ఒంగోలు, జూన్ 7 : రాష్ట్రప్రభుత్వం ఏక్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధమైంది. అందులో భాగంగా బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను జిల్లా పంచాయతీ అధికారులు సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా 1028 పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియలో రాష్ట్రప్రభుత్వం మునిగితెలుతోంది. ఈనెల 15,16తేదీల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు అయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. రిజర్వేషన్ల జాబితావిడుదలైన తరువాత జిల్లాలో ఎన్నికల వేడి ప్రారంభంకానుంది. ఈపాటికే జిల్లాలో సహకార సంఘ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తన ఉనికిని కాపాడుకుంది. కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఈదరమోహన్ విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల్లో తన సత్తాచాటేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, తెలుగుదేశంపార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల రెండవ విడత జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి తన సత్తాచాటినప్పటికీ నేతల్లో మాత్రం అంతర్గత కుమ్ములాటలు జోరందుకుంటున్నాయి. ఈ ప్రభావం పంచాయతీ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గాల్లోని వైఎస్‌ఆర్‌సిపి నేతలు ఎవరికివారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల్లో ఏమేరకు విజయం సాధిస్తారో వేచిచూడాల్సి ఉంది. పంచాయతీ, ఎంపిటిసి, జిల్లాపరిషత్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ఆయా రాజకీయపక్షాల నేతలు గ్రామాల్లోని ముఖ్యనేతలతో సమావేశం అవుతున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే ఏ నాయకుడు ఏ పార్టీకి చెందినవారో స్పష్టంగా అర్ధమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలు జరిగితే గ్రామాల్లోని నేతలు రెండు నుండి మూడు గ్రూపులుగా విడిపోవటం, వారు ఆయా రాజకీయపార్టీలకు అండగా ఉండటం జరుగుతుంది. దీంతో రాజకీయపార్టీల బలబలాలు గ్రామాల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందో ఆ మెజార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ నాయకులు భావిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో తమకు బలం ఉందని వైఎస్‌ఆర్‌సిపి నేతలు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో వారి బలం ఎంతో తెలిసిపోనుంది.
అన్ని పార్టీలకు పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మాకంగా మారటంతో నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మొత్తంమీద వచ్చేనెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు అధికారవర్గాల సమాచారం.
పంచాయతీ ఎన్నికలు జరిగిన వెంటనే ఎంపిటిసి, జడ్‌పిటిసిలు ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం మునిసిపల్ ఎన్నికలు జరగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది పొడువునా ఎన్నికలు జరిగే అవకాశాలుండటంతో ఆయారాజకీయపక్షాలకు చెందిన నేతలు, జిల్లా అధికారులు బిజిబిజిగా ఉండనున్నారు. మొత్తంమీద త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలపైనే నేతలు దృష్టిసారించారు.
* 15వతేదీ తరువాత రిజర్వేషన్ల జాబితా విడుదల
english title:
panchayat elections
Date:
Saturday, June 8, 2013