విశాఖపట్నం, జూన్ 13: ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు పేరుతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చైర్మన్ కం మేనేజింగ్ డైరక్టర్లుగా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులే వస్తున్నారు. ఇప్పటి వరకూ పనిచేసిన సిఎండిల్లో శివ సాగరరావు ఒక్కరే తెలుగువారు. ఆయన 2007లో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత మళ్లీ తెలుగువారు ఈ పదవిని చేపట్టలేకపోయారు. చాలా కాలం తరువాత తెలుగువారైన మధుసూదన్‌కు సిఎండి పదవి లభించింది. ఈ పదవిని చేపట్టిన రెండో తెలుగువారు మధుసూదన్. గుంటూరు జిల్లా ఆరేపల్లిలో 1958 మే తొమ్మిదో తేదీన జన్మించిన మధుసూదన్ ఆంధ్రా యూనివర్శిటీలో 1975-78 సంవత్సరాల మధ్య బికాం డిగ్రీ పూర్తి చేశారు. ఆయన యూనివర్శిటీలో 10 ర్యాంక్ సాధించారు. మధుసూదన్ 1982లో చార్టర్డ్ అక్కౌంట్ పూర్తి చేశారు. అఖిల భారత స్థాయిలో 42వ ర్యాంక్ సాధించారు. 1984లో ఐసిడబ్ల్యుఎ పూర్తి చేశారు. 1986లో కంపెనీ సెక్రటరీగా మధుసూదన్ నియమితులయ్యారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్ (ఫైనాన్స్)గా 1986 జూన్ 30వ తేదీన ప్రారంభించారు. మధసూదన్ 24 సంవత్సరాల పాటు బిలాయ్ స్టీల్ ప్లాంట్‌లోనే వివిధ హోదాల్లో పనిచేశారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఆర్థికాభివృద్ధికి ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మధుసూదన్‌కు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, చిత్రలేఖనం, శాస్ర్తియ సంగీతం అంటే ఇష్టం.
కో-ఆర్డినేటర్లకు విలువేదీ?
* అక్కరకు రాని అనుబంధ సంఘాలు
* వైకాపాలో ముదురుతున్న విభేదాలు
విశాఖపట్నం, జూన్ 13: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. నియోజకవర్గానికి కో-ఆర్డినేటర్లుగా నియమించిన వారికి విలువ లేకుండా పోతోంది. ఆయా నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానించడం లేదు. మరికొన్ని నియోజకవర్గాల్లో వారు ఇతరులను కార్యక్రమాలకు పిలవడం లేదు. జిల్లా అనుబంధ కమిటీలో ఉన్న వారి పరిస్థితి, అలాగే అధికార ప్రతినిధుల పాత్ర ఏంటో తెలియని విధంగా ఉంది. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనర్లను పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా ప్రకటించారు. అర్బన్ జిల్లాకు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌ను, రూరల్ జిల్లాకు గొల్ల బాబూరావును కన్వీనర్‌లుగా ప్రకటించారు. అర్బన్ జిల్లాలో అడపదడప పార్టీ నిర్దేశిత కార్యక్రమాలు జరుగుతునే ఉన్నాయి. ఇక్కడే మరో గట్టి వర్గం పనిచేస్తోంది. అనకాపల్లి ఎంపి సబ్బం హరి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ, వైకాపాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఇప్పటికే విశాఖ నగరంలోని ఒక నియోజకవర్గంలో తన అనుచరుడికే కీలక బాధ్యతలు కట్టబెట్టేలా పావులు కదిపారు. ఇక రూరల్ జిల్లాకు వచ్చేప్పటికి కొణతాల రామకృష్ణ ఇప్పటి వరకూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే వారు. ఇదిలా ఉండగానే, దాడి వీరభద్రరావును పార్టీలోకి తీసుకువచ్చింది అధిష్ఠానం. అప్పటి నుంచి రూరల్ జిల్లాలో వైకాపా పరిస్థితి దారుణంగా తయారైంది. బలమైన ప్రత్యర్థుల మధ్య పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇప్పటి వరకూ దాడి వీరభద్రరావు పార్టీ పరంగా ఎటువంటి కార్యాచరణ ప్రారంభించకపోయినా, దీర్ఘకాలిక వ్యూహంతో ఆయన ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో కొణతాల రామకృష్ణ వైఖరేమిటో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు మరెంతో వ్యవధి లేదు. రూరల్ జిల్లాలో సంస్థాగతంగా పార్టీ ఇంకా బలపడలేదు. దీనికి కావల్సిన చర్యలు తీసుకోవడమూ లేదు. విభేదాలతో సతమతమవుతున్న పార్టీనీ గట్టెక్కించేందుకు ఎవరు నడుం కడతారన్నది చర్చనీయాంశమైంది.
