భువనగిరి, జూన్ 13: ఖరీఫ్ సీజన్‌లో అర్హులైన రైతులకు సకాలంలో పంట రుణాలు అందించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముక్తేశ్వర్‌రావుఅన్నారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన డివిజన్ స్థాయి బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులచే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని రైతాంగానికి 1011.80 కోట్ల పంట రుణాలు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. రుణ అర్హత కార్డు కలిగి ఉన్న ప్రతి కౌలు రైతుకు రుణాలు మంజూరు చేయాలని ఆయన సూచించారు. సంవత్సరం లోపు రుణాలు చెల్లించే రైతుల నుంచి అసలు మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు. నాబార్డు సబ్సిడీతో అందించే గొర్రెలు, మేకలు, ఫౌల్ట్రీ, ఈము పక్షుల వంటి స్కీముల కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ఐకేపి, డీఆర్ డీఏకు గతేడాది 417 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా 450 పూర్తి చేశారన్నారు. ఈయేడాది 440 కోట్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. అర్హత ఉన్న సమభావన సంఘాలకు వడ్డీ లేని రుణాలు తక్షణమే మంజూరు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను వందశాతం గ్రౌండింగ్ పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని కోరారు. ఎంపిడివో, వ్యవసాయాధికారులు, పశువైద్యాధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను లబ్ధిదారులకు సక్రమంగా అందించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సకాలంలో రుణాలు మంజూరు కాని రైతులు లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో అదనపు జె సి నీలకంఠం, లీడ్ బ్యాంక్ మేనేజర్ పిజె జెమ్స్, నాబార్డు ఏ జి ఎం వీరశంకర్, మాడా పివో వి.సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్సీ, బిసి కార్పొరేషన్ ఈడీలు పార్థసారథి, గంగాధర్, డీ ఆర్ డీ ఏ ఏ పి డి మోహన్‌రావు, ఏ డీ ఏ సిద్ధిఖితోపాటు డివిజన్ స్థాయి తహశీల్దార్లు, ఎంపిడివోలు, ఏవోలు బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు.
చలో అసెంబ్లీకి వెళ్లవద్దు
జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ వెల్లడి
చౌటుప్పల్, జూన్ 13: చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లేనందున ఎవరూ వెల్లరాదని నల్లగొండ జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ తెలిపారు. మండలంలోని తూప్రాన్‌పేట వద్ద జాతీయరహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును అయన గురువారం సందర్శించారు. ఈసందర్భంగా వాహనాల తనిఖీని పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వేలమందిని బైండోవర్ చేయగా, 150 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్టు అమలులో ఉన్నందున సభలు, ర్యాలీలు పోలీసుల అనుమతిలేకుండా పెట్టవద్దని హెచ్చరించారు. ఉద్యోగులు, విద్యార్థులు అనుమతిలేని చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెల్లవద్దన్నారు. వెలితే కేసులు నమోదౌతాయని, భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురౌతాయని వివరించారు. వాహనదారులు సైతం తమ వాహనాలను ఇవ్వవద్దని హెచ్చరించారు. ఎస్పీ వెంట ట్రైనీ ఎస్‌పి ఫకీరప్ప, సిఐ జగన్నాధరెడ్డిలు పాల్గొన్నారు.
తనఖీలు ముమ్మరం: కొనసాగుతున్న బైండోవర్లు
భువనగిరి, జూన్ 13: తెలంగాణ జె ఎసి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో డివిజన్ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి ఎక్కడికక్కడే తెలంగాణవాదులను, టిఆర్‌ఎస్, బిజెపి, న్యూడెమాక్రసి కార్యకర్తలను, నాయకులను, ఉద్యోగ సంఘాల నాయకులను బైండోవర్ సంబంధిత మండలాల తహశీల్దార్ల ఎదుట హాజరుపరుస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం ఉద్యోగ సంఘాల నాయకులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట చర్చిస్తుండగా పట్టణ సిఐ మధుసూదన్‌రెడ్డి వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులు అదుపులోకి తీసుకొన్న ఉద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టిఎన్‌జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందడి ఉపేందర్‌రెడ్డి, జె ఏ సి డివిజన్ కన్వీనర్ పూస శ్రీనివాస్‌లు మాట్లాడుతూ శాంతియుతంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని కాని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణవాదులను ఉగ్రవాదుల కన్నా ఎక్కువగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. పోలీసులచే ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి భవిష్యత్‌లో ఈప్రాంత ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైన చలో అసెంబ్లీకి అనుమతి మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఉద్యోగ జె ఏ సి చైర్మన్ సి.జగన్, కార్యదర్శి కృష్ణ, సత్యనారాయణ, దేవేందర్, అడ్వకేట్ జె ఏ సి నాయకులు ఎం ఏ. రహీమ్, నాగారం అంజయ్య, నాయకులు అతికం లక్ష్మినారాయణగౌడ్, జడల అమరేందర్, చందా మహేందర్, పడమటి జగన్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
గడియారం సెంటర్‌లో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
నల్లగొండ రూరల్, జూన్ 13: పట్టణంలోని గడియారం సెంటర్‌లో విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ విజయవంతం చేయాలని ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారికి గుంటోజు వెంకటాచారి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్తున్న తరుణంలో ఆకస్మాత్తుగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే భారీగా బలగాలు మోహరించి ర్యాలీ చేస్తున్న వారందర్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ర్యాలీని ఉద్దేశించి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి మాట్లాడుతూ నేడు జరుగబోయే చలో అసెంబ్లీకి రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మంది విశ్వబ్రాహ్మణులు తరలివెళ్తున్నారని అరెస్ట్‌లకు, బైండోవర్లకు బెదిరేది లేదన్నారు. కాసోజు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ కెసి ఆర్ వల్లే తెలంగాణ సాధ్యమని తెలంగాణ ఆకాంక్షను ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేస్తున్న చలో అసెంబ్లీని అడ్డుకోవడం సరికాదన్నారు.
