టిఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
టిడిపి, బిజెపి వాకౌట్
బిల్లుల కోసమే సస్పెన్షన్లు
సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సభ్యుల ఆగ్రహం
=======================
హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా భావించిన ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లి బాలికాభ్యుదయ మరియు సాధికారిత బిల్లు-2013 (బంగారు తల్లి)కు శాసనసభ బుధవారం ఆమోదం తెలిపింది. బంగారు తల్లితో పాటు మరో నాలుగు బిల్లుల ఆమోదం కోసం శాసనసభ సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేకంగా సమావేశం కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం సభలో తీర్మానం చేయాలని టిఆర్‌ఎస్, ఐఎన్‌జికి భూముల కేటాయింపు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పోడియాన్ని చుట్టు ముట్టి సభా కార్యకలాపాలకు అడ్డుపడటంతో ఇరు పార్టీలకు చెందిన 25 మంది సభ్యులను సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేసారు. అంతకుముందు సాయంత్రం ఐదు గంటలకు సమావేశమైన సభను టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు అడ్డుకోవడంతో సభను అరగంట పాటు స్పీకర్ నాదెండ్ల మనోహర్ వాయిదా వేసారు. తిరిగి సమావేశమయ్యాక కూడా ఇరు పార్టీలకు చెందిన సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి సభా కార్యకలాపలను అడ్డుకోవడంతో వారిని సస్పెండ్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. దీంతో సభ నుంచి 14 మంది టిఆర్‌ఎస్ పార్టీ సభ్యులను, 11 మంది వైఎస్‌ఆర్‌సిపి పార్టీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే టిడిపి శాసనసభా పక్షం ఉప నాయకుడు అశోక గజపతిరాజు, ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ, సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా విపక్ష సభ్యులు అడ్డుకున్నప్పుడు వారిపై చర్య తీసుకోలేదనీ, సభా సమయాన్ని వృధా చేసినప్పటికీ చర్య తీసుకొని పాలకపక్షం కేవలం బిల్లులను ఆమోదించుకోవడానికే సభ్యులను సస్పెండ్ చేసిందని విమర్శించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ వైఎస్‌ఆర్‌సిపి కుమ్మక్కై సభలో ప్రజల సమస్యలు చర్చకు రాకుండా చేసారని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు టిడిపి ప్రకటించింది. సభలో తెలంగాణ తీర్మానం చేయకపోవడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నట్టు బిజెపి సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలిన సభ్యులను ఉపేక్షించి, కేవలం బిల్లుల ఆమోదం కోసం మాత్రమే వారిని సస్పెండ్ చేయడం పట్ల నిరసన తెలియజేస్తున్నామని సిపిఐ, సిపిఎం, ఎంఐఎం పార్టీలు పేర్కొన్నాయి.
అనంతరం సభలో బంగారు తల్లి బిల్లును మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ప్రవేశపెట్టారు. బంగారు తల్లి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని కొనియాడుతూ, పాలక పక్షానికి చెందిన సభ్యులతో పాటు, సిపిఐ, సిపిఎం, లోక్‌సత్తా పార్టీల సభ్యులు 16 మంది ప్రసంగించారు.
ఓట్ల కోసం అయితే చట్టం చేసేవాళ్లం కాదు: సిఎం
ఓట్ల కోసమే బంగారు తల్లి బిల్లును చట్టం చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఓట్ల కోసమే అయితే బంగారు తల్లి బిల్లును చట్టం చేయాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలో ఎవరున్నా బంగారు తల్లి పథకం ఆగిపోకూడదనే ఉద్దేశంతోనే చట్టం చేసామని తెలిపారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఒర్వకల్లులో పర్యటించినప్పుటు మహిళా పొదుపు సంఘానికి చెందిన ఒక మహిళా చేసిన సూచన నుంచి బంగారు తల్లి పథకానికి అంకురార్పణ జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు. మహిళా అభ్యుదయం పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమే బంగారు తల్లికి చట్టబద్ధత అని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా వినూత్న పథకాన్ని తీసుకురావడాన్ని ప్రణాళిక సంఘం చైర్మన్ మాంటెక్ సింగ్ కూడా అభినందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. మహిళా అభ్యుదయం పట్ల కానీ, ఎస్సీ ఉప ప్రణాళిక పట్ల కానీ ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని, అందుకే ఈ రెండు బిల్లులు సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ పార్టీ సభ నుంచి బయటికి వెళ్లిందని ముఖ్యమంత్రి ఆరోపించారు. కళంకిత మంత్రులకు తాను వత్తాసు పలుకుతున్నానని ప్రధాన ప్రతిపక్షం టిడిపి చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. తమకు వైఎస్‌ఆర్‌సిపితో కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి బంగారు తల్లి కాదుకదా, నిలువెత్తు బంగారాన్ని పోసినా తెలంగాణలో ఒక్క ఓటు పడదని సిపిఐ పక్షం నాయకుడు గుండా మల్లేశ్ దుయ్యబట్టారు. బంగారు తల్లి పథకాన్ని ఓట్ల కోసం తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.
అంతకుముందు టిడిపి ఉప నాయకుడు ముద్దు కృష్ణమనాయుడు చేసిన ఆరోపణలను మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుమ్మక్కు కావడం వల్లనే వారి డిమాండ్లను టిడిపి ఎత్తుకుందని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమపై సిబిఐ మోపిన అభియోగాలపై నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేసారు. అభియోగాలు నిరూపణ కాకముందే, తమను జైలుకు వెళ్తారని ప్రతిపక్ష టిడిపి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అభియోగాలపైనే జైలుకు వెళ్లేటట్టు అయితే ఐఎన్‌జి భూముల కేటాయింపులో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లక తప్పదని ధర్మాన విమర్శించారు.
బిల్లుకు శాసనసభ ఆమోదం * ఓట్ల కోసం కాదు : సిఎం
english title:
kiran kumar reddy
Date:
Thursday, June 20, 2013