‘గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్...’ అనే మాట సినిమా పరిశ్రమకు కూడా అన్వయించుకోవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. ఒకప్పుడు సినిమాకి వెళ్లాలి అంటే సంతోషంగా వెళ్ళేవారు. ఇప్పుడు సినిమా అంటే రెండు గంటలపాటు ఏ పనీ లేకపోతే అలా వెళ్లి కూర్చుందాం అన్న ఆలోచనతో వెళ్తున్నారు. సినిమా చూస్తే అలనాటి సినిమాల్లో కొంత విజ్ఞానం దొరికేది. నేడు ఏ సినిమా చూసినా మనకున్న జ్ఞానం మొత్తం తుడిచిపెట్టుకుపోయి సినిమాలో వాడిన బూతుపదాలు, ఊతపదాలు మాట్లాడే పరిస్థితికి చేరుకున్నారు ప్రేక్షకులు. ‘నీ యెంకమ్మ’ అనే మాటతో మొదలైన పదాలు ‘దొబ్బింది’ అనే మాటతో తారాస్థాయికి వెళ్ళాయి ఈ అశ్లీల పదాలు. సినిమాలలో తప్పులు మాటలవరకే అని సరిపెట్టుకుంటే చెల్లుబాటయ్యే కాలం కాదిది. మాటలతోపాటు చేతలు, చేతబడులు ప్రస్తుత సినిమాలలో ఎక్కువైపోయాయి. సినిమాలు అంటేనే భయపడే ప్రేక్షకులు కూడా తయారయ్యారు ఇప్పుడు. దానికితోడు టిక్కెట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటేశాయి. అందరూ కలిసి ఓ రకంగా సినిమాను చంపేస్తున్నారేమో... అన్న అనుమానమూ కలుగుతోంది. ఇప్పటి దర్శక, నిర్మాతలకు ఎంతో చెప్పాలి. నేటి సమాజంలో ఓ బలమైన మాధ్యమం సినిమా. ప్రజల జీవితాల్లో సినిమా ఓ భాగమైంది. సామాన్య మానవుడికి తక్కువ ఖర్చుతో దొరికే ఆనందం ఇదని ఎంతో సంతోషపడుతున్నారు. అదీ ఎండమావైంది. ఈ రోజుల్లో సినిమా అంటే ఏమిటీ అని ప్రశ్నిస్తే మనిషికి మనిషికి ఉండాల్సిన స్నేహ సంబంధాలను సమాధి చేస్తూ, సినిమా ప్రారంభ దృశ్యంలోనే నరుక్కోవడంతో ప్రారంభమవుతున్నాయి. సినిమావారు హింసను ఎందుకిలా ప్రేరేపిస్తున్నారో ప్రేక్షకులకు అర్థంకావడంలేదు. సమాజంలో వారు అంత హింస చూసారా? ఎందుకంటే ఈ సమాజంలో రాక్షసులు లేరు. మరి రాక్షస హింస ఎక్కడినుంచి వచ్చింది. ఈ ప్రభావంతో మనుషులు కూడా హింసాత్మకంగా మారుతున్నారు. ఓ మనిషి ప్రాణానికి సాటిమనిషి విలువ ఇవ్వడంలేదు. ఒకప్పుడు ఒకరిపై ఒకరికి కోపం వస్తే తిట్టుకునేవారు. శ్రుతిమించితే కొట్టుకునేవారు. ఈ రోజు కోపం వస్తే సినిమా ప్రభావంతో ఎదుటి మనిషిని నరికెయ్యడమే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. అసలు మనిషి పుట్టి, మానవజన్మ ఎత్తి సాటిమనిషిని చంపడం ఏమిటి? ఓ మనిషిని చంపడం అంటే ఆ మనిషి కుటుంబం అంతా నాశనం చేసినట్లేకదా! ముఖ్యంగా మనిషిని వెంటాడి చంపడం, వేటాడి చంపడం- ఇవన్నీ సినిమావారి దృష్టిలో ఎంటర్‌టైన్‌మెంట్ కిందకి వస్తాయా? ఇంత బాధ్యతాయుతమైన మాధ్యమాన్ని చేతిలోపెట్టుకుని సమాజంలో చెడును, రాక్షసత్వాన్ని వెదజల్లటానికి వారికి అధికారం ఏవరిచ్చారు? హింస హింస, హింస అంటూ ఎందుకు ప్రేక్షకులపై పగ తీర్చుకుంటున్నారు. ఆంధ్రదేశంలో ఓ భాగమైన రాయలసీమ ఫ్యాక్షనిజానికి బలాన్నిచ్చే అంశంగా సినిమావారు మలుచుకున్నారు. రాయలసీమ అంటే రక్తపుగడ్డేనా? అక్కడుంటున్నవాళ్ళు జీవితాంతం ఒకరినొకరు నరుక్కుంటూనే ఉంటారా? అందుకోసమేనా వాళ్ళు పుట్టింది? వాళ్ళ పగలు వారు మర్చిపోయినా అడ్డమైన చెత్త సినిమాలు తీస్తే, అవి వారు చూసి ‘ఓహో.. మేమిలా నరుక్కోవాలి కాబోలు’ అనే భావన వారిలో కలిగిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా సీమవాసుల్లో కదలిక రావాలని సామాన్య ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తమది రక్తపుగడ్డ కాదని వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది.
