Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

చేరని పాఠ్యపుస్తకాలు

$
0
0

విజయవాడ, జూన్ 6: నూతన విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా మరో ఆరు రోజుల్లో ఈనెల 12 తేదీ వేసవి సెలవులనంతరం ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. అయితేనేమి కీలకమైన పాఠ్య పుస్తకాలు మాత్రం నేటికీ పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. అసలు ప్రతి ఏటా కూడా పాఠ్య పుస్తకాల పంపిణీ ఒక ప్రహసనంలా సాగుతున్నది. ఒక్కోసారి త్రైమాసిక పరీక్షలమయం వరకూ కూడా పాఠ్యపుస్తకాలు అందని స్థితి ఏర్పడుతున్నది. మరోవైపు బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకై ప్రతి పాఠశాల స్థాయిలో పెద్దఎత్తున విద్యా సంబరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఈనెల 13 తేదీ నాటికల్లా పాఠ్య పుస్తకాలన్నీ చేరాల్సి ఉన్నాయి. జిల్లాలో 1 నుంచి పదో తరగతి వరకు దాదాపు 3 లక్షల 25వే మంది పిల్లలకు 24 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా గత ఏడాది గోదాంలలో మిగిలిపోయిన రెండున్నర లక్షల పుస్తకాలతో కలుపుకుని ఇప్పటికి మొత్తం 10 లక్షల పుస్తకాలు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రోజుకు కనీసం 50వేల పుస్తకాలు డిపోలకు చేరుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా పాఠశాలల పునఃప్రారంభం నాటికి అత్యధిక పుస్తకాలు అందించగలమంటున్నారు. గత ఏడాది 3,6,7 తరగతుల పుస్తకాలు మారగా ఈ ఏడాది 4,5,8,9 తరగతుల పుస్తకాలు మారాయి. అయితే కొత్త పుస్తకాలు సకాలంలో అందేలా కన్పించడం లేదు. జిల్లాలో మొత్తం 3వేల 469 పాఠశాలలు ఉండగా వీటిల్లో ప్రాథమిక పాఠశాలలు 2వేల 484, యుపి స్కూల్స్ 527, హైస్కూల్స్ 48 ఉన్నాయి. ఇప్పటివరకు 3 తరగతి లెక్కలు, సైన్స్, 4 తరగతి లెక్కలు, ఐదో తరగతి తెలుగు, ఆరేడు తరగతులకు సంబంధించి హిందీ, ఇంగ్లీషు మినహా ఇతర పుస్తకాలన్నీ చేరాయి. 8,9 తరగతులకు సంబంధించి హిందీ, లెక్కలు, ఎన్‌ఎస్, సోషల్ పుస్తకాలు పదో తరగతికి మాత్రం ఒక్క హిందీ మినహా ఇతర పుస్తకాలన్నీ చేరాయి. కష్టపడి బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించినా పుస్తకాలు లేకుండా మేం ఏం చేయగలమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఉత్తీర్ణతా శాతం తగ్గితే అధికారులు తమను బలి పశువులను చేస్తున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వేసవి సెలవులకు ముందుగానే పాఠ్య పుస్తకాలు తెప్పించుకుని అప్పుడే సిలబస్ కూడా ప్రారంభించారు. దీనివల్ల అర్ధ సంవత్సరం పరీక్షల నాటికే సిలబస్ పూర్తిచేసి రెండోసారి ప్రారంభించడం లేదా ఆపై వచ్చే సంవత్సరం సిలబస్ ప్రారంభించడమో చేస్తున్నారు. ముఖ్యంగా తొమ్మిదో తరగతిలో, అర్ధ సంవత్సర పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి సిలబస్ ప్రారంభం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కంటే అత్యధిక మార్కులు సంపాదించుకోగల్గుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే బిఇడి, ఎంఇడి పూర్తిచేసిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటున్నారు. అయితే పాఠశాలలో సరైన వౌళిక సదుపాయాలు లేకపోవటం, సకాలంలో పాఠ్య పుస్తకాలు అందకపోవటం వంటి కారణాలతో త్వరితగతిన సిలబస్ పూర్తిచేయలేకపోతున్నారు. ఇక ప్రైవేట్ పాఠశాలల కోసం నకిలీ పాఠ్య పుస్తకాలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వ పుస్తకాలను స్కానింగ్ చేసి యధాతధంగా ముద్రించి అధిక రేట్లకు విక్రయం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వీటిని ఆదరిస్తున్నారు.

