విశాఖపట్నం, జూన్ 6: విశాఖ నగరాభివృద్ధి సంస్థకు నిస్సత్తువ ఆవహించింది. ఒకప్పుడు చాలా బిజీగా ఉండే అధికారులు ఇప్పుడు నిర్లిప్తంగా కనిపిస్తున్నారు. నాలుగైదేళ్ల కిందట కొత్త లే-అవుట్‌లు, భూముల వేలం వంటి వివిధ రకాల కార్యకలాపాలతో బిజీగా ఉండే ఇక్కడి ఐఎఎస్ అధికారులు, ఇప్పుడు ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాల్సి వస్తోంది. గతంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం నుంచి వీరికి సహాయ సహకారాలు అందడంతో పనులు వేగవంతం చేసేవారు. కానీ వుడాలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. వుడా సొంత ప్రాజెక్ట్‌లనే పూర్తి చేయలేని దుస్థితికి చేరుకుంది. గత ఏడాది వుడా చిల్డ్రన్ ఎరీనా, వైఎస్‌ఆర్ పార్క్ పనులు జరుగుతున్నాయి. అంతకు ముందు చేపట్టిన హరిత ప్రాజెక్ట్ ఇంకా బాలారిష్టాల్లోనే కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో జరిగిన జాప్యం వలన వుడాకు, లేదా లబ్దిదారులకు చేతి చమురు వదిలే పరిస్థితి కనిపిస్తోంది. సుమారు ఆరేళ్ళ కిందట ప్రారంభించిన రో హౌసింగ్‌లో కొన్ని గృహాలను వేలం వేస్తే, కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లోని కొన్ని గృహాల నిర్మాణం పూర్తి కాకపోవడం, అది ఇప్పటి వరకూ కొనసాగడంతో వీటికి అప్పట్లో పలికినంత ధర ఇప్పుడు పలికే అవకాశం లేకుండాపోయింది. వీటిని త్వరలోనే వేలం వేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఇక వుడా వద్ద సుమారు 200 స్థలాలు ఉన్నాయి. వీటిని లే-అవుట్‌లుగా చేసి విక్రయించాలన్న ఆలోచన ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించకపోవడంతో ఈ విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉంది పరిస్థితి. ఒకవేళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, లాటరీ పద్ధతిలో స్థలాలను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు.
కుంభకోణమే పతనానికి కారణం!
ఒకప్పుడు దేదీప్యమానంగా వెలిగిన వుడా ఇప్పుడు ఇంత నిరాశాజనకంగా పనిచేయడానికి వుడాలో జరిగిన కుంభకోణమే కారణమని స్పష్టమవుతోంది. వుడాలో సుమారు 500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గత వైస్ చైర్మన్ కోన శశిథర్ నివేదిక ప్రభుత్వానికి పంపించారు. దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. వుడా స్థలాలకు అంటే బ్రాండ్ నేమ్ ఉండేది. ఈ కుంభకోణంతో ఆ పేరు మసకబారింది. వుడా భూములు కొనుగోలు చేయడానికి కూడా కొంతమంది వెనకాడే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ప్రస్తుత విసి వుడా కార్యాలయాన్ని ప్రక్షాళన చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు తప్ప, కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వుడాలో పనిచేస్తున్న సిబ్బంది సీట్లనైతే మార్చారు.. ఇందులో జరిగే అవినీతిని ఏమేరకు తగ్గించగలుగుతారో వేచి చూడాలి.
రాజకీయ వత్తిడులు
ఇదిలా ఉండగా వుడా అధికారులపై రాజకీయ వత్తిడులు తీవ్రంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వుడా పరిధి మూడు జిల్లాల వరకూ విస్తరించింది. ఈ మూడు జిల్లాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలన్నా, అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు మోకాలు అడ్డుపెడుతున్నట్టు తెలుస్తోంది. వారి మధ్య ఆధిపత్యపోరుతో వుడా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేకపోతున్నారని తెలుస్తోంది.
హాస్టళ్లపై అధికారుల దృష్టి
* మళ్లీ తెరుచుకోనున్న గ్రంథాలయాలు
* ప్రతి హాస్టల్‌కు ట్యూటర్లు
విశాఖపట్నం, జూన్ 6: సంక్షేమ హాస్టళ్ళంటే చిన్న చూపే అందరికీ. వీటిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అవి అక్కరకు రావడం లేదు. కానీ జిల్లా కలెక్టర్ శేషాద్రి, సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటి డైరక్టర్ శ్రీనివాసన్ తీసుకుంటున్న చర్యల వలన హాస్టళ్ళ రూపురేఖలు మారనున్నాయి. అంతేకాదు, ఇందులో చదువుతున్న విద్యార్థులను అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దనున్నారు. జిల్లా కలెక్టర్ వంద రోజుల ప్రణాళికలో భాగంగా హాస్టళ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. మైదాన ప్రాంతాల్లో ఉన్న 79 హాస్టళ్ళను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.
