చిలకలూరిపేట, జూన్ 6: పట్టణంలోని పండరీపురంలో గల బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. కార్యాలయంలో మామూళ్లు ఇస్తేనే లైసెన్స్‌లు, వెహికల్ నెంబర్లను ఇస్తున్నారని బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఎసిబి డిఎస్‌పి నరసింహారావు తెలిపారు. కార్యాలయంలో ఉన్న ఏజెంట్ల నుండి 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామన్నారు. రికార్డులను కూడా స్వాధీనం చేసుకుని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారుల సమాచారాన్ని అందిస్తే దాడులు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
హత్యకేసు ముద్దాయలకు
జీవిత ఖైదు, జరిమానా
నరసరావుపేట, జూన్ 6: మండలంలోని ఇక్కుర్రు గ్రామానికి చెందిన గుంటి కోటేశ్వరరావును హతమార్చిన కేసులో యర్రగుంట్ల ఇజ్రాయేలు, యర్రగుంట్ల గాబ్రియేలుకు జీవిత ఖైదు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ జిల్లా న్యాయమూర్తి బి శ్యాంసుందర్ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం మండలంలోని ఇక్కుర్రుగ్రామానికి చెందిన గుంటి కోటేశ్వరరావు పెంచుకున్న కుమార్తెను యర్రగుంట్ల ఇజ్రాయేలు మాయమాటలతో మోసంచేసి, ఆమెను నిర్మల పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఇందుకు గాబ్రియేలు వారికి సహకరించాడు. దీంతో గ్రామంలోని పెద్దలు ఇజ్రాయేలు, గాబ్రియేలును పిలిచి పెద్ద సమక్షంలో రాజీ కుదిర్చారు. అయితే ఇజ్రాయేలు కోటేశ్వరరావు కుమార్తెను తీసుకువెళ్ళడంతో మనస్థాపానికి గురై కోటేశ్వరరావు పెద్దల సమక్షంలో వారిని దోషులుగా నిలబెట్టడంతో ఇజ్రాయేలు, గాబ్రియేలు తీవ్ర మనస్థాపం చెంది 2008 మే ఏడో తేదీన కోటేశ్వరరావును గొడ్డళ్ళతో నరికి, రాళ్ళతో కొట్టి హతమార్చారు. ఈ మేరకు అప్పటి రూరల్ సిఐ ఎంవి సుబ్బారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసుకు జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేశిరెడ్డి మల్లారెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. ఈ కేసులో వారిద్దరికి జీవిత ఖై దు, వెయ్యి రూపాయల జరిమానా న్యాయమూర్తి విధించారు. ఇజ్రాయేలు కు సహకరించిన గాబ్రియేలుకు మరో మూడు నెలల జైలు శిక్ష విధించారు.
వ్యవసాయ, పాడి రంగాల
అభివృద్ధితోనే దేశం సుభిక్షం
* కలెక్టర్ సురేష్‌కుమార్
చేబ్రోలు, జూన్ 6: దేశం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ అన్నారు. గురువారం చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో ఆవరణలో ఏర్పాటు చేసిన నేషనల్ డెయిరీ ప్లాన్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ సురేష్‌కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పాడి పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కువ శాతం మంది రైతులు ఈ రెండు రంగాలపైనే ఆధారపడి ఉన్నారన్నారు. పాడి పరిశ్రమాభివృద్ధిలో జాతీయ పాడిపరిశ్రమల అభివృద్ధి సంస్థ పాత్ర చాలా ముఖ్యమైందన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా నేషనల్ డెయిరీ ప్లాన్‌ను సంగం డెయిరీలో ప్రారంభించుకోవడం హర్షదాయకమన్నారు. డెయిరీ ఉన్నత స్థాయికి చేరడానికి అందుకు పాడి రైతులే కారణమని పేర్కొన్నారు. ప్రస్తుత పాడి పరిశ్రమ రంగంలో నెలకొంటున్న పోటీతత్వాన్ని అధిగమించే దిశగా అందరూ కృషి చేయాలన్నారు. 