విజయనగరం, జూన్ 13: జిల్లాలో పంచాయతి ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. దీంతో కేటగిరీల వారీగా పంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ సంఖ్య ఆధారంగా ఏ మండలానికి ఎన్ని పంచాయతీలు రిజర్వు చేయాలన్నదీ జిల్లా స్థాయిలో కసరత్తు జరగనుంది. 2011 జనాభా ఆధారంగా కసరత్తు చేయనున్నారు. 17లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్‌లో ప్రచురిస్తారు. కాగా, ఏయే కేటగిరీలకు ఎనె్నన్ని స్థానాలు కేటాయించాలనేది ప్రభుత్వం స్పష్టం చేయడంతో జిల్లాలో పంచాయతీ ఎన్నికల అలజడి మొదలైంది. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పత్రాల ముద్రణ ఇప్పటికే పూర్తి చేసి పంచాయతీల వారీగా జాబితాలను సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కూడా ప్రాథమికంగా జరిపారు. మరో పక్క రాజకీయ పార్టీలు తమ బలాన్ని, బలగాన్ని పెంచుకోడానికి సమాయత్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీద ఉంటుందన్న ఆలోచనతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయానికి ముందస్తు వ్యూహంతో ముందుకెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నప్పటికీ వీటిలో కూడా తమదే పైచేయి సాధించేందుకు అడుగులు వేస్తోన్నారు.
జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గతంలో 928 పంచాయతీలు ఉండగా.. నెల్లిమర్ల, జర్జాపుపేట, కణపాక, కె.ఎల్.పురం, గాజులరేగ, ధర్మపురి పంచాయతీలు మున్సిపాల్టీలో విలీనమయ్యాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య తగ్గింది. కాగా, జిల్లాలో 2006 జరిగిన ఎన్నికల్లో 8750 పంచాయతి వార్డులకు ఎన్నికలు నిర్వహించగా, ఈ దఫా 8764 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకుగాను సగం స్థానాలు మహిళలకు కేటాయించారు. ఆ ప్రకారం 461 స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి. ఇవిగాకుండా పురుషులకు కేటాయించే స్థానాల నుంచి మహిళలు పోటీ చేసే అవకాశం ఉంది. జిల్లా జనాభా ఆధారంగా మొత్తం 921 స్థానాలకుగాను 123 స్థానాలు ఎస్టీలకు అంటే 13.3 శాతం స్థానాలు ఎస్టీలకు దక్కాయి. వీటిలో 77 స్థానాలు షెడ్యూల్డ్ పంచాయితీలు ఉన్నాయి. షెడ్యూల్డ్ పంచాయతీలలో నూరు శాతం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. ఇక ఎస్సీలకు 71 స్థానాలు కేటాయించారు. అంటే 7.7 శాతం స్థానాలు వీరికి దక్కాయి. బీసీలకు 342 స్థానాలు, జనరల్ కేటగిరీకి 385 స్థానాలు కేటాయించారు. మొత్తం పంచాయతీల్లో 37.13 శాతం స్థానాలు బీసీలకు కేటాయించారు. కాగా, అన్ని పంచాయతీలకు కేటగిరీల వారీగా రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. దీంతో గ్రామాల్లో వాడీవేడిగా రాజకీయాలు ఊపందుకున్నాయి.
‘మూడేళ్ల పాలన సంతృప్తినిచ్చింది’
విజయనగరం, జూన్ 13: జిల్లా కలెక్టర్‌గా మూడేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆయన మరో రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన 3ఆంధ్రభూమి2తో మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్య, సాంఘీక రంగాల్లో అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. ఆ క్రమంలోనే వలసలను అరికట్టి పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు. గత మూడేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఉపాధి పనులు చేపట్టామన్నారు. ఆరు లక్షల మంది కూలీలకు ఉపాధి కల్పించగలిగామని చెప్పారు. ఆ సందర్భంలోనే జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. దీనికిగాను ప్రధాని మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే నిరక్షరాస్యత నిర్మూలనలో కూడా గత ఏడాది ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా అవార్డు లభించిందని వివరించారు. తన పాలనలో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్‌కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అవార్డు
పార్వతీపురం, జూన్ 13: జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్యకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అవార్డు కూడా లభించడం పట్ల అయనకు పలువురు అధికారులు అభినందించారు. సాక్షర భారతి కార్యక్రమం ద్వారా అక్షరాస్యత సాధనకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఎస్ ఆర్ సి డైరక్టర్ నుండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు అవార్డుకు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఎంపికయినట్టు సమాచారం రావడంతో పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి ఆర్ అంబేద్కర్, జడ్పీ సిఇఒ మోహనరావు, పార్వతీపురం ఆర్డీవో జె.వెంకటరావుతదితర అధికారులు కలెక్టర్‌ను అభినందించారు.
