గల్లంతైన స్థలం వివరాలపై ఆరా తీసిన ఇన్‌చార్జి కలెక్టర్‌కు సంతృప్తికరమైన సమాధానం టౌన్ ప్లానింగ్ సిబ్బంది నుంచి లభించలేదు. దీనితో ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్పొరేషన్ మున్సిపల్ స్థలాలపై విషయ పరిజ్ఞానం పెంచుకోకపోతే ఎలాగని సిబ్బందిని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానాలివ్వకుండా అవసరం లేని విషయాలను ప్రస్తావించటం మానుకోవాలని సూచించారు. రిజర్వ్ స్థలంపై ఎసిపి కృష్ణకిశోర్ సంతృప్తికర సమాధానం ఇవ్వలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనితో చైన్‌మెన్ కుళ్ళాయప్ప సమాధానమిస్తూ మున్సిపాలిటీ ఏర్పాటు సమయంలో సెంట్రల్ పార్క్ ఏర్పాటుకై రిజర్వు స్థలం కేటాయించారన్నారు. గతంలో రహదార్ల ఏర్పాటులో స్థలం కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇందులో స్థలం కేటాయింపులు చేశారన్నారు. అలా కేటాయింపులు జరగగా మిగిలినదే 5.20 ఎకరాల రిజర్వ్ స్థలమని తెలిపారు. సరైన సమాచారం ఇచ్చిన చైన్‌మెన్ కుళ్ళాయప్పను ఇన్‌చార్జి కలెక్టర్ అభినందించారు. రిజర్వ్ స్థలం 5.20 ఎకరాలలో గల్లంతైన 72 సెంట్ల స్థలం ఏమైందన్న విషయం నిగ్గుతేల్చాలన్నారు. తహశీల్దార్, సర్వేయర్లు రిజర్వ్ స్థలాన్ని సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. ఎల్లుండిలోగా గల్లంతైన 72 సెంట్ల స్థలం సంగతి తేల్చాలని సూచించారు. ఎలాంటి పరిస్థితిలోను మున్సిపల్ కార్పొరేషన్ స్థలం అన్యాక్రాంతం కానివ్వరాదని హెచ్చరించారు. తప్పులు దొర్లినట్లైతే చర్యలు తప్పవని అన్నారు.
నకిలీ వే బిల్లుల ముఠా అరెస్టు
తాడిపత్రి, జూన్ 6 : పట్టణంలో నకిలీ వే బిల్లులు, నకిలీ రాయల్టీ బిల్లులతో వ్యాపారం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న ముఠాను అరెస్టు చేశామని పట్టణ సిఐ లక్ష్మినారాయణ తెలిపారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ తాడిపత్రి నుండి హైదరాబాద్‌కు బండల లోడుతో వెళ్తున్న లారీని కర్నూలు వద్ద విజిలెన్స్‌వారు తనిఖీలు చేయగా వే బిల్లుపై ఏసిటివో-2 పేరు మీద ఉన్న సీలును చూసి అనుమానంతో లారీని సీజ్ చేసి, తాడిపత్రిలోని కమల్ రోడ్‌లైన్స్‌పై విజిలెన్స్ వారు దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో కొన్ని నకిలీ వే బిల్లులు, రబ్బరు స్టాంపులు దొరకగా, వాటిని విజిలెన్స్‌వారు సీటీఓకు అందజేశారని, వారు నకిలీవని ధృవీకరించి దర్యాప్తు చేయాల్సిందిగా తెలుపడంతో కమల్ రోడ్‌లైన్స్ నిర్వహిస్తున్న రామయ్య, వేణుగోపాల్‌ను విచారించగా, నందలపాడుకు చెందిన కుమార్ తమకు నకిలీ బిల్లులు అందజేస్తున్నాడని తెలుపడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నకిలీ బిల్లులు, రబ్బరుస్టాంపులను స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు. కుమార్ కర్నూలు జిల్లాలో అధికారులు స్టాంపు వేయని వే బిల్లులను తెచ్చి వాటిపై గల రబ్బరు స్టాంపులు, అధికారుల సంతకాలను ఇంకు రిమూవర్‌తో తొలగించి ఆ బిల్లులను విక్రయిస్తున్నాడని, ఇతనిపై కర్నూలు జిల్లాలో పలు కేసులున్నాయని తెలిపారు. అరెస్టు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు.