బ్యాంకర్లు సకాలంలో రుణాలందించాలి
అదనపు జెసి నీలకంఠం
ఆలేరు, జూన్ 13: బ్యాంకర్లు రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలందించాలని అదనపు జెసి నీలకంఠం కోరారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో గురువారం ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట మండలాల బ్యాంకర్ల (జెఎంఎల్‌బిసి) సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణర్హత కల్గిన ప్రతి కౌలు రైతుకు రుణం మంజూరు చేయాలన్నారు. సంవత్సరం లోపు రుణాలు చెల్లించే రైతుల నుండి అసలు మాత్రమే తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు సంబంధించి యూనిట్లను గ్రౌడింగ్ చేయాలన్నారు. రైతులకు పంట రుణాలివ్వటంతో పాటు రికవరీ చేయటంలో శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. పొదుపును సక్రమంగా నిర్వహించే వారికి, అర్హత ఉన్న సమభావన సంఘాలకు వడ్డీలేని రుణాలివ్వాలన్నారు. ఎంపిడిఓలు, ఎఓలు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, పశువైద్యులు ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ జేమ్స్, నాబార్డు ఎజిఎం వీరేశం, డిఆర్‌డిఎపిడి రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌బిహెచ్ మేనేజర్ పి భావనారాయణ, తహశీల్దార్లు సోమ్లానాయక్, సాయిరాం, ఎంపిడిఓ జలంధర్‌రెడ్డి,పశువైద్యాధికారి శ్యాంసుందర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫ్‌నహార్ కాలువకు నీటి విడుదల
వలిగొండ, జూన్ 13: మండలంలోని నెమలికాల్వ గ్రామం వద్ద గల ఆసిఫ్‌నహార్ ప్రాజెక్టు నుండి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేశారు. గత కొన్ని నెలలుగా ఆసిఫ్‌నహార్ ప్రాజెక్టుకు, కాలువకు మరమ్మతులు చేపట్టడంతో దిగువ ప్రాంతాల రైతులు పంటలు పండించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా వేసవి కాలంలో కాలువతో ఎన్నో మండలాల్లోని చెరువులకు నీరందేది కాని కాలువ, ప్రాజెక్టు మరమ్మతులతో నీటిసరఫరా లేకుండా పోయి గ్రామాల్లో సాగుకు, భూగర్భజలాలు ఎండిపోవడంతో త్రాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పలు గ్రామాలకు చెందిన ఆసిఫ్‌నహార్ కాలువ దిగువ ప్రాంత రైతులు కాలువకు నీటిని విడుదల చేయాలని, చెరువులను నింపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు సైతం నిర్వహించారు. దీంతో తప్పనిసరియై కాలువకు నీటిని విడుదల చేశారు. కాలువ నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నాంపల్లి, జూన్ 13: ప్రభుత్వం పేద, బడుగు బలహీన ప్రజలకు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఎండి గఫార్ అన్నారు. గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని పేద వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మరిన్ని పథకాలు ప్రజలకు చేరువవుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా కృషి చేయాలన్నారు. నాంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచి అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు నేర్లకంటి జంగయ్య, మాల్‌మార్కెట్ డైరెక్టర్లు నిమ్మల వెంకట్‌రెడ్డి, పల్ల దేవేందర్, పర్వతాలు, నాయకులు యాదయ్య పాల్గొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
భువనగిరి, జూన్ 13: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులను అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సి ఐ టి యు ఆధ్వర్యంలోగురువారం స్థానిక వినాయక చౌరస్తా వద్ద మున్సిపల్ శాఖ మంత్రి మహిధర్‌రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా సి ఐ టి యు పట్టణ కార్యదర్శి అనిమళ్ల ఆంజనేయులు, డివిజన్ ఉపాధ్యక్షులు మాయ కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా మున్సిపల్‌లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్న వారికి కనీస వేతనం అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 12,500 ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, 5లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కార్మికుడు చనిపోతే దహన సంస్కారాలకు 10వేల రూపాయలు మంజూరు చేయాలని, ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరెస్టు చేయించి కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిచో సి ఐ టి యు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు గ్యాయపాక లక్ష్మినారాయణ, కానుకుంట్లయాదగిరి, ఊదరి రాంచందర్, స్వామి, కొమ్ము వరలక్ష్మి, బర్రె అండాలు, భారతమ్మ, యాదమ్మ, ఎన్.లక్ష్మి, యాదగిరి, సరళ, శోభ, జ్యోతి, రేణుక, ఎల్లమ్మ, లక్ష్మమ్మ, సత్తమ్మ, శాంతమ్మ, నర్సింగరావు, నరేష్, వెంకటేష్, బాబు పాల్గొన్నారు.