ఒంగోలు, జూన్ 13:విద్యార్థులపై ఆర్‌టిసి పెనుభారం మోపింది. ఆర్‌టిసి కష్టాల కడలిలో ఉందన్న సాకుతో యాజమాన్యం ఈనిర్ణయం తీసుకోవటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్‌టిసి యాజమాన్యం తీసుకున్న కఠిన నిర్ణయంతో జిల్లాలోని విద్యార్థులపై సంవత్సరానికి కోట్ల రూపాయల్లోనే అదనపు భారం పడనుంది. దీంతో విద్యార్థిలోకం కనె్నర్ర చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చదువుకునే విద్యార్థులు ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణించేందుకు రాయితీ బస్సు పాస్‌లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. కొన్ని సంవత్సరాల నుండి విద్యార్థుల బస్సు పాస్ చార్జీలను పెంచకుండా హఠాత్తుగా పెంచడమేటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారుమూల గ్రామాల నుండి పట్టణాలు, నగరాలకు వచ్చి డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు విద్యనభ్యిస్తున్నారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాల లెక్కల ప్రకారం 26,245 మంది విద్యార్థులు రాయితీ బస్‌పాస్‌లతో ప్రయాణిస్తున్నారు. అద్దంకి డిపో పరిధిలో 2,438 మంది విద్యార్థులు, చీరాల డిపో పరిధిలో 1748 మంది, కందుకూరు డిపో పరిధిలో 2983 మంది, ఒంగోలు డిపో పరిధిలో 7638 మంది, కనిగిరి డిపో పరిధిలో 2419 మంది, మార్కాపురం డిపో పరిధిలో 3,124 మంది, పొదిలి డిపో పరిధిలో 2,579 మంది, గిద్దలూరు డిపో పరిధిలో 3,648 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం రాయితీ బస్ పాస్‌ల ద్వారా బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్‌టిసి గణాంకాలు తెలుపుతున్నాయి. గతంలో హైస్కూలు విద్యార్థులకు ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే గతంలో 155 రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం పెరిగిన రేట్లకు అనుగుణంగా 235 రూపాయలను ఆర్‌టిసి అధికారులు వసూలు చేయనున్నారు. పది కిలోమీటర్ల మేర విద్యార్థి ప్రయాణిస్తే గతంలో 215 రూపాయలు ఉండగా ప్రస్తుతం 315 రూపాయలకు, 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే గతంలో 255 రూపాయలు, ప్రస్తుతం 385 రూపాయలు, 25 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తే గతంలో 430 రూపాయలు, ప్రస్తుతం 645 రూపాయలు, 30 కిలోమీటర్లకు గతంలో 470 రూపాయలు, ప్రస్తుతం 705 రూపాయలు, 35 కిలోమీటర్లకు గతంలో 515 రూపాయలు ప్రస్తుతం 775 రూపాయలను ఆర్‌టిసి అధికారులు వసూలు చేయనున్నారు. కాలేజీ విద్యార్థులకు గతంలో ఐదు కిలోమీటర్లకు 55 రూపాయలు ఉండగా ప్రస్తుతం 85 రూపాయలకు పెంచారు. అదేవిధంగా గతంలో పది కిలోమీటర్లకు 75 రూపాయలు ఉండగా ప్రస్తుతం 105 రూపాయలు, 15 కిలోమీటర్లకు గతంలో 95 రూపాయలు, ప్రస్తుతం 135 రూపాయలు, 20 కిలోమీటర్లకు గతంలో 120 రూపాయలు ప్రస్తుతం 180 రూపాయలు, 25 కిలోమీటర్లకు గతంలో 150 రూపాయలు ఉండగా ప్రస్తుతం 225 రూపాయలకు, 30 కిలోమీటర్లకు గతంలో 165 రూపాయలు ఉండగా ప్రస్తుతం 250 రూపాయలకు పెంచారు. అదేవిధంగా ఆర్‌టిసిలోపనిచేసే సిబ్బంది పిల్లలకు గతంలో ఐదు కిలోమీటర్లకు 15 రూపాయలు ఉండగా ప్రస్తుతం 25 రూపాయలకు, 10 కిలోమీటర్లకు గతంలో 20 రూపాయలు ఉండగా ప్రస్తుతం 30 రూపాయలు, 15 కిలోమీటర్లకు గతంలో 25 రూపాయలు ఉండగా ప్రస్తుతం 35 రూపాయలకు, 20 కిలోమీటర్లకు గతంలో 30 రూపాయలు ఉండగా ప్రస్తుతం 45 రూపాయలకు పెంచారు. మొత్తంమీద ఎపిఎస్‌ఆర్‌టిసి యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్‌టిసి యాజమాన్యం వైఖరికి నిరసనగా త్వరలోనే ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రఘురాం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.