35 సంవత్సరాల చరిత్ర కల్గిన సంగం డెయిరీని మరింత ఉన్నత స్థాయికి చేర్చేలా రైతులు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. సభకు అధ్యక్షత వహించి డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ సంగం డెయిరీకి నేషనల్ డెయిరీ ప్లాన్ అమలుకు అవకాశం కల్పించిన జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్లాన్ మొదటి దశలో మూడు పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. సమతుల్య పోషకాహార పథకాన్ని డెయిరీ పరిధిలో గుర్తించిన 200 గ్రామాల్లో అమలు చేయనున్నామని, ఇందుకు 1,91,93, 000 రూపాయల నిధులు గ్రాంటుగా మంజూరైందన్నారు. 2వ పథకమైన పశుగ్రాస ఉత్పత్తి పథకం కింద పోషక విలువలు తగ్గకుండా అవసరమైన సమయాల్లో పశువులకు మేపే గ్రాసాన్ని తయారు చేయడం ముఖ్య ఉద్దేశమని, ఇందుకు 68 లక్షలు మంజూరైందన్నారు. చివరిదైన గ్రామ ఆధారిత పాల సేకరణ పద్ధతుల పటిష్టీకరణ పథకం కింద పాల నాణ్యత పెంచడం ముఖ్య ఉద్దేశమని ఇందుకోసం 289.60 లక్షల రూపాయలు గ్రాంటు మంజూరు కాగా 159.90 లక్షల నిధులను డెయిరీ అందజేస్తుందన్నారు. పాల ఉత్పత్తి దారుల సంక్షేమానికే డెయిరీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తొలుత కలెక్టర్ డెయిరీలో తయారవుతున్న పాల ఉత్పత్తుల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. డెయిరీ ఆవరణలో ఇగ్నో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లోమా ఇన్ డెయిరీ టెక్నాలజీ కోర్సు చేస్తున్న 12 మంది విద్యార్థులకు స్ట్ఫైండ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు ఇక్కుర్తి సాంబశివరావు, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ వి వేణుగోపాలరెడ్డి, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్ లత, డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ గోపీనాధ్, పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలన్నింటికీ
‘ఆధార్’ తప్పనిసరి
* 400 గ్యాస్ కనెక్షన్ల పంపిణీ * 1.7 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ మనోహర్
కొల్లిపర, జూన్ 6: సంక్షేమ పథకాలకు ఆధార్‌కార్డు తప్పనిసరని అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లపరలోని పాలకేంద్రం కళ్యాణ మండపంలో దీపం పథకం కింద 400 మంది లబ్ధిదారులకు గురువారం గ్యాస్ కనెక్షన్లను మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఆధార్ తోడ్పడుతుందన్నారు. త్వరలో ప్రారంభించే నగదు బదిలీ పథకంకు ఆధార్ తప్పనిసరి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని రకాల సబ్సిడీలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించటమే లక్ష్యం అన్నారు. ముందుగా పిడపర్తిపాలెంలో 6.50 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఇందిర జీవిత బీమా పథకం కింద విద్దెల అంజలికి 75 వేల రూపాయల చెక్కు అందజేశారు. అనంతరం కోటి రూపాయలతో నిర్మించిన అత్తోట - నేలపాడు రోడ్ ఆయన ప్రారంభించారు.
