మానవుడు ఏ పని చేసినా నమ్మకంతో చేస్తాడు. చేసిన పనికి ఫలితం ఆశిస్తాడు. నమ్మకం లేని పని జోలికి పోడు. విశ్వాసం, నమ్మకం, నమ్మిక, ఆశ ఈ పదాలు ఇంచుమించు ఒకే అర్థాన్ని సూచిస్తాయి. సంసార జీవనం సవ్యంగా సాగాలంటే భార్యాభర్తలకు పరస్పరం నమ్మకం ఉండాలి. లేకుంటే సంసారం నరకమే! నమ్మకం మానసికమైనది. ఎవరి నమ్మకం వారిది. కొందరు ఏడుకొండల వేంకటేశ్వరుని దైవంగా భావిస్తే మరికొందరు షిర్డీసాయిబాబాని దైవంగా నమ్ముతారు. నమ్మకానికి శాస్ర్తియమైన సిద్ధాంతం ఏదీ లేదు. దీన్ని గాఢ నమ్మకము, మూఢ నమ్మకము లేక గుడ్డి నమ్మకముగా విభజించవచ్చు. నమ్మకము వ్యక్తిగతమైనది, సామాజికమైనదిగా కూడా చెప్పవచ్చు. ప్రతి పనికీ ఫలితం ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు.
వ్యక్తిగతమైన మూఢనమ్మకం, గుడ్డి నమ్మకం వల్ల ఇతరులకు కష్టం, నష్టం, హాని, అసౌకర్యం జరగనంతవరకూ ఏ ఇబ్బంది లేదు. అయితే ఆ వ్యక్తి తన మూఢ నమ్మకాన్ని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తే ఘర్షణ తప్పదు. కొందరికి శకునాలపై నమ్మకం ఉంటుంది. అటువంటి వ్యక్తి అర్జంటు పనిపై ఊరికి ప్రయాణమై గుమ్మం దిగగానే అపశకునం ఏదో ఎదురవుతుంది. ఆ వ్యక్తి వెంటనే ఇంట్లోకి వెళ్లి కాళ్లు, చేతులు కడుక్కుని, కాసేపు కూర్చుని, మంచినీరు తాగి బయల్దేరుతాడు. ఈ మారు కూడా అపశకునం ఎదురైతే మళ్లీ అదే తంతు. మంచి శకునం ఎదురయ్యే వరకు ఎదురు చూస్తే ఆ రైలు కానీ బస్సు కానీ మిస్సవక మానదు. ఇంకొందరు ఫలానా రాయి వున్న ఉంగరం ధరిస్తే జీవితంలో అంతా మేలే జరుగుతుందని నమ్ముతారు. అందుకు ఎంత సొమ్మయినా వెచ్చించి సంపాదిస్తారు. ఇలాంటి వ్యక్తులను పసిగట్టి వీరి మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి మరికొందరు వేచి వుంటారు.
తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఈత రాకపోయినా నావ నడిపేవాడు తమను సురక్షితంగా నదిని దాటిస్తాడనే నమ్మకంతో అంతా అందులోకి ఎక్కుతారు. డ్రైవరుపై నమ్మకంతో బస్సు, రైలు, విమానాలలో ప్రయాణిస్తుంటాం. సాధారణంగా ఈ నమ్మకాలు వమ్ముకావు. అది సామూహిక ప్రగాఢ నమ్మకం. తొలకరి సమయంలో రైతులంతా భూమిని దున్ని విత్తనాలు జల్లుతారు. విపరీత పరిస్థితులలో తప్ప ఏటా కరవు రాదు. విద్యార్థులంతా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలనే నమ్మకంతో ఎంతో కష్టపడి చదువుతారు.
పట్న వాసుల్లోకంటే పల్లె ప్రజలలో మూఢ నమ్మకాలు ఎక్కువ. తమ కుటుంబ సభ్యులకు కానీ, పశువులకు కానీ ఏదైనా వ్యాధి వచ్చినా అది గాలి, ధూళి, దిష్టి, చేతబడి, చిల్లంగి వల్ల వచ్చి ఉంటుందనే మూఢ నమ్మకంతో వారు భూతవైద్యులను, మంత్రగాళ్లను సంప్రదించి విభూది, తావీదు, ముడుపు, దిగతుడుపు వంటి వాటితో ప్రాణహానికి గురవుతారు. డాక్టరు వద్దకెళ్లి వైద్యం చేయించుకోరు. కలుషిత ఆహారం, నీరు, గాలి వల్ల కలరా, డయేరియా, మలేరియా, మశూచి వంటివి వస్తే గ్రామ దేవతల ఆగ్రహం వల్లనే వచ్చాయనే మూఢనమ్మకంతో మొక్కుబడులు, ముడుపులు వంటి వాటిని నమ్మి ప్రాణాలు పోగొట్టుకుంటారు తప్ప ఆరోగ్య సూత్రాలు పాటించరు. కొందరు వ్యక్తులు సరైన ఆహారం తినక, నిద్ర లేమితో, పని వత్తిడివల్ల, కుటుంబ కలహాల వల్ల హిస్టీరియా వంటి జబ్బులకు లోనవుతారు. వారి మాటలు, చేష్టలు విపరీతంగా ఉంటాయి. దేవుడు పూనాడనే మూఢనమ్మకంతో హారతులు, నైవేద్యాలు, మొక్కుబడులు వంటివి జరిపిస్తుంటారు. పూనకం వచ్చిన వ్యక్తి కోరిన కోరికలు నెరవేర్చి ఉపచారాలు చేస్తుంటారు. దీనికి కారణం నిరక్షరాస్యత. చదువు ద్వారా ప్రజలను చైతన్య వంతుల్ని చేస్తే మూఢ నమ్మకాలను అదుపు చేయవచ్చు.
మనుషుల్లోనే కాదు పశువులు, జంతువులు, పక్షుల్లో కూడా విశ్వాసం ఉండాడాన్ని మనం గమనింవవచ్చు. తమకు ఆహారాన్ని ఇచ్చి పోషించే యజమమానులకు పశువులు శక్తివంచన లేకుండా సేవలందిస్తాయి. చిక్కటి పాలను అందిస్తాయి. పంట పొలాలకు ఎరువులను సమకూర్చుతాయి.
మంచిమాట
english title:
n
Date:
Thursday, June 13, 2013