గత ఏడాది 1.2 కోట్ల రూపాయలతో హాస్టళ్ల మరమ్మతులు చేపట్టారు. మిగిలిన హాస్టళ్ళకు ఈ ఏడాది మరమ్మతులు కొనసాగించనున్నారు. హాస్టళ్ళలోని విద్యార్థులకు చాలా కాలం కిందట గ్రంథాల సదుపాయం ఉండేది. కానీ ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రంథాలయాల నిర్వహణ చేయలేక చేతులెత్తేశారు. గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలే కొనుగోలు చేయడం లేదు. గతంలో ఎప్పుడో కొనుగోలు చేసిన పుస్తకాలు కాస్తా చెదలు పట్టాయి. అలాగే విద్యార్థులకు అంతగా ఉపయోగం లేని పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి హాస్టళ్ళలోని గ్రంథాలయాలను పునరుద్ధరించనున్నారు. ఇందులో విద్యార్థుల ఆసక్తిగా చదివే కథల పుస్తకాలను ఉంచనున్నారు. అలాగే క్రీడా వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి ఒక్కో హాస్టల్‌కు వెయ్యి రూపాయలు కేటాయిస్తున్నారు.
ఇక హాస్టళ్ళలో విద్యార్థుల విషయానికి వస్తే, పదవ తరగతికి వచ్చిన తరువాతే ఆయా హాస్టళ్ళలో వార్డెన్లు వారిపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచడానికి హాస్టల్ వార్డెన్లపై వత్తిడి ఉండడం వలన మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి నివారించేందుకు మూడవ తరగతి నుంచే హాస్టల్ విద్యార్థులకు ట్యూటర్లను నియమిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఉత్తీర్ణతా శాతం తగ్గిపోవడం వలన చాలా మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్లిపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల పాఠశాలలను మూసివేసే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు హాస్టల్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. విద్యార్థులు చదివే స్కూళ్ళలో ఇచ్చిన హోంవర్క్‌లు సక్రమంగా పూర్తి చేస్తున్నారా? లేదా? సిలబస్ ఏవిధంగా జరుగుతోంది? అన్న విషయాలపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంటారు. విద్యార్థులకు ముందుగా గైడ్స్ ఇస్తారు. పాఠ్య పుస్తకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటారు. 8,9,10వ తరగతి విద్యార్థులు ఉన్న హాస్టళ్ళకు నలుగురు చొప్పున ట్యూటర్లను నియమించనున్నారు. మిగిలిన హాస్టళ్ళకు ఇద్దరు చొప్పున ట్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
రైతు బజారులో కూరగాయలు కరవు
ఉదయం 11 గంటలకే స్టాల్స్ ఖాళీ
వినియోగదారులకు తప్పని అవస్థలు
గోపాలపట్నం, జూన్ 6 : రైతు బజార్లలో కూరగాయల కొరత తీవ్రంగా ఉంది. ఉత్పత్తి తగ్గిపోవడంతో సరఫరా చాలా వరకూ నిలిచిపోయింది. గత నెల రోజుల క్రితం గోపాలపట్నం రైతు బజారుకు కాయగూరలు 650 క్వింటాళ్ల మేరకు సరఫరా కాగా గత రెండు రోజులుగా కేవలం 450 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా కావడంతో రైతు బజారు 11 గంటలకే ఖాళీ అయిపోతుంది. ఈ రైతు బజారుకు పెందుర్తి, సబ్బవరం పాయకరావుపేట, అరకు, శొంఠ్యాం, పాడేరు, దుంబ్రిగుడ తదితర ప్రాంతాల నుండి కూరగాయలను రైతులు తీసుకొస్తారు.
నెలరోజుల్లో తేడా ఇలా
నెలరోజుల కింద క్యాబేజీ 50 క్వింటాళ్ళు సరఫరా జరిగితే ఇప్పుడు కేవలం 5 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా జరుగుతోంది. టమాటా 50 క్వింటాళ్ళు సరఫరా అయ్యేది ఇప్పుడు కేవలం 25 క్వింటాళ్ళు మాత్రమే సరఫరా జరుగుతోంది. ఇక ఉల్లిపాయలు 50 క్వింటాళ్ల నుంచి 40 క్వింటాళ్ళకు తగ్గింది. బీన్స్ 11 క్వింటాళ్ళు సరఫరా జరిగితే ఇప్పుడు కేవలం ఒక క్వింటాకు మాత్రమే సరఫఱా జరుగుతోంది. మిర్చి 16 నుంచి 20 క్వింటాళ్ళు ఉండేది ఇప్పుడు 10 క్వింటాళ్ళు మాత్రమే జరుగుతోంది. అదే విధంగా బెండ, బంగాళ, ఇతర కూరగాయలు సరఫరా బాగా తగ్గిపోతుంది. ఆకుకూరలు అన్ని రకాల కల్సి 38 నుంచి 40 క్వింటాళ్ళు సరఫరా జరిగితే ఇప్పుడు కేవలం 15 క్వింటాళ్ళు మాత్రమే వస్తున్నాయి.
