Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు

$
0
0

ఖమ్మం, జూన్ 6: పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 758పంచాయతీలకు గాను సుమారు 4కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ ప్రకటించిన నేపథ్యంలో రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు బ్యా లెట్ బాక్స్‌లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లుండగా భద్రాచలం డివిజన్ పూర్తిగా షెడ్యుల్డ్ ఏరియాలో ఉంది. ఇక్కడ మొత్తం 117గ్రామ పంచాయతీలున్నాయి. కొత్తగూడెం డివిజన్‌లో 147గ్రామ పంచాయతీలుండగా కొత్తగూడెం మండలంలో 2, సింగరేణి మండలంలో ఒకటి మాత్రమే నాన్ షెడ్యుల్డ్ ఏరియాలో ఉన్నాయి. మిగిలినవన్ని షెడ్యుల్డ్ ప్రాంతంలో ఉండటం గమనార్హం. పాల్వంచ డివిజన్‌లో 117పంచాయతీలకు గాను 103 షెడ్యుల్డ్ ఏరియాలోనూ, 14 నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో 377గ్రామపంచాయతీలకుగాను 369నాన్‌షెడ్యుల్డ్ ఏరియాలో ఉండగా, కేవలం 8మాత్రమే షెడ్యుల్డ్ ఏరియాలో ఉన్నాయి. అవి కూడా పెనుబల్లిలో 6, సత్తుపల్లిలో రెండు పంచాయతీలున్నాయి. జిల్లా మొత్తం 758పంచాయతీలకు గాను 372 షెడ్యుల్డ్ ఏరియాలోనూ, 386నాన్ షెడ్యుల్డ్ ఏరియాలో ఉన్నాయి. కాగా షెడ్యుల్డ్ ఏరియాలో ఖచ్ఛితంగా గిరిజనులు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియ రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
కాగా మరో నాలుగైదు రోజుల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్ల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని జిల్లా పంచాయతీ అధికారి పి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 4కోట్ల మేరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కాగా పోలింగ్ సిబ్బంది వ్యయానికి 60లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలో సర్పంచ్‌ల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీవోల ఆధ్వర్యంలోజరగ్గా, వార్డు మెంబర్ల ప్రక్రియ మాత్రమే ఎంపిడివోల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యను చదివిన విద్యార్థులను ఉపయోగిస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 14.25లక్షల మంది వరకు ఓటర్లుండగా వీరందరికి బ్యాలెట్ పేపర్లు కూడా తయారు చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ ఎన్నికకు పింక్ బ్యాలెట్ పేపర్‌ను, వార్డుమెంబర్‌కు తెలుపు బ్యాలెట్ పేపర్లు ముద్రణకు సిద్ధంగా ఉన్నాయని డిపివో తెలిపారు.

కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
* మంత్రులు బలరాం నాయక్, రాంరెడ్డి, ఎమ్మెల్యే రేగా
పినపాక, జూన్ 6: రాష్ట్రంలో అభివృద్ధి సాధించడం అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అది కూడా సీఎం హయాంలోనే జరుగుతుందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు అన్నారు. గురువారం మండలంలో వారు విస్తృతంగా పర్యటించి మారుమూల జానంపేట గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించనున్న 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏడూళ్ళబయ్యారం క్రాస్ రోడ్డులో ఉన్న కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో ఐటిడిఏ నుంచి మంజూరైన రూ.8 లక్షలు విలువ చేసే ట్రాక్టర్‌ను మహిళా సమాఖ్యకు అందజేశారు. ఈ సందర్భంగా జానంపేటలో జరిగిన సభలో మంత్రి రాంరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ సబ్ స్టేషన్ నిర్మాణంతో సమీప గ్రామాలకు 24 గంటలూ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో రూ.800 కోట్లతో 721 గ్రామాలకు మంచినీటి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో అమలౌతున్న పథకాలను కిరణ్ సర్కార్ అమలు చేస్తున్నారన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఇటీవల కొంత లోపం జరగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. అయినా ప్రభుత్వం కోట్లు వెచ్చించి విద్యుత్‌ను కొనుగోలు చేసి అందిస్తుందన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలను సైతం అందిస్తుందని, అన్ని పథకాలను కొనసాగిస్తుందని చెప్పారు. మండలంలో పోడు భూముల వ్యవహారం తలనొప్పిగా మారిందని, పోడు చేసుకునే గిరిజన, నిరుపేదల భూములను సర్వే చేయించి వెంటనే పట్టాలిచ్చేందుకు ఇప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా 30 సంవత్సరాలుగా మండలంలో సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న చందా లింగయ్య కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి మరో పార్టీలోకి జారుకోవడం తల్లిపాలు తాగి రొమ్ములు గుద్దినట్లేనని విమర్శించారు. అటువంటి వారి మాటలు పట్టించుకోవద్దన్నారు. అనంతరం కేంద్రమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. సోనియా, మన్మోహన్‌ల ఆధ్వర్యంలో గతంలో వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, రాష్ట్రంలో ఆ పథకాలను కిరణ్ సర్కార్ ఎక్కడ కుంటుపడకుండా అమలు చేస్తున్నారని అన్నారు. ఒక్క పినపాక నియోజకవర్గంలోనే పులుసుబొంత వాగు ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల రోడ్డు మార్గాలను విస్తరించడం జరిగిందన్నారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ మండలంలో ఎన్నడూ లేని విధంగా నాలుగేళ్లల్లో విశేషమైన అభివృద్ధిని సాధించడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో ప్రతి ఒక్క దానిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పినపాక మండలంలో జరిగిన అభివృద్ధిని, గతంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు భేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు. జానంపేటలో సబ్ స్టేషన్‌పై అవహేళన చేసిన ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయని విమర్శించారు. ఇదే జానంపేటలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసి ఆ హామీని నిలబెట్టుకుంటానని మరో మారు హామీ ఇచ్చారు. ఉత్తుత్తి మాటలు చెబుతూ కాంగ్రెస్‌పై లేనిపోని అపనిందలు వేసే నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్ల చందా లింగయ్య అనుభవం తన మూడేళ్ల అనుభవంతో సమానమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక తహశీల్దారు పూనెం నాగేశ్వరరావు చేస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని సభా ముఖంగా జిల్లా కలెక్టర్‌ను కోరారు. గిరిజన తహశీల్దారు అయి ఉండి గిరిజనులకే తీవ్ర ద్రోహం చేయడం చాలా అన్యాయమన్నారు. మండలంలో ఎల్టీఆర్ కేసులు, పట్టాదారు పాసుపుస్తకాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు పూనెం నాగేశ్వరరావు, ఎండీఓ గడ్డం రమేష్, విద్యుత్ శాఖ ఏఇ రమేష్, ఎస్‌ఇ తిరుమలరావు, పాల్వంచ ఆర్డీఓ శ్యాం ప్రసాద్, డియస్పి తిరుపతి, సిఐలు సాంబరాజు, వేణుచందర్, ఎస్‌ఐలు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా కిశోర్, నాయకులు పూజారి వెంకన్న, ముక్కు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సోషలిస్టు వ్యవస్థ కోసం పోరాడిన యోధుడు చండ్ర
ఖమ్మం , జూన్ 6: భారతదేశంలో సోషలిస్టు వ్యవస్థ కోసం తుదిశ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. చండ్ర రాజేశ్వరరావు శతజయంతి సభ గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. జమ్ముల జితేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ మాట్లాడుతూ సంపన్న రైతు కుటుంబంలో జన్నించిన చండ్ర రాజేశ్వరరావు నిరంతరం పేదల అభ్యున్నతి కోసమే పరితపించారని కొనియాడారు. తెలంగాణ విముక్తి పోరాటంలో సాయుధ దళాలకు సారథ్యం వహించారని, భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలోతనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఆయన తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమ చీలిక అనంతరం దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి సిపిఐ కార్యదర్శిగా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. 1972లో కేంద్ర ప్రభుత్వం భూసంస్కరణల చట్టం తీసుకు రావడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి చండ్ర అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు భూపోరాటాలకు నాయకత్వం వహించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంతో చండ్రకు విడదీయరాని బంధం ఉందన్నారు. ప్రపంచీకరణ పాలకవర్గాల్లో పెరిగిన అవినీతి నేపద్యంలో కమ్యూనిస్టు శ్రేణులు బహుముఖ పోరాటాలకు సిద్దం కావాలని పువ్వాడ పిలుపునిచ్చారు. ఈ శతజయంతి సభలో రాష్ట్ర నాయకులు టివి చౌదరి, పాకాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, మేకల సంగయ్య, పోటు కళావతి తదితరలు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమాన్ని విస్మరించి
సోనియా చుట్టూ ప్రదక్షిణలు
* కాంగ్రెస్ నేతల తీరుపై సిపిఎం నేత పోతినేని ఎద్దేవా
