విజయనగరం, జూన్ 6: త్వరలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. ఓ పక్క అధికారులు పంచాయతి ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేస్తుంటే మరోపక్క రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికలను 2011 జనాభా ప్రాతిపథికన ఎన్నికలు నిర్వహించడంతో జిల్లాలో కేవలం 14 వార్డులు మాత్రమే పెరిగాయి. అయితే ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయించాలనే దానిపై తర్జనభర్జన జరుగుతుంది. ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లు మొత్తం ఎన్ని కేటాయించాలనే దానిపై గ్రీన్ సిగ్నల్ లభించగానే మిగిలిన తంతు ముగిసే విధంగా జాబితాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే రిజర్వేషన్లపై మార్గదర్శకాలు జారీ అయినా ఏ కేటగిరీకి ఎన్ని పంచాయతీలు కేటాయించాలన్న దానిపై మరింత స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. .2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయతీల్లో 18,76,676 మంది జనాభా కాగా, 2011 నాటికి 19,17,089గా ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వలసలు పెరగడం, ఇతర కారణాల వల్ల కొన్ని పంచాయతీల్లో వార్డుల సంఖ్య తగ్గాయి. మరికొన్ని చోట్ల వార్డుల సంఖ్య పెరిగింది. కాగా, గత పదేళ్ల వ్యవధిలో కేవలం 14 కొత్త వార్డులు ఏర్పాటు కావడం గమనార్హం. ఇటీవల నగర పంచాయతీగా ఏర్పడిన నెల్లిమర్లలో జర్జాపుపేట, గతంలో విజయనగరం మున్సిపాలిటీలో అయ్యన్నపేట, కనపాక, ధర్మపురి, గాజులరేగ పంచాయతీలు విలీనమయ్యాయి. పార్వతీపురం మున్సిపాలిటీలో ఇటీవల నవిరి పంచాయతీ చేరడంతో వార్డులు కేవలం 14 మాత్రమే పెరిగాయి. 2001 నాటికి వార్డుల సంఖ్య 8750 వార్డులు ఉండగా, 2011 నాటికి 8764 వార్డులకు పెరిగాయి. కాగా, ఎన్నికల కోసం ప్రస్తుతం బ్యాలెట్ పత్రాల ముద్రణ చురుగ్గా సాగుతోంది. మరోపక్క మండలాల వారీగా, పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. మరో రెండు రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు ఎంతెంత రిజర్వేషన్ కేటాయించారో తేలనుంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలను ఎదుర్కొనేందుకు కసరత్తు మొదలు పెట్టారు. దీంతో అన్ని పార్టీల్లోను రాజకీయ సందడి మొదలైంది.
ఆర్టీసీ ఆర్.ఎం బాధ్యతల స్వీకరణ
విజయనగరం, జూన్ 6: ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజనల్‌మేనేజర్ పి.అప్పన్న తెలిపారు. ఆర్టీసీ ఆర్.ఎం.గా గురువారం ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా బస్సులు నడుపూతూ మెరుగైన సేవలు అందించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజల వద్దకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తామని, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమనే విషయాలపై అవగాహన కల్పిస్తామన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనాలు, మోటారు వాహనాల చట్టం నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలపై దాడులు నిర్వహిస్తామని అప్పన్న తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రయాణికుల రద్దీగా ఎక్కువ ప్రాంతాల్లో ప్రత్యేకంగా బస్సులు నడుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్‌మేనేజర్లు కొటాన శ్రీనివాసరావు, గండి సత్యనారాయణ, విజయనగరం డిపోమేనేజర్ పిబిఎంకె రాజు, డిపో అసిస్టెంట్‌మేనేజర్ ముత్తిరెడ్డి సన్యాసిరావుతదితరులు పాల్గొన్నారు.
