అద్దంకి, జూన్ 7: నిత్యం రద్దీగా ఉండే స్టేట్‌బ్యాంకు రోడ్డులో...శుక్రవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో ప్రముఖ వైద్యుడు కోగంటి రంగారావు ఇంటిలో భారీ చోరీ జరిగింది. విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు వెంటనే దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కేంద్రం ఒంగోలు నుండి పోలీస్‌డాగ్, క్లూస్‌టీంను రప్పించారు. అద్దంకిలో భారీ చోరీ జరగడంతో నిందితులను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించి వెంటనే ఇనె్వస్టిగేషన్ ప్రారంభించింది. దర్శి డిఎస్‌పి వెంకటలక్ష్మి, దర్శి సిఐ శ్రీరాం (అద్దంకి ఇన్‌చార్జి), ఇన్‌చార్జి ఎస్సై ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులనడిగి వివరాలు సేకరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగులు రంగారావు ఇంటి ముందు ఉన్న ఇనుపమెస్ గేట్ తాళాలు పగలగొట్టి లోపలకు వెళ్ళారు. ఇంటికి ప్రధాన ద్వారాన్ని గడ్డపలుగుతో పగలగొట్టి డాక్టర్ దంపతులు నిద్రిస్తున్న బెడ్‌రూంలోకి వెళ్ళారు. తలుపులు పగిలిన శబ్దానికి నిద్రలేచిన దంపతులను ఐదుగురు దుండగులు గడ్డపలుగులు, కత్తులు చూపించి బెదిరించారు. దుండగులందరూ ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌస్‌లు వేసుకొని ఉన్నారు. డాక్టరుగా మీరు మాకు తెలుసని, గొడవ చేయకుండా కూర్చోవాలని బెదించారు. అనంతరం ఐదుగురిలో ఇరువురు దంపతులకు కాపలగా ఉండగా, మరో ముగ్గురు ఇంటిలోని బీరువాల్లో ఉన్న 7లక్షల రూపాయల నగదు, 80 సవర్ల బంగారం, ఇంకా వెండి వస్తువులు దోచుకున్నారు. మొత్తం కలిపి సుమారు 25లక్షల రూపాయల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దోపిడి అనంతరం బాధిత దంపతులు బయటకు వచ్చి ఇంటి చుట్టుపక్కల వారికి దోపిడీ విషయం తెలియచేశారు. దొంగల ఆచూకీ కోసం స్థానికులు వెతికినప్పటికి ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేదించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దుండగుల్లో డాక్టరుకు తెలిసిన వారెవరైనా ఉండి ఉండవచ్చునని, మిగిలిన వారు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రొఫెషనల్ దొంగలై ఉంటారని భావిస్తున్నారు.
7 లక్షల నగదు, 80 సవర్ల బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
english title:
robbery
Date:
Saturday, June 8, 2013