Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

లక్కవరం చిట్ ఫండ్స్ టోకరాపై విచారణ

$
0
0

జంగారెడ్డిగూడెం, జూన్ 13: మండలంలోని లక్కవరంలో చిట్ ఫండ్స్ పేరుతో పలువురిని వెంకట సుబ్బాయమ్మ అనే ఎస్తేరమ్మ మోసగించి, పరారైన వ్యవహారంపై స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.మురళీరామకృష్ణ గురువారం విచారణ చేపట్టారు. బాధితుల ఆందోళన పత్రికల్లో చూసి స్పందించిన జిల్లా ఎస్పీ ఎం.రమేష్ ఆదేశాల మేరకు సి.ఐ ఈ విచారణ చేపట్టారు. గత కొంత కాలంగా లక్కవరంలో చిట్ ఫండ్స్ నిర్వహిస్తున్న కుటుంబం మంగళవారం నుండి కనిపించకుండా పోవడంతో వారి వద్ద డబ్బు మదుపు చేసిన వ్యక్తులు, చిట్ ఫండ్స్ పాడుకున్న వ్యక్తులు ఆందోళనకు గురయ్యారు. వీరు టోకరా వేసింది సుమారు 50 లక్షల రూపాయల పైమాటేనని బాధితుల ఫిర్యాదులతో తేలింది. గురువారం ఒక్కరోజే 67 మంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. లక్కవరం బి.సి కాలనిలో నివసిస్తున్న తాపీమేస్ర్తి, అతని భార్య ఎస్తేరమ్మ లక్ష రూపాయల చిట్స్, 50 వేల రూపాయల చిట్స్ నిర్వహిస్తున్నారని పలువురు సభ్యులు పోలీసులకు చెప్పారు. ఎస్తేరమ్మ వద్ద చిన్న మొత్తాలలో డబ్బు దాచుకున్న అనేక మంది సి.ఐ ఎదుట హాజరై ఆందోళన వ్యక్తం చేసారు. అధిక వడ్డీ ఇస్తామనడంతో ఈమెకు డబ్బు అప్పు ఇచ్చామని చెప్పారు. ఇటీవల చిట్ పాడుకున్నవారికి నగదు చెల్లించలేదని, తీసుకున్న అప్పులు కూడా చెల్లించడం లేదని చెప్పారు. మంగళవారం ఇంటికి తాళం వేసి, ఇంటిలోని సామాన్లతో సహా ఉడాయిండంతో మోసం వెలుగు చూసిందని చెప్పారు. గురువారం సి.ఐ రావడంతో ధైర్యం వచ్చిన పలువురు లక్కవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ చేస్తున్నట్టు సి.ఐ మురళీరామకృష్ణ తెలిపారు.

