Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇటు పోలీసు నిఘా...అటు తెలంగాణ సెగ

$
0
0

నిజామాబాద్, జూన్ 13: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ నెల 14న జెఎసి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో జిల్లాలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ పోలీసులు ఓ వైపు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండగా, ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామంటూ తెలంగాణవాదులు పట్టుదలను ప్రదర్శిస్తుండడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. జెఎసితో పాటు భాగస్వామ్య పక్షాలుగా వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ, ఇతర విద్యార్థి సంఘాలు చలో అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, పోలీసులు సైతం అదే తరహాలోనే కఠిన చర్యలు చేపడుతున్నారు. వారం రోజుల ముందునుండే తెలంగాణవాదుల కదలికలపై నిఘా ఉంచి, ముందస్తు అరెస్టులు, బైండోవర్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 1400 మందిని బైండోవర్‌లు చేశారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మరో 400 మందిని అరెస్టు చేయడం, గృహ నిర్బంధం విధించడం ద్వారా చలో అసెంబ్లీకి తరలివెళ్లే వారిని అడ్డుకోవాలనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లా నలుమూలలా అన్ని సరిహద్దుల వద్ద ప్రత్యేకంగా 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన మీదటే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. తమ కళ్లు గప్పి ఏ ఒక్క ఉద్యమ నాయకుడు హైదరాబాద్‌కు తరలివెళ్లకూడదనే ఉద్దేశ్యంతో గురువారం ఉదయం నుండే అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద నిఘాను ఏర్పాటు చేశారు. గత బుధవారం నాటి నుండే జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ పేరిట నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చారు. ఉద్యమకారులకు వాహనాలను సమకూర్చకుండా 350 పైచిలుకు ప్రైవేట్ పాఠశాలలు, విద్యా సంస్థలకు తాఖీదులు జారీ చేశారు. చలో అసెంబ్లీకి సహకరిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. హైదరాబాద్‌కు వెళ్లే అన్ని రహాదారులను తమ అధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదివరకు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం సమయాల్లో చేపట్టిన చర్యల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటూ ఆందోళనకారులు చలో అసెంబ్లీకి తరలివెళ్లకుండా నిలువరించేందుకు విఫలయత్నాలు చేశారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎఎస్పీ దేవదానం ఇతర ఉన్నతాధికారులంతా ఎప్పటికప్పుడు పోలీసు సిబ్బందిని సంప్రదిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైన సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలను సమాయత్తం చేస్తూ గత రెండు రోజుల నుండి వారిచే మాక్‌డ్రిల్ జరిపించారు. ఇలా ఓ వైపు పోలీసులు ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తుండగా, తెలంగాణవాదులు సైతం చలో అసెంబ్లీకి తరలివెళ్లేందుకు అంతే పట్టుదలను కనబరుస్తున్నారు. గత పక్షం రోజుల నుండే జిల్లా అంతటా ఎక్కడికక్కడ చలో అసెంబ్లీ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరిస్తూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ నిర్బంధాలు తమను అడ్డుకోలేవని, పోలీసుల వలయాలను ఛేదించుకుని మరీ ముందుకువెళ్తామని సమరోత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే టిఎజెసికి చెందిన పలువురు ప్రతినిధులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలైన తెరాస, బిజెపి, సిపిఐ, కులసంఘాలు, న్యాయవాదులు, విద్యార్థులు, తెలంగాణవాదులు చలో అసెంబ్లీకి మద్దతుగా నిలుస్తూ పోలీసుల కళ్లుగప్పి హైదరాబాద్‌కు చేరుకున్నట్టు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించేందుకు వీలుగా బిజెపి, టిఆర్‌ఎస్‌లు ఎక్కడికక్కడ సన్నాహక సదస్సులు నిర్వహించి తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేశాయి. ఒకరోజు ముందునుండే పోలీసుల నిర్బంధం మరింత తీవ్రతరం అవుతుందనే భావనతో విద్యార్థి సంఘాల నాయకులు సైతం ముందస్తుగానే రాజధానికి తరలివెళ్లారు. చలో అసెంబ్లీకి మద్దతుగా గురువారం జిల్లా కేంద్రంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటాలనే తపన తెలంగాణవాదుల్లో వ్యక్తమవుతోంది. అదే సమయంలో పోలీసులు కూడా ఉద్యమకారులను ఉద్యమకారులను అడ్డుకునేందుకు అడుగడుగునా నిఘాను కొనసాగిస్తున్నారు. దీంతో చలో అసెంబ్లీ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