ఇక అర్బన్ జిల్లాకి కమిటీని వేశారు. వీరి బాధ్యతలు ఏంటో ఎవ్వరికీ తెలియదు. అధికార ప్రతినిధులను కూడా నియమించారు. వారు ఎప్పుడూ పెదవి విప్పే పరిస్థితి కూడా లేదు. వీరంతా ఒక ఎతె్తైతే, పార్టీ ఆవిర్భావం సమయంలోనే జగన్‌కు తోడుగా నిలిచి, వివిధ నియోజకవర్గాల నుంచి టిక్కెట్‌లను ఆశించిన వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది. వీరి భవితవ్యం ఏంటో వీరికే అర్థం కావడం లేదు. ఇవన్నీ చక్కబడాలంటే, జిల్లాలోని అగ్రనేతల మధ్య వైషమ్యాలను తొలగించాల్సిన బాధ్యత అధిష్ఠానంపై ఉంది. ఉత్తరాంధ్ర పరిశీలకునిగా ఉన్న సుజయకృష్ణ రంగారావు శుక్రవారం విశాఖ నగరానికి వస్తున్నారు. జిల్లాలోని పార్టీని చక్కదిద్దడానికి ఆయన ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారో వేచి చూడాలి.
ధర్మారావు కుటుంబాన్ని పరామర్శించిన అధికారులు
విశాఖపట్నం, జూన్ 13: జమ్మూలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐఎఎస్ అధికారి కుటుంబాన్ని పలువురు అధికారులు పరామర్శించారు. ధర్మారావు మధ్య ప్రదేశ్‌లో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఆ సమాచారాన్ని ఇక్కడికి అధికారులకు చేరవేసింది. మధ్య ప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ అధికారిగా ఉన్న ప్రస్తుత జిసిసి ఎండి రమేష్ ఈ విషయం తెలుసుకుని, జిల్లా కలెక్టర్ శేషాద్రిని సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ రంగయ్యను రమేష్ వెంట పంపించారు. వీరంతా సీతమ్మధార అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న ధర్మారావు సోదరుడు రాజారావు ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. కాగా, ధర్మారావు దంపతుల మృతదేహాలు శుక్రవారం ఇక్కడికి చేరుకుంటున్నాయి. వీరి అంత్యక్రియలు శనివారం జరుగుతాయి. అంత్యక్రియలకు మధ్య ప్రదేశ్‌కు చెందిన పలువురు ఐఎఎస్ అధికారులు, మంత్రులు హాజరుకానున్నారు.
పాఠశాలలు ప్రారంభం
* ఫిట్‌నెస్ లేని బస్సులపై అధికారుల దాడులు
విశాఖపట్నం, జూన్ 13: ఫిట్‌నెస్ లేని బస్సులపై రవాణాశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ దాడులను విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీనిలోభాగంగా రెండు రోజుల్లో 11 స్కూల్ బస్సులపై దాడులు జరిపి ఫిట్‌నెస్ లేనివిగా అధికారులు గుర్తించారు. విశాఖ నగరంలో ఫిట్‌నెస్ లేని తొమ్మిది బస్సులను, అనకాపల్లిలో మరో రెండు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇవి కాకుండా అనకాపల్లి, నర్సీపట్నం తదితర పట్టణ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు జరిపి ఫిట్‌నెస్ లేని బస్సులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఖాన్ తెలిపారు. ఇదే తరహాలో శనివారం నర్సీపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు జరుపనున్నట్టు చెప్పారు. వేర్వేరు బృందాలకు శ్రీనివాస్, శివరామకృష్ణ, మురళీకృష్ణ తదితర అధికారులు నాయకత్వం వహిస్తున్నారన్నారు.