ఆండ్ర బ్రిడ్జికి శంకుస్థాపన
మెంటాడ, జూన్ 6 : మండలంలోని చంపావతి నదిపై ఆండ్ర గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్యలు గురువారం భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్‌డిఎఫ్, ఐఎపి నిధుల నుంచి 1.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజన్నదొర మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఆండ్ర గ్రామంతోపాటు కల నేటికి నెరవేర బోతుందన్నారు. ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను గుర్తించుకుని నిధులు మంజూరు చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఉపాధి పనులు కల్పించలేదని అడగడానికి వెళుతున్న కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కూలీలు సభా ప్రాంగణానికి సమీపంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆర్ రవిశంకర్, జిల్లా టెలికాం కమిటీ మెంబర్ రెడ్డి రాజప్పలనాయుడు, ఆండ్ర బ్రిడ్జి ఇఇ ఎవి సబ్బారావు, పార్వతీపురం డిఇ ఎస్ శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఎడి కె.్ఫణి, ఎంపిడిఓ జి.వెంకటరావు, మండల తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, మాజీ ఎఎంసి చైర్మన్ పి.అప్పలనాయుడు, మాజీ జెడ్‌పిటిసి సభ్యురాలు దేశరి భానుమతి, మాజీ సర్పంచ్‌లు కుంచు తిరుపతినాయుడు, చింతగడ శంకరరావు, యవర్న అప్పారావు, ఆండ్ర ఎస్సై బాబురావుతోపాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
‘వడ్డీ చెల్లింపులకు నిధుల విడుదల’
విజయనగరం (్ఫర్ట్టు), జూన్ 6: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఇంతవరకు 52,176 మందిరైతులకు శూన్యవడ్డీ వర్తించిందని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ తెలిపారు. సహకార సంఘాల్లో రుణబకాయిల వసూళ్లు, శూన్యవడ్డీ, డిపాజిట్ల సేకరణ తదితర అంశాలపై గురువారం డిజిఎం కె.వెంకటేశ్వరావుతో సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ రెండు కోట్ల 89 లక్షల 95 వేల రూపాయల శూన్యవడ్డీని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఆయా సహకార సంఘాల్లో ఈ వడ్డీని జమ చేస్తామన్నారు. 2012-2013 రబీసీజన్‌కు సంబంధించి రుణాలు తీసుకున్న రైతులు ఈనెలాఖరులోగా చెల్లిస్తే శూన్యవడ్డీ వర్తింపు జరుగుతుందన్నారు. ఈనెలాఖరునాటికి 90శాతం రుణబకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఇంతవరకు 72శాతం వసూలు చేశామన్నారు. మిగతా 18శాతం రుణబకాయిలను ఈనెలాఖరులోగా వసూలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఖరీఫ్‌సీజన్‌లో ఇంతవరకు రెండుకోట్ల రూపాయల పంటరుణాలను అందించామన్నారు.
హోంగార్డుల నియామకాలకు
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం, జూన్ 6: జిల్లా పోలీస్ శాఖలో వివిభ విభాగాల్లో ఖాళీగా ఉన్న 21 హోంగార్డు పోస్టులు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతున్నట్లు ఎస్పీ కార్తికేయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల గల అభ్యర్థులు ఈ 12 నుంచి 27 తేది వరకు జిల్లా పోలీస్‌పెరేడ్ గ్రౌండ్‌లోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. పోలీస్‌వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని, హాల్‌టికెట్లను పొందవచ్చని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ధరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ధరఖాస్తుకు, హాల్‌టికెట్ (ఇన్‌డూప్లికేట్), అర్హతలు చెప్పే గజిటెడ్ సంతకంతో కూడిన జెరాక్స్ పత్రాలు, నాలుగు కలర్ పాస్‌ఫోర్టుసైజు ఫొటోలతోపాటు ఎస్టీ అభ్యర్థుల మినహా మిగిలిన అభ్యర్థులంతా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, విజయనగరం 25 రూపాయల డిడితో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12 నుంచి 27 తేదిలోగా అన్ని పనిదినాల్లోను ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. కేటగిరిలో-ఎలో మహిళా హోంగార్డు ఉద్యోగాలకు అభ్యర్థులు, టెన్త్ ఉత్తీర్ణత సాధించి, మైదానా ప్రాంతానికి చెందిన వారు కనీసం 250 సెం.మీ ఎత్తు కలిగి ఉండాలన్నారు. ఎస్టీ అభ్యర్థులకు 5 సె.మీ వెసులు బాటు కల్పించినట్లు చెప్పారు.
‘అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టండి’
విజయనగరం, జూన్ 6: వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మలేరియా లక్షణాలను వివరించి మలేరియా రాకుండా ఉండేందుకు వారిలో అవగాహన కల్పించాలన్నారు. మురుగు కాలువల్లో దోమలు పెరగకుండా పిచికారి చేయాలన్నారు. సాక్షర భారత్ సహకారంతో ఆయా గ్రామాల్లో ప్రేరక్‌లు ఉన్నందున మలేరియా గ్రామాల్లో విజృంభించకుండా అధికారుల దృష్టికి తీసుకురావడం, ప్రజల్లో అవగాహన కల్పించడం చేయాలన్నారు. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో మలేరియా వ్యాధి విజృంభించే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో మలేరియా నిర్మూలనకు చేపడుతున్న చర్యల గురించి డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి వివరించారు.
