ఒంగోలు, జూన్ 6: బడిగంట మోగే సమయం దగ్గర పడుతుండటంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల హడావుడి జిల్లాలో పెరిగిపోయింది. తమ పాఠశాలల్లో చేరితే ఉత్తమ ఫలితాలు వస్తాయంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఊదరగొట్టే పనిలో యాజమాన్యాలు నిమగ్నమయ్యాయి. గత నెల రోజుల నుండి జిల్లావ్యాప్తంగా ఇదే తంతు సాగుతోంది. ప్రధానంగా టెక్నో స్కూళ్ల పేరుతో విద్యార్థులను యాజమాన్యాలు ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. తీరా చేరిన తరువాత విద్యార్థులకు కనీస వసతులు కూడా ఉండని పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. డిగ్రీ చదివే విద్యార్థి కంటే ఎల్‌కెజి చదివే విద్యార్థులకే ఫీజులను అధికంగా వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పీల్చుకుతింటున్నారు. ప్రస్తుతం జిల్లాలో విద్య, వైద్యం వ్యాపారంగా మారిపోయాయి. ప్రతి తల్లితండ్రి తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో లక్షల రూపాయలను విద్యకు వెచ్చిస్తున్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు తాము చెప్పిన ఫీజులనే కట్టాలంటూ షరతులను విధిస్తున్నాయి. జిల్లాలోని ఒక్కో ప్రైవేటు పాఠశాల వివిధ రకాలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. కాని ఫీజులను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా 207 గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఆ మేరకు సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో కూడా పెట్టారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకోవాలని ఆదేశాలు జారీచేయటం తూతూమంత్రంగానే జరుగుతోంది. తీరా విద్యాసంవత్సరం ప్రారంభమైన తరువాత వాటి గురించి జిల్లా విద్యాశాఖాధికారులు పట్టించుకోకపోవటం పరిపాటిగానే మిగులుతోంది. జిల్లావ్యాప్తంగా ఎక్కువగా ఒంగోలు నగరంలో 28, దర్శిలో 17, చీరాల, పామూరుల్లో 12, మార్కాపురం, వేటపాలెం మండలాల్లో పది చొప్పున, చీమకుర్తిలో 7, కొత్తపట్నంలో 9, శింగరాయకొండలో నాలుగు, అద్దంకిలో మూడు ప్రైవేటు పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖాధికారులే ప్రకటించారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వపరంగా 3067 ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలు, 508 అప్పర్‌ప్రైమరీ పాఠశాలలు, 612 హైస్కూళ్లు ఉన్నాయి. ప్రైమరీ పాఠశాల్లో 2.26 లక్షల మంది, అప్పర్‌ప్రైమరీ పాఠశాలల్లో 86 వేల మంది, హైస్కూళ్లల్లో లక్షా 95 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాని ప్రభుత్వపరంగా నాణ్యమైన విద్యనందించడం లేదన్న ఆరోపణలతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ పేద, మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఇష్టపడని పరిస్థితులు జిల్లాలో నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఆకర్షించేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ పథకాలు బూడిదలో పోసిన పన్నీరులాగానే మిగిలిపోతున్నాయి. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుచెప్పే గురువులు గ్రామాల్లోనే నివాసం ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. ఆనాడు గురువులు విద్యార్థులతో కలసిపోయారన్న నానుడి ఉండేది. రానురాను ఆ సంబంధాలు తెరమరుగయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని మూడు వంతుల మంది ఉపాధ్యాయులు పట్టణాలకే పరిమితవౌతూ బడి చివరిగంట మోగగానే ఆర్‌టిసి బస్సును వెతుక్కునే పనిలో నిమగ్నవౌతున్నారు. దీంతో కూడా విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్నప్పటికీ జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం వౌనముద్రలో ఉండటం గమనార్హం.