సిసి కెమెరాలతో నేరాలు తగ్గుముఖం
హనుమాన్ జంక్షన్, జూన్ 6: పోలీసు శాఖ ఏర్పాటు చేస్తున్న సిసి కెమెరాలు వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమాజంలో నేరాలు తగ్గుముఖం పడుతున్నాయని కోస్తా రీజియన్ ఐజి ద్వారక తిరుమలరావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఐజి, డిఐజి విక్రమ్‌మాన్ సింగ్‌లు హనుమాన్ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా స్థానిక ట్రాఫిక్ ఆవుట్‌పోస్టులోని సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ సమాజంలో దోపిడి, దొంగతనాల కేసులు తగ్గుముఖం పట్టాయని, పెరుగుతున్న వైట్‌కాలర్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. వైట్‌కాలర్ నేరాలపై పోలీసులకు సాంకేతికపరమైన శిక్షణ లేకపోవడంతో వాటిని నిరోధించడం సాధ్యం కావడంలేదని ఆంగీకరించారు. వైట్‌కాలర్ నేరాల నిరోధానికి పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో నేరాల నిరోధానికి పరిధితో సంబంధం లేకుండా సిబ్బంది పనిచేయాలని సూచించారు. అవసరమైతే రెండు జిల్లాల అధికారులు కలిసి కమిటీగా ఏర్పడాలని అదేశించారు. విజయవాడ మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉందని వస్తున్న ప్రచారాన్ని తిరుమలరావు ఖండించారు. విశాఖపట్నం, ఖమ్మం ప్రాంతాల్లో నక్సలైట్ల కదిలికలు గుర్తించడంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, విజయవాడలో ఏటువంటి కదలికలు లేవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జె ప్రభాకర్, నూజివీడు డిఎస్‌పి ఎ శంకర్ రెడ్డి, నూజివీడు సిసిఎస్ సిఐ వి విజయరావు, జంక్షన్ సిఐ వైవి రమణ, ఎస్‌ఐ అబ్దుల్ సలాం తదితరులు ఉన్నారు.

జంక్షన్‌కు త్వరలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్
హనుమాన్ జంక్షన్ ట్రాఫిక్ నియంత్రణకు త్వరలో తగిన సిబ్బందితో కూడిన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని కోస్తా రీజియన్ ఐజి ద్వారకా తిరుమలరావుప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కూడలిలో కొద్దిసేపు వాహనాల రాకపోకలను పరిశీలించారు. జంక్షన్ సిఐ వైవి రమణ ప్రతిరోజు సిబ్బంది కొరతతో ఎదుర్కొంటున్న సమస్యలను ఐజికి వివరించారు. ప్రతినిత్యం వేలాది వాహనాలతో రద్దీగా వుండే హనుమాన్ జంక్షన్ కూడలిలో సరైన సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారుతోందని తెలిపారు. శాంతి భద్రతల కోసం కేటాయించిన సిబ్బంది సైతం ట్రాఫిక్ నియంత్రణ కోసం కేటాయిస్తున్నామని, అయినా ట్రాఫిక్ సమస్య పరిష్కరం కావడంలేదని అధికారులు తెలిపారు. రెండు జిల్లాలకు సరిహద్దుగా ఉన్న హనుమాన్ జంక్షన్‌కు త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని ఐజి ప్రకటించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతోనైనా జంక్షన్ ట్రాఫిక్ కష్టాలు తిరుతాయా అని స్థానికులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డిఎస్‌పి కార్యాలయం వద్ద
రైతుల ధర్నా
నందిగామ, జూన్ 6: వందలాది మంది రైతుల వద్ద నుండి మిర్చి కొనుగోలు చేసి సుమారు 2కోట్లకు పైగా టోకరా వేసి పరారైన మిర్చి వ్యాపారిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత రైతులు గురువారం స్థానిక డిఎస్‌పి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నేతలు సయ్యద్ ఖాసిం, చుండూరు సుబ్బారావు తదితరులు మద్దతు తెలియజేశారు. బాధిత రైతులు కామేశ్వరరావు, ఏడుకొండలు, నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు వ్యాపారి తమను ఏవిధంగా మోసం చేసిందీ వివరించారు. గతంలో ఒక విత్తనాల కంపెనీకి ప్రతినిధిగా పని చేసిన మండలంలోని చెరువుకొమ్ముపాలెంకు చెందిన ఇందూరి నాగిరెడ్డి నందిగామ పట్టణంలోని చేపల మార్కెట్ సమీపంలో ఐఎన్‌ఎన్‌ఆర్ మిర్చి బ్రాండ్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి రైతులకు చైనా కంపెనీ విత్తనాలను విక్రయించడమే కాక 2వేల రూపాయలు డిపాజిట్ చేసుకొని రైతులకు బాండులు ఇచ్చాడు. అంతే కాకుండా మార్కెట్‌లో ఉన్న మిర్చి ధర కన్నా వెయ్యి రూపాయలు అధిక ధరతో రైతుల వద్ద నుండి మిర్చి కొనుగోలు చేసి కొంత నగదు ఇచ్చి మిగిలిన సొమ్ముకు చెక్కులు ఇచ్చాడు. రైతులకు సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా బాకీదారులకు ఇందూరి నాగిరెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో బుధవారం రాత్రి నందిగామలోని కార్యాలయాన్ని ముట్టడించారు. పలువురు రైతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పలువురు గురువారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు ధర్నా నిర్వహించి డిఎస్‌పి చిన హుస్సేన్‌ను కోరగా మొత్తం రైతులు అందరూ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేవి వివరంగా పేర్కొంటూ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేయాలని, కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని తెలియజేశారు. ఈ ధర్నాలో నందిగామ, వత్సవాయి, పెనుగంచిప్రోలు తదితర మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

