నెల్లూరు, జూన్ 7: గుజరాత్‌లో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడం వలనే ఆ రాష్ట్రం వైపుపారిశ్రామిక వేత్తలంతా పెట్టుబడులు మళ్లించేలా దృష్టిసారిస్తున్నారని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఎంపి కపల్‌సేన్ పేర్కొన్నారు. కార్మిక చట్టాల్ని కాలరాస్తూ పెట్టుబడిదార్లను ఆహ్వానిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన రాష్ట్రం వెలిగిపోతోందని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అంబానీ వంటి పెట్టుబడిదారులు కార్మికశక్తిని దోచుకోవడంలో ముందుంటారన్నారు. అందుకే వారంతా గుజరాత్ వైపుఆకర్షితులవుతున్నారన్నారు. ఇలాంటి దుశ్చర్యలను సిపిఎం అనుబంధ కార్మిక సంఘమైన సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సిఐటియుకు అనుబంధంగా పనిచేసే ఏపిఎస్‌ఆర్‌టిసి ఎస్‌డబ్ల్యూఫ్ తొమ్మిదవ రాష్టమ్రహాసభలు నెల్లూరులో నిర్వహిస్తున్నారు. రెండోరోజైన శుక్రవారం కపల్‌సేన్ హాజరై పతాకావిష్కరణతో సహా ప్రారంభోపన్యాసం చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ బలమైన యూనియన్‌గా ఆర్టీసీలో ఎదిగేందుకు సూచనలు, సలహాలు తెలిపారు. ఎనిమిది గంటల పనిదినాలు కూడా కాలరాసేక్రమం అధికంగా ఉండటాన్ని ఉద్దేశించి పాలకుల తీరును దుయ్యబట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ సిబ్బంది కొరత వల్ల ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు పనిఒత్తిడితో అల్లాడిపోతున్నారన్నారు. కార్మికుల వెతలు వర్ణనాతీతంగా ఉంటున్నాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకు సిపిఎం అనుబంధ సిఐటియూ విస్తృతంగా పోరాటం చేస్తుందన్నారు. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రవాణాశాఖ అధికార యంత్రాంగం అవినీతి, చేతివాటానికి స్వస్తిపలికితే ఆర్టీసీకి ఊపిరినిస్తుందని అభిప్రాయపడ్డారు. కార్మిక వ్యతిరేక చర్యల్ని ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యకర్తలంతా మూకుమ్మడిగా తిప్పిగొట్టాలన్నారు. ఏపిఎస్ ఆర్టీసీకి విక్రయిస్తున్న డీజిల్‌పై ప్రభుత్వ పన్ను మినహాయింపు ఉండాలన్నారు. ప్రైవేటీకరణ, అసంఘటిత రంగానికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. ప్రభుత్వాల పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించాలన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు ఆర్టీసీలో కార్మిక వర్గానికి నమ్మకం కలిగించాలన్నారు. ఏపిఎస్ ఆర్టీసీలో ఎస్‌డబ్ల్యూఎఫ్ చిన్నదే అయినా భవిష్యత్‌లో పెద్దదిగా తయారవ్వాలన్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన పలువురు ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యకర్తలైన ఆర్టీసీ కార్మికులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఇంకా సిఐటియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఎంఎల్‌సిలు యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, విఠపు బాలసుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.
గుజరాత్‌లో కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయడం
english title:
gujarath
Date:
Saturday, June 8, 2013