ఖరీఫ్‌పై కోటి ఆశలు
నాణ్యమైన విత్తనాలు, ఎరువుల కోసం రైతన్న ఎదురుచూపు
కందుకూరు, జూన్ 6: నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. ఈఏడాది తొలకరి ముందే పలకరిస్తుందన్న వాతావరణ ప్రకటన రైతన్నలో కొత్త ఉత్సాహం నింపుతుంది. పొలాలన్ని దున్ని విత్తనం వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు ఖరీఫ్‌పై కొంత ఆశ పెట్టుకున్నారు. నాణ్యమైన విత్తనాలు, సమృద్ధిగా ఎరువులు, పెట్టుబడుల కోసం పంట రుణాలు కావాల్సిన ఆదరువులు వీటన్నింటిపైన నిర్ధిష్ట కార్యాచరణలు ముందుడగు వేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయంగా తయారు చేసుకోలేక రైతుల వద్ద నిల్వ ఉన్న విత్తనాన్ని సకాలంలో సేకరించక ఏటా వ్యవసాయశాఖ ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థలు ఖరీఫ్ అవసరాలను తీర్చలేకపోతున్నాయి. రబీ పంటకాలం పూర్తి అయిన వెంటనే విత్తనసేకరణ జరిపి తొలకరిలో సాగుకు రైతులకు అందజేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గత ఏడాది లెక్కలనే తిరగరాస్తూ అదే అంచనాలను తెరమీదికి తీసుకొస్తున్నారు. రైతు చైతన్యయాత్రలలో అన్ని చెప్పామని, అన్నదాతలకు అవగాహన కల్పించామంటూ వ్యవసాయ అధికారులు చెప్పుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడం లేదు. వర్షం వచ్చాక గొడుగు కొందామన్న చందంగా విత్తనాభివృద్ధిసంస్థ వ్యవహరిస్తుంది. తీరాసాగు ముమ్మరంగా మొదలైన తరువాత విత్తనాల సేకరణ జరిపి పంపిణీ చేయడం వలన సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఖరీఫ్‌లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వర్షం కురిస్తే రైతులు తొలకరి పంటలకు అన్నిరకాల విత్తనాలను సిద్ధం చేసి ఉంచామని ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. గత ఏడాది రైతులకు పలు చేదు అనుభవాలు ఎదురైనా ఈసారైనా అధికారులలో ముందస్తు వ్యూహంతో పనిచేస్తున్నారో లేదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. రబీలో గిద్దలూరు ప్రాంతంలో సరఫరా చేసిన శనగ విత్తనాలు పుచ్చులు రావడంతో తిరిగి వెనక్కు పంపారు. ఇంకొల్లు ప్రాంతంలో పంపిణీ చేసిన మినుము విత్తనాలు, తాళ్లూరు ప్రాంతంలో పంపిణీ చేసిన వరి విత్తనాలు నాణ్యత లోపం కారణంగా రైతులు నష్టపోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రైతుకు సంబంధిత కంపెనీల నుంచి నష్టపరిహారం కూడా అందడం లేదు. జిల్లాలో ఖరీఫ్ కాలం మొదలైంది. అయితే వర్షాలు సక్రమంగా కురవకపోతే జూలై నుంచి ఖరీఫ్ పంటలు సాగవుతాయి. వర్షం కురిస్తే రైతులు తొలకరిపంటగా నువ్వు, సజ్జ సాగు చేస్తారు. పశ్చిమ ప్రాంతంలో సజ్జ ఎక్కువగా సాగవుతుంది. కంది, పత్తి, జీలుగు, పిల్లిపెసర, ఆముదం విత్తనాలు అవసరం. జిల్లాలో 13,708హెక్టార్ల విస్తీర్ణంలో నువ్వు సాగవుతుంది. రైతులకు అవసరమైన విత్తనం ఇంకా మండల కేంద్రాలకు చేరలేదు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి జిల్లాలో స్వయంగా రైతులచేత పంటలు సాగు చేయించి, వారి పర్యవేక్షణలో నాణ్యతగల విత్తనాలను తయారుచేసి పంపిణీ చేయాలి. కాగా జిల్లాలో ఈపథకం ఆశించిన స్థాయిలో జరగడంలేదు. విత్తనాభివృద్ధి సంస్థ 525క్వింటాళ్ళు కాగ్-4రకం వేరుశనగ విత్తనాలను ఇప్పటి వరకు సేకరించింది. ఇవి కాక ఈఏడాది 60వేల హెక్టార్లలో కంది సాగు చేసే అవకాశాలు ఉన్నాయి. 3,350క్వింటాళ్ళు ఎల్‌ఆర్‌జి-41రకం విత్తనాలు సిద్ధ చేసినట్లు తెలిసింది. పత్తి జిల్లాలో 4.51లక్షల ప్యాకెట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 1,36,551ప్యాకెట్లు వచ్చాయి. అలాగే సజ్జ, ఆముదం సంబంధించి కూడా జిల్లాకు 420క్వింటాళ్ళు అవసరం అయితే ఆముదం విత్తనాలు 300క్వింటాళ్ళు అవసరం అని ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. అయితే ఇంకా రాలేదు. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 3,30,774హెక్టార్లలో సాగవుతుంది. దీనికోసం 18,310క్వింటాళ్ళ విత్తనం అవసరం అని అంచనా వేశారు. ఖరీఫ్‌లో అవసరమైన విత్తనాలను సిద్ధం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధిసంస్థ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌కు సరిపడ ఎరువులను కూడా తెప్పిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. జీలుగు, పిల్లిపెసర విత్తనాలను 2వేల క్వింటాళ్ళు సిద్ధం చేశామని అంటున్నారు. ఏది ఏమైనా ఖరీఫ్ పంటలకు సరిపడ విత్తనాలు, ఎరువులు వస్తాయో లేదోనని ఆందోళనలో రైతాంగం ఉంది.