ఆ తరువాత మరో అంశం అభ్యంతకరమైన సెక్స్. సినిమాల్లో ఏదీ ఎంత ఉండాలో అంత ఉంటేనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అర్ధనగ్నంగా హీరోయిన్లు దుస్తులు ధరించి హీరో భుజాలమీద ఎక్కి కూర్చునే ఓ వనిత వుంటుంది. అటుపక్కా ఇటుపక్కా మరో ఇద్దరు నిలబడతారు. ఇలా పరమ దరిద్రమైన పోస్టర్లను ప్రతి కూడలిలో పెట్టించి ప్రేక్షకులను నీచ సంస్కృతితో థియేటర్లకు ఆహ్వానిస్తున్నారు. వచ్చీరాని వయసులో ఉన్న పిల్లలపై ఈ పోస్టర్లు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి? ప్రస్తుతం అనె్నం పునె్నం ఎరుగని ఆడపిల్లలమీద ఎన్నో అత్యాచారాలు, అమానుషాలు జరుగుతున్నాయంటే వీటన్నింటికి కారణం సినిమా కాదా? మీకు కంటిపాపల్లాంటి పిల్లలుంటారు కదా! వాళ్ళపై కూడా ఇలాంటి అత్యాచారాలు జరిగితే మీరు పడే వేదనే మిగతావారు పడరా? మీ రక్తం పంచుకుని పుట్టిన కూతురే నలుగురు కామాంధులచేతిలో చిక్కి నరకయాతన అనుభవిస్తూ అత్యాచారానికి గురైతే ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీ స్వార్థం కోసం మీ రాబడి పెంచుకోవడానికి చెత్త సినిమాలు తీసి సమాజంమీద వదలటం కాదు- మీరు, మీ పిల్లలు సమాజంలో భాగమని గుర్తుంచుకోండి. నేడు జరుగుతున్న అన్యాయాలకు వందశాతం బాధ్యత మీదేనని గుర్తుపెట్టుకోండి. మీవల్ల దేశానికి ఉపకారం జరగకపోయినా ఫర్వాలేదు. కానీ సమాజాన్ని పనిగట్టుకుని ఇలా చెత్త సినిమాలు తీసి భ్రష్టుపట్టించకండి. ఆ సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో మీరు సుఖంగా ఉంటారని కలలో కూడా అనుకోవద్దు. హద్దులేని హింస, విచ్చలవిడి శృంగారాన్ని పచ్చిగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పాపం మిమ్మల్ని వెంటాడక తప్పదు.
ఈ మాధ్యమం ద్వారా ఏదైనా మంచి చేయాలనుకుంటే చాలా చేయవచ్చు. యువతీ యువకులకు భవిష్యత్‌పై మంచి అశలు కలిగిస్తూ వారికి మార్గాన్ని చూపవచ్చు. మన భారతీయ సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థను తిరిగి పునర్ నిర్మించవచ్చు. అవన్నీ వదిలి హేయమైన డబ్బు సంపాదనా మార్గాలను ఎంచుకుంటున్నారు సినిమా వారు. సంపాదనే ధ్యేయంగా విలువలకు వలువలు వొలుస్తున్నారు. అత్యంత పవిత్రమైన గురువు పాత్రని అపహాస్యం చేస్తున్నారు. హైందవ ధర్మ విధానాలను, పద్ధతులను చులకనగా చేసి కామెడీ చేస్తున్నారు. సంస్కృతిని దెబ్బతీసే సన్నివేశాలను సినిమాలలో చిత్రించవద్దు. ఈ పవిత్రమైన భూమిపై మీరు జన్మించినందుకు కొంతైనా ఈ ధరిత్రి పట్ల కృతజ్ఞతాభావంతో బతకండి.
ఒక్కసారి ఆలోచించండి: సినిమా విజయవంతం కావాలంటే హద్దులేని హింస, విచ్చలవిడి శృంగారం అవసరం లేదు. అవి లేకుండా సినిమాలు తీసి విజయం సాధించినవారు ఎందరో ఉన్నారు. మనిషి ఎదగడానికి సమాజమే చేయూతనిస్తుంది. తెలివిగలవారు ఈ సమాజంలో బతుకుతూ మంచిని ప్రబోధిస్తూ ముక్తిని పొందుతారు. ఈ పద్ధతిలో సినిమావారు ఆలోచిస్తే చెడు సినిమాలు రానేరావు.
‘గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్...’ అనే మాట సినిమా పరిశ్రమకు కూడా
english title:
entertainment
Date:
Sunday, June 16, 2013