పనిచేయడం ఇష్టం లేకపోతే ఇళ్ళకు పోండి
* తహశీల్దార్లకుజెసి ప్రవీణ్‌కుమార్ హెచ్చరిక
నర్సీపట్నం, జూన్ 13: పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తహశీల్దార్లను హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ పరిధిలోని తహశీల్దార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వంద రోజుల ప్రణాళికలో వచ్చిన ఆర్జీలను పరిష్కరించడం లేదని ఆయన తహశీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 15వతేదీ నాటికి రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని చెప్పినా తహశీల్దార్లు పట్టించుకోవడం లేదన్నారు. ఆరు నెలలుగా గొంతు చించుకుని అరుస్తున్నా తహశీల్దార్లలో ఎటువంటి మార్పు రావడం లేదన్నారు. ప్రధానంగా అస్సైన్డ్ భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ, ఆరవ విడత భూ పంపిణీలో పంపిణీ చేసిన భూములను నేటికీ లబ్ధిదారులకు అప్పగించకపోవడంపై జె.సి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసుపుస్తకాల కోసం ఎవరెవరు రైతులను ఇబ్బందులు పెడుతున్నారో వారి జాబితా తనవద్ద ఉందన్నారు. పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని ఒక తహశీల్దార్, రెండు వారాల్లో పూర్తి చేస్తామని మరో తహశీల్దార్ సమాధానాలు చెప్పడంతో జె.సి. మండిపడ్డారు. నెలరోజుల్లో పూర్తి చేయలేని పనిని వారంరోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కాకమ్మకథలు వినడానికి తీరిక లేదని, ఇలా ఎన్ని రోజులు పొడిగిస్తారని ఆయన నిలదీశారు. తహశీల్దార్లకు ప్లాన్ లేదని, అవగాహన లోపంతో ఉన్నారని అర్ధమవుతోందన్నారు. రోలుగుంట తహశీల్దార్ చిరంజీవి పడాల్ జె.సి. అడిగిన వాటికి సమాధానం సక్రమంగా చెప్పకపోవడంతో ఆయన తీవ్రంగా మందలించారు. పనిచేయడం ఇష్టం లేకపోతే ఇళ్ళకు వెళ్ళిపోవాలన్నారు. ఆరవ విడత భూ పంపిణీలో పంపిణీ చేసిన భూములను లబ్ధిదారులకు ఇప్పటికీ అప్పగించకపోతే ఏడవ విడత భూ పంపిణీకి ఎలా వెళ్తామని తహశీల్దార్లను నిలదీశారు. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఏడవ విడత భూ పంపిణీకి తహశీల్దార్లు సిద్ధంగా ఉండాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయసారధి, ల్యాండ్ సర్వే జిల్లా అధికారి సిహెచ్.బి ఎస్.కుమార్, ఆర్డీవో ఎస్.ఎస్.వి.బి.వసంతరాయుడు, ఆరు మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సామాగ్రి కొనుగోలుకు జడ్‌సిలకు అధికారాలు
* జివిఎంసి కమిషనర్ ఎంవి.సత్యనారాయణ
సాగర్‌నగర్, జూన్ 13: పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు జోనల్ కమిషనర్లకు అధికారాలు బదలాయిస్తున్నట్లు కమిషనర్ ఎంవి.సత్యనారాయణ తెలిపారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పారిశుద్ధ్య పనుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని వెంటనే కొనుగోలు చేసి సిబ్బందికి పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో జోనల్ కమిషనర్లు, ప్రధాన వైద్యాధికారులు, సహాయ వైద్యాధికారులతో ఆయన సమావేశమై పారిశుద్ధ్య మెరుగునకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాన వైద్యాధికారి అధీనంలో పారిశుద్ధ్య సామాగ్రి ఏ మేరకు నిల్వ ఉందో అడిగి తెలుసుకున్నారు. 31 బ్యాగుల లైమ్‌స్టోన్, 21వేల కిలోల బ్లీచింగ్ పౌడర్, 370 లీటర్ల ఫినాయిల్, 750 కిలోల కొబ్బరి చీపుర్లు, 125 ప్లాస్టిక్ బకెట్‌లు నిల్వ ఉన్నట్లు తెలుసుకున్న ఆయన వెంటనే అవసరం మేరకు జోనల్ కార్యాలయాలకు సరఫరా చేయాలని ప్రధాన వైద్యాధికారిని ఆదేశించారు. గత ఏడాది అనుమతించిన రేట్ల ప్రకారం రెండు, మూడు నెలలకు అవసరమైన పారిశుద్ధ్య సామాగ్రిని వెంటనే కొనుగోలు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. రాబోవు ఏడాదికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు టెండర్లు ఖరారు చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు ప్రతినిత్యం సక్రమంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని ఏ మాత్రం అలక్ష్యం వహించిన అనారోగ్య పరిస్థితులు నెలకొంటాయని ఆయన హెచ్చరించారు. ప్రతి వార్డులోను పిన్‌పాయింట్ ప్రొగ్రాం ప్రకారం పారిశుద్ధ్య పనులు సక్రమంగా అమలయ్యేలా జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (ఫైనాన్స్) పి.పూర్ణచంద్రరావు, ప్రధాన వైద్యాధికారి పివి.రమణమూర్తి, జోనల్ కమిషనర్లు వై.సాయిశ్రీకాంత్, శ్రీరామమూర్తి, జె.విజయలక్ష్మి, సహాయ వైద్యాధికారులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డిసెంబర్ నాటికి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలి
విశాఖపట్నం , జూన్ 13: జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ప్రాజెక్టు కింద 32 విలీన గ్రామాలలో చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కమిషనర్ ఎం.సత్యనారాయణ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో నీటిసరఫరా, ప్రాజెక్టు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశమై రిజర్వాయర్లు, నీటిశుద్ధి ప్లాంట్లు, సెంట్రల్, ఓల్డ్‌సిటీ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 విలీన గ్రామాలలో చేపట్టబడిన 46 రిజర్వాయర్ల నిర్మాణ పనులలో 38 పూర్తి కాగా మిగిలిన 8 రిజర్వాయర్ నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవి.వినయ్‌కుమార్ కమిషనర్‌కు వివరించారు. పద్మనాభపురం, పోతినమల్లయ్యపాలెం. పురుషోత్తమపురం, పెద్దపాలెం, పాలవలస, అప్పికొండ, యల్లపువానిపాలెం, సూదికొండ దగ్గరలో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనుల ప్రగతిని కమిషనర్ సమీక్షించారు. వీటిలో మూడు రిజర్వాయర్ పనులను జూలై నెలాఖరు నాటికి, రెండు రిజర్వాయర్ల పనులను ఆగస్టు నెలాఖరుకు, మిగిలినవి డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అన్నారు. అదే విధంగా సెంట్రల్ సిటీ, ఓల్డ్ సిటీలకు తాగునీటి పంపిణీకి ఉద్దేశించబడిన ప్రాజెక్టుల ప్రగతిని ఆయన సమీక్షిస్తూ పైపులైను నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సెంట్రల్ సిటీ, ఓల్డ్ సిటీలలో చేపట్టబడిన 14 బిఎల్‌ఎస్‌ఆర్, ఇఎల్‌ఎస్‌ఆర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నరవ, అగనంపూడిలలో నిర్మాణంలో ఉన్న రెండు శుద్ధి ప్లాంట్‌ల ప్రగతిని ఆయన సమీక్షిస్తూ నరవ ప్లాంట్‌ను జూలై నెలాఖరు నాటికి, అగనంపూడి ప్లాంట్‌ను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఇదే తరహాలో ప్రతి వారం పనుల ప్రగతిని సమీక్షిస్తూ, భౌతిక, ఆర్థికపరమైన లక్ష్యాలను ఏ మేరకు సాధించడం జరుగుతుందో పరిశీలిస్తానన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ బి.నాగేంద్రకుమార్, ప్రధాన ఇంజనీరు బి.జయరామిరెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉమామహేశ్వరరావు, డిఇఇ వెంకటేశ్వరరావు, ఇఇలు వినయ్‌కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
దేవీపురంలో చెట్టును ఢీకొన్న వ్యాన్
* ఇద్దరు వ్యక్తుల మృతి
* మరో ఇద్దరికి తీవ్రగాయాలు
సబ్బవరం, జూన్ 13: మండలంలోని దేవీపురం వద్ద సబ్బవరం- అనకాపల్లి రోడ్డుపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యాండ్రపు పెద్దిరాజు(46), బొక్కావీర వెంకట సత్యనారాయణమూర్తి(45) అక్కడికక్కడే మృతి చెందగా, బొలెరా వ్యాన్ నడుపుతున్న పరిదేశి(చౌడవా డ),సూరంపూడి రామకృష్ణలకు తీవ్రగాయాలు తగిలాయి. గాయపడిన వారిని పోలీసులు 108 అంబులెన్స్‌లో విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించారు. ఈసంఘటనపై ఎస్‌ఐ జి.గోవిందరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా లక్కవరపు కోటలో రియల్ వ్యాపారి గుత్తుల శ్రీనివాసరావు లే-అవుట్‌లో పనిచేస్తున్న వీరు గురువారం రాత్రి బొలెరా ట్రక్ వ్యానులో అమలాపురం నుంచి బయలుదేరారు. మృతులు పెద్దిరాజు, సత్యనారాయణమూర్తి ఇంజిన్ వెనుక ఉన్న బాడీ పైభాగంలో సింటెక్స్ ఖాళీ ఫైబర్ ట్యాం క్‌ను కట్టి లోపల నిద్రిస్తున్నారు. వ్యాన్ డ్రైవర్ పరదేశి వాహ నం నడుపుతుండగా, సూరంపూడి రామకృష్ణ పక్కనున్నాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం గురువారం తెల్లవారుజామున దేవీపురం వద్దకు వచ్చేసరకి అదుపుతప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న మర్రి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, స్టీరింగ్‌లో ఇరుకున్న డ్రైవరు పరిదేశి రక్షించండంటూ కేకలు వేయటంతో పోలీసులు తాడుకట్టి బయటికి లాగారు. కేబిన్‌లోని రామకృష్ణకు మోకాలి చిప్పలు తెగిపోయాయి. పోలీసులు క్షతగాత్రులను విశాఖ తరలించారు. మృతి చెందిన ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఎస్‌ఐ గోవిందరావు తెలిపారు.
