అసుర సైనికులు మహోగ్రంగా రథాలు ప్లవంగ వీరులపైకి నడపారు. మర్కట యోధులు ఆ రథాలపైకి ఉరికి వాటిని ముక్కలు ముక్కలు అయేలా తొక్కివేశారు. నిశాచరులు మత్తగజాలను ఢీకొల్ప తరుచరులు ఆ ఏనుగులను అవనిపై కూల్చివేశారు.
ఈ రీతిగా రాక్షస, వానర వీరులకు భీకరంగా సంకుల సమరం జరిగింది. ఆ దొమీ యుద్ధంలో వనచర వీరులు అమరారులను డాసి ప్రళయ కాలాంత యముడి వడువున తమ పాదాలతో తొక్కి మదోగ్రకరుల్ని పట్టి నేలమీద తటించి చంపివేశారు. వానరులను కొందరిని పట్టుకొని నలిపివేశారు. దనుజమూకల దర్పాన్ని వానరులు మాపివేశారు. అశ్వాల కాళ్లు పట్టి కుపితులై పైకెత్తి నేలపై కొట్టి కొట్టి హతమార్చారు. కొందరు రక్కసుల్ని వేగంగా కొట్టి కొట్టి శరీరాలు తుత్తునియలు కావించారు. నొగలు ఒడిసిపట్టి దిరదిర తిప్పి, రథాలు విరిగిపోవ పాదాలతో తొక్కివేశారు. క్రుద్ధులై మీద మీదకి చనుదెంచే పదాతుల ఎముకలు పొడి పొడి చేసి పీనుగులుగా చేసివేశారు. వారి శస్త్రాలు విరిచివేశారు. మోచేతులతో వారి మొగాలపైన పొడిచి, అవనిపైకి పడద్రోసి, చేతులు అదిమి పట్టి, మెడలు, కాళ్లు పట్టి మోకాళ్లతో ఆ రాక్షసుల వెనె్నముకలు విరగగొట్టి సంహరించారు. తమ నిడుద వాలములు రాక్షసుల మెడలకి ఉరులుగా చుట్టి, కనుగుడ్లు వెలికి ఉబికి పడ బిగించి మృతులను కావించారు. ఈ రీతిగా వానర నాయకులు విజృంభించి లోక భీకర లీలగా ఆజి సల్పి రాక్షసుల్ని చంపి పీనుగు పెంటలు చేశారు. ఆ యుద్ధ రంగంలో ఇవి తలలు, ఇవి కన్నులు, ఇవి ముఖాలు, ఇవి చెక్కిళ్లు, ఇవి ముక్కులు, ఇవి కంఠములు, ఇవి కరములు, ఇవి మొండెములు, ఇవి ఊరువులు, ఇవి జానువులు, ఇవి చరణాలు అని వేరు పరచలేకుండా రక్తప్రవాహాలపైన తేలి ఆడుతున్నాయి.
రాక్షస సేనలో ముక్కాలు మువీసం ఈ గతి వానరులచే నాశనం అయిపోయినా, ధూమ్రాక్షుడు చెక్కు చెదరలేదు. మహోగ్రుడై తామ్రాక్షుడయి కపి సేనను లెక్క చేయక అలవోకగా తాకి, చతురతతో మెరసి ముద్గరాలతో మోది, వానరుల శిరాలు వ్రయ్యలు కావించాడు. ప్రాసములతో పొడిచి కొందరిని పుడమిపై కొల్చాడు. మహోగ్రులై పరిఘలతోకొట్టి కొందరిని హతులను కావించాడు. శూలాలతో తీవ్రంగా గాయపరచాడు. భిండివాలాలతో మరికొందరిని మడియించాడు. కుపితుడై కరవాలాలతో ఇంకా కొందరి తలలు తెగ నరకివేశాడు. ఆ ధూమ్రాక్షుడి ధాటికి తట్టుకోలేక వానరులు పలువురు రక్త వాంతులు చేసుకొంటూ అసువులు కోల్పోయారు. తక్కిన వానరులు ఉగ్రత కోల్పోయి దిక్కుతోచక చెట్టుకొక్కడు, పుట్టకొక్కడు అయి పారిపోయారు.
కపివీరులు ఆ రీతిగా పారిపోవడం హనుమంతుడు కాంచాడు. ఆగ్రహంతో అతడి కన్నులు ఎర్రవారాయి. వడిగా ఒక మహా పర్వతం ధూమ్రాక్షుడిమీద విసరాడు. ఆ శైలాన్ని ఆ ధూమ్రాక్షుడు గదతో వారించి, చావు తప్పించుకొన్నాడు. ఆంజనేయుడు విసరిన ఆ పర్వతం ధూమ్రాక్షుడి రథంమీద పడింది. ఆ అరదం ఖండ ఖండాలైంది. అంతటితో ఆగక హనుమానుడు చలము పూని అలుక వహించి యముడు బ్రహ్మాండం పగుల పలువుర్ని పరిమార్చిన విధంగా తరువులు, గిరులు, పాషాణాలతో రాక్షసుల తలలు చితకకొట్టాడు. సింహ పరాక్రముడైన అతడు రాక్షసులను తరిమికొట్టి గిరి శిఖరాన్ని ధూమ్రాక్షుడి మీదకి రువ్వాడు. ఆ దానవ వీరుడు గదతో హనుమంతుడి మస్తకంమీద బలంగా మో దాడు. అంత ఆంజనేయుడు ధూమ్రాక్షుడి శౌర్యం, అసూయ ఇసుమంతయినా గణింపక తన చేతగల ఘన శైల శిఖరం ఎత్తి చూపరులు భీతిల్ల విసరికొట్టాడు.
ఆ గిరి శిఖరం వేగంగా ధూమ్రాక్షుడి తలకి తగిలి అతడి శరీరం వెయ్యి ముక్కలయింది. వజ్రాహతికి కొండ విరిగి పడుతూ చేసే అంత చప్పుడు అయింది. ధూమ్రాక్షుడు ఆ మాదిరిగా మృతుడు కాగా, హతశేషులైన ఆ కుటిల దానవులు హనుమంతుడికి భయపడిపోయి భూమి కంపించే విధంగా మాటిమాటికి వెనుదిరిగి చూస్తూ పారిపోయి లంకలో చొరబడి దాగుకొన్నారు.
-ఇంకాఉంది