వ్యక్తిగత మరుగుదొడ్లకు చెల్లింపులు
యుద్ధప్రాతిపదికన జరగాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు, జూన్ 6: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి నగదు చెల్లింపులు యుద్ధప్రాతిపదికన జరగాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేషన్ అధికారుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 36 కోట్ల రూపాయల మేర ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఫినో కంపెనీ అధికారులతో సమీక్షించుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు నగదు చెల్లింపులు జాప్యం కారణంగా ఇతరులు ముందుకురావటం లేదని, పనులు పురోగతిలోకి రావటం లేదని గుర్తించామన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో మొదటి దశ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు అంచనాలు తప్పుగా తయారుచేసేందుకు ఇందిరాక్రాంతి పథం ఎపిఒ, డ్వామా ఎపిడిలు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యులను చేయాల్సిందిగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏదోఒక కారణం చెప్పి పనయిపోయిందనే పద్ధతులను విడిచిపెట్టాలన్నారు. పనులు చేసి చూపించాలన్నారు. ఐదు రోజుల్లో పూర్తిచేసే పనులు ఐదు సంవత్సరాల ప్రాజెక్టుల్లా కాలయాపన చేస్తున్నారన్నారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు మొదటిదశలో 80 శాతం గ్రౌండింగ్ పూర్తయిందన్నారు. కాని నగదు చెల్లింపులు కంప్యూటర్‌లో 80 శాతం జనరేట్ కాలేదన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చెల్లింపులు కంప్యూటర్ విధానానికి దేశంలో గొప్పపేరు ఉందన్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరిగే విధానాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. కిందిస్థాయి అధికారులు చెప్పే మాటలు మాకు చెప్పే కొరియర్ సర్వీసు ఉద్యోగాలు చేయవద్దని అధికారులను హెచ్చరించారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై అధికారులపై తక్షణమే స్పందించాలన్నారు. మరమ్మతులకు గురైన తాగునీటి ఆర్‌ఒ ప్లాంట్ల మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తాగునీటి వనరులు అందుబాటులో లేనిచోట ట్యాంకర్ల ద్వారా తాగునీరు ప్రజలకు సరఫరా చేయాలన్నారు. తాగునీటి ట్యాంకర్ల రవాణాపై ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థలో తాగునీటి సరఫరా సక్రమంగా అందించటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఏవేవో చెబితే తాగునీటి సమస్యలు గురించి అధికారులు తెలుసుకునే విధానం మంచి పద్ధతి కాదని కమిషనర్, మునిసిపల్ ఇంజనీర్లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా పేర్నమిట్ట చెరువును సమ్మర్ సోరేజీ ట్యాంకుగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలురోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్ స్తంభాల నిర్మాణ పనులు వేగంగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో సిపిఒ కెటి వెంకయ్య, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎం రాజు, డ్వామా పిడి పోలప్ప తదితరులు పాల్గొన్నారు.
