కందుకూరు, జూన్ 7: అసలే పంట దిగుబడి తీవ్రంగా తగ్గడంతో విలవిల్లాడిపోతున్న మామిడి రైతులను రోజురోజుకు దిగజారుతున్న ధరలు మరింత కృంగదీస్తున్నాయి. ఏప్రిల్ నెలలో రైతులను ఊరించి, ఆశల పల్లకిలో ఊరేగించిన మార్కెట్ ధరలు ప్రస్తుతం దిగజారుతుండడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 17వేలకుపైగా మామిడి తోటలు ఉన్నాయి. అందులో మూడొంతుల విస్తీర్ణం ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే ఉన్నాయి. జనవరిలో మంచు, చీడపీడలు తదితర కాణాల వల్ల ఈసారి మామిడి దిగుబడి దారుణంగా పడిపోయింది. సాధారణ పంట దిగుబడి ఎకరాకు 4టన్నులు కాగా, ఈసారి ఒకటిన్నర నుంచి రెండు టన్నులకు మించలేదు. ప్రకాశం జిల్లాలోనేకాక రాష్టమ్రంతటా దిగుబడి ఇలాగే తగ్గడంతో ఈసారి మామిడికి మంచి ధర పలుకుతుందని రైతులు ఆశించారు. పంట దిగుబడి తగ్గడం వలన వచ్చిన నష్టాన్ని మంచి ధర పలికితే కొంత అయినా పూడ్చుకోవచ్చునని భావించారు. కాయలు కొద్దిమొత్తంలో కోతకు వచ్చిన ఏప్రిల్, మే నెలల్లో రైతు అంచనాలకు అనుగుణంగానే ధరలు పలికాయి. బంగినపల్లి టన్ను ధర 25వేల నుంచి 30వేల వరకు పలికింది. అయితే మే నెల చివరి నాటికి ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం బంగినపల్లి మామిడి ధర 20వేల నుంచి 25వేల రూపాయల మధ్య ఉంది. ధరలు తగ్గడంతోపాటు కొనుగోళ్లు కూడా మందగించాయి. ఇటీవల ఈదురు గాలుల వలన గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో మామిడి కాయలు నేలరాలాయి. దాంతో కూడా చాలావరకు నష్టం సంభవించింది. ఈప్రాంతాల నుంచి బంగినపల్లి మామిడి ప్రతి ఏటా ముంబయి, చెన్నై వంటి నగరాలకు ఎగుమతి అయ్యేవి. ముంబయి ఎగుమతి వ్యాపారులు రైతుల నుంచి పోటీలు పడి బంగినపల్లి మామిడి కొనుగోలు చేసేవారు. ఈఏడాది ముంబయి ఎగుమతిదారులు ఒకరిద్దరు మినహా రాలేదు. ఉలవపాడు, గుడ్లూరుకు చెందిన దళారుల ద్వారా నెల్లూరు జిల్లాలో సరుకును కొనుగోలు చేస్తున్నారు. ఈప్రాంతంలో టర్బో లారీకి సరిపడా బంగినపల్లి ఒకే ఒక్క తోటలో దొరక్కపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఐదారు తోటలలో ఏరితే టర్బో లారీకి సరిపడ బంగినపల్లి మామిడి దొరకడం లేదు. నెల్లూరు జిల్లాలో పంట దిగుబడి తక్కువగానే ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న వింజమూరు, ఉదయగిరి ప్రాంతాల్లో 20నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో పెద్దమామిడి తోటలు ఉన్నాయి. అలాంటి తోటలలో ఒక్కొక్క తోటలోనే ఒక కనీసం టర్బోలారీ సరుకు లభిస్తుంది. అందువలనే మన ప్రాంతంలో సరుకు కొనుగోలు ప్రారంభించిన ముంబయి ఎగుమతి వ్యాపారులు ఒకరిద్దరు ఎక్కువ నెల్లూరు జిల్లా తోటలపైనే మక్కువ చూపుతున్నారు.
బెంగళూరు మామిడికి ధర తక్కువే
జిల్లాలో బంగినపల్లి మామిడి తరువాత ఎక్కువగా పండే బెంగళూరు మామిడి ధర టన్ను 7వేల రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఈ మామిడిని అధికంగా కొనుగోలు చేసే జ్యూస్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కొనుగోలుకు రావడం లేదు. బెంగళూరు మామిడి పచ్చళ్లు, అవసరాల కోసం కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొద్దిమొత్తంలో ఎగుమతి చేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీల నుంచి పోటీ లేకపోవడంతో ధర తక్కువగా ఉంది. గత సీజన్‌లో టన్ను 35వేల రూపాయలు పలికిన పెద్ద రసాలు కూడా ఈసారి 18వేల రూపాయలకు మించలేదు. బెంగళూరు మామిడి దాదాపు సమానంగా పలికే చెరకు రసం మాత్రం రైతులను పెద్దగా నిరాశ పరచలేదు. గత నెలలో టన్ను 16వేల రూపాయలు పలికిన చెరకు రసం మామిడి ధర ఇప్పటికీ అదే ధర వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బంగినపల్లితో పోల్చితే ఏటా దండిగా పంట దిగుబడి వచ్చే చెరకురసం మామిడికి ఈమాత్రం ధర లభించడం పట్ల కొంతవరకు రైతులు సంతృప్తి చెందుతున్నారు.
చిరు వ్యాపారుల కూటమి
బడా వ్యాపారులు రంగంలో లేకపోవడంతో ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, చిలకలూరిపేట, తేనాలి ప్రాంతాలకు చెందిన చిన్న వ్యాపారులు ఇక్కడ మామిడి కొనుగోళ్లకు కూడపలుక్కొని వ్యవహరిస్తున్నారు. ఈ చిరు వ్యాపారులు మూడు నుంచి ఐదు టన్నుల వరకు బంగినపల్లి మామిడి కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి సరుకును కూడా ప్రతిరోజు కొనుగోలు చేయరు. ఒకరోజు మూడు టన్నులు కొనుగోలు చేసి వాటిని తీసుకువెళ్లి ఆప్రాంతంలో చిరు వ్యాపారులకు విక్రయించి మళ్లీ కొనుగోలుకు వచ్చేసరికి మూడు రోజులు సమయం పడుతుంది. ఇలాంటి చిరు వ్యాపారులకు పెద్దగా సరుకు అవసరం లేకపోవడంతోపాటు అందరూ కూడబలుక్కొని బంగినపల్లి ధర ఇప్పటికే 19వేల రూపాయలకు మించకుండా చేశారు. సాధ్యమైతే ఇంకా ధర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదిఏమైనా ఈఏడాది మామిడి రైతులకు ఒక పక్క చీడపీడలు, మరోపక్క ధరలు, మరోవైపు వడగాల్పుల వల్ల తోటలలో చెట్లమీదనే కాయలు పండి నేల రాలడంతో పెద్ద ఎత్తున నష్టం సంభవించింది.