కర్నూలు, జూన్ 6: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం చేపట్టిన ఆదర్శ కాలనీలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. కర్నూలు నగరం చుట్టూ నిర్మించిన అనేక కాలనీల్లో గృహ నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. వేలాది గృహాలు మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి. అంతో ఇంతో పూర్తయిన గృహాల్లో ఎవరూ నివాసం ఉండకపోవడంతో అసాంఘిక శక్తులకు నిలయంగా మారుతున్నాయి. నగరంలోని నిరుపేదల కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేసుకున్నా ఇంటిలో నివాసం ఉండటానికి వీలు కాకపోవడంతో వారి సొమ్ము కూడా మట్టిలో కలిసినట్లయింది. నగరంలోని నిరుపేదల కోసం నగరం చుట్టూ ఉన్న జగన్నాథగట్టు, పెద్దపాడు, వెంకాయపల్లె, పందిపాడు వంటి ప్రాంతాల్లో 2007 నుంచి 2012వ సంవత్సరం వరకూ సుమారు 32 వేల ఇంటి స్థలాలు, పక్కా గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా కాలనీల్లో మంజూరైన గృహాల్లో కేవలం 4,625 గృహాలు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇక రుణాలు మంజూరు చేసిన గృహాలు సుమారు 16 వేలు ఉండగా మరో 7 వేల ఇళ్ల నిర్మాణం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గృహ నిర్మాణం కోసం అవసరమైన రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 4,500 మంది ఉండగా వారికి ఇంత వరకూ ఏ విషయం చెప్పకపోవడం గమనార్హం. స్థలం మంజూరు చేసినా అవెక్కడున్నాయో చూపకపోవడం, ఆ స్థలాలకు రుణం కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య సుమారు 10 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఇంత వరకూ ఖర్చు పెట్టిన సొమ్ము, లబ్ధిదారులు సొంత నిధులతో నిర్మించుకున్న ఇంటిలో నివాసం ఉండటానికి అనేక మంది సిద్ధపడినా ఆయా కాలనీల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రహదారులు, మురుగు నీటిపారుదల, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తే తక్షణం అక్కడికి వెళ్లి నివాసం ఉంటామని నిరుపేదలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఆదర్శ కాలనీల్లో రాష్ట్రంలోనే అతి పెద్ద కాలనీగా పేరుగాంచిన జగన్నాథ గట్టుపై సుమారు 8 వేల ఇళ్ల నిర్మాణం చేపడితే అందులో 4వేలకు పైగా గృహాలను లబ్ధిబ్దిదారులు నిర్మించుకున్నారు. వారికి ప్రభుత్వం రాయితీ, రుణం రూపేణా ఇచ్చే సొమ్ము కూడా చెల్లించింది. ఆయా గృహాల్లో నివాసం ఉండటానికి లబ్ధిదారులు ఆసక్తిగా ఉన్నా వౌలిక సదుపాయాల లేమి కారణంగా ముందుకు రావవడం లేదు. వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించ తలపెట్టిన పక్కా గృహాలు ఇపుడు ఎందుకూ పనికి రానివిగా తయారయ్యాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆదర్శ కాలనీలపై దృష్టి సారించి వౌలిక సదుపాయాలను కల్పించి ఇతర సమస్యలను పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మంత్రులకు భద్రత పెంపు
* ఛత్తీస్‌గడ్ ఘటన నేపథ్యం..
