‘‘నాకు తెలుసు. నీకు వాడంటే అసహ్యమని కానీ, వాడు ఇవాళ సూసైడ్ చేసుకొన్నాడు’’ అంటూ బావురుమన్నాడు.
‘‘ఆ..’’ అంటూ నిర్ఘాంతపోయింది కుసుమ.
‘‘అతడి స్నేహం నుండి భర్త దూరమవ్వాలని, ఎక్కడికయినా ట్రాన్స్‌ఫర్ కావాలని కోరుకొన్నమాట నిజమే గానీ, ఏకంగా ఈ ప్రపంచం నుండే పోవాలని తను కోరుకోలేదే’’ అనుకొంటూ ‘‘ఎందుకు? అప్పులు పెరిగిపోయా?’’ ప్రశ్నించింది కుసుమ.
‘‘ఇదుగో వాడు రాసిన ఈ లెటర్ చదువు.. అర్థమవుతుంది’’ అంటూ ఓ కాగితాన్ని అందించాడు.
అందుకొని చదవసాగింది కుసుమ.
‘‘డియర్ వాసూ.. రెండ్రోజులుగా ఎందుకదోలా వుంటున్నావని అడుగుతున్నావ్.. ఏమీ లేదని దాటేశాను కానీ, చచ్చిపోతూ ఏదయినా మేలు చేసి చనిపోవాలనుకొని, నీలోనైనా మార్పు రావాలని, మీ కుటుంబం నాలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదని రాస్తున్నానిది...
నేను చనిపోతే ముందుగా నువ్వొస్తావని నమ్మకం. ఈ కవర్‌లో అఫీషియల్ మేటర్ వుంది. వాసు కన్పించినా, మనింటికొచ్చినా ఈ కవర్ ఇవ్వండి ఒకవేళ రాకున్నా వాసూ ఇంటికి వెళ్ళి అతడికో, కుసుమకో తప్పక ఇవ్వాలని మీ వదినతో చెప్పాను. ఆమెకు చదువు రాదు కాబట్టి చదవలేదు- నేను చెప్పిన ఏ మాటా కాదనని మనిషి కాబట్టి ఈ లెటర్ నీకందుతుందనే నమ్మకం. నువీమధ్య నాతో పార్టీలకు రాకపోవడం గమనించినా ఫోర్స్ చేయడం లేదు- నువ్వయినా బావుండాలని. అదేంటో తాగుడు మంచి అలవాటు కాదని తెలిసినా ఈ ఊబిలోనుండి బైటకు రాలేకపోతున్నాను....
ఎప్పట్లాగే మొన్న ఫస్ట్‌న పార్టీలో ఫుల్లుగా మందుకొట్టి ఇంటికి బయలుదేరాను. దార్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పడిపోయాను. మా ఇల్లు తెలిసిన ఇద్దరు వ్యక్తులు నన్ను ఇంట్లో తెచ్చి పడేసారు. అలా నేను పడిపోవడం, ఎవరో ఒకరు ఇల్లు చేర్చటం... మామూలే. ఐతే నా ఖర్మకొద్దీ ఆ రోజు వచ్చినవాళ్ళకు నిద్రపోతున్న నా పెద్ద కూతురు పడింది. ఒకడు నా కూతురిపై అత్యాచారం చేస్తోంటే, నా భార్య నన్ను ఎన్నోసార్లు కుదిపి లేపడానికి ప్రయత్నించిందట. మైకంలో లేవలేకపోయాను. మరొకడు నా భార్య ప్రయత్నాలను అడ్డుకోవడానికి రోకటి బండతో ఆమెతల మీద కొట్టాడట- ఫలితంగా నా కూతురు శీలం కోల్పోయింది, నా భార్య గాయాలపాలైంది. దీనికంతటికీ కారణం నేనూ, నా తాగుడు. బతికుండగానే దాన్ని నేను మానుకోలేను. తాగందే ఉండలేకపోతున్నాను. నరాలు మెలిపెట్టేస్తుంటాయి. రోజూ ఛస్తూ బతికేకన్నా ఏకంగా ఒక్కసారే చావడం మేలనుకొన్నాను. అసలు నేను ఛస్తేనే నా కుటుంబం బాగుపడుతుంది. నా కూతురికో, భార్యకో ఏదో ఒక పోస్ట్ క్రియేట్ చేసైనా మనాఫీసులో చోటిస్తారు. నా చావు తర్వాత నాకొచ్చే బెనిఫిట్స్‌తో అప్పులు తీరిపోతాయి. ముఖ్యంగా నా భార్య ఇకనుండైనా ప్రశాంతంగా వుంటుంది. కళ్లారా నిద్రపోతుంది. రెండ్రోజులుగా ఇదే ఆలోచన. అందుకే చావుకు కావలసిన ఏర్పాట్లు చేసాను, పోయేముందు ఆప్తుడవయిన నీతో మనసు విప్పి చెప్పుకోవాలన్పించింది. వాసూ.. నీకెంతో భవిష్యత్తు ఉంది. కుసుమ చెప్పినట్టల్లా వినాలా..? అని గింజుకొంటున్నావ్. మనపై ఉన్న అధికారులెంత మూర్ఖంగా వున్నా, వాళ్ళు చెప్పిందల్లా మనసు చంపుకొని ఆఫీసులో వినడం లేదా? అలాంటిది మన కష్టసుఖాల్లో పాలు పంచుకొనే భార్య మాట వింటే తప్పేం వుంది? కుసుమ మంచి అమ్మాయి, తెలివైంది. ఆమె చెప్పినట్లుగా విముక్తా సెంటర్‌లో చేర్చడం నీ బాగు కోరే కదా. అక్కడ పద్ధతులు కష్టంగా వున్నాయని రెండు నెలలకే బైటకొచ్చావ్- గానీ నాకు ఆ కొద్దిటైమ్‌లోనే నీలో మార్పు వచ్చినట్లు కన్పించింది. ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టి మళ్లీ రీజాయిన్ అయితే పూర్తిగా బాగుపడతావ్. నా భార్య ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉంటే నా కథ ఇలా ముగిసేది కాదేమో...