పంచాయతీల రిజర్వేషన్లపై ఉత్కంఠకు నేటితో తెర
మేజర్ పంచాయతీలపై ప్రధాన పార్టీల నేతల గురి
అనకాపల్లి, జూన్ 13: ఆశావహులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే సమయం ఎట్టకేలకు ఆసన్నమైంది. జిల్లాల వారీగా ఏ రిజర్వేషన్లు ఏయే పంచాయతీలకు వర్తించాయో సంఖ్యను నిర్ధారిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఏ పంచాయతీ సర్పంచ్ పదవి ఏవర్గానికి రిజర్వ్ అయిందనే విషయం శుక్రవారం ఖరారు కానుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ అధికారికంగా వెలువడనుంది. పంచాయతీ రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లోను, ఆశావహుల్లోను గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠతకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ద్వారా తెరపడనుంది. రిజర్వేషన్లు తమ పార్టీకి సానుకూలంగా ఉంటుందా? లేదా అనే విషయంపై నేతల్లో, ఆశావహుల్లోను తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ప్రధానంగా మేజర్ పంచాయతీల్లోను, చైతన్య రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే కొన్ని గ్రామాల్లోనూ రిజర్వేషన్ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. జిల్లాలో 930 పంచాయతీలుఉండగా, ఎస్టీకి 19 పంచాయతీలు రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్సీలకు 58, బిసిలకు 202 పంచాయతీలు రిజర్వ్ కాబడ్డాయి. మిగిలిన 408 పంచాయతీలను ఓసిలకు రిజర్వ్ చేశారు. జిల్లాలోని పలు మేజర్ పంచాయతీల రిజర్వేషన్లపై ఆయా ప్రాంత నేతలు, ఆశావహులు ఖరారయ్యే రిజర్వేషన్లు తమకు సానుకూలంగా ఉంటుందా? లేదా అనే ఉత్కంఠతతో గడుపుతున్నారు. ఒసి సామాజిక వర్గానికి చెంది వారి ఆధిపత్యంలో ఉన్న పంచాయతీల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. బిసిలు ఆధిపత్యం వహించే గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ భయం పట్టుకుంది. చైతన్య రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచే సబ్బవరం, పరవాడ, నక్కపల్లి, మునగపాక, కశింకోట, మాకవరపాలెం, కోటవురట్ల, పాయకరావుపేట, తుమ్మపాల, కొత్తూరు, మాడుగుల, విజయరామరాజుపేట, వడ్డాది మేజర్ పంచాయతీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా వివిధ హోదాల్లో ఉన్నత పదవులు నిర్వహించిన వారంతా గ్రామ సర్పంచ్ నుండి రాజకీయ ఆరంగ్రేటం చేసిన వారే. భవిష్యత్‌లో రాజకీయంగా గట్టి పునాది వేసుకోవడానికి గ్రామసర్పంచ్ పదవి ప్రాథమికంగా ఎంతో ఉపయోగపడటమే ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. కొత్తూరు, తుమ్మపాల, కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, పరవాడ తదితర పంచాయతీల్లో ఒసి, బిసి సామాజిక వర్గాల వారి మధ్య రాజకీయంగా గట్టి ఆధిపత్యం ఉంది. ఆయా స్థానాలు ఓసిలకు రిజర్వ్ అయితే ఇరువర్గాల వారు పోటీకి దిగవచ్చు. అలాకాకుండా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయితే పరిస్థితి పూర్తిగా తారుమారవుతుంది.