మల్లాది గ్రామ దత్తతకు ’ప్రపంచ బ్యాంకు‘ కార్యాచరణ ప్రణాళిక
అమరావతి, జూన్ 6: నాగార్జున సాగర్ ఆయకట్టు అభివృద్ధి పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు తరఫున గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు వ్యవసాయ శాఖ ప్రతినిధి డాక్టర్ పాల్‌సింగ్ సిద్దు తెలిపారు. గురువారం మండల పరిధిలోని మల్లాది గ్రామాన్ని ప్రపంచ బ్యాంకు అధికారుల బృందం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల బృందం గ్రామంలో విస్తృతంగా పర్యటించి రైతులతో పంటల పెంపకం, దిగుబడి, మార్కెటింగ్ వివిధ అంశాలపై మమేకమై చర్చించారు. ఈ సందర్భంగా సిద్దు మాట్లాడుతూ రైతులు పండించిన ఉత్పత్తులను వారే అమ్ముకునేందుకు వీలుగా గ్రామీణ గోడౌన్లను నిర్మించి నిల్వ ఉంచుకునే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దళారీ వ్యవస్థను నిర్మూలించడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రపంచ బ్యాంకు తరఫున అమరావతి మండలంలో ఈ ఏడాది మల్లాది, దిడుగు గ్రామాలను దత్తత తీసుకున్నామని చెప్పారు. గత ఏడాది ఆత్మ ప్రాజెక్టు తరఫున చేపట్టిన శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర ప్రదర్శనలు వాటి ఉపయోగాల గురించి చర్చించారు. ఈ ఏడాది కూడా ఆత్మ ప్రాజెక్టు ద్వారా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై సమగ్రంగా చర్చించారు. ఈ బృందంలో వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఎంఎన్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ అధికారి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ కె వేణుకృష్ణ, ఆత్మ ప్రాజెక్టు పిడి మాధవీ శ్రీలత, డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ మోహనరావు, సీనియర్ ఇక్స్‌టెన్షన్ కోఆర్డినేటర్ నారాయణచౌదరి, జిల్లా నీటి అభివృద్ధి విభాగం అధికారి నీలకంఠేశ్వరరావు, మంగళగిరి ఎడిఎ సిహెచ్ తిరుమలాదేవి, ఆత్మా ప్రాజెక్టు ఎస్‌ఎంఎస్ సాయిబాబు, అమరావతి ఎఒ నరేంద్రబాబు, బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శ్రీనివాసరావు, ఎఇఒలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు బృందానికి మాజీ ఎంపిపి వెంపా జ్వాలా లక్ష్మీనరసింహారావు స్వాగతం పలికారు. అనంతరం ప్రపంచ బ్యాంకు బృందం అమరావతి అమరేశ్వరాలయంలో అమరేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోరీ
నూజెండ్ల, జూన్ 6: నూజెండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి లక్ష రూపాయల విలువ చేసే వస్తువులు చోరీ అయ్యాయి. పాఠశాలలో ఉన్న ఎల్‌సిడి టీవి, ప్రొజెక్టర్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయానే్న పాఠశాలకు వచ్చిన అటెండర్ హెచ్‌ఎం రూమ్‌ని శుభ్రపరిచేందుకు వెళ్లాడు. అప్పటికే బీరువా తాళాలు తెరిచి రికార్డులు చిందరవందరుగా పడి ఉండటాన్ని గుర్తించి ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందజేశాడు. ప్రధానోపాధ్యాయుని పక్కగదిలో ఉన్న ఎల్‌సిడి ప్రొజెక్టర్ కూడా చోరీ అయింది. వెంటనే జరిగిన విషయాన్ని పాఠశాల హెచ్‌ఎం హరిప్రసాద్ ఐనవోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ పి భాస్కర్ ఆదేశాల మేరకు పోలీసులు పాఠశాలకు చేరుకుని దొంగతనం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పోరాటయోధుడు చండ్ర
మంగళగిరి, జూన్ 6: పీడిత, తాడి త జనావళి కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు అని పట్టణ సిపిఐ కార్యదర్శి కూరపాటి మురళీరాజు అన్నారు. కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత దివంగత చండ్ర రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలోని గాలిగోపురం ఎదుట గల ఆయన విగ్రహానికి సిపిఐ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు. ఈ సందర్భంగా మురళీరాజు మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడిన రాజేశ్వరరావు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. తాడేపల్లి మండల సిపిఐ కార్యదర్శి కంచర్ల కాశయ్య మాట్లాడుతూ తెలంగాణాలో నిజాం పాలన దోపిడీకి వ్యతిరేకంగా చండ్ర ఉద్యమించారని అన్నారు. అవినీతి, దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడే చండ్రకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నా రు. పార్టీ నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ముసునూరు సుహాస్, పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఎస్‌కె సుభాని, చిన్ని తిరుపయ్య, అన్నవరపు ప్రభాకర్, మద్దిరాల రమేష్, షేక్ దస్తగిరి, నూతలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తొలుత సిపిఐ కార్యాలయం నుంచి చండ్ర విగ్రహం వరకు పార్టీ పతాకాలు చేతబూని ప్రదర్శన నిర్వహించారు.