ఎంసెట్ ర్యాంకర్ నిఖిలేశ్వర్‌కు అభినందనలు
అవనిగడ్డ, జూన్ 6: అవనిగడ్డకు చెందిన కొండవీటి నిఖిలేశ్వర్ ఎంసెట్‌లో 113వ ర్యాంక్ సాధించి మెడిసిన్‌లో కార్డియాలజిస్ట్‌గా ప్రత్యేక కోర్సు తీసుకోనున్నట్లు తెలిపాడు. గురువారం ఆయన స్వగృహంలో నిఖిలేశ్వర్‌ని విలేఖర్లు కలవగా శిక్షణ పొందిన కారణంగానే తాను 113వ ర్యాంక్ సాధించగలిగానన్నారు. నిఖిలేశ్వర్ తల్లిదండ్రులు సాయిబాబు, భానురేఖ తమ కుమారుడిని అభినందిస్తూ మిఠాయిలు తినిపించారు.

యామిని ప్రియకు ‘మండలి’ అభినందనలు
అవనిగడ్డ, జూన్ 6: ఇటీవల అమెరికాలోని నాసా కేంద్రంలో అంతరిక్షానికి సంబంధించిన పత్రాల సమర్పణకు వెళ్ళిన మత్తి యామిని ప్రియను రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అభినందించారు. నూజివీడు ట్రిపుల్ ఐటిలో చదువుతున్న యామిని నాసాలో పరిశోధనల కోసం పత్రాలు తయారు చేసి సమర్పించారు.

పోలీసుల ఆదుపులో నకిలీ నక్సలైట్?
హనుమాన్ జంక్షన్, జూన్ 6: నక్సలైట్ల పేరుచెప్పి స్థానిక రైస్‌మిల్లర్ నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హనుమాన్ జంక్షన్ పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. జంక్షన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. హనుమాన్ జంక్షన్‌కు చెందిన కొనకళ్ల వెంకటేశ్వరరావుకు పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం ఏపూరు గ్రామ పరిధిలో రైస్ మిల్లు వుంది. కొద్దిరోజుల క్రితం కొందరు వ్యక్తులువచ్చి వేంకటేశ్వరరావును తుపాకులతో బెదిరించడంతోపాటు, తాము నక్సలైట్లమని రెండు లక్షలు నగదు ఇవ్వకపోతే చంపేస్తామని చేప్పారు. దీంతో భయపడిన వేంకటేశ్వరరావు తన దగ్గర అంత డబ్బు లేదని 80వేలు ఇచ్చి మిగిలిన నగదు త్వరలో ఇస్తానని చెప్పడంతో వచ్చిన వ్యక్తులు వెళ్ళిపోయారు. రెండు రోజుల నుంచి మళ్ళి నగదు కావాలని ఫోన్లు చేయడంతో వేంకటేశ్వరరావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆప్రమత్తమైన పోలీసులు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా వుండగా గురువారం ఫోన్‌చేసిన గుర్తుతెలియని వ్యక్తులు డబ్బుతో స్థానిక నూజివీడు రోడ్‌లోని వైయస్‌ఆర్ కల్యాణ మండపం వద్దకు రావాలని సూచించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందజేసిన వేంకటేశ్వరరావు తన మిత్రులతో కలసి ఆ ప్రదేశానికి వెళ్ళారు. డబ్బు తీసుకొనేందుకు వచ్చిన వ్యక్తిని వేంకటేశ్వరరావు ఆయన మిత్రులు కలిసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో జంక్షన్ ఎస్‌ఐ అబ్దుల్ సలాం స్టేషనులో ఆ వ్యక్తిని విచారించారు. దీంతో ఆ వ్యక్తి వివరాలు వెల్లడించాడు. అతని పేరు మద్దలిమోహన్ అని విజయవాడలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని వివరించారు. గురువారం ఉదయం కొందరు వచ్చి హనుమాన్ జంక్షన్‌లో ఇంటి కడిగేందుకు తనను కారులో తీసుకువచ్చి వదలివెళ్ళినట్లు చెప్పాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నుంచి, బాధితుడు నుంచి వాంగ్మూలం రికార్టు చేసిన జంక్షన్ పోలీసులు సంఘటన స్థలం పెదపాడు పోలీసుస్టేషను పరిధిలో ఉండడంతో పెదపాడు పోలీసులకు అప్పగించారు.