గడప గడపకు వైఎస్‌ఆర్, ఇంటింటికి దారా
ఒంగోలు , జూన్ 6 : గడప గడపకు వైఎస్‌ఆర్, ఇంటింటికి దారా సాంబయ్య కార్యక్రమాన్ని ఈనెల 10వ తేదీన నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం నుండి ప్రారంభిస్తున్నట్లు సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎస్‌ఎన్ పాడు ఇన్‌చార్జి దారా సాంబయ్య తెలిపారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఈనెల 10వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని రైతులకు కనీస మద్దతు ధరలు, పెన్షన్లు, అమ్మఒడి , బెల్టుషాపుల రద్దు, రైతు నిధి తదితర పథకాలపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్ఫలితాలపై నాటికలు, కళాజాతాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. గుడిసెలు మేల్కొన్నాయ్ అనే నాటికను ప్రత్యేకంగా అన్ని గ్రామాల్లో ప్రదర్శిస్తున్నట్లు వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం గత 10 సంవత్సరాల నుండి తన పోరాట ఫలితంగానే వచ్చిందన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కెవిపి రామచంద్రరావు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉప ప్రణాళికపై చర్చించి ఎస్సీ, ఎస్టీలకు ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఎన్నోసార్లు విన్నవిస్తే స్పందించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనను ప్రత్యేకంగా మహారాష్టక్రు పంపారన్నారు. మహారాష్టల్రో ఉప ప్రణాళిక అమలు జరుగుతున్న తీరుతెన్నులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. ఆ తరువాత ఎన్నికలు, వైఎస్ మరణం తరువాత ఉప ప్రణాళిక మూలనపడిందన్నారు. అప్పటి నుండి కేంద్రంలో 4 లక్షల కోట్లు, రాష్ట్రంలో 22 వేల 500 కోట్ల రూపాయలు సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్ళాయన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మద్యపానాన్ని నిషేధిస్తే చంద్రబాబు నాయుడు తలుపులు తెరిచారన్నారు. వ్యక్తిగతంగా ఆరు సీసాలు ఇంట్లో ఉండవచ్చని జీవో కూడా ఉందన్నారు. ముందుగా వాటిని నిషేధించగలిగితే బెల్టుషాపులు కూడా పూర్తిగా రద్దు అవుతాయన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇటీవల తమ పార్టీ ఇద్దరిని సమన్వయకర్తలుగా నియమించిందన్నారు. ప్రస్తుతం వాటిని రద్దు చేశారని, తాను నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న గడపగడపకు వైఎస్‌ఆర్, ఇంటింటికి దారా సాంబయ్య అనే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
త్వరలో ఒంగోలులో ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాలు
ఒంగోలు అర్బన్, జూన్ 6:త్వరలో ఒంగోలులో ప్రథమాంధ మహాసభ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వక్తలు పేర్కొన్నారు. ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది రాష్ట్ర ప్రచార వేదిక, పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలను గురువారం స్థానిక ఎకెవికె జూనియర్ కళాశాలలో ఆవిష్కరించి ప్రదర్శన చేపట్టారు. ప్రధమాంథ్ర మహాసభ నుండి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు నూరేళ్ల ప్రస్థానం (1913-2013 ) అనే అంశంపై జిల్లాలోని వివిధ అధ్యాపక సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసమావేశానికి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కెపి రంగనాయకులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రచార కార్యదర్శి కోటా వెంకటేశ్వరెడ్డి మాట్లాడుతూ నేటితరం విద్యార్థులకు 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ గురించి ఆంధ్ర మహాసభలు, ఆంధ్రోద్యమం గురించి తెలియదన్నారు. కళాశాలల్లో ఆంధ్ర చరిత్ర ఒక సబ్జెక్టుగా బోధించడం లేదన్నారు. తెలుగు వారి చారిత్రక విజ్ఞానం, తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సంస్కృతులు, చారిత్రక ఔన్నత్యాల గురించి అంతగా తెలిసే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యాపక సంఘాలు, మేధావులు, విద్యావేత్తల సహకారంతో సమాజంలో చైతన్యం కోసం ప్రధమాంధ్ర మహాసభ నుండి నూరేళ్ల ప్రస్థానం అనే అంశంపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించినట్లు చెప్పారు. గత నెల 24, 25, 26 తేదీల్లో బాపట్లలో శతాబ్ది ఉత్సవాలు జరిగాయన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాలో మహాసభలు జరిపే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎయిడెడ్ జూనియర్ కళాశాలల సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షులు విఎల్‌పి రాజు, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కె సురేష్ , ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం జిల్లా కార్యదర్శి ఎస్ సత్యనారాయణ, పి లక్ష్మిప్రసాద్, ఎ సూర్య నారాయణ, సిహెచ్ బాబూరావు, ఎస్‌కె కరీముల్లా, జె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