‘ఏడాదికి 150 రోజుల పని కల్పించాలి’
ఒంగోలు అర్బన్, జూన్ 13: ఏడాదికి 150 రోజుల పని కల్పించి రోజుకు కనీస వేతనం 200 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంకణాల ఆంజనేయులు అధ్యక్షతన జిల్లా ప్లీనం జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో కరవు విలయతాండవం చేస్తోందన్నారు. జిల్లా నుండి వలసలు తీవ్రంగా కొనసాగుతున్నాయన్నారు. వలస కూలీలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో కూడా జిల్లా వారు అధికంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో 240 మండలాల్లో కరవు ఉందని, ఆ ప్రాంతాల్లో 150 రోజులు ఉపాధి హామీ పనిని కల్పిస్తామని చెప్పడం తప్పా నిధులు కేటాయించడం లేదన్నారు. ఒకవైపు వలసలు కొనసాగుతుంటే ఉన్న ఉపాధి నిధులు కూలీలకు ఖర్చు చేయకుండా అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి 8 వేల కోట్ల రూపాయలు నిధులు రాగా కేవలం 1600 కోట్ల రూపాయలు మాత్రమే నేటికి ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం 149 రూపాయలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. 50 రూపాయల నుండి 80 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, అవి కూడా రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారన్నారు. పథకం అమలులో వస్తున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జాలా అంజయ్య మాట్లాడుతూ అధికారాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పథకాల జాతర మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. అమ్మహస్తం పేరుతో నాసిరకం సరుకులు ఇస్తున్నారన్నారు. అవి కూడా అరకొరగా ఉన్నాయన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నిధులు రాక రాష్ట్రంలో 30 లక్షల గృహాలు ఆగిపోయాయన్నారు. అందులో 20 లక్షలకు పైగా ఎస్సీ, ఎస్టీలవే ఉన్నాయన్నారు. వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి హనుమంతరావు, జిల్లా నాయకులు వెంకటరామిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఎం ఆంజనేయులు, కెజి మస్తాన్, ఎం వసంతరావు, ఎన్ వెంకటేశ్వర్లు, ఊసా వెంకటేశ్వర్లు, వెల్లంపల్లి ఆంజనేయులు, కంకణాల వెంకటేశ్వర్లు, రామలక్ష్మమ్మ, సోమిరెడ్డి, మాలకొండయ్య, శివమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
రజకుల దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా
ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్థం
ఒంగోలు అర్బన్, జూన్ 13: హైదరాబాద్‌లో రజకుల దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా రజక వృత్తిదారుల సంఘం నాయకులు మాట్లాడుతూ, రజకులపై దాడులు, అత్యాచారాలు తరచుగా జరుగుతున్నాయన్నారు. మూడు సంవత్సరాల కాలంలో 400 చోట్ల దాడులు, వెయ్యి కుటుంబాలను బహిష్కరించారని, వంద మందిపై అత్యాచారాలు జరిగాయని వివరించారు. రజకులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్నవారే కరవయ్యారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో కదలిక వచ్చేందుకు, రజకుల సమస్యలు పరిష్కారం అయ్యేందుకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద 20 మంది రాష్ట్ర నాయకులు రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 72 గంటల పాటు నిరవధిక దీక్షను ఈనెల 11వ తేదీన ప్రారంభించారని తెలిపారు. రజకుల సమస్యల పట్ల ప్రభుత్వానికి సానుభూతి లేదని, దీక్షను భగ్నం చేసి నాయకులను అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం స్థానిక ఎల్‌బిజి భవన్ నుండి జిల్లా సచివాలయం వరకు ప్రదర్శన చేపట్టి అనంతరం కలెక్టరేట్ సెంటర్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి గుడిపాటి వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు దేవరంపాటి వెంకటసుబ్బయ్య, ఒంగోలు నగర కార్యదర్శి చీమలదినె్న శ్రీనివాసరావు, చీమకుర్తి పట్టణ గౌరవాధ్యక్షులు పి సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితర నాయకులు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోలయ్య, వెంకట్రావు, రమణమ్మ, వసంతరావు, రామయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొని రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరపాలి
వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ నూకసాని డిమాండ్
ఒంగోలు, జూన్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే జరపాలని వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలను సరైన సమయంలో జరుపుతారన్న నమ్మకం లేదన్నారు. ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని ఎక్కువ పంచాయతీలు, కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు వైఎస్‌ఆర్‌సిపికి వస్తాయన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు ఇప్పటివరకు జరపకపోవడం వలన పంచాయతీల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఎన్నికలు వెంటనే జరుపకపోతే పంచాయతీలకు రావాల్సిన నిధులు వెనక్కిపోతాయని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే విషయంపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిపినా వైఎస్‌ఆర్‌సిపి 80 శాతం పంచాయతీలను కైవశం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైయ్యాయని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శిద్దా రాఘవరావు ప్రకటించడాన్ని నూకసాని బాలాజీ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెడితే రెండుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వారి ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనినిబట్టి చూస్తే కాంగ్రెస్‌తో ఎవరు కుమ్మక్కయ్యారో ఆయనే తెలుసుకోవాలని శిద్దాకు సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలుచేసిన సంక్షేమ పథకాలను సక్రమంగా అమలుచేయాలని నిలదీసినందుకే జగన్‌ను జైలుపాలుచేశారని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తున్నందువల్లే జైలులో ఉండాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని శిద్దా గమనించాలన్నారు. వైఎస్‌ఆర్‌సిపి జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో 80 సీట్లను వైఎస్‌ఆర్‌సిపి సాధించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సిపి అభిమానులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విలేఖర్ల సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి కల్పన విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, బిసి సెల్ నగర కన్వీనర్ బొప్పరాజు ఏడుకొండలు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమశేఖర్, ట్రేడ్ యూనియన్ నాయకులు ముదివర్తి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి కృషి చేయాలి
పారిశ్రామికవేత్తలకు కలెక్టర్ పిలుపు
ఒంగోలు, జూన్ 13:జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి పారిశ్రామికవేత్తలు తమవంతు కృషిచేయాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో పారిశ్రామిక రంగం ద్వారా వచ్చే కాలుష్యం వల్ల సమాజానికి ముప్పులేకుండా తీసుకోవాల్సిన చర్యలపై పారిశ్రామికవేత్తలతో జిల్లాకలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాల ద్వారా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పారిశ్రామికవేత్తలు ప్రజలు సంక్షేమం కోసం కేవలం కొంతశాతం మాత్రమే నగదు ఖర్చు చేస్తున్నారన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రజాసంక్షేమం కోసం అధిక మొత్తంలో నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగాల ద్వారా కేటాయించిన నిధులను ప్రభుత్వం ఏర్పాటుచేసిన బ్యాంకు ఖాతాకు జమచేసి నిధులు ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలు కేటాయించిన మొత్తాన్ని పారిశ్రామికవేత్తలు సూచించిన ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల ద్వారా కేటాయించిన మొత్తాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులతో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ యువకిరణాలు పథకం ద్వారా జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈసమావేశంలో సిపిఒ కెటి వెంకయ్య, డిఆర్‌డిఏ పిడి ఎ పద్మజ, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి, పొల్యూషన్ బోర్డు ఇఇవిఆర్ మహేష్, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మద్దిపాడు, జూన్ 13: మండలంలోని ఏడుగుండ్లపాడు వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మద్దిపాడు పోలీసుల కథనం మేరకు ఒంగోలు నుండి అద్దంకి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే ముందుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోడ్రైవర్ జి మస్తాన్ (23)తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108 వాహనంలో వైద్యచికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆర్టీసీ బస్సును మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ పుల్లయ్య తెలిపారు.
కరవు కాసుల కోసం కర్షకుల ఎదురుచూపు
* దయచూపని ప్రభుత్వం
మార్కాపురం, జూన్ 13: తీవ్ర వర్షాభావంతో కరవు కోరల్లో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం నేటికీ అందిన దాఖలాలు లేవు. మార్కాపురం డివిజన్ 2011లో కరవు ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో అధికారులు సర్వేచేసి ఇన్‌పుట్ సబ్సిడీ అందించనున్నట్లు హామీ ఇచ్చారు. మార్కాపురం డివిజన్‌లో 12 మండలాలు ఉండగా మార్కాపురం మండలానికి మాత్రం కోటి రూపాయల చిల్లర విడుదల చేసి ఇంకా 78 లక్షల రూపాయల మేర విడుదల చేయాల్సి ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం మిగిలిన మండలాలకు అందించిన దాఖలాలు లేవు. అయితే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రైతుల బ్యాంకు ఖాతాల నెంబర్లను వ్యవసాయశాఖకు అందచేస్తే నిధులు విడుదల చేస్తుందని చెబుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు. రైతులు తమ ఖాతాలను నమోదు చేసుకునేందుకు బ్యాంకులకు వెళితే సిబ్బంది లేని కారణంగా ఇన్ని ఖాతాలను ఒక్కసారే నమోదు చేసుకోలేమని చెప్పి తప్పించుకుంటున్నారు. మిగిలిన మండలాల్లోని రైతులకు కూడా కరవు సహాయం నిధులను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈఏడాది తీవ్ర వర్షాభావంతో పంటలులేక నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై వర్షాలు పడుతున్నప్పటికీ వ్యవసాయం చేద్దామంటే అందుకు అవసరమైన పెట్టుబడులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, ఈ సమయంలో కరవు సహాయం అందించి రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.