పోలంపల్లి డ్యామ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
వత్సవాయి, జూన్ 6: పోలంపల్లి డ్యామ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని పోలంపల్లి ఆనకట్ట వద్ద గురువారం రాష్ట్ర, జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కృష్ణా డెల్టా సిఇ సాంబయ్య, గోదావరి బేసిన్ కమిషనర్ ఇన్ మెకానికల్ విజయప్రకాష్‌లతో కలిసి డ్యామ్ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా డ్యామ్‌కు ఇరువైపులా ఎర్పడిన గుంటలను, అసంపూర్తిగా ఉన్న కరకట్టను, పూర్తిస్థాయిలో ఇంత వరకూ నిర్మాణం చేయని డ్యామ్ పనులను పరిశీలించారు. అనంతరం వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఈ డ్యామ్‌ను గత తొమ్మిదేళ్లుగా నిర్మాణం చేస్తున్నారని, నేటి వరకూ నిర్మాణ పనులు పూర్తి కాలేదని, దీనికితోడు ఆయకట్టు రైతులకు నీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బ్రిటీష్ కాలం నాడు నిర్మించిన ఆనకట్టను పరిగణలోకి తీసుకొని నీటి సరఫరా చేయడం అత్యంత దౌర్భాగ్యమని రైతులు ఆరోపించారు. సిఇ సాంబయ్య మాట్లాడుతూ 2014 నాటికి గేట్ల నిర్మాణం పూర్తవుతుందని, 2015నాటికి పూర్తి స్థాయిలో డ్యామ్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల పనులు వేగవంతం కాలేదని అన్నారు. ఈ లోపల పాత ఆనకట్ట పరిధిలో మేట తొలగించి నీటిని దిగువకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టకపోతే ఉద్యమం చేపడతామని అన్నారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెకానికల్ ఎస్‌ఇ శారద, విజయవాడ సివిల్ ఎస్‌ఇ నరసింహమూర్తి, ఇఇ స్పెషల్ డివిజన్ యాదవ్, డిసి మెకానికల్ శ్రీ్ధర్ దేశ్‌పాండే, డిఇ సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటిబండ్ల వెంకట్రావు, మాజీ నీటి సంఘ అధ్యక్షుడు పాల్గొన్నారు.