‘బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలి’
చీరాల, జూన్ 6: బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని, జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని తదితర డిమాండ్‌లతో యాదవ చైతన్య యాత్ర నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ చీరాల నియోజకవర్గం ఆధ్వర్యంలో గురువారం మండలంలోని దేవినూతల గ్రామం నుంచి బయలుదేరిన చైతన్యయాత్ర గవినివారిపాలెం, పుల్లాయపాలెం, బోయినవారిపాలెం, ఈపూరుపాలెం, బుర్లవారిపాలెంతో ముగిసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చట్టసభలలో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బిసి ఉద్యోగాలలో రిజర్వేషన్‌లు వర్తింపు, బిసిల అభివృద్ధికి ప్రత్యేక పారిశ్రామిక విధానం, జిల్లాలో దామాషాప్రకారం 25వేల పైన ఉన్న యాదవ జనాభా కలిగిన అన్ని నియోజకవర్గాలలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే అసెంబ్లీ టిక్కెట్‌లు కేటాయించాలని, బిసి అభ్యర్ధిని ముఖ్యమంత్రిగా చేయాలని పలు డిమాండ్‌లు చేశారు. కార్యక్రమంలో పెరుగు భాస్కర్, ఆంజనేయ మూర్తి, తాడిబోయిన లక్ష్మీప్రసాద్, బుర్ల రాము, రమణయ్య, పిట్టు నాగభూషణం, కర్నేటి నాగమల్లేశ్వరరావు, హరికృష్ణ, బుర్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
50 బస్తాల బియ్యం పట్టివేత
వేటపాలెం, జూన్ 6: మండలంలోని చల్లారెడ్డిపాలెం గ్రామంలో గురువారం తెల్లవారుఝామున ప్రజాపంపిణీకి చెందిన 50 బస్తాల బియ్యం గ్రామ శివారు ప్రాంతంలో స్ధానికులు గమనించి ఎస్‌ఐ అంకబాబుకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు వచ్చి ఎడారి ప్రాంతంలో ఉన్న 50 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్‌తో పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇదేవిధంగా మే నెలలో మార్కెట్ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉన్న 25 బస్తాల బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో అక్రమంగా బియ్యం, కిరోసిన్ తరలిపోతున్నా స్థానిక అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టుకున్న వారిపై 6ఎ కేసు నమోదుచేసి తమ పని అయిపోయినట్లు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. చల్లారెడ్డిపాలెంలో దొరికిన బియ్యం ఎక్కడనుంచి వచ్చాయనే కోణంలో రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రామంలోని డిపోలను తనిఖీలు చేయగా సంబంధిత స్టాకు రిజిస్టర్‌లు సక్రమంగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ బియ్యం ఎక్కడనుంచి ఇక్కడకు తరలించారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
రామాయపట్నం పోర్టు ఏర్పాటులో
మంత్రికి సహకరిస్తాం : దివి
కందుకూరు, జూన్ 6: రామాయపట్నం పోర్టు మంజూరు ప్రక్రియలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం పేర్కొన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో శివరాం మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాజకీయ పార్టీ నాయకుల పైరవీలతో పోర్టు నెల్లూరు జిల్లా దుగరాజపట్నానికి తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి నియోజకవర్గం, జిల్లా పరిధిలోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి పోర్టు మంజూరుకు కృషి చేయాలని ఆయన కోరారు.
నియోజకవర్గాన్ని వెంటాడుతున్న తాగునీటి సమస్య
నియోజకవర్గంలో అన్ని మండలాల పరిధిలో తాగునీటి సమస్య ప్రజలను వెంటాడుతోందని శివరాం అన్నారు. ఒక్క కందుకూరు పట్టణం మినహాయించి అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారని ఆయన అన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు ఎందుకు నిర్వీర్యం అవుతున్నాయో అంతుచిక్కడం లేదన్నారు. గుడ్లూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నాయకుల అభీష్టం మేరకే నీటి సరఫరా జరుగుతోందని ఆప్రాంత వాసులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టణంలో ఉన్న వంద పడకల వైద్యశాలకు పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బంది లేక ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి వైద్యులు, సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమెరికాలో ఆంధ్ర అవినీతి అసమర్థ పాలనపై చర్చ