ప్రస్తుతం ధరలు
ఒక వైపు కూరగాయల సరఫరా తగ్గిపోవడంతో ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. రైతు బజారులో బీన్స్ కిలో 50 రూపాయలు కాగా. టమాటా 40 రూపాయలు, మిర్చి 40 రూపాయలు, క్యాబేజీ ఇరవై రూపాయలు బెండకాయ ఇరవై రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారు. ఇక అల్లం కిలో రూ. 150 దాటింది. దొండ, బెండ, బీర, చిక్కుడు కాకర తదితర కూరగాయలు రైతు బజారుకు తెచ్చిన గంట, అరగంటలోనే అయిపోతున్నాయి. ఆకు కూరల విషయానికొస్తే కొత్తిమీర ధరని చూస్తే అర్ధమవుతోంది. కొత్త మీర కట్ట గతంలో రూపాయికి, రెండు రూపాయలకు దొరికేది. ఇప్పుడు ఏకంగా పది నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు. పది రూపాయలకు తోటకూర కట్టలు 5, గోంగూర కట్టలు 4, పుదీన రెండు కట్టలు, మెంతికూర 3 కట్టలు చొప్పున విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా వర్షాలు పడి కూరగాయ పంటలు పండినంత వరకు ధరలు ఇలా బెంబేలెత్తిస్తాయని రైతులు అంటున్నారు. కాగా రైతు బజారులోనే పరిస్థితి ఇలా ఉంటే బహిరంగ మార్కెట్ ధరలు మరింత భయపెడ్తున్నాయని వినియోగదారులంటున్నారు.
టిక్కెట్ల ధరలు పెంపుపై దేవాదాయ వర్గాలతో చర్చిస్తా?
మంత్రి గంటా శ్రీనివాసరావు
సింహాచలం, జూన్ 6 : రాష్ట్రంలోని పలు దేవాలయాలలో పూజా టిక్కెట్ల ధరలు పెంపుపై దేవాదాయశాఖ మంత్రి అధికారులతో చర్చిస్తానని రాష్ట్ర ఓడరేవులు, వౌలిక వసతుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. గురువారం ఆయన సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టెక్కట్ల ధరలు పెంపుపై రాష్ట్రంలోని పలువురు స్వామీజీలు సింహగిరిపై చేసిన ధర్నా వ్యవహారంపై ఆరా తీశారు. ఈనేపథ్యంలో విలేఖరులడిగిన ప్రశ్నపై మంత్రి పై విధంగా స్పందించారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల ప్రణాళికను దేవస్థానం ఈవో రామచంద్రమోహన్, ఈ ఈ శ్రీనివాసరాజులు మంత్రికి వివరించారు. సుమారు 7 కోట్ల రూపాయల ఖర్చుతో కొండపై భక్తుల కోసం సత్రం నిర్మాణం చేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. 84 లక్షల రూపాలయలతో గజపతివర్మ పునర్నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు ఈవో తెలిపారు. సింహగిరి అంతా కాంక్రీట్ జంగిల్ చేసేయవద్దని పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. భక్తులకు వసతులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని మంత్రి సూచన చేశారు. భక్తుల కోసం తక్షణమే క్యాంటిన్ నిర్మాణం చేపట్టాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తెంశెట్టి శ్రీనివాసరావు అధికారులకు చెప్పారు. గోసంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. అంతకు ముందు మం6తి సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈవో రామచం6దమోహన్ మంత్రికి అర్చక పరివారంతో కలిసి సంప్రదాయంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. మంత్రితో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరా, 72 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంట్ల కిరణ్‌బాబు, కర్రి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన ఆర్టీసీ స్డూడెంట్ బస్ పాస్‌చార్జీలు
* అధికారుల నోట రోజుకో మాట
విశాఖపట్నం, జూన్ 6: స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీనిపై ఆర్టీసీ ఇన్‌చార్జ్ రీజనల్ మేనేజర్ చౌదరి అధ్యక్షతన గురువారం రాత్రి అధికారులతో సమీక్ష జరిగింది. స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలను ఒకేసారి కాకుండా స్వల్పంగానే పెంచినట్టు ప్రకటించారు. పెంచిన చార్జీలను రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
* భారీగా పెరిగిన చార్జీల్లో మళ్ళీ మార్పులు తీసుకువచ్చిన యాజమాన్యం పాత చార్జీలకు స్వల్పంగా భారాన్ని వేసింది. మూడు మాసాల బస్‌పాస్ చార్జీలు ఇంతవరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో రూ.85లున్న చార్జీలుండగా దీనిని రూ.130కి పెంచింది. దీనిని రూ.315లకు పెంచుతూ యాజమాన్యం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అనుమతించకపోవడంతో ఉపసంహరించుకున్న ఆర్టీసీ యాజమాన్యం తాజాగా రూ.130ని నిర్ణయించింది. అలాగే ఎనిమిది కిలోమీటర్లకు సంబంధించి మూడు మాసాలకు రూ.105లుండగా దీనిని స్వల్పంగా పెంచినట్టు సంబంధితాధికారి తెలిపా. 12 కిలోమీటర్ల పరిధిలో రూ.130లు, 18కిలోమీటర్ల పరిధిలో రూ.150లు, 22 కిలోమీటర్ల వరకు రూ.175లు ఉన్న మూడు మాసాల బస్‌పాస్ చార్జీలను స్వల్పంగా పెంచుతున్నట్టు తెలిపింది. అలాగే విశాఖ నగరంలో జనరల్ స్టూడెంట్ బస్‌పాస్ (మూడు మాసాలు) రూ.240లుండగా దీనిని రూ.390లకు పెంచాలని సంస్థ నిర్ణయించింది.