డెల్టా ఆధునికీకరణ పనులపై ఎమ్మెల్యే దాస్ అసంతృప్తి
కూచిపూడి, జూన్ 6: మొవ్వ మండలం పెదపూడి శివారు భీమనది డ్రైన్‌పై రూ.80లక్షల డెల్టా ఆధునికీకరణ నిధులతో నిర్మించిన వంతెన బూడిదలో పోసినట్లైందని పామర్రు శాసనసభ్యులు డివై దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వంతెన నిర్మాణాన్ని డ్రైనేజీ ఎఇ విజయకుమార్‌తో కలిసి పరిశీలించిన ఆయన పలు లోపాలను గుర్తించి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో 214ఎ జాతీయ రహదారి కానున్న పామర్రు-అవనిగడ్డ ఆర్‌అండ్‌బి రహదారిలో గత ఏడాది ఏప్రిల్ 2వతేదీన శంకుస్థాపన చేసిన వంతెన నిర్మాణ సమయంలో వెడల్పును 10 మీటర్లుగా నిర్మించాలని, ఫిల్లర్లు ఏటవాలుగా నిర్మించాలని మొదటి నుండి హెచ్చరిస్తున్నా తన సూచనలను కాంట్రాక్టర్, వారి ఇంజనీరింగ్ బేఖాతరు చేసి తమ ఇష్టారాజ్యంగా నిర్మించటాన్ని ఆయన తప్పుపట్టారు. ఫలితంగా ఐనంపూడి నుండి దాదాపు ఎనిమిది గ్రామాల్లోని వరదనీరు వంతెన వద్ద నిలిచిపోయి ఎగువ భూములు ముంపుకు గురవుతాయన్నారు. వంతెన వెడల్పు 7.5మీటర్లకే పరిమితం చేయటంతో రహదారి విస్తరణలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుందని, వర్షపు నీటి నిల్వ కారణంగా వంతెన కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. వంతెన నిర్మాణంలో ఏర్పడిన లోపాలు సరి చేయకపోతే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి బిల్లు చెల్లింపును నిలిపి వేయిస్తానని హెచ్చరించారు. అనంతరం కూచిపూడి, పెదపూడి గ్రామాల్లో రూ.1.80లక్షలతో నిర్మిస్తున్న పక్కా డ్రైన్ నిర్మాణంలో వెలువడిన అవకతవకలను గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డ్రైన్ నిర్మాణానికి ఆటంకం కలిగించే అడ్డంకులను ఎంతటివారైనా ఖాతరు చేయవద్దని ఆర్‌డబ్ల్యుయస్ అధికారులకు సూచించారు. పెదపూడి రైతులకు సాగునీరు సరఫరాకు ఆటంకం కలిగించే సైఫన్, పంట బోదె తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో మొవ్వ ఎఎంసి చైర్మన్ మండవ రత్నగిరిరావు, మాజీ చైర్మన్ చీకటిమర్ల శివరామప్రసాద్, ఆర్‌డబ్ల్యుయస్ డిఇ రామదాసు, ఎఇ సిహెచ్ సుబ్బారావు, పిఐడియు ప్రసాదరావు, డ్రైనేజీ ఎఇ విజయకుమార్, ఎండివో వై పిచ్చిరెడ్డి, కెడిసిసి డైరెక్టర్ కాకర్ల శివ కుమార్, మాజీ సర్పంచ్ వైకెడి ప్రసాదరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజులపాటి తారక బ్రహ్మానంద మస్తాన్, కూరపాటి కోటేశ్వరరావు, పిట్టు శ్రీనివాసరావు, హైదర్ అబ్బాస్ అలీ తదితరులు ఉన్నారు.

శాస్త్రోక్తంగా మన్యుసూక్త హోమం
మచిలీపట్నం , జూన్ 6: స్థానిక పరాసుపేట సువర్చలాసమేత ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం మన్యుసూక్త హోమం, మహాలక్ష్మి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తేవి వెంకట సత్యనారాయణాచార్యులు బ్రహ్మత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముత్తేవి శేషభట్టార్, అర్చకులు అగ్నిహోత్రం వాసుదేవాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్య నిర్వహణాధికారి ఎంవివి సత్యనారాయణ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా - 15మందికి గాయాలు
జగ్గయ్యపేట , జూన్ 6: జాతీయ రహదారిపై మండలంలోని గౌరవరం గ్రామ శివారులో గురువారం తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 15మంది ప్రయాణీకులు గాయపడ్డారు. హైదరాబాదు నుండి నర్సాపురం వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు గౌరవరం గ్రామం దాటిన తరువాత రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. డ్రైవర్ అలసత్వమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు ఆరోపించారు. బస్సులో మొత్తం 40మంది ప్రయాణీకులు ఉండగా నర్సాపురానికి చెందిన ధనలక్ష్మి, దుక్కిపట్ల గ్రామానికి చెందిన కె సూర్యనారాయణ, గుడివాడకు చెందిన జాస్తి అచ్చయ్య చౌదరికి తీవ్రగాయాలు అయ్యాయి. అలాగే సాకా సంపంగి, రామలక్ష్మితో పాటు మరో పది మంది స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు 108 అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిల్లకల్లు ఎస్‌ఐ ఇస్మాయిల్ ప్రమాద సంఘటనను సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు
కలిదిండి, జూన్ 6: బడి ఒడిలో బడి ఈడు పిల్లలను చేర్పించడం నా ఉద్యోగ బాధ్యత అని ఎంఇఓ నరసయ్య అన్నారు. మండల పరిధిలోని అప్పారావుపేటలోని తనూజా పాఠశాల, కలిదిండిలో టెక్నో స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు లేదని, గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించవద్దని కోరారు. విద్యా హక్కు చట్టం ద్వారా గుర్తింపు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే 7వ తరగతి వరకు గుర్తింపు ఉన్న పాఠశాలల్లో 8, 9, 10 తరగతి విద్యార్థులను చేర్పించుకోవద్దన్నారు. విద్యా సంబరాల్లో భాగంగా గురువారం ఎస్‌ఆర్‌పి అగ్రహారం, పడమటిపాలెం, పరసావానిపాలెం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల్లో ఆయా ప్రాంత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