వ్యవసాయాధారిత పరిశ్రమలకు సత్వర రుణాలు
గుంటూరు, జూన్ 6: వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు బ్యాంకర్లు సత్వరమే రుణాలు అందజేయాలని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు శ్రీ్ధర్ పేర్కొన్నారు. గురువారం కృషీ భవన్‌లో వెంచర్ క్యాపిటల్ స్కీంపై ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజన్సీ, అగ్రికల్చరల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ జిల్లాను వ్యవసాయపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. భారత ప్రభుత్వం వ్యవసాయశాఖ, సహకార శాఖ నేతృత్వంలో అమలు చేయనున్న వెంచర్ క్యాపిటల్ స్కీం ఫర్ అగ్రి బిజినెస్ డెవలప్‌మెంట్‌పై రైతులకు అవగాహన కల్గించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ స్కీం ప్రాజెక్టు ఆఫీసర్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కింద వ్యక్తులు, రైతులు, ఉత్పత్తిదారులు, స్వయం సహాయక గ్రూపుల్లోని వారికి వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. ఒక ప్రాజెక్టు తయారు చేయడానికి రూ. 50 వేలు కన్సార్డియమ్ ఇస్తుందని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం నాగసుందరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పలు రాయితీలను కల్పిస్తోందన్నారు. నాబార్డు ఎజిఎం భవానీశంకర్ మాట్లాడుతూ వెంచర్ క్యాపిటల్ స్కీం అమలుకు అందరూ సహకరించాలన్నారు.
భూసమస్య పరిష్కరించాలి
నూజెండ్ల, జూన్ 6: భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ములకలూరు ఎస్సీ కాలనీవాసులు మూడో రోజైన గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చి వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విఆర్‌వో జానీబాషాను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. వాగుపోరంబోకు, గుండ్లకమ్మ పోరంబోకు అంటూ కాలక్షేపం చేస్తున్న విఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్థులు పలువురు హెచ్చరించారు. 30 ఏళ్లుగా భూమిని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, భూమికి సంబంధించిన అడంగల్ కాపీ, ఆన్‌లైన్లలో పేర్లు నమోదు చేయకుండా డ్రామాలు అడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించారు. ఆర్‌ఎస్‌ఆర్ రికార్డుల ప్రకారం వాగు పోరంబోకుగా ఉన్నందున ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు కుదరదని, ఉన్నతాధికారులకు సమస్యను తెలియజేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు.
తెనాలి మండలంలో నేడు స్పీకర్ పర్యటన
తెనాలి రూరల్, జూన్ 6: రాష్ట్ర శాససభాపతి, స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ శుక్రవారం తెనాలి మండలంలో పర్యటించనున్నట్లు ఎంపిడిఓ బొర్రా శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా 2081 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న, పనుల ప్రారంభించన్ను అభివృద్ధి కార్యక్రమాలు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు ఎంపిడిఓ వివరించారు. ముందుగా మండలంలోని జాకీర్ హుస్సేన్‌నగర్‌లో 8 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను స్పీకర్ మనోహర్ ప్రారంభిస్తారు. అనంతరం హాఫ్‌పేటలో జనసందర్శనం, ఖాజీపేట గ్రామంలో 23 లక్షల రూపాయల నిధులతో బిటి రోడ్ ప్రారంభం, కొల్లిపరలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న అప్రోచ్ రోడ్‌ను స్పీకర్ ప్రారంభిస్తారు. 5 లక్షల రూపాయలతో శ్మశానవాటికకు కాంపౌండ్ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తారు. అనంతరం 25 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం పూర్తయిన కొలకలూరు - అనుమర్లపూడి గ్రామాల లింక్‌రోడ్‌ను మనోహర్ ప్రారంభిస్తారు. చివరిగా కొలకలూరు ఎస్సీ కాలనీలో కోటి రూపాయలతో ఆర్‌అంబి నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న సిమెంటు రోడ్లను ప్రారంభిస్తారు. మండలంలోని కఠెవరంలో కోటి రూపాయలతో చిన్న, పెద్ద కాలనీల్లో నిర్మించిన సిమెంటు రోడ్లను ప్రారంభించనున్నట్లు ఎంపిడిఓ వివరించారు.
పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణ దాతలు అభినందనీయులు
తెనాలి, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యుల పట్టుదలకు దాతల సహకారం తోడై అసోసియేషన్ నూతన భవన నిర్మాణం అనే లక్ష్యం సాకారమైందని దాతల సేవలు ముదావహమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక ట్రావెలర్స్ బంగళా పక్కనే పెన్షనర్స్ అసోసియేషన్ కోసం ప్రభుత్వపరమైన స్థలాన్ని కేటాయించగా, నూతనంగా నిర్మితమైన భవనాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా గురువారం ప్రారంభించారు. పెన్షనర్స్ అసోసియేషన్ లక్ష్య సాధనలో సహకరించిన దాతలు అభినందనీయులని నాదెండ్ల దాతలను సత్కరించి అభినందనలు తెలిపారు.