కర్నూలు, జూన్ 6: ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో జిల్లా కు చెందిన ఇద్దరు మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్‌లకు ప్రభు త్వం భద్రత పెంచింది. అలాగే వారు పర్యటించే ప్రాంతంలో ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీపై మావోయిస్టులు విరుచుకుపడిన విషయం విదితమే. ఆ సంఘటన తరువాత కేంద్రం మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లోని ప్రముఖులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అంతేగాకుండా నగరాల్లో కూడా నక్సలైట్లు దాడులు చేసే అవకాశం ఉందని సూచించింది. దాంతో రాష్ట్రంలో పోలీసు అధికారులు చర్య లు తీసుకున్నారు. అయిదేళ్ల క్రితం మావోయిస్టులకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరాసు ప్రతాపరెడ్డికి భద్రతను రెట్టింపు చేశారు. నియోజకవర్గంలో పర్యటించే ముందు ఆయన పోలీసులకు తగిన వివరాలు తెలపాలని కూ డా కోరారు. ఆయన పర్యటించే ప్రాం తాల్లో ముందస్తు తనిఖీలతో పాటు ఆయనను కలవడానికి వచ్చే వారిని కూడా సోదా చేస్తున్నారు. అలాగే కర్నూలు నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిజి వెంకటేష్ విషయంలో కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని గతంలో కంటే భద్రతను పెంచారు. ఆయన పర్యటించే ప్రాంతాల్లో కూడా పోలీసులు సోదా లు నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రైతులు సకాలంలో విత్తనం వేసుకోవాలి
* మంత్రి ఏరాసు
వెలుగోడు, జూన్ 6: రైతులు సకాలంలో విత్తనం వేసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సూచించారు. తెలుగుగంగ కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించడానికి విశేష కృషి చేసిన మంత్రి ఏరాసును గురువారం మండల పరిధిలోని గుంతకందాల గ్రామంలో గ్రామకమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులందరూ ఏకాభిప్రాయంతో సకాలంలో పంటలు వేసుకుంటనే రబీ సీజన్‌లో సాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు నిజంగా అల్ప సంతోషులన్నారు. విదేశాల్లో రైతుల ఉత్పత్తి ధర కంటే వాటి అమ్మకం ధర అధికంగా వుండి రైతులకు లాభదాయకంగా వుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా రైతులకు అలాంటి గిట్టుబాటు అయ్యే వ్యవసాయ విధానం కోసం ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఉద్యోగికే పిల్లనిస్తున్నారని, పదెకరాలు రైతుకు పిల్లనివ్వమని పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ఈ ఏడాది రూ. 18 వేల కోట్ల పథకాలను అమలు చేయాలని సిఎం కిరణ్ దృఢ నిశ్చయంతో వున్నారన్నారు. బిసిలకు రూ. 1500 కోట్లతో వృత్తులకు సంబంధించిన పరికరాలు, వాటి అవసరం లేని వారికి రూ. 5 వేల సబ్సిడీతో రుణాలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్థులు మంత్రిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో తహశీల్దార్ విజయశ్రీ, ఎంపిడిఓ సాల్మన్, సిపిఎం నాయకులు యాదాటి నాగేంద్రుడు, మాజీసర్పంచ్ గాండ్ల శివన్న, నాయకుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
బడ్జెట్‌లో ఆర్‌యుకు మొండిచెయ్యి
* రూ. 5 కోట్లు మంజూరు
* విసి కృష్ణానాయక్
కర్నూలు స్పోర్ట్స్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ యూనివర్శిటీకి బడ్జెట్ కేటాయింపులో మొండిచెయ్యి చూపిందని, రూ. 16 కోట్ల ప్రతిపాదనలకు గానూ కేవలం రూ. 5 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని విసి కృష్ణానాయక్ తెలిపారు. స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో గురువారం విసి విలేఖరులతో మాట్లాడుతూ వర్శిటీతో పాటు ఏర్పడిన యూనివర్శిటీలకు ప్రభుత్వం రూ. 15 కోట్ల నిధులు కేటాయించందన్నారు. ఆర్‌యుకు నిధుల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్నారని మంత్రుల క్యాబినెట్ సబ్ కమిటీ ఈ అన్యాయాన్ని ప్రస్తావించినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయిందన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు వర్శిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్, రెగ్యులర్ ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతాయన్నారు. వర్శిటీని అభివృద్ధి చేసేందుకు 12 (బి), ప్లానింగ్ అండ్ మానిటరింగ్ బోర్డు కమిటీలు ఇప్పటికే సందర్శించారని, వారి నుంచి సానుకలంగా నివేదిక వస్తుందని విసి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి మహబుబ్‌నగర్ జిల్లా పర్యటనలో పాలమూరు వర్శిటీ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు బహిరంగంగా అక్కడి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల ప్రకటించారని, కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా ఆర్‌యు అభివృద్ధికి కావాల్సిన నిధుల మంజూరుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పాలమూరు వర్శిటీకి సంబంధించి స్థానిక ఎంపి కెసిఆర్ ఎంపి ల్యాడ్స్ కింద రూ. 50 లక్షలుమంజూరు చేశారని, కావున ఆర్‌యు అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. వర్శిటీ అభివృద్ధికి నిధుల కేటాయింపు కోసం జిల్లా ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వం వర్శిటీలో ఖాళీగా వున్న ప్రొఫెసర్, ఇతర పోస్టుల భర్తీకి గత మార్చి నెల 19వ తేదీ రోస్టర్‌ను ప్రక్రియను పూర్తి చేసిందని, ఏడాది చివరికి భర్తీ చేస్తామన్నారు. అలాగే పిజి సెట్ కౌనె్సలింగ్‌ను ఈ నెల 3వ వారంలో ప్రారంభించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. వర్శిటీని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అందరి సహకారం తీసుకుంటామని విసి తెలిపారు.
