శ్రీకాకుళం, జూన్ 13: ఒడిశా ఎగువ ప్రాంతంలో గురువారం భారీ వర్షం కురిసింది. ఒడిశాలో అత్యధిక వర్షం కురియడంతో ఆంధ్రాలో వంశధారకు జలకళ వచ్చింది. ఒడిశా ఎగువ భాగం (కాచ్‌మెంటులో) 81.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కాశీనగర్‌లో ఒకటవ ప్రమాద హెచ్చరికను అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. ఒడిశాలో వర్షంతో అక్కడి వాసుల్లో ఆందోళన నెలకొన్నా...ఆంధ్రా అన్నదాతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపం ఇంకా తీరకముందే ఒడిశా ఎగువప్రాంతంలో కుంభవృష్టి కురియడంతో జిల్లా అంతా చల్లబడింది. ప్రతీ ఏటా ఖరీఫ్ పంట చేతికి అందేసమయానికి ఒడిశాలో భారీ వర్షాలు కురియడం, వంశధారకు వరదనీరు చేరడంతో ఆంధ్రాలో పంటపొలాలు నీటిమునిగిపోవడం పరిపాటి. కాని - ఈసారి ఖరీఫ్ ఆరంభంలో వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం సృష్టించేవిధంగా ఒడిశా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురియడం ఆంధ్రా రైతాంగానికి శుభపరిణామమే. ఒడిశాలో కాట్రగడ వద్ద 78.4 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, గుడారి వద్ద 159.2 మి.మీ., మోహన 173.4 మి.మీ., మహేంద్రగడ 103.6, గుణుపూర్ 165.6., కాశీనగర్‌లో 134.6 మి.మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా వంశధార నదిలో 31,700 క్యూసెక్కుల నీరు చేరింది. దీనికితోడు...ఖరీఫ్ ప్రారంభం..జూన్ నెలలో 134.9 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవ్వాలి. అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లా అంతటా రెండు రోజులుగా చిరుజల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురియడంతో 110.0 మి.మీ. వాస్తవ వర్షపాతం నమోదు అయ్యింది. ఇంకా 24 శాతం వర్షం వ్యవసాయ పనులు అవసరం. నిన్నమొన్నటి వరకూ ఎండలకు బాగా బీడుబారిన నేలంతా చల్లదనంతో మట్టివాసన వస్తున్నా...్భరీ వర్షాలు కాకపోవడంతో జల వనరుల్లో పెద్దగా వర్షపు నీరు నిల్వ కాలేదు. ఈ వర్షాలు కొద్దిపాటి జల్లులే అయినప్పటికీ నిలకడగా కురవడంతోపంట పొలాల్లో నీరుచేరింది. ఈ నీరు నారుమళ్లు తయారుచేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుందని అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు జరుగుతోంది. ఇందులో 90 శాతం వర్షాధారమే. ఒడిశాలో వర్షాలు కురిస్తేనే సిక్కోలులో పంటలు ఆశాజనకంగా ఉంటాయి. అందులోనూ ఖరీఫ్ సీజన్ ఆరంభంలో ఇలా వర్షాలు కురవడం, నారుమళ్ల తయారీకి ఈ వర్షాలు కాస్త ప్రయోజనకరంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో శ్రీకాకుళం డివిజన్‌లో 454.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా, పాలకొండ డివిజన్‌లో అత్యంత ఎక్కువగా 512.6 మి.మీ., టెక్కలి డివిజన్‌లో తక్కువగా 132.8 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ఒక మోస్తరు వర్షాలు కొన్ని మండలాల్లో కురియగా, ఒకటి, రెండు వరకూ పెద్ద వర్షాలు కూడా కురిసాయి. ఇదే తరహాలో కాస్త భారీ వర్షాలు మరో నాలుగైదు రోజులు కురిస్తే దమ్ములు చేసుకోవడానికి తగినంత అనువైన వాతావరణం ఏర్పడుతుందని, నీరు సమకూరుతుందని రైతులు భావిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాల కోసం ఆరాటపడుతున్నారు. జిల్లాలోని మొత్తం సాగు విస్తీర్ణానికి 1.5 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం. కాని సబ్సిడీ విత్తనాలు 45 వేల క్వింటాళ్లకు మించి అందుబాటులో లేవు. అలాగే, ఖరీఫ్ మొత్తం (ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకూ) యూరియా 16,150 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, డి.