కార్మికుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం, జూన్ 6 : స్థానిక రెవెన్యూ భవన్‌లో గురువారం జిల్లాలోని కార్మికుల సమస్యలను పరిష్కరించుటకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరు తరపున కార్మికశాఖ ఉప కమిషనరు కె. సుబ్బారావు ఫిర్యాదులను స్వీకరించారు. అసిస్టెంట్ కమిషనర్లు రంగరాజు అయ్యంగార్, సూర్యనారాయణ, మురళీధర్, సీనియర్ సహాయకులు సుజాత తదితరులు పాల్గొన్నారు. కార్మికుల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లోవచ్చిన వినతుల వివరాలిలా ఉన్నాయి .. అనంతపురము మెడికల్ కళాశాల, సర్వజన వైద్యశాలలోపనిచేస్తున్న 213 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఆరు నెలల వేతనాలు ప్రభుత్వం ద్వారా బకాయిపడి ఉండడంవల్ల జీతభత్యాలు లేక ఉద్యోగుల కుటుంబాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే 2013 ఏప్రిల్ నుంచి ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కొనసాగింపు కొరకు చర్యలు చేపట్టాలని అనంతపురము మెడికల్ కళాశాల, ఆసుపత్రి ఉద్యోగుల సంఘం నాయకులు వినతిని సమర్పించారు. కళ్యాణదుర్గం మండలంలోని వడ్డేకాలనీలో సుమారు నాలుగు వేల మంది నివసిస్తున్నారని, ఈ ప్రాంతపు ప్రజలకు తాగునీరు సరఫరా కావడం లేదని అందుచేత తాగునీటి ఎద్దడి తీర్చుటకు వాటర్ ప్లాంట్ మంజూరు చేయుటకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు. కళ్యాణదుర్గం మండలంలోని కురుబరహళ్లి గ్రామంలోని బిసి కాలనీ నివాసి వడ్డే భాగ్యమ్మ సాధారణంగా మృతి చెందినదని ఈమె పేరు మీద భవన నిర్మాణ సంక్షేమం బోర్డు ద్వారా రూ.30 వేలు మంజూరై భర్త హనుమంతరాయుడుకు చెందవలసి ఉండగా ఇటీవల కాలంలో ఇతను కూడా మరణించారు. అందుచేత ప్రస్తుతం మరణించిన దంపతుల కుమారుడైన వడ్డే వన్నూరుస్వామికి మంజూరు అయిన ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వ అధికారులు తగుచర్య తీసుకుని నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి నారాయణరెడ్డి, ఎడిఓ సేవానాయక్, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి ఇబ్రహీమ్, ఎపిఓ సువర్ణలత, ఇయస్‌ఐ బ్రాంచి హిందూపురం మేనేజరు పద్మావతమ్మ, డిప్యూటీ కమిర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు ప్రసాదు, పిఎఫ్‌ఓ సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల నిరసన దీక్షలు జయప్రదం చేయండి
అనంతపురం సిటీ, జూన్ 6: ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపుతున్న సాచివేత ధోరణికి నిరసనగా ఈ నెల 11వ తేదీన హైదరాబాదులో జరుగు దీక్షలను జయప్రదం చేయాలని జిల్లా జాక్టో పిలుపునిచ్చింది. గురువారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జాక్టో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర జాక్టో ఈ నెల 11వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలో జాక్టో నాయకులు, ఉపాధ్యాయులు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాక్టో రాష్ట్ర నాయకులు కె.ఓబుళపతి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై జరుగు నిరసన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌టిఎఫ్ ఉపాధ్యాయులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో జాక్టో జిల్లా నాయకులు బసవరాజు, వెంకటేశులు, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, రామన్న, గోవిందు, జయరామ్ నాయక్, వెంకటసుబ్బయ్య, శ్రీనివాసప్రసాద్, రాజశేఖర్, నారాయణస్వామి, వెంకటరత్నం, విష్ణువర్థన్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, తులసిరెడ్డి, ఎర్రిస్వామి, అశోక్‌కుమార్‌రెడ్డి, రామలింగప్ప, ఎం.రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడి మృతి
ధర్మవరం టౌన్, జూన్ 6: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని (55) సంవత్సరాలు వృద్ధుడు మృతి చెందాడు. వివరాలిలా వున్నాయి. కనగానపల్లి హైస్కూల్ వద్ద అపస్మారక స్థితిలో పడి వున్న వృద్ధుడిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు విషయం చేరవేయడంతో బుధవారం సాయంత్రం 108 సాయంతో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతి చెందిన వృద్ధుడు తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు ధరించాడని, ముఖంపై పెద్ద పులిపిరి వుందని డాక్టర్లు తెలిపారు. వృద్ధుడిని అంత్యక్రియల నిమిత్తం మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు.పోలీసులు కేసు నమోదు చేసారు.