చలో అసెంబ్లీకి అనుమతి లేదు
ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొంటే క్రిమినల్ కేసులు
ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్
భిక్కనూరు, జూన్ 13: హైదరాబాద్‌లో జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీకి ప్రభుత్వ అనుమతి లేదని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. గురువారం జిల్లా ముఖద్వారమైన భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలోని 44వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీని సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని దగ్గర ఉండి పరిశీలించారు. కొందరు ఆకతాయలు మారణాయుధాలతో తరలివెళ్లి అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని, వారిని అడ్డుకునేందుకు జిల్లాలో 14 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన వద్దని, పాల్గొన్న వారి వివరాలను వీడియోలు తీశామన్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 30 యాక్టు అమలులో ఉన్నందున జిల్లా ప్రజలు చలో అసెంబ్లీకి వెళ్లవద్దని కోరారు. ఇప్పటి వరకు జిల్లాలో 1400 మందిని బైండవర్ చేశామన్నారు. ఆయన వెంట భిక్కనూరు సిఐ సర్దార్‌సింగ్, ఎస్‌ఐలు సురేశ్, గంగాధర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కుమారుడి బైండవర్
చలో అసెంబ్లీకి వెళున్నాడన్న కారణంతో భిక్కనూరు పోలీసులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కుమారుడు మహేందన్ వాహనాన్ని గురువారం అడ్డుకున్నారు. ఇదే సమయంలో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ చెక్‌పోస్టును తనిఖీ చేసేందుకు రావడంతో ఈ విషయాన్ని సిఐ సర్దార్‌సింగ్ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. తాను వ్యాపార రీత్యా హైదరాబాద్‌కు వెళ్తున్నానని, చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పినప్పటికీ ఆ పత్రాలను చూసిన ఎస్పీ బైండోవర్ అతనిని చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కుమారుడు మహేందర్‌రెడ్డితో పాటు స్నేహితులు రోహణ్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డిలను పోలీస్ స్టేషన్‌కు తరలించి బైండోవర్ చేశారు.

ఫిట్‌నెస్ లేని పాఠశాలల బస్సులపై ఆర్టీఏ కొరఢా
రెండవ రోజూ కొనసాగిన తనిఖీలు * 21 కేసులు నమోదు
నిజామాబాద్, జూన్ 13: నిబంధలకు విరుద్ధంగా నడుపుతున్న పాఠశాల బస్సులపై ట్రాన్స్‌పోర్ట్ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. బుధవారం విస్తృత తనిఖీలకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్సు కమిషనర్ రాజారత్నం, రెండవ రోజు కూడా బస్సులను పరిశీలించారు. 48 గంటల తనిఖీలలో మొత్తం జిల్లా వ్యాప్తంగా 21 కేసులను నమోదు చేసినట్లు డిటిసి రాజారత్నం తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో పాఠశాల బస్సులను తనిఖీ చేయగా మొత్తం పది బస్సులకు ఫిట్‌నెస్ లేదని నిర్ధారించారు. వీటిపై ఆర్టీఎ యాక్టు ప్రకారం కేసులను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రెండవ రోజు కామారెడ్డి పట్టణంలో పాఠశాలల బస్సులను తనిఖీ చేపట్టామని, అందులో 11 బస్సులకు ఫిట్‌నెస్ లేదని ఆయా పాఠశాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ తనిఖీలు ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని, నిబంధనలను అతిక్రమించి నడిపించే బస్సులను సీజ్ చేయడంతో పాటు యజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. 15 ఏళ్లు నిండిన బస్సులను నడుపవద్దని గతంలోనే హెచ్చరికలు జారీ చేశామన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాల బస్సు యజమాని తప్పకుండా ఫిట్‌నెస్ ఉన్న వాహనాలను మాత్రమే ఉపయోగించాలని, విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరిగిన యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీఎ నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈవిషయంలో ఎవ్వరిని ఉపేక్షించేది లేదని డిటిసి స్పష్టం చేశారు.