* గ్రామీణ ప్రాంతాల్లో
జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ స్టూడెంట్ బస్‌పాస్ చార్జీలను స్వల్పంగా పెంచింది. అయిదు కిలోమీటర్ల మేర రూ.55, అదే పది కిలోమీటర్లకు రూ.75లు, 15కిలోమీటర్లకుగాను రూ.90, 20కిలోమీటర్ల వరకు రూ.120లు, 25కిలోమీటర్ల పరిధిలో రూ.150లు, 30కిలోమీటర్ల వరకు రూ.165లు, 35కిలోమీటర్ల మేర 180వరకు బస్‌పాస్ చార్జీలు కొనసాగుతున్నాయి. అయితే వీటిని భారీగా పెంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించిన సంస్థకు స్వల్పంగానే పెంచాలనే ఆదేశాలొచ్చాయి. దీంతో పెంచిన చార్జీలను ఉపసంహరించుకుని స్వల్పంగా పెంచుతున్న చార్జీలనే అమలు చేయాలని నిర్ణయించింది. వీటిని కూడా ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.
1997 తర్వాత ఇదే పెరుగుదల
1997వ సంవత్సరం దాటిన నుంచి ఇంతవరకు స్టూడెంట్ బస్‌పాస్‌ల చార్జీలు పెరగలేదు. ఇపుడు కూడా స్వల్పంగానే పెంచినట్టు సంస్థ తెలిపింది. ఎటువంటి భారం మోపకూడదని, మధ్యతరగతి, పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టుకూడదనే ఉద్దేశ్యంతో యాజమాన్యం స్వల్పచార్జీలనే అమలు చేయాలని నిర్ణయించినట్టు అధికారి ఒకరు తెలిపారు.
విద్యుత్ పొదుపుతోనే సామర్ధ్యం పెంపు
* సౌరశక్తిపైనే ప్రత్యేక దృష్టి
విశాఖపట్నం, జూన్ 6: రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ అవసరాల కోసం సోలార్ ప్రాజెక్ట్ తప్పనిసరి కానుంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ప్రభుత్వరంగ సంస్థలన్నీ ఈ రోజు సోలార్ ప్రాజెక్ట్‌ల వైపే దృష్టిసారిస్తోంది. ఈ ప్రాజెక్టును నెలకొల్పినపుడే తప్ప అక్కడ నుంచి మరెపుడూ పెట్టుబడి పెట్టే అవసరం ఉండకపోగా, అవసరమైన విద్యుత్‌ను నిరంతం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందువలనే దీనిని ఎలాగైనా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలోభాగంగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలో సోలార్ పవర్‌ను అందుబాటులో తీసుకురావడం, అంతవరకు విద్యుత్ సామార్ధ్యాన్ని పెంచుకోవడం, పొదుపు అంశాలను పాటించడం వంటి అంశాలను పటిష్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎస్‌ఇసిఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మెంబర్ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. దీంతో ఆయన గురువారం విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం విద్యుత్ పొదుపు, భవిష్యత్‌లో పెరిగే డిమాండ్, సంస్థ వాడకం తదితర కీలక అంశాలపై ఆయన చర్చించారు. సహజ వాయువు, బొగ్గును రక్షించుకుంటూనే విద్యుత్ అవసరాలకనుగుణంగా దీని సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నది ప్రధాన లక్ష్యంగా ఆయన పేర్కొన్నా. దీని కోసం కార్యాచరణ రూపొందించాలని కూడా సూచించారు. విద్యుత్ వృధాను తగ్గించడం, ఇందుకోసం విద్యుత్ సామర్థ్యం, విద్యుత్ పొదుపు (ఇఇ అండ్ ఇసి) ప్రమాణాలను పాటించడం, ఇందులో కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలు మునిపాలిటీ, వుడా, వ్యవసాయ, విద్యుత్, పంచాయతీరాజ్‌శాఖ, పరిశ్రమలు భాగస్వామ్యం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల దాదాపు 15వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేయవచ్చని ఎనర్జీ కన్జర్వేషన్ కమిటీ అంచనా వేస్తుంది. అలాగే ఆయా ప్రభుత్వ సంస్థలకు వీటిపై బోదించి, తద్వారా మార్పు తీసుకురావలనే లక్ష్యంతో కార్యచరణ రూపొందించనుంది. దీనిలోభాగంగా జిల్లా ఎనర్జీ కనె్వర్వేషన్ కమిటీ, జిల్లా కలెక్టర్‌తో సమావేశమై శుక్రవారం ఆయన తగిన సూచనలు చేయనున్నారు. ఆ తరువాత కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. తొలిదశలో భాగంగా విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, కడప, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లకు వాడే విద్యుత్‌పై దృష్టిపెట్టనున్నారు. దీనిపై నాల్గవ ఉన్నత స్థాయి ఎస్‌ఇసిఎం సమావేశం ఈనెల 15వ తేదీన మధ్యాహ్నాం 2.30 గంటలకు సెక్రటేరియట్‌లో జరుగుతుంది. దీనిలో వేర్వేరు విద్యుత్ పొదుపు కార్యక్రమాలపైన, సోలార్ పవర్‌పై చర్చిస్తారు. ========
దేవస్థానంలో ఒక ఉద్యోగి సస్పెన్సన్
* మరో ఉద్యోగికి చార్జి మెమో
సింహాచలం, జూన్ 6: విధి నిర్వహణలోనున్న అర్చకులపై అనుచిత వ్యాఖ్యాలు చేసిన నాల్గవ తరగతి ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఇవో రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయ ఏఇఓపై అనుచితంగా ప్రవర్తించిన మరో ఉద్యోగికి చార్జ్ మెమో ఇచ్చారు. ఉద్యోగులు క్రమశిక్షణగా విధులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని ఇవో హెచ్చరించారు.