మునగపాక, నాగులాపల్లి, చోడవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి ఇతర పంచాయతీల్లో బిసి సామాజిక వర్గం వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. ఎస్సీలకు రిజర్వ్ అయితే ఇప్పటికే సర్పంచ్ పదవులపై కొండంత ఆశలు పెట్టుకున్న ప్రధాన రాజకీయ పార్టీల్లోని నేతలు వారి అనుచరవర్గ నేతల ఆశలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ సమీకరణలే పూర్తిగా మారిపోయే పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. రిజర్వేషన్ ప్రతికూలంగా వస్తే గ్రామాల్లో వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశం కోల్పోయి మరికొంతకాలం పాటు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఊహించని విధంగా రిజర్వేషన్ కలిసి వస్తే సర్పంచ్ పదవులపై ఆశలు లేని వారిని ప్రధాన పార్టీల నేతలు బ్రతిమాలి పోటీకి దింపే పరిస్థితులు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయ్యే పంచాయతీల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
బాధ్యతారాహిత్యంపై పిఒ ఆగ్రహం
ఇద్దరు హెచ్‌ఎంలు, ముగ్గురు ఉపాధ్యాయులకు షోకాజ్‌లు
డుంబ్రిగుడ, జూన్ 13: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి ప్రొజెక్టు అధికారి వై.నరసింహారావు గురువారం మండలంలో తొలిసారిగా పర్యటించారు. ఏజెన్సీలో విద్యావ్యవస్థ తీరుపై మండిపడుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కించుమండ, డుంబ్రిగుడ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై కొరఢా ఝుళిపించారు. ఏజెన్సీలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ బృందం ఏవిధంగా కృషి చేస్తుందన్న దారిపై ప్రత్యేక దృష్టి సారించారు. కించుమండ కేంద్రీకృత ఆశ్రమోన్నత పాఠశాల, డుంబ్రిగుడ పాఠశాలలను సందర్శించిన పి.ఒ పనితీరు అధ్వాన్నంగా ఉండడంతో ఆగ్రహావేశాలకు గురై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సత్యమోహన్, కొండమ్మకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కించుమండ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, అందులో తొమ్మిది మంది పాఠశాలకు హాజరుకాగా, మిగిలిన ముగ్గురు గైర్హాజర్ కావడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వతేదీ నుండి తరగతులు ప్రారంభమైనా విద్యార్థులు పూర్తిస్థాయిలో పాఠశాలలకు హాజరు కాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులు ప్రారంభం రోజు నుండే పాఠశాలలకు హాజరైనా పాఠశాల సిబ్బంది శ్రద్ధ చూపకపోవడంపై ఆయన ఆగ్రహించారు. 400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా పాఠశాల తరగతులు ప్రారంభమై మూడు రోజులు గడిచినా ఒక్క విద్యార్థి కూడా హాజరుకాక పోవడాన్ని గుర్తించిన ఐటిడిఎ పిఒ సిబ్బందిపై తీవ్రంగా మండిపడ్డారు. ఏజెన్సీ డిఇఒ తీరు సక్రమంగా లేకపోవడం వలనే విద్యావ్యవస్థ అటకెక్కుతోందని పి.ఒ. అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘం నాయకులు తమ హక్కుల కోసం పోరాటాలు సాగించేముందు వారి బాధ్యతలపై దృష్టిసారించాలన్నారు. పి.ఒ. పర్యటనలో గృహనిర్మాణ శాఖ, కాఫీ అధికారులు మినహా మిగిలిన శాఖల అధికారులు సమయపాలన పాటించక పోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
పిసిపిఐఆర్‌లో రవాణా వ్యవస్థపై వుడా వీసి సమీక్ష
విశాఖపట్నం, జూన్ 13: విశాఖ-కాకినాడ మధ్య అభివృద్ధి చేయనున్న పెట్రోలియం, కెమికల్, పెట్రో కెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) పరిధిలో రవాణా వ్యవస్థ ప్రతిపాదనలపై పిసిపిఐఆర్ స్పెషల్ డెవలెప్‌మెంట్ అథారిటీ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వుడా వీసి డాక్టర్ ఎన్.యువరాజ్ సమీక్ష నిర్వహించారు. గురువారం వుడా కార్యాలయంలో జరిగిన సమావేశంలో పిసిపిఐఆర్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు, జీఎంఆర్ సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖాధికారులతో రవాణా వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలపై సమీక్షించారు. పిసిపిఐఆర్ పరిధిలో మెరుగైన రవాణా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు వీలుగా బృహత్ప్రణాళికలో పొందుపరిచిన సూచిత మార్గాలు, అవసరమైన చోట్ల ప్రస్తుతం ఉన్న ప్రధాన రహదారులతో అనుసంధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. విశాఖ నుండి కాకినాడ వరకు సుమారు 150 కిలోమీటర్ల పొడవున ప్రతిపాదించిన ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు విశాఖపట్నం స్టీలుప్లాంటు, కాకినాడ సమీపంలో జీఎంఆర్ భూముల మీదుగా ప్రతిపాదించడంతో ఆ సంస్థల ప్రతినిధుల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. రహదారి ఏర్పాటుకు అటవీ భూములు, కొండలు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నచోట ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా సమావేశంలో చర్చించారు. త్వరితగతిన ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేసిన పిసిపిఐఆర్ బృహత్తర ప్రణాళిక ముసాయిదా పొందుపర్చాల్సిందిగా వీసి డాక్టర్ యువరాజ్ అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ఉన్న రహదారుల వివరాలు, ప్రతిపాదించిన రహదారుల అభివృద్ధి వివరాలను కూడా సమావేశంలో చర్చించారు. పిసిపిఐఆర్ పరిధిలో గ్రీన్‌బెల్టు అభివృద్ధి నియమావళిపై కాలుష్య నియంత్రణ మండలి, ఏపిఐఐసి అధికారులు, వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యల్లతతో సమీక్షించిన వీసి నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేయాలని సూచించారు. అలాగే పిసిపిఐఆర్ పరిదిలో ప్రాంతాల్లో పర్యావరణ ప్రభావం, సిఆర్‌జెడ్ అమలు నిబంధనవళిపై ఈపిటీఆర్‌ఐ, ఎన్‌ఐఓ సంస్థలు చేపట్టిన పరిశోధనలు అధ్యయనాల వివరాలను సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమీక్షించారు. పిసిపిఐఆర్ బృహత్ప్రణాళిక ముసాయిదాను ప్రకటించేందుకు వీలుగా పొందుపర్చాల్సిన సాంకేతిక వివరాలన్నింటినీ పది రోజుల్లోపు ఖరారు చేసి అందజేయాలని వీసి యువరాజ్ సంబంధిత శాఖల ప్రతినిధులకు సూచించారు. పిసిపిఐఆర్ వుడా చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్‌జె విద్యుల్లత, డిప్యూటీ డైరెక్టర్ వి.రామ్‌కుమార్, స్టీల్‌ప్లాంటు డైరెక్టర్ పర్సనల్ వైఆర్ రెడ్డి, జనరల్ మేనేజర్లు బి.మాథ్యూ, ఆర్‌ఆర్ శ్రీవాత్సవ, డీజిఎం బిఎన్ కనియన్, ఏపిఐఐసి చీఫ్ ఇంజనీర్ సిహెచ్‌వివిఎస్ ప్రసాద్, జోనల్ మేనేజర్ యతిరాజు, జిఎంఆర్ ప్రతినిధులు కెబి అరుణాచలం, అరిపు చెల్వన్, డాక్టర్ ఎవివి చౌదరి, అబ్రహాం వర్కీ, మత్స్యశాఖ సహాయ సంచాలకులు వైజె ప్రభుదాస్, ఎపిట్కో కన్సల్టెంట్లు లక్ష్మీనారాయణ, ఆర్.రాజశేఖర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ మోహనరావు పాల్గొన్నారు.
‘మహిళలు బ్యాంకు రుణాలతో ఆదాయం పెంచుకోవచ్చు
విశాఖపట్నం , జూన్ 13: పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు లింకేజి రుణాలతో ఆదాయ వనరుల పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేలా వారిని చైతన్యపర్చాలని కమిషనర్ ఎంవి.సత్యనారాయణ యుసిడి అధికారులను ఆదేశించారు. బ్యాంకు లింకేజి రుణాలు కేవలం అప్పులు తీర్చుకోవడానికి, కుటుంబ అవసరాలకు వినియోగిస్తే ఉపయోగం లేదని ఆ సొమ్మును సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా మహిళలు అడుగులు వేయాలని ఆయన సూచించారు. గురువారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమావేశమై నగరంలో యుసిడి కార్యక్రమాలు అమలుతీరును ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో కొబ్బరితోట ప్రాంతంలో పర్యటించినప్పుడు పొదుపుసంఘాల మహిళలు బ్యాంకు లింకేజి రుణాలను కేవలం సొంత అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఇటువంటి విధానాలను పొదుపు సంఘాల మహిళలు అవలంబించకుండా వారిని చైతన్యపర్చాలని అధికారులకు సూచించారు. జనశ్రీ బీమా యోజన పథకంలో పెద్దఎత్తున లబ్ధిదారుల నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని లక్ష్యంగా నిర్దేశించిన 53 వేలను రెండు రోజులలో సాధించాలని ఆయన క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా స్ర్తి శక్తి భవనాలను నిర్మించేందుకు నిర్ణీత ప్రాంతాలను గుర్తించి సంబంధిత ప్రతిపాదనలను తమకు వెంటనే సమర్పించాలన్నారు. ఎస్‌జెఎస్‌ఆర్‌వై పథకం కింద కూడా లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 800 మందికి రుణాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని ఆయన ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు అమలుపరుస్తున్న రాజీవ్ యువకిరణాల కార్యక్రమాన్ని విస్తృతస్థాయిలో అమలుపర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కెజిహెచ్, రైల్వేస్టేషన్, బస్టాండ్ల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని దీనికి తగినట్టుగా చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక భద్రత కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. పరదేశిపాలెం, మదినాబాగ్, మంత్రిపాలెం తదితర ప్రాంతాలలో నిర్మించిన జిఎన్‌ఎన్‌యుఆర్‌ఎం గృహ సముదాయాలలో కేటాయించిన ప్లాట్లలలో చాలా మంది నివాసం ఉండట్లేనట్లు గుర్తించడమైనదని, ఆయా లబ్ధిదారుల జాబితాను రూపొందించి వెంటనే తమకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) బి.నాగేంద్రకుమార్, యుసిడి పిడి పాత్రుడు, అన్ని జోన్ల ఎపిడిలు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో 15 కల్యాణ మండపాలు సీజ్