అబ్దుల్లాపురం రిజర్వాయర్ నిర్మాణం జరిగే ప్రసక్తేలేదు:మంత్రి ఏరాసు
వెలుగోడు, జూన్ 6: మండల పరిధిలోని అబ్దుల్లాపురం వద్ద రిజర్వాయర్ నిర్మాణం జరిగే ప్రసక్తే లేదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. గురువారం గుంతకందాలలో జరిగిన అభినందన సభలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అబ్దుల్లాపురం రిజర్వాయర్ వస్తే రెండు కార్లు పండే వేలాది ఎకరాలు నీటిలో మునిగిపోతాయని ఆందోళన చెందుతున్న రైతుల్లో మంత్రి ఏరాసు చేసిన ప్రకటన హర్షం నింపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రిజర్వాయర్ నిర్మా ణం గురించి గతంలో ప్రభుత్వం ఆలోచించిన మాట వాస్తవమేనని, అయితే బాగా పంటలు పండే వేలాది ఎకరాల భూములను, కొన్ని గ్రామాలను కోల్పోయి రిజర్వాయర్ నిర్మించడం వల్ల జరిగే నష్టమే ఎక్కువగా వుంటుందన్నారు. ఈ రిజర్వాయర్ వల్ల ప్రయోజనం పొందే ప్రాంతాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రిజర్వాయర్ వస్తుందని ఆందోళన చెందుతున్న అబ్దుల్లాపురం, గుంతకందాల, మద్దూరు, కృష్ణానగర్, వేంపెం ట, పెంచికలపల్లె గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకోదని మంత్రి స్పష్టం చేశారు.
రూ. 99 కే 9 రకాల కూరగాయలు
* నేడు లాంఛనంగా ప్రారంభించనున్న కలెక్టర్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జూన్ 6: పెరిగిన కూరగాయల ధరలను అదుపు చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా యంత్రంగా కేవలం రూ. 99 కే 9 రకాల కూరగాయలను ఈ నెల 7వ తేదీ నుండి స్థానిక సి.క్యాంపు రైతు బజారులో విక్రయించనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిలో టమోటా కిలో, ఉల్లిగడ్డలు కిలో, ఆళ్లగడ్డలు 1/2 కిలో, వంకాయలు 1/2 కిలో, బెండకాయలు 1/2 కిలో, దొండకాయలు 1/2 కిలో, పచ్చి మిరపకాయలు 1/4 కిలో, మునక్కాడలు-4, ఆకుకూరలు - 5 కట్టలు కలిపి కేవలం రూ. 99కే విక్రయించనున్నట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి విక్రయాలను లాంఛనంగా ప్రారంభిస్తారని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
వందకోట్లతో ఎస్‌ఎస్
ట్యాంకు నిర్మాణం
* మున్సిపల్ కమిషనర్ కృష్ణ
ఎమ్మిగనూరు, జూన్ 6 : పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందుకు వంద కోట్లతో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పినట్ల మున్సిపాల్ కమిషనర్ కృష్ణ గురువారం విలేఖరులకు తెలిపారు. స్థానిక గూడికల్ రోడ్డు లో 120 ఎకరాల్లో ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణ కార్యక్రమం చేపడుతామని ఈ ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మాణం అయితే 6 నెలల వరకు నీటిని ట్యాంకులో నిలువ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మున్సిపాల్ జనరల్ ఫండ్ నుండి కోటి 8లక్షలతో మైనార్టీ శివన్ననగర్ కాలనీలలో రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని మైనార్టీ కాలనీ నాలుగు రోడ్లు, మున్సిపాల్ జనరల్ ఫండ్ కింద మైనార్టీ కాలనీలో రూ. 6 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఏఎస్‌ఏ స్కీం కింద రూ. 23 లక్షలు మంజూరు చేశారని వాటితో ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద 6 బోర్లను మరమ్మతు చేయిస్తామని కమిషనర్ తెలిపారు.