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ
డెంకాడ, జూన్ 13 : రుతుపవనాల కదలికతో రైతులు వ్యవసాయ పనుల్లో బిచె అయ్యారు. అడపాదడపా కురుస్తున్న వర్షపు జల్లులకు గ్రామాల్లో రైతులు ప్రస్తుతం వేరుశెనగ సాగుకు సంబంధించిన విత్తనాలు నాటుతున్నారు. మరో 15 రోజుల్లో వరి విత్తనాలు కూడా నాటేందుకు అవకాశం ఉందని రైతులు అంటున్నారు. మండలంలోని అక్కివరం, గొలగాం, గంట్లాం, డి.తాళవలస, ఆకులపేట,జొన్నాడు, రఘుమండ, చింతలవలస, మోపాడ, అమకాం, బెల్లాం తదితర గ్రామాల్లో రైతులు ఎక్కువగా వేరుశెనగ సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు అనువైన వర్షాలు లేకపోవడంతో విత్తనాలు నాటేందుకు రైతులు కొంత భయపడుతున్నారు.
‘గ్రంథాలయాలకు పక్కా భవనాలు’
వేపాడ, జూన్ 13 : మండల కేంద్రమైన వేపాడలోని శాఖా గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు వెల్లడించారు. వేపాడ మండలం వెనుక బడిన ప్రాంతమైనప్పటికీగ్రంథాలయాల అభివృద్దిలో వేపాడలో ప్రథమ స్థానాల్లో ఒకటిగా నిలిచి ఉందన్నారు. అటువంటి గ్రంథాలయానికి ఇంత వరకూ సొంత భవనం లేకపోవడం శోచనీయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 6 మండలాలకు 71.97 లక్షల రూపాయల నిధులు మంజూరైందన్నారు. వీటిలో కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, మక్కువ,సాలూరు, పాచిపెంట గిరిజన మండలాలు ఉన్నాయన్నారు. దీంతోపాటు మరో 8 మండలాలకు ఒక్కొక్కదారి 10 లక్షలు చెప్పున 80 లక్షలతో ప్రతిపాదనలు చేసామన్నారు. జిల్లాలో 40 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయని వీటిలో తొమ్మిదిగ్రంథాలయాలకు సొంత భవనాలు ఉండగా 13 అద్ద్దె భవనాల్లోను మిగిలిన 18 భవనాలు దాతలు సమకూర్చినవి ఉన్నాయని అన్నారు. అలాగే జిల్లా గ్రంధాలయాన్ని అభివృద్ది చేసేందుకు కోటి 50 లక్షలతో ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.ఎస్.కోటలోని భవనం శిధిలావస్థకు చేరుకున్నందున కొత్త్భవనం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గత ఏడాది నాలుగు మున్సిపాలిటీలు కలిపి కోటి 10 లక్షలు, పంచాయతీల నుంచి 17 లక్షల రూపాయలు వసూలైందన్నారు. జిల్లాలో 111 బుక్ డిపోలు మంజూరు కాగా 105 ఇచ్చామని మిగిలిన 6 పెద్ద పంచాయతీలను ఇచ్చేందుకు ఆలోచనలు చేసామని అన్నారు. స్థానికులు మహేష్, ఎస్.అప్పారావు, సత్యంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయండి
దత్తిరాజేరు, జూన్ 13 : గ్రామాల్లో పంపిణీ చేసిన మొక్కల పెంపకం కార్యక్రమం వేగవంతం చేయాలని ఎపిఓ బాణు సన్యాసినాయుడు క్షేత్ర సహాయకులకు సూచించారు. ముందుగా గుర్తించిన రైతుల పొలాల్లో గుంతలు తీయించి మామిడి మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలన్నారు. తప్పని సరిగా వర్క్ డిమాండ్, పని కేటాయింపు సమాచారాన్ని సక్రమంగా నిర్వహించకపోతే వేతనాల చెల్లింపు జరగడం కష్టమవుతుందన్నారు. అలాగే గునపాలు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పనులు ప్రారంభించి గంటలోపే ఈ మస్టరు విధానాన్ని పాటించాలన్నారు. వారం వారం కూలీలకు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలకు వీలైనంత ఎక్కువ కూలి లభించేలా చూడాలని అన్నారు. పనుల గుర్తింపు, చెల్లింపుల్లో పారదర్శకత ఉంటేలా చూడాలని పిలుపునిచ్చారు. పనులలో అక్రమాలు జరిగితే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇసి శివప్రసాద్‌యాదవ్, టెక్నికల్ అసిస్టెంట్, నాయుడు, శ్రీదేవి, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