‘10లోగా ఆధార్ కార్డులు అందజేయండి’
విజయనగరం, జూన్ 6: నగదు బదిలీ పథకానికి (డిబిటి) సంబంధించి బీసీ వసతిగృహ లబ్ధిదారులకు ఆధార్ కార్డులను అందజేయాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరావు వసతిగృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ ఈ నెల పదో తేదీలోగా పూర్తి చేయాలన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నగదు బదిలీ పథకానికి ఎంపికైన బీసీ విద్యార్థులలో ఆధార్ కార్డులు లేని విద్యార్థులను గుర్తించి వారికి ఆధార్ అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లో ఆధార్ మంజూరు చేసేందుకు బయోమెట్రిక్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది నగదు బదిలీ పథకం ద్వారా ఉపకార వేతనాలను పంపిణీ చేయాల్సి ఉన్నందున ఆధార్ లేకపోతే వారు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల ఉపకార వేతనాలను పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సహాయ బీసీ సంక్షేమాధికారి వి.హరిబాబు, సహాయ బీసీ సంక్షేమాధికారి కె.సూరిబాబు పాల్గొన్నారు.
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైళ్లు
విజయనగరం, జూన్ 6: కొత్తవలస మండలంలోని నిమ్మలపాలెం గ్రామ సమీపంలో డీజిల్ తీసుకెళ్తున్న గూడ్స్ రైలు నిలిచిపోవడంతో సుమారు గంట సేపు మిగిలిన రైళ్లు నిలిపివేశారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఇంజన్ సామర్థ్యం చాలకపోవడంతో గూడ్స్ రైలు నిలిచిపోయిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ గూడ్స్ రైలు నిలిచిపోవడంతో కొత్తవలస-విజయనగరం మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొత్తవలస రైల్వే స్టేషన్‌లో పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్, పలాస వెళ్ళాల్సిన ఇఎంయు రైలుతోపాటు మిగిలిన రైళ్లను నిలిపివేశారు. గంట తరువాత రైళ్లు రాకపోకలు మొదలయ్యాయి.
‘ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయండి’
విజయనగరం, జూన్ 6: జిల్లాలో ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శోభ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వివిధ పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన లబ్ధిని నగదు బదిలీ పధకం కింద అందజేసేందుకు ఆధార్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె ఎంపిడిఒలు, వసతిగృహ సంక్షేమాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా ఆధార్ నంబర్లు లేని వారికి బయోమెట్రిక్ చేయించి ఇఐడి నంబరును కేటాయించి బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేయడంలో బాధ్యత వహించాలన్నారు. జిల్లాలో నగదు బదిలీ పథకం కింద ప్రి, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, జననీ సురక్ష యోజన పథకం కింద గర్బిణీ స్ర్తిలకు చెల్లించే ప్రసూతి వేతనం మొదలైనవి ఆధార్ కార్డులతో అనుసంధానం చేసి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయడానికి నిర్ణయించినట్టు తెలిపారు. కాగా, ఆధార్ మ్యాచింగ్ అయిన వాటిని, మ్యాచింగ్ కాని జాబితాలను తయారు చేసి మ్యాచ్ కాని లబ్ధిదారుల వివరాలను డంప్ జాబితాలో సరి చూడాలన్నారు. వసతి గృహ సంక్షేమాధికారులు ప్రత్యేక శ్రద్ధతీసుకొని లబ్థిదారుల యుఐడి, ఇఐడి నంబర్లను సంబంధిత ఖాతాలకు అనుసంధానించడానికి కృషి చేయాలన్నారు. జూన్ పదో తేదీలోగా ఇఐడి జాబితాను సమర్పిస్తే వాటిని ఆధార్‌తో అనుసంధానం చేయిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు, జెడ్పీ సిఇఒ మోహనరావు, బీసీ సంక్షేమాధికారి సంజీవరావు, ఎంపిడిఒలు, వసతిగృహ సంక్షేమాధికారులు పాల్గొన్నారు.