అంత వీజీ కాదు
*డిసిసి కార్యవర్గంపై మల్లగుల్లాలు*నియోజకవర్గాల్లో నేతలు గల్లంతు*అధికార పార్టీలో విచిత్ర ధోరణి
ఏలూరు, జూన్ 13 : దాదాపుగా రెండు పదవీ కాలాలు పూర్తవుతున్నాయి. అయినా నేతల కోసం అనే్వషణే... నిలబడే నేత ఎవరా? అని సర్వత్రా చర్చే... చివరకు పార్టీ పరంగా కూడా విచిత్రమైన పరిస్థితే. గతంలో ఏనాడూ అధికారంలో వున్న పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదనే చెప్పుకోవాలి. ఇక పార్టీ పరంగానూ జోష్ ఉందా అంటే అదీ కనపడదు. ఇక వరుసగా సంవత్సరాలు తరబడి అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ సరికొత్తగా జిల్లాలో సంపాదించుకున్న వర్గమేమిటో నేతలెవరో అర్ధం కాదు. చివరకు జిల్లా పార్టీని పరిశీలించినా అదే నిస్తేజం కనిపిస్తోంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాలో అధ్యక్షులను ప్రకటించిన తరువాత కార్యవర్గాలు ఏర్పడకుండా ఎన్నడూ లేదు. ఈ రికార్డును కూడా బద్దలు చేశారనే చెప్పుకోవాలి. వరుసగా ఇద్దరు జిల్లా అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించినా వారిలో ఏ ఒక్కరూ కూడా సొంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సందర్భంలో ఒక్కసారిగా జిల్లా పార్టీ కార్యవర్గాల విషయం తెరపైకి చేరింది. తక్షణం కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని, జిల్లాలకు ఆదేశాలు అందడంతోపాటు పిసిసి కూడా సుదీర్ఘకాలం తరువాత కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఏ రకంగా చూసినా ఇవన్నీ గతంలో ఎన్నడూ జరగనివే. ఇక జిల్లాకు వస్తే కార్యవర్గం ఏర్పాటుపై నేతలు మల్లగుల్లాలు పడుతూనే వున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ ఉపయోగపడే రీతిలో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు అంత వీజీ కాదనే నేతలు కూడా భావిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ బలాన్ని చూస్తే ప్రస్తుతం ఏడు స్థానాలకు పరిమితమైంది. గతంలో తొమ్మిది స్థానాలు ఉండగా రకరకాల పరిణామాల అనంతరం ఆ సంఖ్య ఏడుకు తగ్గిపోయింది. అలాగే కొన్ని నియోజకవర్గాల పరిధిలో పార్టీ క్రియాశీలకంగా వుందా? అన్న అనుమానాలు కూడా తలెత్తే పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ఆ పార్టీ యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా వాస్తవాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వున్న చోట్ల పరిస్థితిని మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో దాదాపుగా ఆ పార్టీ ఉనికి చాటుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. మరో విధంగా చూస్తే జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొని వుందనే చెప్పుకోవాలి. మరికొన్ని చోట్ల రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్ధులను కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏలూరు, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, దెందులూరు వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిస్తేజంగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇలాంటి నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కమిటీలని, ఇన్‌ఛార్జిలని ఇలా రకరకాల పేర్లు పెట్టి ప్రత్యేక కసరత్తు జరుగుతుందని ప్రకటించినా ఆ విధమైన పరిస్థితి ఇంత వరకు అమలు కాలేదు. దీంతో ఈ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా చతికిలపడిందనే చెప్పుకోవాలి. ఇక డిసిసి కార్యవర్గం విషయానికి వస్తే నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో వాటికి కూడా ప్రాతినిధ్యం కల్పించే రీతిలో నేతలను ఎంపిక చేయడం ఇప్పుడు ఆ పార్టీ జిల్లా యంత్రాంగానికి కష్టతరంగా మారిపోయిందని చెబుతున్నారు. యధాప్రకారం ఎమ్మెల్యేలు వున్న ప్రాంతాల్లో వారి ఆశీస్సులు, సిఫార్సుల మేరకు కొంతమందిని ఎంపిక చేసినా మిగిలిన చోట్ల మాత్రం నాయకుల అనే్వషణ భారీగానే సాగుతున్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చూస్తే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం మాత్రం విచిత్రమనే చెప్పుకోవాలి.

పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలకు
నీరు విడుదల
చాగల్లు , జూన్ 13: నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద గోదావరి జలాలను ధవళేశ్వరం ఇరిగేషన్ హెడ్ వర్క్స్ ఇఇ తిరుపతిరావు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోనికి విడుదల చేశారు. గురువారం ఉదయం 7.20గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, నీటిని విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సకాలంలో నీటి సరఫరాకు చర్యలు చేపట్టామని, రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఇ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 200 క్యూసెక్కుల నీటిని కాలువలోకి 55 రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు తెలిపారు. రైతుకు సకాలంలో నీటిని అందించి పంటల అభివృద్ధికి, అధిక దిగుబడిని పొంది సార్వాలో రైతులు లాభాల బాటలో పయనించటానికి ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో శెట్టిపేట ఇఇ, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఉద్యోగి దారుణ హత్య
ఏలూరు, జూన్ 13 : ఏలూరు కార్పొరేషన్‌లో వాటర్ సప్లై విభాగంలో టుటౌన్ పరిధిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న నిట్టా జాన్ ఆల్‌ఫ్రెడ్ (49) దారుణ హత్యకు గురయ్యారు. నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ కధనం ప్రకారం... స్థానిక మస్తాన్‌మన్యం కాలనీకి చెందిన నిట్టా జాన్ ఆల్‌ఫ్రెడ్ ఏలూరు కార్పొరేషన్‌లో వాటర్ సప్లై విభాగంలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం ఆల్‌ఫ్రెడ్ ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లలేదు. స్థానిక శాంతినగర్‌లోని రిజర్వాయర్ ఆవరణలో ఉన్న పాత భవనంలో గురువారం ఆల్‌ఫ్రెడ్ హత్యకు గురైన విషయాన్ని సిబ్బంది సహకారంతో పోలీసులు గుర్తించారు. శాంతినగర్ రిజర్వాయర్ వద్ద ట్యాంక్ వాచర్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కె రమేష్, సింహాచలం, శ్రీరామమూర్తిలు పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం హత్యకు గురైన ఆల్‌ఫ్రెడ్ మోటారు సైకిల్‌ను ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్ తీసుకువెళ్లిపోయాడు. గురువారం కూడా అతను విధులకు హాజరుకాలేదు. హత్యకు గురైన ఆల్‌ఫ్రెడ్‌తో కలిసి రిజర్వాయర్ ఆవరణలో బుధవారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్‌తోపాటు మరికొందరు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. జాబ్ ఛార్టు ప్రకారం గురువారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్ రిజర్వాయర్ విధులకు హాజరుకావాల్సి ఉంది. అతను రాకపోవడంతో మిగిలిన ఉద్యోగులు ఈ విధులను నిర్వర్తించారు. కాగా రిజర్వాయర్ ఆవరణలో గల పాత భవనంలో గురువారం ఏదో పడిన శబ్ధం వినపడటంతో వీరు అక్కడకు వెళ్లి పరిశీలించగా ఆల్‌ఫ్రెడ్ మృతదేహాన్ని గుర్తించి మున్సిపల్ ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు డి ఎస్‌పి ఎం రజనీ, నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతుని తలపై రక్తగాయాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కె రమేష్‌పై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆల్‌ఫ్రెడ్ మృతిని హత్య కేసుగా నమోదు చేసినట్లు నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ చెప్పారు. విచారణలో పూర్తి ఆధారాలు వెలుగుచూస్తాయని ఆయన చెప్పారు. ఏలూరు డి ఎస్‌పి ఎం రజనీ ఆధ్వర్యంలో నగర సి ఐ ఎన్ మురళీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మున్సిపల్ ఉద్యోగి ఆల్‌ఫ్రెడ్ హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ ఎస్ ఇ యోహాను, కార్పొరేషన్ కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది శాంతినగర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు.