నిజాయతీతో పోలీసుశాఖకు మంచిపేరు తీసుకురావాలి
మచిలీపట్నం, జూన్ 6: నీతి, నిజాయతీలతో పనిచేసి పోలీసుశాఖకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని నార్త్ కోస్టల్ జోనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సిహెచ్ ద్వారకా తిరుమలరావు పోలీసు అధికారులకు సూచించారు. నార్త్ కోస్టల్ ఐజిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిసిఆర్‌బి, స్పెషల్ బ్రాంచ్, క్లూస్, డిటిఆర్‌ఎస్, ఎఫ్‌పిబి తదితర విభాగాల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసిటిఎన్‌ఎస్ ప్రొగ్రామ్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్‌లకు అనుసంధానించి ఇకమీదట పోలీసు సేవలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా నైసర్గిక స్వరూపాన్ని సరిహద్దు జిల్లాలతో పంచుకుంటున్న సరిహద్దుల వద్ద తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజి విక్రమ్ సింగ్ మాన్, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు, అడిషనల్ ఎస్‌పి బాజ్‌పాయ్, డియస్‌పిలు, సిఐలు పాల్గొన్నారు.

భూ పోరాటాలకు శ్రీకారం చుట్టిన చండ్ర
విజయవాడ, జూన్ 6: భూస్వామ్య, జమిందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా భూపోరాటాలకు శ్రీకారం చుట్టి లక్షలాది ఎకరాలను భూమిలేని నిరుపేద రైతులకు పంచిన చండ్ర రాజేశ్వరరావు చిరస్మరణీయులని నగర ప్రథమ మేయర్ టి. వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ సూర్యదేవర నాగేశ్వరరావు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ కొనియాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ప్రారంభ సందర్భంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం స్థానిక కంట్రోల్ రూం వద్దనున్న సిఆర్ విగ్రహం వద్ద సభ జరిగింది. తొలుత చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి సూర్యదేవర నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి. వెంకటేశ్వరరావు, ఇండియన్ మెడికల్ రాష్ట్ర నాయకులు డా. రాంప్రసాద్, సిఆర్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా విశ్వశాంతి వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ నాయకులు శాంతి కపోతాలను ఎగురవేశారు. అనంతరం ప్రారంభమైన సభలో టి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో జన్మించిన సిఆర్ అభ్యుదయ భావజాలంతో జీవిత చరమాంకం పీడిత తాడిత ప్రజలకు అండగా ఉద్యమించారన్నారు. జమిందారీ,
జగిర్ధారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన సిఆర్ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన వీర తెలంగాణా సాయుధ పోరాటానికి నేతృత్వం వహించి 4వేల మందికి పైగా పోరాటయోధులను బలిదానమిచ్చారని కొనియాడారు. సూర్యదేవర నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాతగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన సిఆర్ సోవియట్ రష్యా ప్రభుత్వంచే ఆర్డర్ ఆఫ్ లెనిన్, జర్మన్ ప్రభుత్వంచే జార్జి డిమిట్రావ్ వంటి అత్యున్నత పురస్కారాలతో గౌరవించబడ్డారని కొనియాడారు. సిపిఐ ప్రధాన కార్యదర్శిగా దీర్ఘకాలం పాటు కొనసాగిన సిఆర్ ప్రజలకు అండగా అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించారని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన చండ్ర రాజేశ్వరరావు విజయవాడ నగరాన్ని కేంద్రంగా చేసుకుని నగరంలోని రౌడీ మూకలను అణిచివేశారన్నారు. నగరంలో కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక శైలితో ప్రజా ఉద్యమాలను చేపడుతూ ప్రజలతో మమేకమై పనిచేస్తుందని చెప్పారు. సిపిఐ నగర సమితి సభ్యులు వజ్జే మహేష్ వందన సమర్పణ చేసిన కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు జి. కోటేశ్వరరావు, పి. దుర్గ్భావాని, నగర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లా సూర్యారావు, వియ్యపు నాగేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు నవనీతం సాంబశివరావు, నూతక్కి సీతారామయ్య, డివి రమణబాబు, నగర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, మహిళా నాయకులు దుర్గాసి రవణమ్మ, జి. రాహేలమ్మ, తమ్మిన దుర్గ, సిరా లక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న అభయగోల్డ్ నిందితుల విచారణ