ఉర్దూ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం
నరసరావుపేట, జూన్ 6: స్థానిక ప్రకాష్‌నగర్‌లోని లిమ్రా హ్యాండ్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గురువారం నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ఆర్డీవో ఎం శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవాలని సూచించారు. హ్యాండ్ రైటింగ్ ద్వారా విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరడానికి వీలవుతుందన్నారు. ఎన్‌సిపియుఎల్ విద్యార్థులకు ఈ సందర్భంగా మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ షేక్ కరిముల్లా, డ్రాయింగ్ టీచర్ చక్రవర్తి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డివైఎస్‌వోకు 2 ఫిర్యాదులు
మాచర్ల, జూన్ 6: పాత పోలీసు క్వార్టర్స్ సమీపంలోని బోరింగ్ మరమ్మతులకు గురైందని, ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువుగా ఉందని 29వ వార్డుకు చెందిన సుబ్బారావు గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ స్పెషల్ ఆఫీసర్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 7వ వార్డులోని రోప్‌లైన్ వద్ద గల రెడ్డి బడ్డీకొట్టు సమీపంలో కల్వర్టు పూడిపోయిందని వెంటనే ఆ సమస్య పరిష్కరించాలని గోవిందరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమిషనర్ గిరికుమార్ తెలిపారు.
‘ఇందిరమ్మ పచ్చతోరణం’ పక్కాగా అమలుచేయాలి
తెనాలి రూరల్, జూన్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల భూములను అభివృద్ధిపరిచే ప్రక్రియలో భాగంగా అమలు చేస్తున్న ‘ఇందిరమ్మ పచ్చతోరణం’ కార్యక్రమాన్ని తెనాలి మండలంలో పక్కాగా అమలుచేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ ఎపిడిఓ ప్రసాద్ పేర్కొన్నారు.
మండల పరిషత్ కార్యాలయం సమావేవం మందిరంలో గురువారం మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎపిడి మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అభివృద్ధికి నోచుకోని భూములను గుర్తించి వాటిని క్రమంగా అభివృద్ధి చేసి కనీసం ఎకరాకు 200 చెట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని పెదరావూరు, కొలకలూరు, ఎరుకలపూడి, చావావారిపాలెం, సోమసుందరపాలెం గ్రామాలను సంపూర్ణ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మింపజేసే గ్రామాలుగా ఎంపిక చేసుకోవటం జరిగిందని, మార్చి 2013నాటికి నూరు శాతం మరుగుదొడ్లు పూర్తి చేయించవలసి ఉండగా పూర్తికాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ నెలాఖరునాటికైనా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రూపుల్లోని ప్రతి సభ్యురాలు తప్పక ఇన్సూరెన్స్ పథకాల గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ‘స్ర్తి నిధి’ బ్యాంకుల ద్వారా గ్రూపుల్లోని ఆరుగురు సభ్యులకు 15 నుండి 20 వేల రూపాయల మేరకు రుణాలు అందేలా, తిరిగి వారు సకాలంలో సక్రమంగా చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు.
