సాదరంగా ఆహ్వానించి, దేశ అతిథి మర్యాదలను ప్రపంచానికి చాటాల్సిన అమెరికా తొలి మహిళ మిచెల్లీ ఒబామా వైట్‌హౌస్‌ని వదిలి పక్క
నగరానికి వెళ్లిపోయింది. కుమార్తె పుట్టిన రోజనీ, ఇతరత్రా కార్యక్రమాల వల్ల అందుబాటులో ఉండ
లేకపోతున్నారంటూ పలు రకాల కథనాలు
వెలువడ్డాయి. కారణాలు ఏవైనా మిచెల్లీ చేసిన ఈ పని దౌత్య నీతికి తూట్లు పొడిచినట్లేనని ఘాటుగా విమర్శలు వెలువడ్డాయి. కనీసం ఆహ్వానమైనా
పలకకుండా అతిథిని అగౌరవ పరిచి అమెరికా ప్రజల మనోభావాలనూ ఆమె గాయపరిచారు. సాటి ‘తొలి మహిళ’ను ఆహ్వానించకపోవడం,
అధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకోకపోవడం దౌత్య సంప్రదాయానికే విరుద్ధమనే
విమర్శలు వెల్లువెత్తాయి.
ఇంటికొచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించడం... మనసారా పలకరించడం... ఉన్నంతలో మర్యాదలు చేయడం కనీస మానవ ధర్మం. ఏ దేశమైనా, ఏ చిన్న కుటుంబమైనా ఇందుకు అతీతం కాదు. దేశానికి తొలి మహిళ హోదాలో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి అతిథి మర్యాదలకు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రోటోకాల్’ ఉంటుంది. తమ దేశ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా, ఆతిథ్యానికి దేశ పౌరులు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబించేదిగా ఈ ప్రోటోకాల్‌ను ప్రతి దేశమూ రూపొందించుకుంటుంది. దీన్ని ఏ దేశ తొలి మహిళైనా అనుసరించాల్సిందే. అయితే, కనీస ప్రోటోకాల్‌ను పాటించకుండా, వచ్చిన అతిథికి కనీసం ఆహ్వానం పలకకుండా మొహం చాటేస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఓ అగ్ర దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళ... అధ్యక్షుడైన తన భర్తతో పాటు అధికార బలగమంతా తరలివచ్చిన వేళ... ఆమెకు కనీస మర్యాద దక్కకపోతే ఆతిథ్యం అపహాస్యం కాక మరేమవుతుంది. దౌత్య నీతికి తూట్లు పొడిచినట్లే అవుతుంది. ఓ అతిథి పట్ల చూపిన నిరాదరణ ఇరు దేశాలకూ అవమానకరమే. ప్రజల మనోభావాలనూ కించపరిచినట్లే.
ఇలాంటి చేదు అనుభవం చైనా తొలి మహిళ లింగ్ పియూన్‌కు ఎదురైంది. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. పలు దేశాల పర్యటనలో భాగంగా ఆయన సతీసమేతంగా అమెరికా వెళ్లారు. గతంలో చైనా అధ్యక్షులుగా పనిచేసిన వారెవరూ తమ సతీమణులను విదేశీ పర్యటనల్లో వెంట తీసుకొచ్చిన దాఖలాలు లేవు. స్వదేశంలో అధికారిక పర్యటనల్లో సైతం తొలి మహిళలు తెరచాటునే ఉండేవారు. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా, తొలిసారిగా ప్రస్తుత చైనా అధ్యక్షుడు సతీసమేతంగా విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఏ దేశంలోనూ ఎదురుకాని చేదు అనుభవం ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో ఎదురైంది. సాదరంగా ఆహ్వానించి, దేశ అతిథి మర్యాదలను ప్రపంచానికి చాటాల్సిన అమెరికా తొలి మహిళ మిచెల్లీ ఒబామా వైట్‌హౌస్‌ని వదిలి పక్క నగరానికి వెళ్లిపోయింది. కుమార్తె పుట్టిన రోజనీ, ఇతరత్రా కార్యక్రమాల వల్ల అందుబాటులో