నగర ఓటర్ల జాబితా సిద్దం
నిజామాబాద్ , జూన్ 13: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. నగరంలోని కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్‌ల ఓటర్ల గణన దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ మేరకు జాబితాను బుధవారం రాత్రి అధికారులు బహిర్గతం చేశారు. దీనిపై అభ్యంతరాలను ఈ నెల 15లోగా అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చిన అభ్యంతరాలపై ఈ నెల 16నుండి 28వరకు విచారణ జరిపి 30వ తేదీన ప్రభుత్వానికి నివేదికను పంపించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని పంచాయతీల రిజర్వేషన్‌లు ఖరారు ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు ఇక నగరం, పట్టణాల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రభుత్వానికి పంపిన ఓటర్ల జాబితా ద్వారా రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు రిజర్వేషన్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అధికారుల జాబితా ప్రకారం నిజామాబాద్ నగరంలోని 50 డివిజన్‌ల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,74,692 మంది ఉన్నారు. వీరిలో 1,40,832 మంది బిసి ఓటర్ల ఉండగా, 53.09 శాతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అదే విధంగా నగరంలో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. మొత్తం ఓటర్ల జాబితాలో 1,37,286 మంది పురుషులు ఉండగా 1,37,406 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు బహిర్గతం చేసిన జాబితాలో వెల్లడించారు. వీరిలో డివిజన్‌ల వారిగా గమనిస్తే 14వ డివిజన్‌లో 10,795 మంది ఓటర్లు ఉండగా, వారిలో అత్యధికంగా 8476 మంది బిసి ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 13వ డివిజన్‌లో 4806 మంది ఓటర్లు ఉండగా వారిలో బిసిలు కేవలం 751 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు. దీనిపై అధికారులు గత కొంతకాలంగా కసరత్తు చేసి చివరకు తుది జాబితాను వెల్లడించడంతో ఆశావాహులు అంచనాలలో తేలిపోతున్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి.

అక్రమ అరెస్ట్‌లతో చలో అసెంబ్లీని ఆపలేరు
సిపిఐ జిల్లా కార్యదర్శి యాదగిరి
ఇందూర్, జూన్ 13: ఈ నెల 14న టిజెఎసి నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు తెలంగాణవాదులను అరెస్ట్‌లు, బైండోవర్లు శోచనీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి కె.యాదగిరి ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రిని కలిసి కోరినప్పటికీ, సిఎం నిరాకరించడం సీమాంధ్ర పాలకుల అణిచివేత ధోరణికి అద్దంపడుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చలో అసెంబ్లీని అడ్డుకునేందుకు కేంద్ర బలగాలను మోహరించి, ముళ్ల కంచెలను ఏర్పాటు చేసినా, అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా వాటన్నింటిని ఛేదించుకుని తెలంగాణవాదులు కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం సాగిస్తున్న అప్రజాస్వామిక నిర్బంధ చర్యలను ఖండిస్తూ చలో అసెంబ్లీకి చేతికో జెండా ఇంటికో మనిషి చొప్పున కదిలివచ్చి విజయవంతం చేయాలని యాదగిరి పిలుపునిచ్చారు.

ఆర్టీసీకి 72 లక్షల ఆదాయం
స్వీట్లు పంచిన డిఎం
ఆర్మూర్, జూన్ 13: వేసవికాలంలో ఆర్మూర్ ఆర్టీసీ డిపోకు 72 లక్షల రూపాయలు అదనపు ఆదాయం రావడంతో గురువారం మేనేజర్ ఇజ్జగిరి రాజవౌళి కార్మికులకు స్వీట్లు పంచిపెట్టారు. ఆర్టీసీ డిపో గేటు వద్ద డిపో మేనేజర్ రాజవౌళి ఆధ్వర్యంలో కార్మికులకు స్వీట్లు అందజేసి అభినందనలు తెలిపారు. కార్మికుల కృషి వల్ల వేసవికాలంలో 72 లక్షల రూపాయల ఆదాయం సమకూరిందని డిఎం పేర్కొన్నారు. ఇదే ఒరవడిని ఇకముందు కూడా కొనసాగించి ఆర్మూర్ ఆర్టీసీ డిపోను రీజియన్ పరిధిలో లాభాలు తీసుకురావాలని ఆయన సూచించారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపోను నష్టాల నుంచి గట్టెక్కించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయాస్ యూనియన్ కార్యదర్శి ఫత్తేపూర్ రాములు, నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజియన్ ఉపాధ్యక్షుడు టిఎస్ నారాయణ, తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి నర్సింలు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