శంకర్ ఫౌండేషన్‌ను సందర్శించిన శివస్వామి
విశాఖపట్నం, జూన్ 6: విశాఖపట్నం వేపగుంట సమీపాన ప్రత్యేకంగా నెలకొల్పిన శంకర్ ఫౌండేషన్‌ను శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర పీఠాధిపతి, విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బ్రహ్మచారి శివస్వామి గురువారం సందర్శించారు. ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆత్మకూరి శంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిలావళలర్పించారు. అనంతరం శంకర్ ఫౌండేషన్‌లో గల వివిధ విభాగాలను పరిశీలించారు. శంకర్ ఫౌండేషన్ పనిచేస్తున్న తీరును నిరుపేదలకు, గ్రామీణ ప్రాంతవాసులకు ఉచితంగా చేపడుతున్న కంటి శస్తచ్రికిత్సల సేవా కార్యక్రమాలను సంస్థ హెచ్‌పిసి వి.రమేష్‌కుమార్ స్వామిజీకి వివరించారు. అనంతరం శివస్వామి ప్రసంగిస్తూ నిస్వార్ధంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు నిదర్శనంగా శంకర్ ఫౌండేషన్ రూపుదిద్దుకోవడం ప్రశంసనీయమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ఆదర్శంగా శంకర్ ఫౌండేషన్ నిలుస్తుందన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డాక్టర్లు,సిబ్బందికి ఆశీస్సులు అందజేశారు. శంకర్ ఫౌండేషన్‌ను సందర్శించిన వారిలో క్షేత్రం ప్రతినిధి చంద్రశేఖర కవి, ఆథ్యాత్మికవేత్త ఎమ్‌వి రాజశేఖర్, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వివిధ ఆశ్రమాల ప్రతినిధులు, శంకర్ ఫౌండేషన్ సంస్థ నిర్వాహాకులు సిఇఓ ఆనంద్‌సుదన్, కె.రామారావు తదితరులు పాల్గొన్నారు. స్వామిజీ శివస్వామికి పూలమాలతో స్వాగతం పలికి ఫౌండేషన్‌ను సందర్శించినందుకు సంస్థ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు ఆపండి
* ఆర్డీవోను ఆదేశించిన జెసి ప్రవీణ్‌కుమార్
సబ్బవరం, జూన్ 6: సబ్బవరం,ఇరువాడ పంచాయతీల్లోని విలువైన ప్రభుత్వ బంజరుభూముల అన్యాక్రాంతంపై జిల్లాకలెక్టర్ వి.శేషాద్రి కొరడా ఝళిపించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో జిల్లాజాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ గురువారం దర్యాప్తుప్రారంభించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు విశాఖ ఆర్డీవో రంగయ్య,ఎడి సర్వేకుమార్, ఎల్‌పి ఎస్‌పిడి ఎస్.వెంకటేశ్వరరావు,ట్రైనీ కలెక్టర్ మురళీతో కలిసి ఆయన ముందుగా ఇక్కడి తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.ఇరువాడ గ్రామ పంచాయతీ పరిధిలోని 142/2లోని ప్రభుత్వ బంజరుభూమికి సంబంధించిన వివరాలు,సబ్బవరం సర్వేనెంబర్ 271లోని 5 సబ్‌డివిజిన్లలోని రికార్డు దాఖలా వివరాలను క్షణ్ణంగా పరిశీలించారు. గతంలో పనిచేసిన తహశీల్దార్లు,ఎంఆర్‌వోలు ప్రభుత్వ బంజరు భూములను దారాదత్తం చేసిన వివరాలను సైతం తెలుసుకన్నారు. అప్పటికే సాయంత్రం 6.30 గంటలు సమయం కావటంతో విలేఖర్లకు సైతం ఇంటర్యూ నిరాకరించిన జాయింట్ కలెక్టర్ మసక మసక చీకట్లోనే సబ్బవరంలో ఆక్రమణలకు గురయిన సర్వే నెంబర్ 271లోని అక్రమ కట్టడాలను అసకపల్లి సర్వేనెంబర్-1లోని కొండ గుట్టపై ఆక్రమణలను పరిశీలించారు.