విశాఖపట్నం (జగదాంబ), జూన్ 13: నగర పరిధిలో అగ్నిమాపక ప్రమాణాలు పాటించని 15 కళ్యాణమండపాలను సీజ్ చేసినట్లు కమిషనర్ ఎంవి.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటివరకూ ఆదేశాలు మాత్రమే ఇచ్చిన జివిఎంసి అధికారులు ప్రస్తుతం ఒక్కసారిగా గురువారం దాడులు చేయడంతో అసలైన వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండవ జోన్‌లో మూడు, నాల్గవ జోన్‌లో ఐదు, అయిదవ జోన్‌లో మూడు, ఆరవ జోన్‌లో నాల్గింటిని సీజ్ చేయడమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగర పరిధిలో మొత్తం 94 కల్యాణ మండపాలను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించగా అందులో 91 కల్యాణ మండపాలలో అగ్నిమాపక ప్రమాణాలు పాటించనట్లు గుర్తించడమైనదని అన్నారు. ఆయా కల్యాణమండపాల యజమానులకు గత ఏడాది డిసెంబర్ నెలలో షోకాజ్ నోటీసు జారీ చేయడమైందని, ఈ ఏడాది జనవరి నెలలో రెండుసార్లు వారందరితో సమావేశం నిర్వహించి అగ్నిమాపక ప్రమాణాలు, పార్కింగ్ ప్రాధాన్యతను వివరించడమైందని అన్నారు. అయినప్పటికీ చాలా కల్యాణమండపాల నిర్వాహకులు ఏ మాత్రం స్పందించకపోవడం గుర్తించడమైందని అన్నారు. అలాగే హెచ్‌ఎంసి యాక్ట్ సెక్షన్ 461 ఎ ప్రకారం కల్యాణమండపాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఫిబ్రవరిలో కూడా నోటీసులు జారీ చేయడమైందని అన్నారు. అనంతరం నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు అగ్నిమాపక సామాగ్రిని ఏర్పర్చుకునేందుకు మే నెలాఖరు వరకూ గడువు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఇలా అనేకసార్లు అవకాశాలు ఇచ్చినప్పటికీ కల్యాణమండపాలు నిర్వాహకులు సద్వినియోగం పర్చుకోనందున ఇప్పటివరకూ 15 కళ్యాణ మండపాలను సీజ్ చేసామని, త్వరలోనే మిగిలిన వాటిపై కూడా చర్యలు చేపడతామని అన్నారు.
వ్యక్తుల కన్నా వ్యవస్థ ముఖ్యం
* రాజకీయాల్లో ప్రక్షాళన అవసరం
* శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు
సింహాచలం, జూన్ 13: ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల ప్రాధాన్యత కన్నా వ్యవస్థ పటిష్టతే ప్రధానమని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల అన్నారు. అన్నిరంగాలలో విలువలు పడిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోకంలో దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలు పెచ్చుమీరినప్పుడు భగవంతుడు సాక్షాత్కరిస్తాడని నమ్మే సమాజంలో మనం ఉన్నామంటూ రామకృష్ణుడు వేదాంత ధోరణిలో మాట్లాడారు. గురువారం ఆయన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రజలు తమ బాగుకోసం నేతలను ఎన్నుకుంటారనే వాస్తవాన్ని రాజకీయ నాయకులు గ్రహించాలని ఆయన సూచించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపారే తప్ప పార్టీలనుగాని, వ్యక్తులను గాని ఆయన ప్రత్యక్షంగా విమర్శించలేదు. వ్యవస్థను సరిచేయాల్సిన ప్రభుత్వాలే విలువలు పడిపోయేలా ప్రవర్తించడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల్లో విలువలు దిగజారినప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలని యనమల పిలుపునిచ్చారు. కాగా సింహాచలం దేవస్థానం భూసమస్య అంశాన్ని స్థానిక టిడిపి నేత పాశర్ల ప్రసాద్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తానని సాధ్యం కాకపోతే ప్రభుత్వంతో పోరాటం చేద్దామని చెప్పారు. కొంతమంది రైతులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.
ప్రత్యేక పూజలు
శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు సింహాచలేశుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దేవస్థానం ఇఓ కె.రామచంద్రమోహన్ యనమలకు స్వాగతం పలికారు. కప్పస్తంభం వద్ద యనమల స్వామి వారిని ప్రార్థించారు. అంతరాలయంలో యనమల పేరున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భరణికోన రామారావు, బమ్మి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.