మన్యసూక్త హోమాలకు మహాపూర్ణాహుతి
గుంటూరు , జూన్ 6: పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తుల సమక్షంలో హనుమన్మండల దీక్షలను దీక్షాధారులైన స్వాములు విరమించారు. శ్రీరామ, ఆంజనేయస్వామి భక్తులను అమితంగా పులకింపజేసిన ఈ విశేషమైన కార్యక్రమాన్ని గురువారం నగరంలోని మారుతీ నగర్‌లో కొలువుతీరిన శ్రీ కంచికామ కోటిపీఠ మారుతీ దేవాలయంలో ఆ దేవాలయ పాలకమండలి శ్రద్ధాశక్తులతో నిర్వహించింది. కంచికామ కోటి పీఠాధిపతుల ఆశీస్సులతో హనుమన్మండల దీక్షలను నిర్వహిస్తున్నారు. దీక్షల ముగింపు సందర్భంగా గురువారం ప్రభాత వేళ సుందర అభయాంజనేయ స్వామికి పంచామృత స్నపన, తిరుమంజనం, అనంతరం నాగవల్లీ దళార్చనలను అర్చక స్వాములు చేశారు. దీక్షా విరమణలో భాగంగా మండలం పాటు ప్రధాన యజ్ఞస్థలిలో జరుపుతున్న నవగ్రహ, రుద్ర, మన్యసూక్త హోమాలకు 25 మందికి పైగా వేద పండితులు, రుత్విక్కులు పూర్ణాహుతి చేశారు. ముఖ్యంగా దీక్షలను ఆచరిస్తున్న స్వాములు సామూహికంగా అంజనీసుతుని సేవించుకున్నారు. పూర్ణాహుతి కార్యక్రమానికి ముందు ఇరుముడులు ధరించిన స్వాములు దేవస్థానంలో 11 పర్యాయాలు ప్రదక్షిణలు చేసి, మాల విరమణ చేశారు. ఇదే ఆలయంలో వేంచేసియున్న శ్రీ గంగా గౌరీశంకర స్వామికి మాస శివరాత్రిని పురస్కరించుకుని కల్యాణ మహోత్సవాన్ని కూడా కనులపండువగా నిర్వహించారు. మారుతీ దేవాలయ కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు, యజ్ఞ పూర్ణాహుతి తదితర కార్యక్రమాల్లో పాల్గొని రుత్విక్కులను సత్కరించారు.
సిసి రోడ్ల ప్రారంభం
బాపట్ల, జూన్ 6: బాపట్ల మండలంలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముత్తాయపాలెంలో కోటి 32 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆదర్శనగర్, కప్పలవారిపాలెం, ఈతేరు గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అక్కడ జరిగిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధికి చిరునామాగా బాపట్ల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ప్రతిగ్రామానికి అవసరమైన వౌళిక సదుపాయాలను కల్పించడంలో రాజీలేకుండా శ్రమిస్తున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లం గోపికృష్ణ, గాదె మధుసూధనరెడ్డి, మాజీ ఎంపిపి దాసరి యోహాను, బొడ్డు సుబ్బారెడ్డి, జిట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత కళాకారులదే
వినుకొండ, జూన్ 6: సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత కళాకారులపై ఉందని చైతన్య స్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక చైతన్య స్రవంతి కార్యాలయంలో జరిగిన కళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి సంస్థ కార్యదర్శి బి రవికుమార్ అధ్యక్షత వహించారు. సామాజిక రుగ్మతలపై కళాకారులు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. తొలుత తెలుగు వెలుగుల చిత్రపటానికి గుమ్మడి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. సమాజంలో పతనమవుతున్న విలువలను కాపాడటంలోను, మానవ సంబంధాలను పెంపొందించేందుకు ప్రతి కళాకారుడు కృషి చేయాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు కళాకారులందరూ సంఘటితం కావాలన్నారు. ఈ నెల 16వ తేదీ ఆదివారం చైతన్య స్రవంతి కార్యాలయంలో జరగనున్న నియోజకవర్గ కళాకారుల సదస్సును జయప్రదం చేయాలని కోరారు.
బడిమానేసిన పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి
విజయపురిసౌత్, జూన్ 6: ఐదేళ్ళ చిన్నారులను, బడిమానేసిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చింతల తండా ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లిఖార్జునరావు కోరారు. విద్యా సంబరాల్లో భాగంగా గురువారం విజయపురిసౌత్ పరిధిలోని చింతలతండాలో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్పించే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల మోజులో పడి మోసవద్దని పిల్లల తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాల గురించి వివరించారు.
మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రోత్సహించండి
అమృతలూరు, జూన్ 6: మొదటి విడతగా ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసుకున్న మండల పరిధిలోని ఐదు గ్రామాల్లో ఉన్నవారు వ్యక్తిగత మరుగుదొడ్డి లేనివారందరూ మరుగుదొడ్డి నిర్మించుకునేలా సభ్యులకు అవగాహన కల్పించాలని ఎసి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. గురువారం మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో మండల పరిధిలోని 29 గ్రామ సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విషయాలపై మండల సమా ఖ్య ఇసి సభ్యులకు అవగాహన కల్పించారు.