అయితే ఈమొత్తం బంజరుభూమిలో 5ఎకరాలు సామాజిక అడవులకు చెందిన మదర్ నర్సరీకి కేటాయించినట్లు ఆర్డీవో రంగయ్య తెలిపారు. మిగిలిన భూమి ఐదు సబ్‌డివిజన్లలో విస్తరించి ఉందని తెలిపారు.అందులోకొంత మందికి ఎస్సీ,బిసి కాలనీలు మంజూరు చేసినట్లు రికార్డుల ప్రాప్తికి వివరించారు. అయితే 271లోని భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం వాగు ఫోరంబోకగా పేర్గొని ఉన్నట్లు ఆర్డీవోతెలిపారు. దీంతో కోర్టుకేసుల్లో కౌంటర్‌ను మార్చిగెడ్డ్ఫోరంబోకగానే చూపించాలని జెసి ఆదేశించారు. అంతేకాకుండా సబ్బవరం సర్వేనెంబర్‌లోని మొత్తం 88.02 ఎకరాల విస్తీర్ణం మొత్తాన్ని సమగ్రమైన సర్వే చేసి విలువైన భూమి చుట్టూకంచె నిర్మించాలన్నారు.సర్వెనెంబర్ 271/2లో దెడ్డం ప్రసాద్ ఆక్రమించాడని అధికారులు తెలిపారు. దీంతో అధికారుల బోర్డులు సైతం తొలగిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆక్రమణలు తొలగించే సమయంలో అధికారులను అడ్డుకున్న వారిని ఉపేక్షించేది లేదని వారికి రక్షణగా ప్రత్యేక పోలీసు బలగాలతోపాటు ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ను తమకు కేటాయించాలని జిల్లాఎస్‌పి శ్రీనివాస్‌ను జాయింట్ కలెక్టర్ కోరారు. సబ్బవరం విఆర్‌వో కృష్ణకుమార్ పర్యవేక్షణ సరిగాలేదని గుర్తించిన జెసి ఇక్కడ పర్మినెంట్ విఆర్‌వోను నియమించాలని ఆదేశిస్తూ ఆ విఆర్‌వోప్రత్యేకించి సర్వేనెంబర్ 271 భూమికి పర్యవేక్షణాధికారిగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్రమైన సర్వేపూర్తయ్యేవరకు ఆర్డీవో ప్రతీ రోజూ పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ సమయంలో కొందరు ఆక్రమణ దారులు తమ వద్ద పట్టాలున్నాయంటూ జెసికి చూపించటంతో వాటిని రికార్డుల్లో ఇన్‌కార్పోరేట్ అయ్యాయో లేదో చూడాలని తహశీల్దార్ నాగభూషణాన్ని ఆదేశించారు. దీంతో ఆర్డీవో రంగయ్య కల్పించుకుని వారి వద్ద 2001లోజారీచేసినట్లు చెబుతున్న ఎల్‌పిసిలున్నాయని అప్పటికి ఇందిరమ్మపధకం లేదన్నారు. ఇంటి పట్టాపొందిన లబ్ధిదారుడు 6నెలల లోపు గృహం నిర్మించకుంటే అది చెల్లుబాటు కాదన్నారు. ఈనేపధ్యంలో ఇక్కడి ఆక్రమణలకు ముఖ్యకారణం విద్యుత్ శాఖ అధికారులు మీటర్లు మంజూరు చేయటం పంచాయతీ కార్యదర్శులు పన్నులు వేయటం లాంటి తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయంటూ కొందరు జెసి దృష్టికి తీసుకురావటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ బంజరుభూములకు వారి అజమాయిషీ ఏమిటని ప్రశ్నిస్తూవారికికూడ నోటీసులు జారీచేయాలని ఆర్డీవోను కోరారు. ఈపర్యటనలోజెసితోపాటు ఆర్డీవోరంగయ్య,ఎడి సర్వేకుమార్,ట్రైనీ కలెక్టర్ మురళీ,ఎల్‌పి ఎస్‌డిసి వెంకటేశ్వరరావు,తహశీల్దార్ నాగభూషణరావు,ఆర్‌ఐ రమేష్ పాల్గొన్నారు.