ఎ.పి. 21,404 మెట్రిక్ టన్నులు, ఎం.ఒ.సి. 10300 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సులు 16,300 మెట్రిక్ టన్నులు అవసరం. దీనిమేరకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు వ్యవసాయ కమిషనర్, హైదరాబాద్‌కు పంపారు. కాని, ప్రతీ ఖరీఫ్ మాదిరిగానే 65 - 80 శాతం మేరకే ఎరువులు సరఫరా అయినట్లే ఈ ఖరీఫ్‌కు కూడా 65 శాతం మాత్రమే ఎరువులు అందుబాటులో ఉంటాయన్న అనుమానాలు వ్యవసాయశాఖ క్షేత్రఅధికారులు సుస్పష్టం చేస్తున్నారు. అదే జరిగితే వరుణదేవుడు కరుణించినా..సర్కార్ యథావిధిగానే అన్నదాత వెన్నువిరిచేలా ప్రణాళిక రూపొందిస్తుందనడంలో అతిశయోక్తిలేదు. దీంతో వర్షాలు అనుకూలించేలా ఉన్నప్పటికీ విత్తనాలు, ఎరువులు మాత్రం తగినన్ని దొరకకపోవచ్చునన్న ఆందోళన అన్నదాతల్లో పుడుతోంది. మొత్తం మీద ఈ వర్షాలు ఖరీఫ్ సీజన్‌కు శుభసూచికంగా అంతా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఒడిశా వర్షాల వల్ల ఆంధ్రా అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆంధ్రా- ఒడిశా సరిహద్దు గ్రామాలకు ప్రమాద హెచ్చరికలు అక్కడ సర్కార్ హెచ్చరించింది. అంతేకాకుండా, గురువారం పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సిన విద్యార్ధులు ఒడిశాలో కురిసిన భారీ వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిందని అక్కడ విద్యాశాఖ అధికారి చెబుతున్నారు.
మరోవైపు జిల్లాలో వంశధార, నాగావళి నదులలో నీటి ప్రవాహం కారణంగా ఇద్దరు గల్లంతయ్యారు. భామిని మండలం నులకజోడు వద్ద వంశధార నీటి ప్రవాహానికి కొట్టుకుపోగా, ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడు పేట వద్ద నీలమప్పడు అనే వృద్ధుడు గల్లంతయ్యాడు.
గొట్టా బ్యారేజీలో 22గేట్లు ఎత్తివేత
*34వేల క్యూసెక్కుల నీరు విడుదల
హిరమండలం, జూన్ 13: ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధారనదిలో ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహంతో గురువారం వరదపరిస్థితులు ఏర్పడ్డాయి. గొట్టాబ్యారేజి వద్ద దిగువ ప్రాంతానికి 34వేల క్యూసెక్కుల నీటిని ఇంజనీరింగ్ అధికారులు విడిచిపెడుతున్నారు. ఒడిశా క్యాచ్ మెంటు ఏరియా అయిన మోహన, కాట్రగడ, గుడారి, గుణుపూర్, కాశీనగర్, మహేంద్రగడ ప్రాంతాల్లో 81.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీని ప్రభావంతో పెరిగిన నీటి మట్టానికి అనుగుణంగా వంశధార ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజికి ఉన్న 22 గేట్లు రెండు మీటర్లు ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. బ్యారేజి వద్ద 34.72 లెవల్లో నీటిని స్థిరీకరిస్తున్నట్లు తెలిపారు. వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. బ్యారేజి వద్ద నీటి పరిస్థితితులను తహశీల్దార్ బి చంద్రశేఖర్, వంశధార డి ఇ ఇ ఎస్ జగదీశ్వరరావులు సమీక్షించారు.