ఖమ్మం , జూన్ 6: ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కుర్చీలు కాపాడుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సహా మరికొంతమంది కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో సోనియాగాంధీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు ఎద్దేవా చేశారు. గురువారం మండలంలోని సత్యనారాయణపురంలో తోట పెద్ద వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సిపిఎం గ్రామశాఖ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడమే సిపిఎం ధ్యేయమన్నారు. ఎర్రజెండాను నమ్ముకొని సిపిఎం పార్టీలో చేరిన వారికి పార్టీ అండగా నిలస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో, జిల్లాలో అనేకచోట్ల భూపోరాటాలు చేసిన ఘనత సిపిఎంకు ఉందన్నారు. అంతేగాక ఇతర ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసి అనేక సమస్యలు కూడా పరిష్కరించుకోగలిగామని పోతినేని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, ఇళ్ళస్థలాలు, పెన్షన్లు సాధించుకోగలిగామన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు తదితర సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఏనాడూ ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించిన పాపానపోలేదని, ఎక్కడ ఒంగోలు గిత్తలు ఉన్నాయి, ఎక్కడ ఎడ్ల పందేలు జరుగుతున్నాయో అనే విషయాలపైనే దృష్టి సారిస్తారని విమర్శించారు. తమ్మినేని వీరభద్రం ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. ఈసందర్భంగా 30 కుటుంబాలకు చెందిన ప్రజలు పోతినేని సమక్షంలో సిపిఎం లో చేరారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, నాయకులు నున్నా నాగేశ్వరరావు, బత్తుల లెనిన్, ఎజె రమేష్, కాసాని ఐలయ్య, కనకయ్య, సిఐటియు కార్యదర్శి పి మోహన్‌రావు, మామిండ్ల విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనం పల్టీ: వ్యక్తి మృతి
కొణిజర్ల, జూన్ 6: ద్విచక్ర వాహనం అదుపు తప్పి పల్టీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటన తుమ్మలపల్లి గ్రామ సమీపంలో గురువారం ఆర్‌అండ్‌బి రోడ్డుపై జరిగింది. స్థానికులు, మృతుని కు టుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అన్నవరం గ్రామానికి చెందిన చెన్నోజు వాసుదేవాచారి(40) ద్విచక్ర వాహనంపై తనికెళ్ళ నుంచి ఇంటికి వెళ్తుండగా గ్రామ సమీపంలో మూలమలుపువద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతోఅక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శంకర్ సంఘటనా స్థలాకి చేరుకొని పంచనామ నిర్వహించి పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేసున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
పాఠ్యపుస్తకాలు పంపిణీ
ఖమ్మం రూరల్, జూన్ 6: మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు గురువారం మండల విద్యాశాఖాధికారి వి సత్యనారాయణ 33,240 పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం 57,635 పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ప్రస్తుతం 33,240 పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చినట్టు ఆయన తెలిపారు. ఇంకా తెలుగు మీడియంకు చెందిన 7వ తరగతి హిందీ, సైన్స్, 8వ తరగతి గణితం, 9వ తరగతి ఇంగ్లీష్, గణితం, 10వ తరగతి తెలుగు, భౌతికశాస్త్రం పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకు చెందిన 7వ తరగతి హిందీ, సైన్స్, 10వ తరగతి ఇంగ్లీష్, హిందీ, జీవశాస్త్రం, భౌతికశాస్త్రం పాఠ్యపుస్తకాలు సైతం రావాల్సి ఉన్నట్టు ఎంఇఓ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో
11 మందికి గాయాలు
* ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
తిరుమలాయపాలెం, జూన్ 6: మండల పరిధిలోని కాకరవాయి గ్రామ సమీపాన గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 11 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాకరవాయి గ్రామశివారుకు చెందిన 11 మంది జిల్లా కోర్టుకు ఒక కేసు విషయమై హాజరై తిరిగి తమ గ్రామానికి టాటా ఏసిలో వెళ్తున్నారు. జూపెడ గ్రామానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో సుద్దవాగుతండాకు చెందిన బాణోతు సోమన్న, బాణోతు జాను, బాణోతు మల్సూరు, బాణోతు వీరన్న, బాణోతు చిన్న, బాణోతు లకుపతి, బాణోతు పంత్రి, బాణోతు భాషా, బాణోతు తావ్రి, బాణోతు మోహన్ అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ ఎల్ రఘురాంరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రారంభమైన
వ్యవసాయ మార్కెట్
ఖమ్మం (గాంధీచౌక్), జూన్ 6: గత నెల 15 నుండి ఈ నెల 5 వరకు మార్కెట్‌కు సెలవులు ఇవ్వటంతో మూతపడ్డ మార్కెట్ గురువారం యథాతథంగా ప్రారంభమైందని మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ అన్నారు. ఎండవేడిమికి తట్టుకోలేకపోతున్నామని, మార్కెట్‌కు సెలవులు ప్రకటించాలని మార్కెట్ కూలీలు కోరడంతో మార్కెట్‌కు సెలవులు ఇచ్చామని ఆయన అన్నారు. ఇకపై రైతులు వారు పండించిన పంటలను మార్కెట్‌కు తరలించుకోవచ్చని, మార్కెట్‌లో అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు.

చండ్రుగొండ మండలంలో భారీ వర్షం
చండ్రుగొండ, జూన్ 6: మండలంలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో పిడుగులు సైతం పడడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వర్షానికి తోడు గాలి తోడవడంతో చండ్రుగొండ, రావికంపాడు, బాలికుంట, బెండాలపాడు గ్రామాల్లో పెద్దపెద్ద వృక్షాలతో పాటు విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో గురువారం ఉదయం వరకు మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసాలు
ఎర్రుపాలెం, జూన్ 6: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసకార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి తల్లిదండ్రులు వివిధ గ్రామాల నుంచి ఆలయానికి వచ్చి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, తదుపరి సరస్వతి పూజ కార్యక్రమాలను ఆలయ వేద పండితులు కొత్తూరి కోటేశ్వరశాస్ర్తీ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మలు నిర్వహించి, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. చిన్నారులకు దేవాలయం తరుపున పలక, బలపం, ప్రసాదాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమంలో ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ఈవో వెచ్చానర్సింహారావు, స్థానిక ధర్మకర్త వేమిరెడ్డి అంకిరెడ్డి, ధర్మకర్తలు, సిబ్బంది, పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు
english title: 
panchayat elections

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>