‘లైఫ్‌లో లవ్’ సినిమా షూటింగ్ సందడి
చోడవరం, జూన్ 6: మాతా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న లైఫ్‌లో లవ్ అనే చిత్రం షూటింగ్ రెండవ షెడ్యూల్ చోడవరం సంతోష్ షాపింగ్ మాల్‌లో గురువారం జరిగింది. హీరోహీరోయిన్లు కలసి వస్తద్రుకాణంలో షాపింగ్ చేసేందుకు వచ్చిన దృశ్యాన్ని చిత్రీకరించారు. డైరెక్టర్ ప్రేమ్‌తేజ్ దర్శకత్వంలో కెమెరామేన్ బండి చక్రపాణి ఆయా సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరో విశాఖకు చెందిన సాయిసంతోష్ కాగా, హీరోయిన్ స్థానికురాలే కావడం వలన పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో యువకులు తరలివచ్చి షూటింగ్‌ను తిలకించారు. స్థానిక సుధా బ్యూటీక్లీనిక్‌కు చెందిన యజమాని కె.సుదీర్, సుధ దంపతుల రెండవ కుమార్తె హనీ(మేఘనాగుప్తా) సినిమాలో పేరు సుమశ్రీ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమెడియన్లుగా కళ్లుచిదంబరం, కొండవలస లక్ష్మణరావు, ప్రసన్నకుమార్, అంబికా శ్రీను నటిస్తున్నారు.
ఈ సందర్భంగా కలిసిన విలేఖరులతో డైరెక్టర్ ప్రేమ్‌తేజ్ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యంలో అందమైన ప్రేమకథా చిత్రంగా యువతకు మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని అందిస్తున్నామన్నారు. చిత్రం రెండవ షెడ్యూల్ కొద్దిరోజుల్లో పూర్తిచేసుకుని నెలరోజుల్లోగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సిఉండగా కొందరు ప్రముఖ నటులకు కాల్షీట్లు అధికంగా ఉండటంతో షూటింగ్ ఆలస్యమైందని అన్నారు.
సబ్ ప్లాన్ నిధులలో గిరిజన విద్యకు పెద్దపీట
గిరిజన సంక్షేమ మంత్రి బాలరాజు
పాడేరు, జూన్ 6: గిరిజన ప్రాంతాలలో విద్యాభివృద్ధికి ఎస్.టి. సబ్ ప్లాన్ నిధుల నుంచి 78 శాతం వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. విశాఖ మన్యంలో విద్యా ప్రమాణాల పెంపుకు చేపడుతున్న చర్యలపై స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో డివిజన్ స్థాయి అధికారులు, పాఠశాలలు, కళాశాలల ప్రదానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధి గతంలో కంటే మెరుగుపడినప్పటికీ ఇంకా ప్రగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన విద్యకు ఇంతవరకు అత్యధిక శాతం నిధులను వెచ్చించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో పనిచేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు అంకితబావంతో విధులను నిర్వర్తించకపోవడం వలనే సర్కారు లక్ష్యం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారంతా గిరిజనులే అయినప్పటికీ గిరిజన విద్యాభివృద్ధికి అంకితబావం కనబరచకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతం అతి తక్కువగా ఉందని, దీనిని అధిగమిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పాఠశాలల నుంచి మధ్యలో బడిమానివేసిన విద్యార్థుల సంఖ్యను తగ్గించాలని ఆయన చెప్పారు. ప్రతి పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న బాలికలను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన ఆదేశించారు. గత నాలుగు సంవత్సరాలలో గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఏర్పాటుతో పాటు విద్యార్ధులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ కొరకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చించినట్టు ఆయన తెలిపారు. ఏజెన్సీలోని ప్రతి మండల కేంద్రంలో 15 లక్షల రూపాయల వ్యయంతో సహాయ గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయ భవనాలను నిర్మించనున్నట్టు ఆయన చెప్పారు. పాడేరు ఐ.టి.డి.ఎ.లో అన్ని శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. రాజీవ్ విద్యామిషన్ ద్వారా ముద్రించిన విద్యా సంబరాల వాల్‌పోస్టర్లను ఈ సందర్భంగా బాలరాజు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వై.నరసింహరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతిరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి, ఏజెన్సీలోని అన్ని మండలాల గిరిజన సంక్షేమ సహాయ అధికారులు, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల ప్రదానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు మోకాలడ్డితే ఉపేక్షించేది లేదు
*మంత్రి బాలరాజు హెచ్చరిక