ఉండలేకపోతున్నారంటూ పలు రకాల కథనాలు వెలువడ్డాయి. నిధుల సమీకరణలో తలమునకలై ఉన్నారనే వార్తలూ హల్‌చల్ చేశాయి. కారణాలు ఏవైనా మిచెల్లీ చేసిన ఈ పని దౌత్య నీతికి తూట్లు పొడిచినట్లేనని ఘాటుగా విమర్శలు వెలువడ్డాయి. కనీసం ఆహ్వానమైనా పలకకుండా అతిథిని అగౌరవ పరిచి అమెరికా ప్రజల మనోభావాలనూ ఆమె గాయపరిచారు. సాటి ‘తొలి మహిళ’ను ఆహ్వానించకపోవడం, అధికారిక కార్యక్రమాల్లో పాలుపంచుకోకపోవడం దౌత్య సంప్రదాయానికే విరుద్ధమనే విమర్శలు వెల్లువెత్తాయి. అటు చైనాలోనూ తమ దేశ తొలి మహిళకు ఎదురైన అనుభవంపై అన్ని వర్గాలనుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటన పట్ల సామాన్య ప్రజానీకానికి అంతగా పట్టింపు లేకపోయినా, దౌత్యపరంగా మిచెల్లీ వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయమేనని చైనా విదేశీ వ్యవహారాల నిపుణులు, మేధావులు ధ్వజమెత్తుతున్నారు. ట్విట్టర్‌లో అయితే ఏకంగా - ఒబామా, మిచెల్లీ మధ్య విభేదాలు ఉన్నాయనీ, అందుకే ఆమె పిల్లలతో వేరే నగరానికి వెళ్లిపోయిందంటూ వ్యాఖ్యానించే దాకా వెళ్లింది. చైనాలో విశేష ఖ్యాతి కలిగిన పింగ్ లియూన్ అంటే మిచెల్లీకి ఇష్టం లేదని, అందుకే మొహం చాటేసిందనే ఆరోపణలూ పత్రికలకెక్కాయి.
సాధారణంగా తొలి మహిళలు ఏ దేశానికి వెళ్లినా - ఆ దేశ సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవడం, అక్కడి మహిళలు, విద్యార్థులతో సంభాషించడం, మహిళల సాధికారతకు చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకోవడం వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాన్య ప్రజలనుంచి మీడియా వరకూ తొలి మహిళ కార్యక్రమాలపై ఆసక్తి చూపడం ఏ దేశంలోనైనా సహజం. ఆమె వ్యక్తిత్వం, హావభావాలు, ప్రవర్తన తీరుపై ప్రత్యేకంగా కథనాలు కూడా వెలువడతాయి. ఇలాంటి కార్యక్రమాల్లో ఇరు దేశాలకు చెందిన తొలి మహిళలు పాల్గొనడం రివాజు. చైనా తొలి మహిళ లియూన్ పాల్గొన్న ఏ కార్యక్రమంలోనూ మిచెల్లీ లేకపోవడం ‘ఎవరికి అవమానం?’ అనే కొత్త ప్రశ్నకు ఆస్కారం కలిగిస్తోంది. తొలి పర్యటనలోనే లియూన్‌కు ఎదురైన ఈ అనుభవం భవిష్యత్ పర్యటనల్లో తప్పదన్న వాదనా వినిపిస్తోంది.
విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో - ఎట్టకేలకు మిచెల్లీ స్పందించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. క్షమాపణ కోరుతూ వైట్‌హౌస్ అధికారులతో లేఖ పంపింది. ఆ లేఖలోనే చైనా పర్యటనకు వచ్చిన సమయంలో కలుస్తానంటూ వర్తమానం పంపింది. పింగ్ లియూన్ విషయానికొస్తే - చైనాలో ఆమెను ఎరుగని వారు లేరు. ఇరవై ఏళ్ల వయసునుంచే ఆమె చైనావాసులకు చిరపరిచితురాలు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందు జిన్‌పింగ్ చైనా ప్రజలకు పెద్దగా తెలీదంటే అతిశయోక్తి లేదు. లియూన్ భర్త అంటేనే అతనికి గుర్తింపు ఉండేది. అంతటి పేరు ప్రతిష్ఠలు కలిగిన లియూన్ అనంతర కాలంలో ‘తొలి మహిళ’ కాగలిగింది. అందంలోనూ, వాక్చాతుర్యంలోనూ ప్రపంచ తొలి మహిళలకు దీటుగా లియూన్ రాణిస్తారని ఆశించిన చైనా ప్రజలకు మిచెల్లీ తీరు శరాఘాతమే!