వివాహిత ఆత్మహత్య
గోరంట్ల, జూన్ 6: వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని 1వ వార్డుకు చెందిన చింతకాయల లక్ష్మీదేవి (36) అనే మహిళ దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధ పడుతోందని, ఆ బాధ భరించలేక గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రెండు దేవాలయాల్లో చోరీ
ఉరవకొండ, జూన్ 6: మండలంలోని రేణుమాకుల పల్లి గ్రామంలోని సుంకులమ్మ, మారెమ్మ దేవాలయంలో గురువారం తెల్లవారుజామున దుండుగులు చోరీ చేసినట్లు ఆలయ పూజారి లింగప్పలు తెలిపారు. తలుపుల బద్దలు కొట్టి సుంకులమ్మ ఆలయంలో బిరువాను రాళ్లతో ధ్వంసం చేసి అమ్మవారి కిరిటాలు, ముఖం, మీసాలతో పాటు బంగారు తాళిబొట్లను, హుండీలోని నగదును చోరీ చేసినట్లు పూజారి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతానికి యువ రైతు మృతి
వజ్రాకరూరు, జూన్ 6: మండల పరిధిలోని చిన్నహోతూరు గ్రామానికి చెందిన గోవిందు.33 కు విద్యుత్‌షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. బంధువుల వివరాలు మేరకు...రోజుమాదిరిగా పొలానికి నీరు కట్టెందుకు వెళ్లడన్నారు. గురువారం తెల్లవారజూమున యథాప్రకారం తమ 3ఎకరాల కొత్తిమిర తోటకు నీళ్లు కట్టెందుకు వెళ్లాడన్నారు. విద్యుత్ మోటరు ప్రారంభిస్తుండగా ఈ సంఘటన చేసుకుందన్నారు. ఉదయం పొలానికి వెళ్లిన వ్యక్తులు చూసి గోవిందు మృతి చెందినట్లు గుర్తించారన్నారు. మృతునికి భార్య తులసమ్మ ఇద్దరు పిల్లలు వున్నట్లు తెలియజేశారు. ఈ సంఘటనపై వజ్రకరూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
కదిరిటౌన్, జూన్ 6: పట్టణ శివార్లలోని పిల్ల కాలనీకి చెందిన భాస్కర్ అనే బీటెక్ విద్యార్థి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని మర్తహళ్లి వద్ద బుధవారం రోడ్డు దాటుతుండగా వాటర్‌ట్యాంక్ వాహనం ఢీకొని మృతి చెందినట్లు కాలనీవాసులు పేర్కొన్నారు. భాస్కర్ తండ్రి క్షౌరవృత్తి చేస్తూ తమ కుమారున్ని చదవించేందుకు రూ. 5లక్షల దాకా అప్పుచేయడం జరిగిందన్నారు. భాస్కర్ మృతి చెందడం వల్ల అతని కుటుంబం దయనీయ స్థితిలో వుందని, ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని కాలనీవాసులు కోరారు.
విద్యుదాఘాతంతో నేతన్న మృతి
ధర్మవరం, జూన్ 6: మగ్గం నుండి తయారైన చీరను తీసుకొని బయటకు వస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో శివానగర్‌కు చెందిన పోతులయ్య (27) అనే నేత కార్మికుడు మృతి చెందాడు. షాక్ తగిలిన వెంటనే అతనిని 108లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ రామచంద్రారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
చెనే్నకొత్తపల్లి, జూన్ 6: పెళ్లి ఊరేగింపులో గాయపడి చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన గురువారం దామాజిపల్లిలో జరిగింది. గత నెల 24న గ్రామంలో జరుగుతున్న పెళ్లి ఉరేగింపులో జరిగిన ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చికిత్స పొందుతూ వడ్డే ముత్యాలమ్మ (45) అనంతపురం ఆసుపత్రిలో మృతి చెందింది.
మహిళ ఆత్మహత్యాయత్నం
ధర్మవరం, జూన్ 6: స్థానిక మార్కెట్ వీధికి చెందిన చిన్నసుంకమ్మ కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి గురువారం పాల్పడింది. వివరాలు ఇలా వున్నాయి. నారాయణ స్వామి, భార్య సుంకమ్మ ఇరువురు కలసి గాజుల వ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. ఇరువురి మధ్య కుంటుంబ కలహాలు రావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుంకమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
జూదరుల అరెస్టు
నంబులపూలకుంట, జూన్ 6: మండల పరిధిలోని బి. కొత్తపల్లి గ్రామంలో గురువారం జూదం ఆడుతున్న ఆరుమంది జూదరులను అదులోకి తీసుకున్నట్లు ఎస్సై లక్ష్మి పేర్కొన్నారు. గ్రామంలోని పీర్లచావడి సమీపంలో జూదరులు పేకాట ఆడుతున్న సమయంలో ఆరుమందిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 2200ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. జూదరులను నేడు రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు.
ఓబుళదేవరచెరువులో...
ఓబుళదేవరచెరువు: మండల పరిధిలోని పెద్దగుట్లపల్లి గ్రామశివార్లలో పేకాట ఆడుతున్న ఆరుమందిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కర్ణాటక, ఆంధ్రా సరిహద్దుల ప్రాంతాలలో భారీగా పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో మెరుపుదాడులు చేసి వీరిని పట్టుకున్నామన్నారు. వీరి వద్ద నుండి రూ.14 వేలను స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపరస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
హిందూపురంలో..
హిందూపురం రూరల్, జూన్ 6: హిందూపురం రూరల్ మండల పరిధిలోని నక్కలపల్లి వద్ద గురువారం సాయంత్రం 14 మందిని అరెస్టు చేసి వారి నుండి రూ.25,100 నగదు స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్సై చాంద్‌బాషా తెలిపారు. గ్రామంలో పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించి జూదరులను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులను శుక్రవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్సై చెప్పారు.

పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని
english title: 
poor

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>