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అవినీతి, అసమర్థ పాలనపై చర్చ జరుగుతున్నట్లు శివరాం వెల్లడించారు. నెలరోజుల పాటు తాను అమెరికాలో ప్రవాసాంధ్రుల సభలలో, తానా సభలలో పాల్గొన్నానని తెలిపారు. ఈక్రమంలో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రవాసాంధ్రులు మన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అసమర్థ పాలనపై చర్చించుకోవడం విశేషం అన్నారు. మరలా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతుందనే అభిప్రాయాన్ని ప్రవాసాంధ్రులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈసమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తలపనేని వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వంశీ, ఉపాధ్యక్షుడు గోరంట్ల బ్రహ్మయ్య, టిడిపి నాయకులు మాధవ, రవి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
29న బిసి ఓటర్ల తుది జాబితా ప్రచురణ
మున్సిపల్ కమిషనర్ స్పష్టం
కందుకూరు, జూన్ 6: మున్సిపాలిటీ పరిధిలోని బిసి ఓటర్ల తుది జాబితా ఈనెల 29వ తేదీన ప్రచురించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఫల్గుణకుమార్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పరిధిలో ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయపార్టీల పట్టణ అధ్యక్షులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశానుసారం పట్టణంలో ఈనెల 1నుంచి బిసి ఓటర్ల గుర్తింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. 11న ముసాయిదా బిసి ఓటర్ల జాబితా ప్రచురించనున్నామని, 12నుంచి 15వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించనున్నామని తెలిపారు. ఫిర్యాదులు, అభ్యంతరాలు ఏ వ్యక్తి చేస్తున్నారో ఆవ్యక్తిమాత్రమే దరఖాస్తు ఇవ్వాలని, గుత్తగా వస్తే దరఖాస్తులు స్వీకరించబడవని అన్నారు. 22వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలపై విచారణ జరుగుతుందని, 29న తుది జాబితా ప్రచురించబడుతుందని ఆయన తెలిపారు. రాజకీయపార్టీ నాయకులు సర్వే బృందాలు ఆయా వార్డులకు వచ్చిన సందర్భాలలో తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు కమిషనర్‌కు వివరించారు. ఈసమావేశానికి టిడిపి పట్టణ అధ్యక్షుడు తలపనేని వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎస్‌కె ఖాదర్‌బాషా, బిజెపి పట్టణ అధ్యక్షుడు జె రాఘవులు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్‌కె గౌస్‌బాషా, సిపిఐ నాయకులు బి సురేష్‌బాబు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యం పట్టివేత
శింగరాయకొండ, జూన్ 6: అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల బియ్యాన్ని గురువారం ఉదయం జాతీయ రహదారిపై శింగరాయకొండ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒంగోలు నుండి కావలి వైపు వెళ్తున్న లారీలో 200 బస్తాల బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు జాతీయ రహదారిపై జివిఆర్ ఫ్యాక్టరీ సమపంలో లారీని స్వాధీన పరుచుకున్నారు. స్వాధీన పరుచుకున్న లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి ఎన్‌ఫోర్స్ డిటి సుబ్బారావుకు స్వాధీన పరచనున్నట్లు ఎఎస్సై బాషా తెలిపారు. ఈ బియ్యం ప్రజాపంపిణీ బియ్యంగా అనుమానం రావడంతో పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ అధికారులకు పంపనున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటి సుబ్బారావు తెలిపారు.
పొంగిన దొంగల వాగు
నిల్చిపోయిన వాహనాలు
పెద్దదోర్నాల, జూన్ 6: మండలంలోని కొత్తూరు గ్రామం వద్ద వెలుగొండ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న దొంగలవాగు బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పొంగి ప్రవహించటంతో కర్నూలు, గుంటూరు వెళ్ళే వాహనాలు గురువారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు నిల్చిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నల్లమల అటవీప్రాంతంలో కురిసిన వర్షానికి గంటవానిపల్లె గ్రామం వద్దవున్న చప్టాపై నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గంటవానిపల్లె గ్రామానికి చెందిన ఒక గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుండటంతో గ్రామంలోని కొందరు యువకులు చెట్టుకు తాళ్లు కట్టి తాళ్ల సహాయంతో ఆమెను చప్టాను దాటించి దోర్నాల ఆస్పత్రికి తరలించారు. చప్టాపై నీరు ఎక్కువగా ప్రవహించటంతో వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం పనులకు వెళ్ళే కార్మికులు నిల్చిపోయారు. దీంతో మొదటి సొరంగం పనులు చేస్తున్న ఎన్‌ఎస్‌ఇ ప్రతినిధి రామ్మోహనరావు జెసిబితో సంఘటనా స్థలానికి చేరుకొని చప్టాపై అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించటంతో కొంతమేరకు అంతరాయం తొలగింది. సుమారు రెండు గంటల పాటు బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గంటవానిపల్లి వద్ద ఉన్న చప్టా ప్రదేశంలో బ్రిడ్జి నిర్మించాలని, అదే విధంగా కొత్తూరు సమీపంలో ఉన్న దొంగలవాగు సమీపంలో ఉన్న చప్టాపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.