ఆన్‌లైన్ ద్వారా పిహెచ్‌సిల పనితీరు పర్యవేక్షణ
ఆరోగ్య కేంద్రాలకు వెబ్ కెమెరాల అనుసంధానం
నిజామాబాద్ , జూన్ 13: జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును మెరుగుపర్చేందుకు కలెక్టర్ క్రిస్టీనా ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ, మార్పు పథకంపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన కలెక్టర్, పిహెచ్‌సిల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా వాటిని ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. జిల్లాలో మొత్తం 44 పిహెచ్‌సిలు ఉండగా, తొలివిడతలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెబ్ కెమెరాలు, ల్యాప్‌టాప్‌లను సమకూరుస్తూ ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. వీటి పరిశీలన ప్రక్రియను గురువారం విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో కలెక్టర్ పరిశీలించారు. సంబంధిత ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అందించే సాంకేతిక సహాయంతో ఆన్‌లైన్‌లో పిహెచ్‌సిల పనితీరును పర్యవేక్షించనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రం నుండే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును, డాక్టర్లు, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. తద్వారా విధుల్లో పారదర్శకత నెలకొంటుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే మిగితా పిహెచ్‌సిలకు కూడా వెబ్ కెమెరాలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గోవింద్ వాగ్మారే తదితరులు పాల్గొన్నారు.