అధికారులు సమన్వయంతో
పనిచేయాలి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
నంద్యాల రూరల్, జూన్ 6: ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చే యకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నియోజక వర్గం అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి సూచించారు. నంద్యాల ప్రథమనంది దేవస్థాన కల్యాణ మంటపంలో గురువారం వివిధ శాఖ ల అధికారులతో కలెక్టర్ ఇందిరమ్మ పచ్చతోరణం, ఇందిరమ్మ కలలు, హౌ సింగ్, కౌలురైతుల రుణాలు, ఉపాధి హామీ, సివిల్ సప్లై, రెవెన్యూ సదస్సు లు, విద్యా సంబరాలు తదితర వాటిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెన్షన్, తాగునీరు, పారిశుద్ధ్యం అప్రమత్తంగా లేని పక్షంలో పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం విద్యాసంబరాలులో భాగంగా బడిఈడు పిల్లల ను బడిలో చేర్పించడం, తెలుగు భాష ప్రాముఖ్యత, నియోజకవర్గంలో ఆర్‌విఎం పాఠశాలలు ఎన్ని పూర్తయ్యాయని అడిగి తెలుసుకున్నారు. అలాగే వాటి వివరాలు, పాఠశాల నేమ్ బోర్డులను తెలుగులో రాయాలని ఆదేశిం చారు. పాఠశాలలకు తాగునీటి వసతి కల్పించాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 13లోగా అన్ని పాఠశాలలకు యూనిఫాం పంపి ణీ చేయాలన్నారు. మండలంలో భూ సార పరీక్షలు చేయించి భూచేతన కార్యక్రమం ద్వారా 350 మంది రైతులకు శిక్షణ ఇస్తున్నామని నంద్యాల ఇన్‌చార్జీ ఎడి ఎకె చెన్నయ్య కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. నంద్యాల మండలం చాపిరేవుల పిహెచ్‌సిలో ఎన్ని కాన్పులు చేశారని, జననీ సురక్ష పథకం వివరాలు అడిగి తెలుసుకున్నా రు. 104 సర్వీసు గ్రామాల నివేదికను ఎంపిడిఓలు తనిఖీ చేయాలన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం నివేదికను ఈ నెల 10వ తేదీలోగా ఇవ్వాలన్నారు. 739 గ్రామైక్య సంఘాలకు రూ. 19.5 కోట్లు రుణాలు ఇచ్చినట్లు ఐకెపి అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సిఎస్‌పిలు గ్రామాల్లో ఇంటి వద్దకు వెళ్లి పెన్ష న్ ఇవ్వాలని, లేనిచో చర్యలు తప్ప వన్నారు. జూలై 1 నుంచి నగదు బదిలీ పథకాన్ని వర్తింపచేస్తున్నామని, ఎన్‌పిఆర్, ఆధార్ నంబర్లను త్వరగా సేకరించాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్ల వార్డెన్లు ముందుగా హాస్టల్‌కు వెళ్లి తాగునీరు తదితర సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఇం దిరమ్మ కలల నివేదికను జిల్లా కార్యాలయానికి అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ పథకం కింద పక్కా గృహాలు నిర్మించేందుకు ఎస్సీలకు రూ. లక్ష, ఎస్టీలకు రూ. 1.5 లక్షలు ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. మోడల్‌స్కూల్‌కు విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించా లని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిఇఓ సూర్యప్రకాష్, డిఆర్‌డిఎ పిడి నజీర్, సోషల్‌వెల్పేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, నంద్యాల ఆర్డీఓ శంకర్, డ్వామా పిడి హరినాథ్‌రెడ్డి, హౌసింగ్ ఇఇ సుధాకర్‌రెడ్డి, పిఆర్ ఇఇ సుబ్బారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ హరిరామనాయక్, హౌసింగ్‌పిడి రామసుబ్బు, డిప్యూటీ డిఇఓ తాహేరాసుల్తానా, ఎపిఓ సాంబశివరావు, సిడిపిఓ లీలావతి, తహశీల్దార్ శివరామిరెడ్డి, ఎంపిడిఓ ప్రజ్యోత్ కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సిఎం కిరణ్ గురించి
డిఎల్ చెప్పింది వాస్తవమే..
* టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కెఇ
కల్లూరు, జూన్ 6: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పేదంతా వాస్తవమేనని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం కిరణ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే వివిధ పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం సిఎం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా వుందని ఇక సంక్షేమ పథకాల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారడం తథ్యమన్నారు. మంత్రులకు తెలియకుండా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే ఏకైక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే అన్నారు. పేదలకు అందిస్తున్న అమ్మహస్తం పథకం ఏవిధంగా మారిందో ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. 9 రకాల వస్తువులకు బదులుగా నాసిరకం వస్తువులను ప్రజలకు తగలగడుతున్నారని, పేద ప్రజల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రవేశ పెట్టేటప్పుడు డిప్యూటీ సిఎం లేకుండా పథకాన్ని ప్రవేశపెట్టారంటే దళితులపై ఏమాత్రం ప్రేమ వుందో అర్థమవుతుందన్నారు. రైతుల రుణాలకు వడ్డీ చెల్లించవద్దని చెబుతున్న సిఎం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాయకులు సుబ్బరాయుడు, ఆకెపోగు ప్రభాకర్, శ్రీనివాసులు, పర్వేజ్, హనుమంతరాయచౌదరి, చక్రపాణి, రవి పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను
సద్వినియోగం చేసుకోండి
* ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కర్నూలుటౌన్, జూన్ 6: గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామంలో గురువారం ఎపిఓ రాజారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే కాటసాని ముఖ్య అతిథిగా హాజరై ఉపాధి మేట్‌లకు గుడారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ నిరుపేదలు వలస వెళ్లకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే కూలీలకు పనిముట్లు, వైద్యం, బీమా తదితర సౌకర్యాలు ప్రవేశపెట్టిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనికి తగ్గట్లు వేతనం రాకున్నా, పనుల్లో అవినీతికి పాల్పడినా వెంటనే అధికారులకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తారన్నారు. రెండు వారాల క్రితం వడదెబ్బతో మృతిచెందిన ఉపాధి కూలీ కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తానన్ని, వారి పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించేందకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎపిడి లక్ష్మన్న మాట్లాడుతూ పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అనేక పోరాటాలు చేయడంతోనే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి పనులు కల్పిస్తున్నారన్నారు. మండలంలో మెట్టమొదటిసారి గుడారాలను పంపిణీ చేస్తున్నామని, వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివరాయుడు, ఎంపిడిఓ అన్వర్‌బేగం, నాయకులు కె.్ధనుంజయ్య, రేవంత్, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు ప్రసాద్, లక్ష్మీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్‌లు, ప్రజలు పాల్గొన్నారు.
చెన్నైకి వెళ్లిన పీఠాధిపతి మహాదేశికన్
ఆళ్లగడ్డ, జూన్ 6: అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ గురువారం స్వామికి పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను ఆశీర్వదించి మధ్యాహ్నం చెన్నైకి బయల్దేరారు. పట్ట్భాషిక్తుడైన జియ్యర్ స్వామి మొట్టమొదటిసారిగా అహోబిలం వచ్చి రెండు రోజుల పాటు లక్ష్మీనరసింహస్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అలాగే ఎగువ అహోబిలం గిరులపై కొలువైన శ్రీ మాలోలా, వరాహ నరసింహ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. మార్గమధ్యలో వున్న అత్తా కోడళ్ల మండపాన్ని పరిశీలించి, కారంజ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజర్ బివి నరసయ్య, ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చకులు, ఆళ్లగడ్డ జూనియర్ సివిల్ జడ్జి శేషాద్రి, ఆలయ సిబ్బంది జియ్యర్‌స్వామి ఆశీస్సులు పొందారు. అనంతరం జియ్యర్ స్వామి చెన్నైకి బయల్దేరి వెళ్లారు.