పాడేరు, జూన్ 6: ప్రభుత్వం విడుదల చేస్తున్న అభివృద్ధి పనుల నిధులు సకాలంలో వినియోగించక ప్రభుత్వానికి చెడ్డపేరు తమ నిర్లక్ష్యం కారణంగానే వస్తుందని మండల ప్రత్యేక అధికారులపై గిరిజన సంక్షేమ శాఖమంత్రి పసుపులేటి బాలరాజు మండిపడ్డారు. స్ధానిక ఐ.టి.డి.ఎ.సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక అధికారుల సమావేశంలో ఆయన ప్రత్యేక అధికారుల తీరుపై తీవ్రంగా స్పందించారు. గిరిజన ప్రాంతంలో కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించకపోగా అభివృద్ధికి మోకాలడ్డుతూ సకాలంలో పనులు జరగకుండా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో సాగుతున్న అభివృద్ధి పనులపై పూర్తి స్ధాయిలో దృష్టి సారించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంతో పాటు అనేక అభివృద్ధి పనులకు ప్రత్యేక అధికారులు చెల్లింపులు జరపాల్సి ఉండగా గ్రామస్ధాయిలో నియమించబడే వ్యక్తికి చెల్లింపులపై అనేక ఆంక్షలు విధించడంతో పాటు బ్యాంక్‌ల నందు అందించాల్సిన సమాచారం అందించకపోవడంతో పాటు తమ గుర్తింపు కార్డులు అందించకపోవడం వంటి పలు సమస్యలు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని ఆయన చెప్పారు. ప్రత్యేక అధికారులు అభివృద్ధికి సహకరించే విధంగా వ్యవహరించక తమదే అధికారం అన్న చందంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనులు చేస్తున్న వారికి ఇబ్బందులు కలుగజేయకుండా వారికి సహకరించాల్సిందిగా ఆయన కోరారు. బిల్లుల చెల్లింపులు ఇతర అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడానికి ప్రత్యేక అధికారులు కారణం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయని, పునరావృతం అయితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం గిరిజన ప్రాంతానికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి పనులు చేపడుతుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విదంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక అధికారులు తమ తీరు మార్చుకోవాలని హితవుపలికారు. ఇకపై ప్రత్యేక అధికారుల కారణంగా ప్రగతికి అవరోదం ఏర్పడుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందితే శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతంలో సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. అదే విదంగా రానున్న కాలంలో గిరిజనులకు విత్తనాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుని ముందస్తుగా విత్తనాలను సమకూర్చుకోవడంతో పాటు గిరిజనులకు సరఫరా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మండల స్ధాయిలో జరుగుతున్న సానిటేషన్ , కరెంట్, తాగునీటి సమస్యలు పరిష్కారం, వైద్య సేవలు, ఐ.కె.పి., జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనుల్లో దృష్టి సారించాలని మంత్రి బాలరాజు కోరారు. ఈ కార్యక్రమంలో పాడేరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం.గణపతిరావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.మల్లిఖార్జునరెడ్డి, కార్యనిర్వాహక ఇంజనీర్లు బి.అప్పలనాయుడు, ఎం.ఆర్.జి.నాయుడు పాల్గొన్నారు.
వై ఎస్ ఆర్ వుడా సెంట్రల్ పార్కులో ప్లానిటోరియం
మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖపట్నం, జూన్ 6 : మహా విశాఖ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించనున్న డాక్టర్ వై ఎస్ ఆర్ వుడా సెంట్రల్ పార్కులో మిని ప్లానిటోరియంను ఏర్పాటు చేసే ప్రతిపాదనను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక సదుపాయాల శాఖ మాత్యులు గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. గురువారం ఉదయం పార్కు పరిధిలో అభివృద్ధి చేసిన వెలుపలి నడక దారి ( ఎక్స్‌టర్నల్ జాగింగ్ ట్రాక్)ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై ఎస్ ఆర్ పార్కును ఆహ్లాదకర కేంద్రంగానే కాకుండా విజ్ఞానదాయక సందర్శన స్థలంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పార్కు ఆవరణలో ప్లానిటోరియం ఏర్పాటు ప్రతిపాదిస్తున్నామన్నారు. నక్షత్రశాల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక అధ్యయనాన్ని వుడా చేపడుతుందన్నారు. వై ఎస్ ఆర్ వుడా సెంట్రల్ పార్కును బహుళ ప్రయోజన కేంద్రంగా నగరవాసులకు అంకిత చేసేందుకు వుడా ప్రణాళికల ఉ చేపట్టిందని పేర్కొంటూ పార్కు పరిధిలో ఒక్కొక్కటిగా సౌకర్యాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. సుమారు 35 కిలోమీటర్ల పొడవున్న ఎక్స్‌టర్నల్ జాగింగ్ ట్రాక్ పొడవునా 720 చెట్ల పెంపకంతో పాటు పార్కు అంతటా 2వేలకు పైగా మొక్కల్ని నాటేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రూ. 35 కోట్ల వ్యయంతో చేపట్టిన పార్కులో ఇప్పటికే 10 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని తెలిపారు. కైలాసగిరి కొండ దిగువన వుడా అభివృద్ధి చేసిన హెల్త్ ఎరినాను కూడా నెలరోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ఈనెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నగర పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున వుడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా ఆరోజు నిర్వహించేందుకు సమాలోచన చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ వుడా విసి డాక్టర్ మనోజ్, చిఫ్ ఇంజనీర్ ఐ.విశ్వనాథరావు, కార్యదర్శి డాక్టర్ జెసి కిషోర్‌కుమార్, డి ఎఫ్ ఒ డాక్టర్ ఎస్.రెహ్మాన్, ఎస్టేట్ అధికారి బి.భవానీదాస్, ఫారెస్టు రేంజ్ అధికారి రమేస్, ప్రజాస్పందన అధ్యక్షులు సి. ఎస్.రావు, పేడాడ రమణకుమారి, విశాఖ వాకర్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రాజపాత్రుడు, కార్యదర్శి ఆర్.రామారావు తదితరులు పాల్గొన్నారు.