డిసెంబర్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
యువతను సన్నద్ధం చేయాలి : కలెక్టర్ క్రిస్టీనా
నిజామాబాద్, జూన్ 13: భారత సైన్యంలో నియామకాల కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 14 నుండి 22వ తేదీ వరకు ప్రత్యేకంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నామని కలెక్టర్ క్రిస్టీనా జడ్.చోంగ్తూ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన యువకులు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చని సూచించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని పురస్కరించుకుని గురువారం కల్నల్ యోగేష్ ముదాలియర్, ఇతర ఆర్మీ అధికారులతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీ చేపడుతున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున సమకూర్చాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, భారత సైన్యంలో చేరడం ద్వారా దేశ సేవ చేసే మహత్తర అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లిన ప్రస్తుత తరుణంలోనూ కేవలం ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్హతలతో ఉద్యోగ నియామకాల కోసం ఆర్మీ అవకాశం కల్పిస్తోందన్నారు. ఆకర్షణీయమైన వేతనంతో పాటు అన్ని వసతులు సమకూరుతాయని, కుటుంబ పోషణకు సైతం ఇది ఎంతగానో దోహదపడుతుందని, అన్నింటికీ మించి దేశ సేవ చేస్తున్నామనే సంతృప్తి అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుందన్నారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీకి మరో ఆరు మాసాల వ్యవధి మిగిలి ఉన్నందున సంబంధిత శాఖల అధికారులు యువకులును చైతన్యపర్చే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సైన్యంలో చేరిక పట్ల యువకులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న అనవసర భయాందోళనలను దూరం చేస్తూ, వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి ఆర్మీ ఉద్యోగాల్లో చేరితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, ఆసక్తి కనబర్చే వారికి శారీరక ధృఢత్వం కోసం శిక్షణ అందించాలని, తద్వారా వారు సులువుగా ఆర్మీలో ఎంపికయ్యేలా చూడాలన్నారు. స్థానికంగా నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సందర్భంగా జిల్లాకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కల్నల్ యోగేష్ ముదాలియర్ మాట్లాడుతూ, సోల్జర్ టెక్నికల్, సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ ట్రేడ్స్‌మెన్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ ఉద్యోగాలకు 17 సంవత్సరాల ఆరు నెలలు దాటి 23 సంవత్సరాల లోపు వయస్సు గల యువకులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలని, సోల్జర్ జనర్ డ్యూటీకీ 21వ సంవత్సరాల లోపు వయస్సు గల వారై ఉండి పదవ తరగతి పాసైన వారు అర్హులని పేర్కొన్నారు. పై ఉద్యోగాలకు నిర్దేశించిన మేరకు ఎత్తు, ఛాతీ, బరువు తదితర అంశాలను పరిశీలిస్తారని, ఇందుకు అవసరమైన శారీరక ప్రమాణాల కోసం యువకులు కృషి చేయాలన్నారు. శారీరక పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు 1.6 కిలోమీటర్ల పరుగు పందెం, 9 అడుగుల కందకం నుండి దూకడం, బ్యాలెన్సింగ్ తదితర పోటీ పరీక్షల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పై పరీయల్లో పాల్గొని అర్హత సాధించిన వారికి ఆర్మీలో చేర్చుకుంటారని, నెలకు 17 వేల రూపాయల వరకు వేతనం లభించడమే కాకుండా, కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయాలు, ఇతర సౌకర్యాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఐకెపి పిడి వెంకటేశం, డిఎస్‌డిఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి
సమీక్షా సమావేశంలో ఆర్డీఓ మోహన్‌రెడ్డి
జుక్కల్, జూన్ 13: వర్షాకాలం ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రత వ్యాపించి, సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందువల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఆర్డీఓ మోహన్‌రెడ్డి మండలస్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తహశీల్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు సరఫరా చేసే పైపులైన్లు పగిలిపోతే, వాటికి వెంటనే మరమ్మతు చేయించాలని అన్నారు. లేదంటే కలుషితమైన నీరు కుళాయిల ద్వారా వచ్చి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల పదిహేను రోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రం చేయించడంతో పాటు ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయించాలని సూచించారు. అమ్మహస్తం పథకం కింద అన్ని గ్రామాల్లో లబ్ధిదారులందరికీ సరుకులు అందేవిధంగా డీలర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించాలని తహశీల్దార్ గోపిని ఆదేశించారు. ఉపాధి హామీ, గృహ నిర్మాణం, విద్యా, వైద్యం తదితర శాఖలపై సమావేశాలు నిర్వహించి, సంబంధిత అధికారులకు తగు సూచనలు చేయాలన్నారు. సమావేశంలో తహశీల్దార్ గోపి, ఎంపిడిఓ సోఫీ, ఎంఇఓ జె.దేవరావు, హౌసింగ్ ఎఇ జగదీష్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ షహనాజ్‌తో పాటు ఎఎన్‌ఎంలు, విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీఓను ఘెరావ్ చేసిన పెద్దఎడ్గి రేషన్ బాధితులు
జుక్కల్ మండలం పెద్దఎడ్గిలో 105 మందికి రేషన్‌కార్డులను రద్దు చేసి జూన్ మాసం రేషన్ సరుకులు నిలిపివేయడంతో బాధితులు గురువారం తహశీల్ కార్యాలయానికి తరలివచ్చారు. అదే సమయంలో జుక్కల్‌లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించేందుకు వచ్చిన ఆర్డీఓ మోహన్‌రెడ్డిని బాధితులు ఘెరావ్ చేశారు. గ్రామంలోని లబ్ధిదారులకు గత నెల వరకు రేషన్ సరుకులు అందించి, జూన్ మాసంలో 18 క్వింటాళ్ల బియ్యాన్ని తగ్గించి, 105 మంది పేర్లను తొలగించడంతో బాధితులు గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయించారు. వందమంది బాధితులు జుక్కల్ తహశీల్ కార్యాలయానికి చేరుకుని అధికారులను నిలదీసి, తొలగించిన కార్డులను పునరుద్ధరించి, సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తహశీల్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే అర్హులైన లబ్ధిదారుల పేర్లను తొలగించారని వారు ఆర్డీఓకు తెలిపారు. గ్రామానికి వచ్చి ఇంటింటికి తిరిగి మళ్లీ సర్వే నిర్వహించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు సరుకులు అందించే వరకు గ్రామంలో రేషన్‌షాప్‌ను మూసివేయిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆర్డీఓ మోహన్‌రెడ్డి మాజీ ఎంపిటిసి వెంకట్‌గౌడ్‌తో మాట్లాడుతూ, అర్హులైన వారందరికీ సరుకులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, వారం రోజుల్లో నిత్యావసర సరుకులను పంపణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం ఆర్డీఓ పెద్దఎడ్గి గ్రామానికి వెళ్లి సర్వే నిర్వహించి, బాధితులకు న్యాయం చేయాలని తహశీల్దార్‌కు సూచించారు. అదేవిధంగా గత ఐదు మాసాలకు సంబంధించిన నివేదికలు తెప్పించుకుని సరుకులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ గోపిని ఆదేశించారు.

చలో అసెంబ్లీ నేపథ్యంలో టెన్షన్...టెన్షన్ జిల్లా వ్యాప్తంగా 1400 మంది బైండోవర్లు సరిహద్దుల్లో చెక్‌పోస్టులు...ముమ్మర తనిఖీలు
english title: 
nigha

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>