‘్భ చేతన’ విజయవంతానికి పిలుపు
విజయనగరం, జూన్ 6: భూ చేతన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి జెడి లక్ష్మణరావు కోరారు. గురువారం రైతు శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూచేతనతో భూసార పరిరక్షణ అనే అంశంపై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సరళి, సేంద్రియ ఎరువులు తగ్గడం, రసాయన ఎరువులు విచక్షణ రహితంగా వాడటంతో భూసారంలో అసమతౌల్యం ఏర్పడుతుందన్నారు. పశువుల పెంపకం తగ్గడం వల్ల రసాయన ఎరువులకు డిమాండ్ పెరిగిందన్నారు. అందువల్ల సాగు ఖర్చు కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు. ‘డాట్’ హెడ్ గురుమూర్తి మాట్లాడుతూ రైతులు అధిక మోతాదులో ఎరువులు వాడటం వల్ల పంటలపై విపరీతంగా ఖర్చు పెరుగుతుందన్నారు. దీనివల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. దీనిని అధిగమించడానికి అవసరానికి అనుగుణంగా శాస్ర్తియ పద్దతిలో ఎరువులను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా భాస్వరం ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు విజయనగరం ఏరువాక కేంద్రంలో భూచేతన పథకంలో భాగంగా ముఖ్యమైన పంటలకు ప్రధమశ్రేణి క్షేత్రాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. రైతు శిక్షణ కేంద్రం డిడి ఆషాదేవి మాట్లాడుతూ రైతులు పంట దిగుబడులు తగ్గకుండా సాగు ఖర్చు తగ్గించుకునేందుకు భూసార పరీక్షలు జరుపుకోవాలన్నారు. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా లభ్యమయ్యే పోషకాలు అధిక మోతాదులో ఉండటం వల్ల పైరుకు సిఫార్సు చేసిన మోతాదులో 30 శాతం తగ్గించాలన్నారు. లబ్య పోషకాలు తక్కువ మోతాదు ఉంటే సిఫార్సు చేసిన పోషకాలు 30 శాతం అధికంగా వాడాలన్నారు. భూసార పరీక్షతో సూక్ష్మ లోపాలను గుర్తించి వాటిని అధిగమించే వీలు ఉంటుందని వివరించారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆత్మా పిడి రాజబాబూరావుతోపాటు పలువురు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఎసిబికి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్
విజయనగరం, జూన్ 6: పట్టణంలోని దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న స్థలంలో ఓ మహిళ తోపుడు బండిపై టిఫిన్ అమ్ముకునేందుకు అనుమతి కోరగా జూనియర్ అసిస్టెంట్ తనకు రూ.3వేలు లంచం ఇస్తే తప్ప తోపుడు బండి పెట్టుకోడానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఆమె ఎసిబి అధికారులను ఆశ్రయించింది. ఎసిబి డిఎస్పీ కెసిఎస్ రఘువీర్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గూడాచారి వీధిలో నివాసం ఉంటున్న రేణుకాబాయి తోపుడు బండి పెట్టుకునేందుకు దేవాదాయశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లంకా సన్యాసినాయుడు రూ.3వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె ఇంటి వద్దకు వెళ్లి జూనియర్ అసిస్టెంట్ సన్యాసినాయుడు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఎసిబి ఇన్‌స్పెక్టర్ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించాలంటూ చెరకు రైతుల ఆగ్రహం
సీతానగరం, జూన్ 6: లచ్చయ్యపేట ఎన్.సి. ఎస్. సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు బిల్లులు సకాలంలో చెల్లించనందున గురువారం ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ, సి.పి.ఎం., తదితర వామపక్షాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట శాంతియుతంగా రైతులంతా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. యాజమాన్యం రైతులను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు బొబ్బిలి, సీతానగరం ప్రధాన జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రైతులతో చర్చలు జరపడానికి వచ్చిన సి.ఇ.ఒ. ఆంజనేయులకు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫ్యాక్టరీ సీజన్ ముగిసి దాదాపు నాలుగు నెలలు కావస్తున్న బకాయిలు పూర్తిచేయకపోవడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది రైతులు సహనం కోల్పోయి సి.ఇ.ఓ., మరికొంతమంది అధికారులను ఫ్యాక్టరీలో పరుగులెత్తించారు. అనంతరం పోలీసులు రక్షణ మధ్య సి.ఇ.ఓ.ను కార్యాలయంలోనికి తరలించారు. అప్పటికీ శాంతించని రైతులు ఫ్యాక్టరీ అద్దాలను పగులుగొట్టారు. మరికొంతమంది ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వారు. ఈ సంఘటన ఫ్యాక్టరీ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేసింది. రహదారి మధ్యలో టెంటు వేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అనంతరం విషయం తెలుసుకున్న పార్వతీపురం ఆర్డీ ఓ జె.వెంకటరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఫ్యాక్టరీ రికార్డులను పరిశీలించగా 27కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు గుర్తించామని, ఈ మొత్తాన్ని ఈనెల 15వ తేదీలోగా అందించాలని లేనిపక్షంలో తదుపరి జరిగే పరిణామాలకు ఎన్.సి. ఎస్. యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బి.చిరంజీవులు, మండల అధ్యక్షులు కె.తిరుపతిరావు, రైతు సంఘం నాయకులు ఆర్.శ్రీరామ్మూర్తి, ఆర్.వేణు, సి.పి. ఎం. జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు, రెడ్డి లక్ష్మునాయుడు, ఈశ్వరరావు, జి.సత్యనారాయణ, తదితరులతోపాటు సుమారు 150మంది రైతులు పాల్గొన్నారు.