‘విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలి’
విజయనగరం, జూన్ 13: ఎపి రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని ఎ.పి.సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. గురువారం ఆయన వివిధ జిల్లాల ప్రిన్సిపాళ్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదుల వాతావరణం ఆహ్లాదాన్నిచ్చే విధంగా ఉండాలన్నారు. విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో ఇంగ్లీషు భాషలో ప్రావీణ్యం సాధించేవిధంగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు వారికి మార్కులకు బదులు గ్రేడ్‌లను కేటాయించాలన్నారు. ప్రతి విద్యార్థికి గ్రేడుల వారీగా పాయింట్లను కేటాయించాలన్నారు. 4, 5, 8, 9 తరగతులకు పుస్తకాలు మారినందున కొత్త సిలబస్ ప్రకారం ప్రాజెక్టు వర్కులను తయారు చేయాలన్నారు. విద్యార్థుల్లో నిరంతర సమగ్ర పర్యవేక్షణ (సిసిఇ) ఉండాలన్నారు. విద్యార్థులతో ప్రాజెక్టు వర్కులను చేయించాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాళ్లు వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరావులతోపాటు పలువురు ప్రిన్సిపాళ్లు, పిజిటిలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిధులు ఖర్చు చేయకపోవడంపై
నాఫెడ్ డైరెక్టర్ ఆగ్రహం
గుర్ల, జూన్ 13 : అపారిశుధ్య నిర్మూలనకు మంజూరైన నిధులు నేటి వరకు ఎందుకు ఖర్చు చేయలేదని, ఆసుపత్రికి ఖర్చు పెట్టిన నిధులపై పూర్తి రికార్డు ఎందుకు తయారు చేయలేదని గుర్ల, ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఎఎన్‌ఎంలపై నాఫెడ్ డైరెక్టర్ కెవి సూర్యనారాయణరాజు మండి పడ్డారు. గురువారం గురల ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి సలహా సంఘం సమావేశానికి నెల్లిమర్ల ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన డయేరియా షెడ్‌ను నాఫెడ్ డైరెక్టర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆసుపత్రికి ఖర్చు పెట్టిన నిధులపై సమాచారం తెలపమని కోరగా పూర్తి నివేదిక సిబ్బంది ఇవ్వలేక పోయారు. మాజీ ఎమ్మెల్యే పొట్నూరి సూర్యనారాయణ మాట్లాడుతూ నివేదికను పీటర్స్ ద్వారా తెలియపరచలేదని ప్రశ్నించారు 10 నిమిషాల్లో నివేదిక తయారు చేసి ఇస్తామని డా.ఎస్‌వి రమణ తెలిపారు. 13 సబ్ సెంటర్లకు మంజూరైన సబ్ సెంటర్ నిధులపై గుర్ల ఆరోగ్య కేంద్రం ఎఎన్‌ఎంలు నివేదిక కోరారు. నిధులు రావడం ఆలస్యంగా వచ్చాయని నిధులు ఖర్చులో సెక్రటరీలు సహకరించ లేదని దీనిపై పలు మార్లు ఎంపిడిఓకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎంపిడిఓ మాట్లాడుతూ జమ్ము నుండి మామ్రే ఫిర్యాదు అందినట్లు తెలిపారు.
‘శూన్యవడ్డీ వల్ల రైతులకు ఊరట’
విజయనగరం (్ఫర్టు), జూన్ 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన శూన్యవడ్డీ వల్ల రైతులకు ఊరట కలుగుతుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వంగపండు శివశంకర ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 52,176 మందిరైతులకు శూన్యవడ్డీ కింద 5,07,40,792 రూపాయలను ఆయా సహకార సంఘాల ఖాతాల్లో జమచేస్తామన్నారు. గురువారం సాయంత్రం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం నాలుగుశాతం వాటా కింద విడుదల చేసిన 2,89,94,567 రూపాయలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జమచేశామన్నారు. అయితే కేంద్రప్రభుత్వం మూడుశాతం వాటా 2,17,45,925 రూపాయలను విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తం విడుదలైతే ఆయా సంఘాల్లో జమ చేస్తామన్నారు. గత రబీసీజన్‌లో పంటరుణాలు తీసుకున్న రైతులు ఈనెఖలారులోగా బకాయిలను చెల్లిస్తే శూన్యవడ్డీ వర్తిస్తుందన్నారు. గత రబీసీజన్‌లో 135 కోట్ల రూపాయల పంటరుణాలను రైతులకు అందించామన్నారు. బకాయిలు చెల్లించిన 52,176 మంది రైతులకు వడ్డీశూన్యవడ్డీ వర్తింపు జరిగిందన్నారు. ఈనెలాఖరునాటికి 90శాతం రుణబకాయిలు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
‘బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చాలి’
విజయనగరం, జూన్ 13: బడిఈడు గల పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారి కె.వి.రమణ అన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యా సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బడిఈడు గల పిల్లలను గుర్తించారు. జిల్లాలో 37610 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో పదివేల మంది అంగన్‌వాడీ కేంద్రాల వారు కాగా, మిగిలిన వారు 25వేల మంది ఉన్నారు. కాగా, వారిలో ఇప్పటి వరకు 22వేల మందిని బడిలో చేర్పించారని ఆయన పేర్కొన్నారు. పాఠశాలకు వెళ్లే బడిఈడు పిల్లలందరినీ తప్పనిసరిగా బడిలో చేర్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని ఫలితాలు మెరుగ్గా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, పిఒ కెవి రమణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా బోధన ఉంటుందన్నారు. ఎన్నో ఉచిత సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. బడిఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తల్లితండ్రులు సహకరించి తమ పిల్లలను బడిలో చేర్చాలని పిలుపునిచ్చారు.
ధియేటర్‌లో తూనికల శాఖ అధికారుల తనిఖీ
గజపతినగరం, జూన్ 13 : విజయనగరం డివిజన్ పరిధిలో గత ఏడాదిలో 18 మండలాల్లో దాడులు నిర్వహించి 824 కేసులు నమోదు చేసి 10.5 లక్షల రూపాయలు అపరాధ రుసుం విధించినట్లు లీగల్ మెట్రాలజీ ఇన్స్ పెక్టర్ సిహెచ్ వరప్రసాద్ అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక సూర్యమహాల్ ధియేటర్‌ను తహశీల్దార్, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, ఎరువులు, విత్తనాలు విక్రయించే దుకాణాలు, పండ్లషాపులలో విక్రయించే వస్తువుల పరిమాణం, ధరలు, వివరాలు తెలిపే బోర్డులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ కాటాలను ఏడాదికి ఒక సారి తూనికలు కొలతలు అధికారులు వద్ద సీలు వేయించుకోవాలన్నారు. రాష్ట్ర లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ధియేటర్‌లో మంచినీటి ట్యాంకుపై సరైన మూత లేకపోవడంతో తహశీల్దార్ శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు, మంచినీటి ట్యాంక్‌ను ఎప్పటి కప్పుడు శుభ్రపరుచుకోవాలని సూచించారు. డిప్యూటీ తహశీల్దార్ జయరామ్, మండల రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కె.సత్యన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