బ్యారేజి మరమ్మతు పనులకు నష్టం
బ్యారేజి దిగువ భాగంలో చేపడుతున్న మరమ్మతు పనులకు నీటి ప్రవాహంతో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనావేస్తున్నారు. దిగువబాగంలో మూడు కోట్ల రూపాయలతో రాతికట్టు క్యాబిన్ పనులు చేపడుతున్నారు. ఈ నీటి ప్రవాహం వలన మరమ్మతు పనులు కొట్టుకుపోయి ఉంటాయని నీటి ప్రవాహం తగ్గితేగాని ఎంత మేర నష్టం జరిగిందనేది అంచనావేయలేమని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
దేవాలయాల అభివృద్ధికి
అంకితభావంతో పనిచేయాలి
శ్రీకాకుళం, జూన్ 13: అంకితభావంతో విధులు నిర్వహించడం ద్వారా ఆలయాల అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ కె.చంద్రశేఖరరావు ఆలయాల నిర్వహణా యంత్రాంగానికి పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖ, ఎస్.ఐ.టి.ఏ సంయుక్త నిర్వహణలో గురువారం అరసవల్లి దేవస్థానంలో ఆలయ పరిపాలన, మెరుగైన పనితీరుపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్వహణ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడం ద్వారా గుర్తింపు పొందాలన్నారు. క్రమశిక్షణా చర్యలు, విధి విధానాలు, విచారణ ప్రక్రియపై చర్చించారు. శిక్షకులు ఓలేటి శ్రీరామశర్మ మాట్లాడుతూ మాతృభాష విశిష్ఠతను వివరిస్తూ స్పష్టమైన తెలుగును అలువరచుకుని జాతి ఔన్నత్యాన్ని కాపాడాలన్నారు. గ్రాంథికం స్థానంలో ఆధునిక తెలుగును వాడాలంటూ ఉత్తర ప్రత్యుత్తరాల్లో గమనించాల్సిన పద్ధతులు తెలిపారు. వ్యవస్థాపక ధర్మకర్తల మండలి చైర్మన్ ఇప్పిలి జోగిసన్యాసిరావు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి సహాయ కమిషనర్ శ్యామలాదేవి, పాలకొండ జగన్నాథాలయం, శ్రీకాకుళం ఉమారుద్రకోటేశ్వర ఆలయం ఇ.ఒలు ప్రసాదపట్నాయిక్, సన్యాసిరాజు, జిల్లాలోని వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఇ.ఒ.లు, మేనేజర్లు, సిబ్బంది, ఆదిత్యుని సన్నిధి అర్చకులు ఇప్పిలి నగేష్‌శర్మ, హరిశర్మ తదితరులు పాల్గొన్నారు.
నదుల నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతు
భామిని/ఎచ్చెర్ల/హిరమండలం జూన్ 13: జిల్లాలో పొంగుపొర్లుతున్న వంశధార, నాగావళి నది నీటి ప్రవాహానికి భామిని మండలం నులకజోడు వద్ద ఒకరు, ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద వృద్ధుడు గల్లంతయ్యారు. హిరమండలం మండలంలోని బుడుమూరు గ్రామం వద్ద నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలకు సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. పశువుల కాపరి అయిన భామిని మండలం బిల్లుమడ గ్రామానికి చెందిన మామిడి కరువు గురువారం ఉదయం నులకజోడు గ్రామానికి వెళ్ళి తిరిగి తన స్వగ్రామానికి వస్తుండగా రహదారిపై భారీగా చేరిన నీటిని దాటుతుండగా ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. తివ్వకొండల నుండి భారీగా చేరిన డొంగురు నీటితో పాటు వంశధార వరద కాలువ నీరు ప్రవహించే ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వర్షం నీరు అధికంగా ఉండడంతో గల్లంతైన వ్యక్తిఆచూకీ కోసం ఎవరూ నీటిలోకి వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది. దీంతో బిల్లుమడ గ్రామంలో విషాదం అలుముకుంది. విషయం తెలుసుకున్న పాలకొండ ఆర్డీ ఒ బి.దయానిధి ,తహశీల్దార్ ఎం సావిత్రి, ఎస్ ఐ సత్యారావుతో పాటు పలుశాఖల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కరువు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు పేట గ్రామానికి చెందిన నారు నీలమప్పడు(60) అనే వృద్ధుడు గ్రామంలో ఉన్న నాగావళి నదిలోకి గురువారం సాయంత్రం స్నానానికి దిగగా, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు కుటుంబ సభ్యులు ఎంతగాలించినా నీలమప్పడు ఆచూకీ లభ్యం కాలేదు. తహశీల్దార్ వెంకటరావు, విఆర్వో గోవిందరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తోటపల్లి రిజర్వాయర్ వద్ద భారీగా వరదనీరు విడుదల చేయడంతో నాగావళి నది నీటితో నిండి ప్రవహిస్తున్నది.