నాపై ఏ మాత్రం అభిమానమున్నా, నీ కుటుంబానికి ఇకనుండైనా న్యాయం చేయాలన్నా- కుసుమ చెప్పినట్టు విను. అర్ధంతరంగా మిమ్మల్నందరినీ విడిచిపోతున్నందుకు బాధగా వున్నా, అన్ని పరిస్థితులూ చేజారిపోయినందుకే ఈ బలవర్మనరణం. నన్ను నా భార్యా పిల్లలు ఏహ్యంగా చూడటం భరించలేను. నాలాంటి పరిస్థితి నీకు ఎదురు కాకూడదు. ప్లీజ్.. తాగుడు, సిగరెట్ మానెయ్. ఇదే నా ఆఖరి కోరిక. తీరుస్తావని ఆశిస్తూ నీ నుండి శాశ్వతంగా సెలవు తీసుకొంటున్నాను. మిత్రమా- సెలవు..’’
-ఇట్లు పానకాలరావ్.
అని వుందా లెటర్‌లో. అదంతా చదివిన రవళి భారంగా నిట్టూర్చింది.
‘‘పాపం.. ఎంత నరకయాతన పడ్డాడోకదా అతను’’ అంది.
‘‘నిజమే. వాళ్ళావిడ అంత దుఃఖంలోనూ ఈయనకా లెటర్ ఇవ్వడం, అప్పుడీయన తాగి వుండకపోవడం వల్ల చదివింది మెదడుకు ఎక్కడం వల్ల ఆయన్లో చాలా మార్పు వచ్చింది. కర్ణుడి చావుకి లక్ష కారణాల్లా, ఆ సెంటర్‌లో ఆయన మళ్లీ చేరమని పానకాలరావుగారి హితబోధ, నువ్ చెప్పిన సూచనలు పాటించడం- నీ మనీ హెల్ప్ .. ఇవ్వన్నీ ఆయన్లో మార్పు తెచ్చాయి’’ అంది కుసుమ ఆనందంగా.
ఆ ఘోర సంఘటన జరగడం బాధాకరమే గానీ దాంతోనే మీవారిలో మార్పు వచ్చి మళ్లీ విముక్తా రిహేబిలిటేషన్ సెంటర్ చేరి పూర్తిగా మద్యం వ్యసనాన్ని విడనాడటం జరిగింది. మళ్లీ మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చింది. ఫ్రెండ్‌గా చిన్న సాయం చేసినందుకు క్రెడిటంతా నాకే అంటే ఎలా? నేను రామానికి ఇచ్చిన డబ్బు తిరిగి నాకు ముట్టజెప్పేసినా, ఇప్పటికీ వాళ్ళు థాంక్స్ చెబ్తూంటే నాకెలాగో వుంటుంది. బ్యాంక్‌లో ఓమూల పడి వుండే డబ్బుని మీ అవసరాలకిచ్చాను. అంతేకదా’’ అంది రవళి.
‘‘అదంతా నీ మంచితనం. కానీ ఈయన మళ్లీ మారరనే నా నమ్మకం’’ అంది కుసుమ.
‘‘మొత్తానికి ఎలాగైతేనం- మీవారు మారారు, అది చాలు. ఇంకా కొన్నాళ్ళు నువ్వు మరింత సహనంగా వుండక తప్పదు. ఇలాంటి స్థితిలో అతడు కాస్త సంయమనాన్ని కోల్పోయినా, నువ్వు ఓర్మిని కోల్పోకుండా వుంటూండు’’.
‘‘రవళీ... అందరి మంచిని కోరుకునే నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి’’.
- ఇంకాఉంది