విత్తనాల కోసం అన్నదాతల అగచాట్లు
గజపతినగరం, జూన్ 13 : వరివిత్తనాల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రెండు రోజుల క్రిందట వర్షం పడటంతోపాటు బుధవారం రాత్రి జల్లులు పడటంతో రైతులు వరివిత్తనాల కోసం ఎగబడుతున్నారు. ఇంత వరకు గత రెండు నెలలుగా చినుకు కూడా పడకపోవడంతో విత్తనాల కోసం రైతులు ఆలోచించ లేదు. వర్షం పడటంతో రైతుల్లో ఆశలు రేగి విత్తనాలకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గురువారం పెద్ద సంఖ్యలో స్థానిక ఎఎంసి గిడ్డంగి వద్ద వ్యవసాయ శాఖ అధికారులు విక్రయిస్తున్న కేంద్రం వద్దకు రైతులు చేరుకున్నారు. గత నాలుగు రోజులుగా ఇక్కడ 1001, స్వర్ణ, సాంబమసూరి రకం విత్తనాలు విక్రయిస్తున్నారు. అధికారులు రైతులు విత్తనాలు కావాల్సి వస్తే మీనమేషాలు లెక్కిస్తుండగా అధికార పార్టీ నాయకులకు మాత్రం లారీల్లో విత్తనాలు తరలిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క వరివిత్తనాల బస్తాపై ఐదు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, కళాసీ చార్జి కింద 2 రూపాయలు రైతులే చెల్లించుకోవాల్సి వస్తుందని బస్తాకు ఏడు రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తున్నట్లు రైతులు అంటున్నారు. అదనపు వసూళ్లపై మండల వ్యవసాయ అధికారి సంగీతను వివరణ కావాలని ప్రయత్నించగా సమాధానం ఇవ్వడానికి వెనుకంజ వేశారు. గత నాలుగు రోజులుగా రోజుకు వెయ్యి రూపాయల చొప్పున వరివిత్తనాల బస్తాలను అధికారులు విక్రయించగా రోజుకు 5 వేల చెప్పున అదనంగా రైతుల నుండి వసూళ్లు చేసి ఉంటారని రైతులు అంటున్నారు. ఎడిఎను వివరణ కోరగా ఇలా అదనంగా వసూళ్లు చేయకూడదని విషయం తెలుసుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మున్సిపల్ కాంట్రాక్టర్లపై ఎమ్మెల్సీ ఆగ్రహం
విజయనగరం , జూన్ 13: ‘చేతకాకపోతే తప్పుకొండి. ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేయకండి. నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయకపోతే బ్లాక్‌లిస్టులో పెడతాం...అవసరమైతే మీపై పోలీసు కేసులు కూడా పెడతాం’ అంటూ మున్సిపల్ కాంట్రాక్టర్లను ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి హెచ్చరించారు. బాధ్యతాయుతంగా పనిచేయకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మున్సిపల్ ఇంజనీర్లపై మండిపడ్డారు. పట్టణంలో నెలరోజులపాటు శంకుస్థాపన చేసిన పలు అభివృద్ధిపనులకు సంబంధించి గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ 17,18శాతానికి టెండర్లను దక్కించుకుని పనులు ప్రారంభించకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. ‘మీకు బిల్లుల చెల్లింపులు ఆగిపోతే చెప్పండి. వెంటనే బిల్లులు చేస్తాం. కానీ పనులు చేయకుండా జాప్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు’ అని హెచ్చరించారు. మున్సిపాలిటీలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, అభివృద్ధిపనులు చేసేందుకు ఎందుకు చొరవ చూపడంలేదని ఆయన ప్రశ్నించారు. నిధులు లేకుండా పనులు ఏలా ప్రారంభిస్తారని ప్రతిపక్షపార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, మున్సిపాలిటీలో నిధులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ అభివృద్ధిపనులను వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.గోవిందస్వామి, మున్సిపల్ అసిస్టెంట్‌కమిషనర్ ఎన్‌విడి మణిరామ్, పట్టణ ప్రణాళిక అధికారి ఎ.లక్ష్మణరావు, మున్సిపల్ ఇంజనీర్ బాబు, డిప్యూటీ ఇంజనీర్లు శ్రీనివాసరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.