ప్రాణాలతో బయటపడిన ఇద్దరు
కాగా, భామిని మండలంలోని బుడుమూరు గ్రామానికి చెందిన బొమ్మాలి రాము రెల్లి గడ్డి కోసేందుకు వెళ్లి వరదనీటిలో చిక్కుకున్నాడు. అయితే రామును రక్షించేందుకు తలయారి గౌరీసు నదీ నీటిలోకి దిగగా ఆయన కూడా చిక్కుకున్నాడు. దీంతో సమాచారం అందుకున్న తహశీల్దార్ చంద్రశేఖర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గజఈతగాళ్లను రప్పించారు. వరదనీటిలో చిక్కుకున్న రాము, గౌరీసులను వారు సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
నేటి నుంచి విద్యార్థులకు బస్‌పాస్‌ల జారీ
నరసన్నపేట, జూన్ 13: ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ఆధ్వర్యంలో విద్యార్థులకు శుక్రవారం నుండి బస్‌పాస్‌లను జారీ చేయనున్నట్లు టెక్కలి డిపో మేనేజర్ అరుణకుమారి తెలిపారు. గురువారం స్థానిక ఆర్టీసి కాంప్లెక్సులో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవలి విద్యార్థుల బస్‌పాస్ చార్జీలను పెంచామని, ఆ ధరలను అమలుచేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్లవరకు 55 నుండి 85 రూపాయలు, పదికిలోమీటర్ల వరకు 75 నుండి 105 రూపాయలు, 15 కిలోమీటర్ల వరకు 90 నుండి 135 రూపాయలు, 20 కిలోమీటర్ల వరకు 120 నుండి 180 రూపాయలు 25 కిలోమీటర్ల వరకు 150 నుండి 225 రూపాయలు, 30 కిలోమీటర్ల వరకు 165 నుండి 250, 35 కిలోమీటర్ల వరకు 180 నుండి 270 రూపాయలకు పెంచామని స్పష్టంచేశారు. ఈ మేరకు విద్యార్థులు సహకరించాలని కోరారు. బస్‌స్టేషన్‌లో 4,266 చదరపు గజాల డిఒటి ప్రాతిపదికన ఖాళీ స్థలాన్ని 33 సంవత్సరాలకు గాను వ్యాపార కార్యకలాపాలను నిర్వహించేందుకు టెండర్లు కోరనున్నామన్నారు. ఈ మేరకు దరఖాస్తులు కావాల్సిన వారు 23వ తేదీలోగా కాంప్లెక్సులో తీసుకోవాలని, టెండర్లు 25న నిర్వహిస్తామన్నారు.
సంక్షేమ అధికారుల నియామకం
పొందూరు, జూన్ 13: షెడ్యూల్ కులాల ఒకటవ బాలుర వసతి గృహం సంక్షేమాధికారిగా శశిభూషణరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన మలిపెద్ది శ్రీరంగనాయకులు డోలపేట వసతి గృహం సంక్షేమాధికారిగా బదిలీపై వెళ్లారు. అదేవిధంగా ఇంటర్ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహ సంక్షేమాధికారిగా పూజారి చుక్కారావు నియమితులయ్యారు. ఈయన విశాఖపట్నం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఇంతకుముందుకు ఇక్కడ పనిచేసిన రమణమూర్తి తిరుపతి తీర్ధయాత్రలకు వెళ్లి గుండెపోటుతో మరణించిన విషయం పాఠకులకు తెలిసిందే.
విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి
* ఆర్‌విఎం పి.ఒ నగేష్
నరసన్నపేట, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలని రాజీవ్ విద్యామిషన్ పి.ఒ నగేష్ స్పష్టంచేశారు. గురువారం మండల కేంద్రంలోని తమ్మయ్యపేట ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులందరూ వారి ఆధార్ కార్డు నంబర్లను పాఠశాల ఉపాధ్యాయులకు అందించాలని సూచించారు. ఈ ఆధార్ నంబర్ల ప్రాప్తికి యూనిఫారాలు, సంక్షేమ పథకాల కల్పించనున్నామన్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగేటట్లు చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. గతంలో చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు మారేటప్పుడు ఎందుచేత పాఠశాలను మారుతున్నారో తెలుసుకోవాలని, ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించే దిశగా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూను తప్పనిసరిగా అమలుచేయాలని సూచించారు. జవహర్ బాల ఆరోగ్యరక్ష పథకంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి వి.వి.రత్నాలరాజు, హెచ్.ఎం ఎం.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీచింగ్ అసోసియేట్స్‌కు ఇంటర్వ్యూలు
* వీసీ లజపతిరాయ్
ఎచ్చెర్ల, జూన్ 13: ఈ నెల 17, 18వ తేదీల్లో అంబేద్కర్ వర్శిటీలో విధులు నిర్వహిస్తున్న టీచింగ్ అసోసియేట్స్‌కు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్ స్పష్టంచేశారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముగ్గురు సీనియర్ ఆచార్యులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. వౌఖిక పరీక్షలతోపాటు ఐదు నిమిషాలు డెమో కూడా టీచింగ్ అసోసియేట్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. గత ఏడాది విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా టీచింగ్ అసోసియేట్స్ నిర్వహించిన పరిశోధనా వ్యాసాలు, ఎం.్ఫల్, పి.హెచ్.డి. పూర్తి చేసిన వివరాలను అందివ్వాల్సి ఉందన్నారు. ప్రతీ సెమిస్టరీకి ఈ తరహా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఈయనతోపాటు ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య ఉన్నారు.
భామినిలో కుండపోత
భామిని, జూన్ 13: అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో భామిని మండలంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుండి గురువారం వరకు ఏకధాటిగా వర్షాలు కురవడంతో కొండవాగులు పొంగగా చెరువులు నిండిపోయాయి. వర్షపు డొంగురు నీరు ప్రభావంతో పొలాలన్నీ తెల్లదనం పరుచుకుని గట్లు కూడా కనిపించని విధంగా నీటితో నిండిపోయాయి. సింగిడి, కాట్రగడ, బత్తిలి గ్రామాల వద్ద ఎబి రహదారిపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నులుక జోడు వద్ద గ్రామానికి వెళ్ళే రహదారిపై భారీగా నీరు చేరడంతో బిల్లుమడ గ్రామానికి చెందిన మామిడి కరువు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. వర్షం ఉద్ధృతికి రోడ్లపైకి రాళ్ళుతేలి కొట్టుకుపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. పొలాల గట్లకు గండ్లు పడ్డాయి. వర్షాలు బుధవారం నుండి తీవ్ర తరం కావడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. మంగళవారం 64మిమీ వర్షపాతం నమోదుకాగా బుధవారం 99 మిమీ వర్షపాతం నమోదై ప్రజలను అల్లాడించింది. గురువారం కూడా ఇదే రీతిలో వర్షం పడడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది.
ఉప్పొంగిన వాగులు
వర్షం ఉద్ధృతికి బత్తిలి వెర్రిగెడ్డ, భామిని పొందుపాముగెడ్డ, చీకటితోట గెడ్డ, దిమిడిజోల తంపర గెడ్డ, పసుకుడి కొత్త చెరువుగెడ్డ, కొరమ బగ్గామర్రిపాడు గెడ్డ, పెద్దదిమిలి డొంబురు గెడ్డతో పాటు కొండవాగులన్నీ ఉప్పొంగాయి. ఖరీఫ్‌కు ముందస్తుగా భారీ వర్షాలు కురవడంతో రైతులకు నష్టం తప్పా ప్రయోజనం ఉండదని పలువురు భావిస్తున్నారు. పొలాల్లోని చెరకు, కూరగాయలు ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వంశధారకు వరదనీరు
ఒడిశాతో పాటు భామిని ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో వంశధారకు వరదనీరు భారీగా చేరుతోంది. మండలంలోని సింగిడి, బత్తిలి వద్ద వంశధారకు వర్షం నీరు అధికమై ఎబి రోడ్డుపైకి నాలుగైదు అడుగుల మేరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నదిలో నీరు ప్రవహించడంతో ఏటి ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
భామిని వారపు సంతకు అంతరాయం
కుండపోత వర్షాలు ధాటికి గురువారం భామిని వారపు సంత జరగలేదు.