పోలవరం నిర్వాసితుల పునరావాస పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే
క్రమశిక్షణాచర్యలు:కలెక్టర్
ఏలూరు, జూన్ 13 : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందించే సహాయ, పునరావాస కార్యక్రమాల పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో గురువారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావా కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు చేపడుతున్న సహాయ, పునరావాస కార్యక్రమాలు నత్తనడకన నడవడంపై అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో మొదటి విడతగా ఏడు గ్రామాల ప్రజలకు అమలు చేయాల్సిన సహాయ పునరావాస కార్యక్రమాలను వారి మనోభావాలకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ పనులలో పురోగతి లేదన్నారు. పునరావాస కాలనీ నిర్మాణం, కాలనీలో వౌలిక సదుపాయాల కల్పన, నిర్వాసితుల సమస్యల పరిష్కారం, భూసేకరణ, నిర్వాసితులకు భూమికి భూమి అందించడం, తదితర పనులకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులే నిర్ధేశించిన పనిని నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. నిర్ధేశించిన సమయంలో పనులు పూర్తి చేయని అధికారులపై తీసుకునే క్రమశిక్షణా చర్యలకు వారే బాధ్యత వహించవలసి వస్తుందని, అధఙకారుల పనితీరుపై ఎప్పటికప్పుడు సంబంధిత శాఖాధఙకారులకు తెలియజేయడం జరుగుతుందని, విధి నిర్వహణలో అలసత్వం వహించే అధఙకారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేస్తామని కలెక్టర్ చెప్పారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన గ్రామాల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన సమస్యలేమైనా ఉంటే జిల్లాస్థాయి అధికారుల దృష్టికి గాని, లేదా పెద్ద సమస్యలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. నిర్వాసితులకు అందించే నష్టపరిహారం విషయంపై ప్రతీ నిర్వాసితుడికి అవగాహన కల్పించి ప్రజలందరూ ఆయా గ్రామాలను వదిలి కొత్తగా నిర్మించే పునరావాస కాలనీలకు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సిబ్బందికి డివిజన్, ఐటిడి ఎలలో అందుబాటులో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని, అదే విధంగా వాహనాలను కూడా వారి పరిధిలో ఉన్న వాహనాలను వినియోగించుకోవాలన్నారు. భూ సేకరణకు సంబంధించి సర్వేయర్ల కొరత ఉంటే సర్వే శాఖ ద్వారా సర్వేయర్లను డిప్యుటేషన్‌పై సేవలు వినియోగించుకోవాలన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజల సామాజిక సమస్యలైన రేషన్ కార్డులు, స్వయం ఉపాధి పధకాలు, మొదలైన వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుదర్శనం, ఐటి డి ఎ పివో సూర్యనారాయణ, జంగారెడ్డిగూడెం ఆర్డీవో నాన్‌రాజు, డిపివో నాగరాజువర్మ, గృహ నిర్మాణ సంస్థ పిడి సత్యనారాయణ, పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ ఎస్ ఇ విజయభాస్కరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు యల్లారమ్మ, నాగలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే మద్దాల ప్రకటన రాజ్యాంగ విరుద్ధం
జిల్లా టిడిపి అధ్యక్షురాల తోట
ఏలూరు, జూన్ 13 : వై ఎస్ జగన్‌ను విమర్శించే వారిపై భౌతిక దాడులు చేయాలంటూ వై ఎస్ ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు వై ఎస్ విజయమ్మ తనను ఆదేశించారని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కార్యకర్తల సమావేశంలో చెప్పడం ద్వారా ప్రజాస్వామ్యంలో దాడులను ప్రోత్సహిస్తూ జగన్ కుటుంబం రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనడానికి నిదర్శనమని టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)లు తెలిపారు. వై ఎస్ విజయమ్మ అసలు స్వరూపాన్ని ఆ పార్టీ నాయకుడే బయటపెట్టారని వారు విమర్శించారు. నేరాలు, హత్యలు, దోపిడీలకు అసత్య ప్రచారాలకు వై ఎస్ కుటుంబం చిరునామాగా మారిందని, దీన్ని బట్టి మరోసారి రుజువవుతోందని వారు తెలిపారు. వై ఎస్ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పారిశ్రామిక వేత్తలు, అధికారులను బెదిరించి లక్ష కోట్లు దోపిడీకి పాల్పడిన జగన్ జైలు పాలు అయితే ఆ అవినీతిని ప్రశ్నించిన వారిపై దాడులు చేయాలని పేర్కొనడం ఆ పార్టీ కర్కశత్వాన్ని, రాక్షసత్వాన్ని, దుర్మార్గాన్ని తెలియజేస్తోందని వారు తెలిపారు. ఈ విధంగా చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వై ఎస్ విజయమ్మ తమ పార్టీ అభ్యర్ధులకు బి ఫారమ్‌లతోపాటు కర్రలు, కత్తులు, తుపాకులు, బాంబులు ఇచ్చి ఎన్నికలకు పంపేలా వున్నారని తెలిపారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ దాడులను ప్రోత్సహించే నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులను ప్రజలు బహిష్కరించి వారికి గుణపాఠం చెప్పాలని టిడిపి నాయకులు కోరారు.
చేపల చెరువుల తవ్వకాలపై సమగ్ర నివేదిక సమర్పించాలి:కలెక్టర్
ఏలూరు, జూన్ 13 : కొల్లేరు ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ తహశీల్దార్లను ఆదేశించారు. స్థానిక కలెక్టరు ఛాంబరులో గురువారం కొల్లేరు అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కొల్లేరు ప్రాంతంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించిన దృష్ట్యా తక్షణం నివేదికను సమర్పించాలని కొల్లేరులో ఎక్కడైనా అక్రమ చేపల చెరువులు తవ్వకాలు జరిగితే సంబంధిత తహశీల్దార్లను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నిడమర్రు మండలం వెంకటాపురం, నిడమర్రు ప్రాంతాలలో 132 ఎకరాలు విస్తీర్ణంలో అనధికారికంగా తవ్విన 132 ఎకరాల చేపల చెరువులను తక్షణమే ధ్వంసం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ చేపల చెరువులు అక్రమంగా తవ్విన వారిపై కేసులు కూడా నమోదు చేసి వివరాలు తెలపాలని కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరు ప్రాంతంలో కనీసం పది వేల ఎకరాలకు పైగా అక్రమ చేపల చెరువులు ఉండే అవకాశాలున్నాయని, వాటి సమగ్ర వివరాలను వెంటనే సమర్పిస్తే తగు చర్యలకు ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ చెప్పారు. కొల్లేరు ప్రాంతంలో వన్యప్రాణి సంరక్షణ కోర్టు పరిధిలో జిరాయితీ భూముల్లో అక్రమ చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించిన 36 కేసులు సత్వరమే పరిష్కరించి కొల్లేరులో ఎక్కడా కూడా అక్రమ చేపల చెరువులు లేకుండా చూడాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. కొల్లేరు పరిధిలో సంప్రదాయ పద్దతిలో చేపల పెంపకం సాగాలే తప్ప ఎక్కడికక్కడే అక్రమంగా చేపల చెరువులు తవ్వితే పర్యావరణానికి హాని జరుగుతుందని అటువంటి వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వర్షాకాలంలో మురుగునీరు త్వరితగతిన సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉండాలని ఎక్కడైనా ఇందుకు ఆటంకం కలిగించే అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో డి ఆర్‌వో ఎం మోహనరాజు, ఆర్‌డివో కె నాగేశ్వరరావు, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి, తహశీల్దార్లు ఎజి చిన్నికృష్ణ, పోసిన వెంకన్నబాబు, ఎం మురళీధర్, సోమశేఖర్, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