విజయవాడ , జూన్ 6: అభయగోల్డ్ వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరింత సమాచారం వెలుగుచూస్తోంది. బోర్డు తిప్పేసిన సంస్థ నిర్వహకులు అరెస్టుకు ముందే జాగ్రత్త పడి నగదు, బంగారం వంటివి సర్దేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరెస్టయి రిమాండులో ఉన్న ప్రధాన నిందితుడు మేనేజింగ్ డైరెక్టర్ కోకట్ల శ్రీనివాసరావుతోపాటు మరో ఇద్దరు బోర్డు డైరెక్టర్లు విజయరాజు, మహేష్‌లను కోర్టు ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీసులు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే రెండురోజులు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చినా మరో రోజు పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రస్తుతం నిందితులు పోలీసు కస్టడీలోనే కొనసాగుతున్నారు. ఏలూరు రోడ్డులోని అభయ గోల్డ్ గ్రూపు సంస్థలు కొద్దిరోజుల క్రితం ఖాతాదారులకు డబ్బు ఎగవేసి బోర్డు తిప్పేసిన సంగతి విదితమే. దీనిపై కేసు నమోదు చేసిన సూర్యారావుపేట పోలీసులు ఎండి శ్రీనివాసరావు, అతని భార్య అంబిక, డైరెక్టర్లు మహేష్, విజయరాజులతోపాటు మరో 14మందితో కలిపి మొత్తం 16మందిని నిందితులుగా గుర్తించారు. అయితే వీరిలో ఇప్పటి వరకు శ్రీనివాసరావు, అంబిక, మహేష్, విజయరాజులను మాత్రమే అరెస్టు చేయడం జరిగింది. మిగిలిన నిందితుల జాబితా పోలీసుల వద్ద ఉన్నప్పటికీ ఆ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇదే జరిగితే కనుక పరారీలో ఉన్న నిందితులు పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తపడటంతోపాటు దొడ్డిదారిలో కోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వెస్ట్ ఏసిపి హరికృష్ణ నేతృత్వంలో కేసు ప్రాధమిక దర్యాప్తులో సుమారు 62వేల మంది సంస్థ ఖాతాదారులకు దాదాపు 37కోట్ల మేర తిరిగి చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా మూడు కోట్ల రూపాయలు విలువ చేసే భవనం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో వివిధ చోట్ల వెయ్యికి పైగా ఎకరాల భూమిని గుర్తించి అందుకు సంబంధించి అసలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే రిమాండులో ఉన్న నిందితులను కస్టడీకి ఇస్తే మరింత సమాచారం సేకరిస్తామని కోర్టును కోరిన మీదట న్యాయస్థానం అనుమతి మేరకు రెండురోజుల పాటు కస్టడీకి తీసుకున్న పోలీసులు నిందితులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. గురువారంతో నిందితుల కస్టడీ ముగిసినందున తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. అయితే తమ విచారణ పూర్తి కాలేదని, కస్టడీ పొడిగించాలని పోలీసులు కోర్టును కోరగా మరోరోజు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. దీంతో గురువారం రాత్రి వరకూ విచారిస్తున్న పోలీసులు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇంట్లోనే అతని సమక్షంలో తిష్ట వేసి పలు పత్రాలు పరిశీలించడంతోపాటు వివిధ రకాలుగా ప్రశ్నిస్తున్నారు. ఇల్లు, పొలాల అదనపు డాక్యుమెంట్లుతోపాటు ఐదు కేజీల వెండి, రెండు లక్షలు నగదు గుర్తించారు. భారీ ఎత్తున బంగారం, నగదు మాత్రం వెలుగుచూడలేదని అధికారులు చెబుతున్నా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ అభయగోల్డ్ దర్యాప్తులో రహస్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు పలు ఆరోపణలూ ఎదుర్కోవడం గమనార్హం. కాగా తాజాగా సంస్థలో ఏజెంటుగా పని చేసిన దుర్గాపురానికి చెందిన కణజం కనకలింగేశ్వరరావు అనే సైకిల్ మెకానిక్ ఫిర్యాదుపై సూర్యారావుపేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సంస్థ ఎండి మరో 11మందిపై ఈ కేసు నమోదైంది. తాను 11మంది నుంచి రెండు లక్షల వరకు కట్టించినట్లు లింగేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలావుండగా కస్టడీలో ఉన్న నిందితులను విచారిస్తున్న పోలీసులు శుక్రవారం సాయంత్రంలోగా తిరిగి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

భూములు ఇచ్చే ప్రసక్తే లేదు
విజయవాడ, జూన్ 6: పోలవరం కాలువల నిర్మాణం.. ఆ తర్వాత బైపాస్ రోడ్డు నిర్మాణం వంటి అభివృద్ధి పనుల పేరిట ఎంతో విలువైన భూములు కోల్పోయాం. తిరిగి హైటెన్షన్ వైర్ల టవర్ల కోసం భూములను ఇవ్వమంటే ఇచ్చేది లేదని నున్న, ఇబ్రహీంపట్నం, భవానీపురం రైతులు ఖరాఖండిగా చెప్పారు. నున్న నుంచి నెల్లూరు కృష్ణపట్నం వరకు హైటెన్షన్ లైన్ల నిర్మాణంకు అవసరమైన టవర్లను నెలకొల్పేందుకై జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ దాసరి హరిచందన గురువారం తుది విడతగా రైతులతో చర్చలు జరిపారు. భూసేకరణ చట్టాల ద్వారా బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోవాలని చూస్తే ఊరుకోబోమని కూడా తెగేసి చెప్పారు. స్థానిక మార్కెట్ ధరను బట్టి నష్టపరిహారం అందచేయాలని పలువురు రైతులు కోరారు.

పాలప్యాకెట్లకు వెళ్లిన మహిళ మెడలో బంగారం చోరీ
విజయవాడ (క్రైం), జూన్ 6: తెల్లవారుజామున పాలప్యాకెట్ కోసం వెళ్లిన మహిళ మెడలోని బంగారు నగలు గుర్తు తెలీని వ్యక్తులు దోచుకుని పరారయ్యారు. పోలీసుల కథనం ప్రకారం... సత్యనారాయణపురం జ్ఞానఓలు వారి వీధికి చెందిన వలివేటి ఝాన్సీలక్ష్మీ (42) అనే మహిళ గురువారం ఉదయం పాలప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయలుదేరి పాలప్యాకెట్ తీసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. నాగంవారివీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న సమయంలో వెనుక నుంచి ఇద్దరు గుర్తు తెలీని వ్యక్తులు బైక్‌పై ఆమెను దాటుకుని ముందుకు వెళ్ళారు. మరలా తిరిగి ఎదురుగా వచ్చి ఆమెను సమీపించి మెడలోని ఏడు కాసుల బంగాను నానుతాడు, నల్లపూసల గొలుసు లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుల మతాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
పాయకాపురం, జూన్ 6: కుల,మత, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి కొలుసు పార్ధసారధి కోరారు. పెనమలూరు మండలం పోరంకి గ్రామ పరిధిలోని నారాయణపురం కాలనీ నుండి ఎనికేపాడు ఎన్‌హెచ్ 5 వరకు 48లక్షల్తో నిర్మించనున్న తారురోడ్డు పనులకు గురువారం ఉదయం మంత్రి సారధి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వేలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే మంజూరు చేసిన నిధలతో చేపట్టే పనులు నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉంటాయన్నారు. విద్య, వాణిజ్యపరంగా విజయవాడ నగరం అభివృద్ధి చెందటంతో ఒకప్పుడు గ్రామ ప్రాంతమైన పెనమలూరు మండలం నేడు పట్టణ వాతావరణాన్ని తలపిస్తుందన్నారు. పాశ్చాత్యపోకడల వల్ల పట్టణ ప్రాంత ప్రజలలో ఐకమత్యం కొరవడి కుల, మత, వర్గ, రాజకీయాలకు నిలయమవుతున్నాయన్నారు. తద్వారా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత ప్రజల మాదిరిగా పట్టణ ప్రాంత ప్రజలు ఐకమత్యంతో మెలిగి వారికి అవసరమైన వౌళిక వసతులు ఏర్పాటు చేసుకునేందుకు రాజకీయాలకు అతీతంగా సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకున్నప్పుడే ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. నారాయణపురం కాలనీలో కమ్యూనిటీహాలు నిర్మాణానికి శాసన సభ్యుల నిధుల నుండి 15 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కాలని ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను తీర్చేందుకు లైన్ల మరమ్మతు నిమిత్తం అవసరమైన 15 లక్షలను మంజూరు చేస్తున్నాననీ, వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. నారాయణపురం కాలని - నిడమానూరు రోడ్డు పక్కన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కాలనీవాసుల కోరిక మేరకు పార్క్ నిర్మాణానికి విజిటియం ఉడా నుండి అవసరమైన నిధులను మంజూరు చేయించడం జరుగుతుందన్నారు. ప్రజల సామాజిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడంలో వెనుకాడేది లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో నారాయణపురం కాలనీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్మల గోపాలకృష్ణ, కార్యదర్శి యం. ఆంధోనిరాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దామోదర్, స్థానిక పెద్దలు అల్లూరి సత్యనారాయణ, ఆచంట వెంకటరమణ, తహసిల్దార్ విజయ్‌కుమార్, అభివృద్ధి అధికారి జె.సునీత, పంచాయతీ రాజ్ డిఇ ఏడుకొండలు పాల్గొన్నారు.

నూతన విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా మరో ఆరు రోజుల్లో
english title: 
text books

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>