వ్యాపారులు, కొనుగోలు దారులు ఎవరూ సంతచోటుకు చేరుకోలేదు. భామిని కూడలిలో దుకాణాలు కూడా తెరుచుకోలేదు. రోజంతా వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
వంశధార జలాలను సాగుకు వినియోగించాలి
శ్రీకాకుళం, జూన్ 13: జిల్లాలోని అధికశాతం సముద్రం పాలవుతున్న వంశధార నదీ జలాలను మళ్లించి రైతులకు సాగు, పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలకు వినియోగించేలా పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహననాయుడు కోరారు. గురువారం ఉదయంఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయాధారిత జిల్లాగా పేరొందిన సిక్కోలులో రైతుల సాగుకు అవసరమైన నీటిని అందించాల్సి ఉందన్నారు. ఇందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం వంశధార నదీ జలాలను మళ్లించి రైతులకు సాగు నీరందించడమే కాకుండా, పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలను గట్టెక్కించవచ్చని సూచించారు. . జిల్లాలో గతంలో సంభవించిన వరదల్లో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకూ ఎలాంటి నష్టపరిహారం అందజేయలేదని, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజల తాగు, సాగు నీటి అవసరాలు పట్టించుకున్న దాఖలా కానరావడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు యాక్సిలిరేటెడ్ ఇరిగేషన్ ద్వారా నిధులు మంజూరు చేయించి గేదెలవానిపేట వద్ద ఆసియాలోనే అతిపెద్దది అయిన వయోడెక్ట్ నిర్మాణం చేయించారని గుర్తుచేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జి), ముద్దాడ కృష్ణమూర్తి నాయుడు, ఎస్‌వి రమణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన ఈసెట్ కౌనె్సలింగ్
ఎచ్చెర్ల, జూన్ 13: ఈ విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం ప్రవేశాలు, ఈసెట్‌తోపాటు బి-్ఫర్మసీ, డిప్లమో ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్వహించిన కౌనె్సలింగ్ గురువారంతో ముగిసింది. ఈ నెల పదోతేదీన ప్రారంభమైన ఈ కౌనె్సలింగ్ ప్రక్రియ నాలుగు రోజులపాటు కొనసాగింది. 972 మంది అభ్యర్థులు సర్ట్ఫికేట్ల పరిశీలన చేసుకున్నారు. ఒసి, బిసి కేటగిరికి చెందిన వారు 928 మంది కాగా ఎస్సీ, ఎస్టీలు 44 మంది. గత ఏడాది ఈసెట్ కౌనె్సలింగ్‌తో పోలిస్తే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉంది. గత విద్యాసంవత్సరంలో 753 మంది కౌనె్సలింగ్‌కు హాజరు కాగా ఒసి, బిసిలు 707 మంది కాగా 46 మంది. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లా కన్వీనర్, ప్రభుత్వ బాలుర పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ వి.ఎస్.దత్, కౌనె్సలింగ్ ఇన్‌చార్జి మేజర్ శివకుమార్‌లు ఏర్పాట్లు చేశారు.
ఎంఎ రూరల్ డెవలప్‌మెంట్ ప్రవేశాల కౌనె్సలింగ్
ఎచ్చెర్ల, జూన్ 13: ఆసెట్‌తో సంబంధం లేకుండా ఎం.ఏ. రూరల్‌డెవలప్‌మెంట్ కోర్సులో అడ్మిషన్ల కోసం ఈ నెల 19వ తేదీన కౌనె్సలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 40 సీట్లకు కౌనె్సలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్‌జిఒ ప్రాజెక్టుతోపాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. బి.ఏ, బి.కాం, బి.బి.ఎం, బిఎస్సీ అగ్రికల్చర్, ఎం.ఏ సోషల్‌వర్క్, సోషియాలజీ పూర్తిచేసిన అభ్యర్థులు కౌనె్సలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు.
జగన్ సిఎం అయితే ఎస్సీలకు ప్రాధాన్యత
శ్రీకాకుళం, జూన్ 13: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే షెడ్యూల్ కులాలకు ప్రాధాన్యత ఇవ్వబడునని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ విభాగం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే షెడ్యూల్ కులాలకు చెందిన రుణాలు మాఫీ చేయబడ్డాయని గుర్తుచేశారు. యువతకు ఉపాధి కల్పనతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టబడునని ప్లీనరీలో ప్రకటించినట్లు తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ఆజ్యం వేసింది వైఎస్సేనన్నారు. ఎస్సీలను ప్రస్తుత ప్రభుత్వం వెనుకన పెట్టి పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో 80 శాతం సర్పంచ్‌లను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎస్సీల అభివృద్ధి కార్యక్రమంలో నడిపించాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశీలకులు రాజేష్‌కన్నా, ఎస్సీ సెల్ కన్వీనర్ దేవరాజ్, కిల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.