గురుకుల పాఠశాలల్లో విద్యా బోధనకు సమగ్ర ప్రణాళిక
వీడియో కాన్ఫరెన్స్‌లో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆదేశం
ఏలూరు, జూన్ 13 : ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కొత్త విధానంలో పాఠాలు బోధించేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రవీణ్‌కుమార్‌తో జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ ఎన్ సంజీవరావు మాట్లాడారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్ధి సమగ్ర అభివృద్ధికి ప్రణాలిక లమలు చేయడం వల్ల విద్యా ప్రమాణాలు మెరుగుపడి మంచి ఫలితాలు లభిస్తాయని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. గురుకుల పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్ధినీ విద్యార్ధులకు అవసరమైన వౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టవంతం చేయాలని అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యపడతాయని ప్రవీణ్‌కుమార్ చెప్పారు. విద్యార్ధినీ విద్యార్ధుల రోజువారీ ప్రగతి తీరును కూడా పరిశీలన చేయాలని, ఏ ఏ సబ్జెక్టులలో వెనుకబడి వున్నారో అటువంటి విద్యార్ధినీ విద్యార్ధులను ముందుగానే గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా బోధనా విధానంలో కొత్త పోకడలను అనుసరించాలని తద్వారా ఆ విద్యార్ధులు ఆయా సబ్జెక్టులలో కూడా రాణించగలుగుతారని ఆయన చెప్పారు. జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇప్పటి నుండే ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రెసిడెన్షియల్ కళాశాలల కన్వీనర్ సంజీవరావు చెప్పారు. కార్యక్రమంలో వివిధ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ రత్నకుమారి, దేవకి, రాణి, సిహెచ్ పద్మిని, వర్మాచార్యులు, పి ఆర్‌కె మూర్తి, పి సోమయాజులు తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసులో నిందితుడు అరెస్టు
11 కాసుల బంగారం,
కిలో వెండి వస్తువులు
స్వాధీనం

చింతలపూడి, జూన్ 13: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఈ నెల 2న మూడు గృహాలలో వరుస దొంగతనాలకు పాల్పడిన రాణిమేకల వీరయ్యను అరెస్టు చేసినట్లు సిఐ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ధర్మాజీగూడెంకు చెందిన నిందితుడు వీరయ్య చెడు వ్యవసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ప్రగడవరం గ్రామంలో అట్ల నాగేశ్వరరావు, జయవరపు సూర్యనారాయణ, జె నాగిరెడ్డి గృహాలలో ఒకే రాత్రి చోరీ చేసిన 11 కాసుల బంగారు వస్తువులు, 1 కేజి వెండి వస్తువులు, 32 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ నిందితుడి నుంచి రికవరీ చేసినట్లు సిఐ వివరించారు. నిందితుడు రాణిమేకల వీరయ్య పాత నేరస్థుడని, జైలు శిక్ష అనుభవించి రెండు నెలల క్రితమే విడుదలైనట్లు సిఐ చెప్పారు. సమావేశంలో చింతలపూడి ఎస్‌ఐ బి కృష్ణ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి
మాజీ ఎమ్మెల్యే పాతపాటి
ఉండి, జూన్ 13: ఉండి నియోజకవర్గంలో గతంలో మంజూరైన ఇరిగేషన్ పనులు పూర్తి చేయకపోవటం వలన రైతాంగానికి నష్టం వాటిల్లుతోందని, వాటిని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉండిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఉండి కాలువ శివారు ప్రాంతానికి సక్రమంగా నీరు అందించటానికి ఉపయోగపడుతుందని, ఉండి నుండి 3 కిలోమీటర్ల మేర సిమెంట్ లైనింగ్‌కు, ఉండి అక్విడెక్ట్ పునర్నిర్మాణానికి , వెంకయ్య వయ్యేరు బెడ్ కాంక్రీట్‌కు డ్రెయిన్ల ఆధునీకరణకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో చెప్పి నిధులు మంజూరు చేయించినట్లు వెల్లడించారు. అయితే వాటిలో ఒక్క పని కూడా గత నాలుగేళ్ళ కాలంలో పూర్తి చేయకపోవటంతో, రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు వెంటనే వాటిని చేపట్టి పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పనులు చేయని పాలకులను నిలదీయాల్సిన ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీయటంలో విఫలమైనందున, రైతాంగానికి నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెదకాపవరం నుండి ఏలూరుపాడు లాకు వరకు వెంకయ్య వయ్యేరులో కర్రనాచు పట్టి నీరు కిందకు లాగని పరిస్థితి ఉందన్నారు. అధికారులు వెంటనే కర్రనాచు తొలగించాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ రైతాంగానికి ప్రభుత్వం వెంటనే సబ్సిడీ విత్తనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఏడిద వెంకటేశ్వరరావు, గులిపిల్లి అచ్చారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

చాటపర్రులో రైస్‌మిల్లులపై
విజిలెన్స్ దాడులు
ఏలూరు, జూన్ 13 : ఏలూరు మండలం వెంకటాపురం పంచాయితీ చాటపర్రు రోడ్డులో వున్న రైస్‌మిల్లులపై విజిలెన్స్ అధికారులు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోటీ 85 లక్షల రూపాయల విలువైన అక్రమ ధాన్యం, బియ్యం నిల్వలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారుల కధనం ప్రకారం వెంకటాపురం పంచాయితీ చాటపర్రు రోడ్డులో వున్న దుర్గాప్రసాద్ రైస్ ట్రేడర్స్‌లో అక్రమ ధాన్యం, బియ్యం నిల్వలు వున్నాయంటూ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. విజిలెన్స్ ఎస్‌పి ఎం నారాయణ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దుర్గాప్రసాద్ రైస్ ట్రేడర్స్ మిల్లుపై దాడి చేశారు. మిల్లు యజమాని మద్దుల వెంకటేశ్వరరావును అక్రమ నిల్వలకు సంబంధించి ప్రశ్నించారు. వీటికి సమాధానం లేకపోవడం, రికార్డుల్లో కూడా నిల్వలను గూర్చి లెక్కలు లేకపోవడంతో 13 వేల క్వింటాళ్ల ధాన్యం, 600 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. అలాగే ఈ మిల్లు ఎదురుగా వున్న లక్ష్మీనారాయణ రైస్‌మిల్లుపై కూడా దాడులు చేశారు. ఈ మిల్లులో సూపర్‌ఫైన్ రకం బియ్యం 400 క్వింటాళ్ల వివరాలను రికార్డుల్లో పేర్కొనకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ అంశంపై విచారణ నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్పారు. మిల్లు యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సి ఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ రామ్మూర్తి, డిడి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

67 మంది ఫిర్యాదు
english title: 
cheat fund

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles