శ్రీకాకుళం, జూన్ 19: జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా స్కూల్ బస్సుల తనిఖీలను అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెడుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో కూడా రెండు చోట్ల ప్రమాదం సంభవించిన విషయం విధితమే. దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పునఃప్రారంభానికి ముందే బస్సుల కండిషన్‌ను తనిఖీ నిర్వహించి, కండిషన్ లేని బస్సులకు ఫిట్‌నెస్ సిర్ట్ఫికెట్ ఆపుచేయాల్సి ఉంది. అయితే అటువంటి దాఖలా జిల్లాలో ఇప్పటి వరకు కానరాకపోవడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రులతో కమిటీ వేసి, ఆ కమిటీకి బస్సులను తనిఖీ చేసే అధికారం కల్పించాల్సి ఉంది. అటువంటిది జిల్లాలో ఏ కోశానా కానరావడం లేదు. ఇటీవల రవాణాశాఖ అధికారులు ఏదో మొక్కుబడిగా తనిఖీ తూతూ మంత్రంగా నిర్వహించి, ఏదో కొద్దిపాటి బస్సులపై నామమాత్రపు కేసులుపెట్టి విడిచిపెట్టేయడంతో బస్సులపట్ల ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారిందనడంలో సందేహం లేదు. అయినా అన్ని బస్సుల కండిషన్ బాగుందని రవాణాశాఖ అధికారులు పేర్కొనడం వారి పనితీరుకు అద్దంపడుతుంది. కార్పొరేట్ విద్యాసంస్థలు బస్సు రవాణా పేరిట విద్యార్ధుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, బస్సు నిర్వహణలో అంతలా పర్యవేక్షణ లేదన్నది నిత్యసత్యం. విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించే చర్యలు కాని, భరోసా కల్పించే కార్యాచరణగాని విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు, అధికార యంత్రాంగం నుంచి కానరావడం లేదు. బస్సుల కండిషన్ బాగులేక, బస్సుల కాలపరిమితి ముగిసినప్పటికీ అవి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నా ట్రాఫిక్ విభాగం పోలీసులు మాకెందుకులే అన్న నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతుండటంతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగుతుంది. జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సులు సుమారు ఆరు వందల పైబడే ఉన్నాయి. ఇదిలావుంటే ప్రైవేట్ స్కూల్ బస్సులతో పాటు బస్సును నడిపే డ్రైవర్లకు సైతం కొన్ని నిబంధనలున్నాయి. ఈ నిబంధనలు ఎక్కడా ఆచరించిన దాఖలా లేదు. బస్సుల్లో కూర్చోడానికి మాత్రమే పిల్లలను అనుమతించాలి. అయినప్పటికీ పిల్లలను నిల్చుండబెట్టిమరీ ఆర్టీసీ బస్సుల మాదిరి పిల్లలను తీసుకువెళ్తున్నారు. ప్రతీ ఏటా రవాణా శాఖ ద్వారా స్కూల్ బస్సుల డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహించాల్సి ఉంది. ఇదీ తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారన్న విమర్శలుసైతం వినిపిస్తున్నాయి. ఎపి మోటార్ వెహికల్స్ నిబంధనల మేరకు వాహనం పసుపు రంగులో ఉండి స్కూల్ బస్సు అనే పేరు నిర్ధేశించిన సైజులో బస్సుకు నాలుగువైపులా రాసి ఉండాలి. వాహనాన్ని నడిపే డ్రైవర్‌కు కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్లు నిండిన వారు అనర్హులు. డ్రైవర్లకు విధిగా యూనిఫారం ఉండాలి. స్కూల్ చిరునామాతో పాటు ఫోన్ నెంబరు బస్సుపై రాయాల్సి ఉంటుంది. పేరెంట్స్ కమిటీ నియమించి బస్సును తనిఖీ చేసే అధికారం కమిటీకి కల్పించాలి. ప్రాథమిక చికిత్సకు కావాల్సిన మందులు బస్సుల్లో అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు అత్యవసర ద్వారం ఏర్పాటు చేసి, అగ్నిప్రమాద నివారణ పరికరాలు బస్సుల్లో అందుబాటులో ఉంచాలి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రైవేట్ బస్సుల నిర్వహణపై సరైన చర్యలు తీసుకొని, తనిఖీలు నిర్వహించినట్లైతే విద్యార్ధులకు భరోసా కల్పించడంతో పాటు తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించినవారవుతారు.
* స్కూల్ బస్సులపై రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహిస్తున్నాము - డిటిసి
జిల్లాలోని స్కూల్ బస్సులపై రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వారం రోజుల తనిఖీల్లో 25 బస్సులపై వివిధ కేసులు పెట్టామన్నారు. 15 సంవత్సరాల కాలపరిమితి దాటిన బస్సులు జిల్లాలో 22 ఉన్నాయని, వాటిని రోడ్డుపై తిరగకూడదని నోటీసులు జారీచేశామన్నారు. స్కూల్ బస్సుల కండిషన్ గూర్చి చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే ఆయా బస్సులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
కనె్నధారపై రీసర్వే
సీతంపేట, జూన్ 19: సీతంపేట ఏజెన్సీలో వివాదస్పదమైన పుటిపుట్టి పంచాయతీ పరిధిలోని కనె్నధార కొండపై రీసర్వే చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. లోకాయుక్త ఆదేశాల మేరకు బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పోలాభాస్కర్ ఆధ్వర్యంలో సర్వే అధికారులు కనె్నధార కొండ పై మంజూరు చేసిన లీజుల ప్రాంతాన్ని పరిశీలించారు.సర్వే నెం.289లో ఎంత మంది గిరిజనులకు కొండపోడు పట్టాలు ఇచ్చారు..లీజులకు సంబంధించి రికార్డ్‌లను పూర్తిగా పరిశీలించాలని అధికారులను జెసి ఆదేశించారు. ఈ నెల 21వతేది నుండి 10సర్వే బృందాలతో కనె్నధారకొండ పై రీసర్వే చేస్తామని జెసి కనె్నధార పోరాట కమిటీ నాయకులకు తెలిపారు. కనె్నధారకొండ పై అప్పట్లో ఇచ్చిన లీజులకు సంబంధించిన రికార్డ్‌లను క్షుణ్ణంగా పరిశీలించాలని,అప్పటి రికార్డ్‌లు సరిగా లేకుంటే సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్జిన్‌రాక్ సంస్థకు మంజూరు చేసిన గ్రానైట్ లీజుల ప్రాంతాన్ని పరిశీలించి,దానికి సంబంధించిన మ్యాప్‌ను జెసి క్షణ్ణంగా పరిశీలించారు. సర్వే ఏ విధంగా చేయాలో సంబంధిత సర్వేబృందాలకు ఒక్క రోజు అవగాహన కల్పించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి బి రామారావును జెసి ఆదేశించారు.ఎస్‌ఎల్‌ఆర్ సర్వే రికార్డ్స్ లేవని మరి దాని పరిస్థితి ఏంటని కనె్నధార పోరాటకమిటీ నాయకులు సవరతోట మొఖలింగం,సంజీవరావులు జెసిని ప్రశ్నించారు.వాటన్నింటికి సంబంధించిన రికార్డ్‌లు పరిశీలించడం జరుగుతుందని జెసి సమాధానమిచ్చారు.కనె్నధారకొండ ప్రాంతంలో సర్వేకు సంబంధించి జెసితో పాటు పాలకొండ ఆర్డీఓ బి దయానిధి,తహశీల్దార్ మంగు,ఆర్‌ఐలు దేవదాసు,రాంబాబు,సర్వేయర్ కరువయ్యలు ఉన్నారు.
అలరించిన జ్యోతిర్మయి కీర్తనలు
శ్రీకాకుళం, జూన్ 19: వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా పట్టణంలోని శివబాలాజీ దేవాలయంలో బుధవారం రాత్రి అమ్మగురు కొండవీటి జ్యోతిర్మయి ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. తొలుత ఆమె ఆలయాన్ని సందర్శించి భక్తులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం కచేరి వేదికపై పలు కీర్తనలు పాడారు. మేలుకో శృంగారరాయి, వినరోభాగ్యం..తగుదువమ్మా...నాటికినుండి...సినె్నక్కితేవే తదితర ఆధ్యాత్మిక కీర్తనలు పాడి భక్తులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా అన్నమాచార్యుల గూర్చి, తిరుపతి వేంకటేశ్వరస్వామి గూర్చి ప్రవచించారు. సంగీత వాయిద్యాలను బండారు రమణమూర్తి, సాయి, పరమేష్, మధులు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జి.తులసీరావు, సామంత్‌లు ఆమెను ఘనంగా సత్కరించారు.
వర్షంతో ఉపశమనం
శ్రీకాకుళం /జలుమూరు, జూన్ 19:శ్రీకాకుళం పట్టణం, జలుమూరు మండలాల్లో బుధవారం కురిసిన వర్షం చాలా ఊరట కలిగించింది. ఉదయం ఎండవేడిమి, ఉక్కపోత సాయంత్రం వర్షంతో వింత వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గత రెండు మూడు రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడి పోగా, సాయంత్రం కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ప్రజలకు స్వాంతన చేకూరినట్లైంది. జిల్లాలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు వివిధ ప్రాంతాల్లో కురుస్తున్నప్పటికీ, పట్టణంలో గత మూడు రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అంతకు ముందు కురిసిన వర్షాలకు వేసవి ఎండల నుండి సాంత్వన పొందిన పట్టణ ప్రజలకు మూడురోజులుగా భానుడి ప్రతాపంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడటమే కాకుండా ఇటీవల పట్టణంలో చేపట్టిన విస్తరణ పనుల్లో బాగంగా రోడ్లపై మట్టి పేరుకుపోయి చిత్తడిగా మారింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులనెదుర్కోవలసి వచ్చింది. పట్టణంలో పారిశుద్ధ్యంపై ఉత్తుత్తి ఆర్భాట ప్రచారాలే తప్ప పారిశుద్ధ్య నిర్వహణపై చిత్తశుద్ధి కొరవడిందని
పట్టణ ప్రజారోగ్య విభాగాన్ని ప్రజలు దుయ్యబడుతున్నారు.
జలుమూరు మండలంలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా వరుణ దేవుని కరుణతో వర్షం కురిసింది. ముందుగా ఉరుములు, గర్జనలు ప్రారంభమై కనీసం మేఘంలో మబ్బులు కూడా కనిపించకుండా ఓ వైపు భానుడి ప్రతాపంతో ఉక్కపోతగానే ఉంటూ ఒక్కసారిగా వర్షం కురవడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈ వర్షం పొలాల సాగుకు, ఎదలు జల్లేందుకు, వరినారు పోసేందుకు ఎంతో అవసరమని రైతులు ఆనందం వ్యక్తంచేశారు. అదేవిధంగా ప్రజలు గత మూడురోజులుగా ఉష్ణోగ్రత తాకిడికి ఇబ్బందులు గురైనా ఈ వర్షం కారణంగా ఉపశమనం పొందారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా డిఎస్‌కె
శ్రీకాకుళం , జూన్ 19: జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి డి.ఎస్.కె.ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నర్తునరేంద్రయాదవ్, అధికార ప్రతినిధి రత్నాల నర్శింహమూర్తి తమ హర్షం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన డి. ఎస్.కె.ప్రసాద్ నియామకంపట్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 30 సంవత్సరాల క్రితం వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎన్.వి.సుబ్బారావును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించగా, 30 సంవత్సరాల అనంతరం మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్‌ను నియమించడం పట్ల హర్షం ప్రకటిస్తూ, నియామకానికి సహకరించిన ధర్మాన ప్రసాదరావు, కేంద్ర ఐటి, కమ్యూనికేషన్లు శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి కోండ్రు మురళీ మోహన్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
గంగోత్రిలో చిక్కుకున్న కరగాం వాసులు
నరసన్నపేట, జూన్ 19: పుణ్యక్షేత్రాలకు గాను ఈ నెల రెండవతేదీన మండలంలో కలగాం గ్రామానికి చెందిన దంపతులు గంగోత్రి వద్ద చిక్కుకుపోవడంతో బంధువులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై బుధవారం బంధువులు తోట శకుంతల, సూరమ్మలు మాట్లాడుతూ విజయవాడలో ఉన్న స్నేహితులతో పుణ్యక్షేత్రాలకు వెళ్లారన్నారు. అనుకోని పరిస్థితిలో గంగోత్రిలో వరదబీభత్సం ఉండటంతో వారు చిక్కుకుపోయారు. మంగళవారం ఉదయం వారితో ఫోన్‌లో మాట్లాడామని, గత శుక్రవారం నుండి ఎటువంటి ఆహారం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని చెప్పారన్నారు. టీవీల్లో మృతుల సంఖ్య పెరుగుతుందంటూ వార్తలు వస్తుండడంతో భీతిల్లిపోతున్నామని వాపోయారు. తమ వారిని రక్షించాలంటూ కోరుతున్నారు.
ఉత్తరకాశీ మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
* సిటిజన్‌ఫోరం అధ్యక్షుడు కామేశ్వరరావు
శ్రీకాకుళం, జూన్ 19: ఉత్తరకాశీ యాత్రకు వెళ్లి ప్రకృతి వైకూరీత్యాలు కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సిటిజన్‌ఫోరం జిల్లా అధ్యక్షుడు బరాటం కామేశ్వరరావు డిమాండ్ చేశారు. సంస్థ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గంగోత్రి, బదరీనాథ్, కేదారీనాథ్ యాత్రలకు వెళ్లి వరదల్లో రాష్ట్రానికి చెందిన నాలుగు వేల మంది చిక్కుకున్నారన్నారు.. ఇందులో చాలా మంది మృతిచెందినట్లు తెలిసిందని, ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించి మృతులకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. అలాగే యాత్రికులను క్షేమంగా ఇంటికి చేర్చి ఇందులో గాయపడిన వారికి ఆంధ్రరాష్ట్రంలో కూడా ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించాలన్నారు. గౌరవ సలహాదారు బరాటం శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ కేదారీనాథ్, బదరీనాథ్‌లకు ఎపి నుంచి, శ్రీకాకుళం నుంచి ఎక్కువ మంది భక్తులు వెళ్తుంటారని, ప్రభుత్వం శాశ్వత పరిష్కారమార్గం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సూరి చంద్రశేఖర్, జి.నర్సునాయుడు, కలగ నారాయణరావు తదితరులు ఉన్నారు.
ఐటిఐ సిలబస్‌లో మార్పులు
ఎచ్చెర్ల, జూన్ 19: ఈ విద్యాసంవత్సరం నుంచి ఐటిఐ కోర్సుల్లో సిలబస్ మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.వి.కె.నగేష్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ బాలికల ఐటిఐలో జిల్లాలోని వివిధ ఐటిఐలకు చెందిన ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిలబస్‌లు మార్పునకు సంబంధించి వివిధ అంశాలను ప్రభుత్వ ఐటిఐల్లో ట్రైనింగ్ అధికారులుగా పనిచేస్తున్న వారికి హైదరాబాద్, బెంగళూర్ కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదేమాదిరిగా సెమిస్టరీ విధానాన్ని అమలుచేసి ఆరునెలలకోసారి ఐటిఐ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 18 నుంచి 25వ తేదీవరకు దరఖాస్తులు చేసుకునే గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాకు సంబంధించి 3,921 దరఖాస్తులు విక్రయించగా 1904 మంది సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, అయితే 3,170 సీట్లు ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐల్లో ఉన్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో 3,910 సీట్లు, విశాఖపట్నంలో 12,013 9,031 సీట్లు ఉన్నాయని స్పష్టంచేశారు. జూలై 11వ తేదీ నుంచి ఐటిఐ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈయనతోపాటు బదిలీపై వెళ్లిన ఆర్.డి.డి జె.వి.ప్రభాకరరావు, విశాఖపట్నం ఎ.డి గురురాజ్‌కుమార్, ఎచ్చెర్ల, రాజాం, సీతంపేట ఐటిఐల ప్రిన్సిపాళ్లు రాడ కైలాసరావు, భాస్కరరావు, గోపాలరావు, శ్రీకాకుళం డిఎల్‌టిసి ఎ.డి మల్లేషు తదితరులు పాల్గొన్నారు.
కూర్మ క్షేత్రంలో ఆర్కియాలజిస్టు తనిఖీ
గార, జూన్ 19: కూర్మనాథ క్షేత్రాన్ని ఆర్కియాలజీ విభాగం ఎ.డి. విష్ణుమూర్తి బుధవారం సందర్శించారు. తొలుత స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం వర్షం నీరు గుడిలొపలికి చిమ్ముతుండడంతో గతంలో రోడ్లు, భవనాలు శాఖ మరమ్మతులు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆర్.అండ్.బి. ఎ.ఇ. గోపాలరావు, పర్యవేక్షకుడు గోవిందరావులు సమక్షంలో ఈ పరిశీలనలు జరిగాయి. స్వామివారి గర్భగుడి వెలుపలి భాగంలో చేపట్టిన పనులు ఎంత వరకు సక్రమంగా ఉన్నాయన్న అంశంపై సంబంధిత ఎ.డి. పరిశీలన చేశారు.
ఎంఎ(ఆర్‌డి) కోర్సుకు స్పందన కరవు
ఎచ్చెర్ల, జూన్ 19: అంబేద్కర్ యూనివర్శిటిలో ఎం.ఏ రూరల్ డెవలప్‌మెంట్ కోర్సుకు విద్యార్థులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. ఆసెట్‌తో సంబంధం లేకుండా నేరుగా సీట్ల భర్తీకి కౌనె్సలింగ్ నిర్వహించాలని వర్శిటీ అధికారులు భావించినప్పటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 40 సీట్లతో ఉన్న ఈ కోర్సును అభ్యసించేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదు. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంటోంది. ఈ ఏడాది కూడా ఆసెట్ నుంచి ఐదుగురు అడ్మిషన్ పొందగా మిగిలిన 35 సీట్ల కోసం బుధవారం క్యాంపస్‌లో ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య పర్యవేక్షణలో అడ్మిషన్ కౌనె్సలింగ్ సాగింది. అయితే నలుగురు మాత్రమే ఆసక్తి కనబరచడం అధికారులు సైతం అవాక్కయ్యారు. మిగిలిన 31 సీట్లు ఈ విద్యాసంవత్సరంలో భర్తీ అయ్యే పరిస్థితులు కనిపించకపోవడంతో వర్సిటీ అధికారులకు ఏం చేయాలో తోచడం లేదు. ఉద్యోగవకాశాలు లేని పి.జి కోర్సులపై నేటి యువత ఆసక్తి కనబరచకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆచార్యులు సైతం చెబుతున్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి రూ.28 లక్షలతో ప్రతిపాదనలు
పాతశ్రీకాకుళం, జూన్ 19 : జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ఈ ఏడాదికి గాను 28 లక్షల నిధులను కోరుతూ రాజారామోహన్‌రాయ్ ఫౌండేషన్‌కు ప్రతిపాదనలు పంపించామని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట నందకుమార్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన సర్వసభ్యసమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 2013-14 సంవత్సరంలో 94 లక్షలతో ప్రారంభించిన వీరఘట్టం, రణస్థలం, లావేరు, ఆమదాలవలస, కవిటి, కంచిలిలోని శాఖాగ్రంథాలయ భవనాల నిర్మాణాభివృద్దికి ఆర్‌ఆర్‌ఎల్‌ఎఫ్, ప్రభుత్వం, స్థానిక సంస్థలు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీపరీక్షల్లో పాల్గొంటున్న యువతకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే యుపిపిఎస్‌సీ, ఏపీపీ ఎస్‌సీ,స్ట్ఫా సెలక్షన్ కమిటీ, రైల్వేసర్వీస్ కమీషన్, బ్యాంకు రిక్రూట్‌మెంట్ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆమోదించిన బడ్జెట్ అంచనాలను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆర్ ఆర్ ఎల్ ఎఫ్ కంట్రిబ్యూషన్ ఫండ్ చెల్లించేందుకు 5 లక్షలకు, స్థ్ధానిక సంస్ధల నుంచి రావల్సిన 25 లక్షల నిధులను రప్పించేందకు తగిన విధంగా చర్యలు చేపట్టాలని, పట్టణంలో ఏర్పాటు చేయబోయే రెండు నూతన గ్రంధాలయాలకు స్ధలాల కోసమై జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో ఆ సంస్ధ కార్యదర్శి పి పద్మ, సభ్యులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో సీట్ల భర్తీకి చర్యలు
పాతశ్రీకాకుళం, జూన్ 19: జిల్లాలో 14 మోడల్ స్కూళ్లకు సంబంధించి సీట్ల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు డి.ఇ.ఒ ఎస్.అరుణకుమారి వివరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో మోడల్ స్కూళ్లలో సీట్ల భర్తీపై విద్యాశాఖాధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గురువారం బాపూజీ కళామందిర్‌లో లాటరీ పద్ధతిన డ్రా నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల మోడల్‌స్కూళ్లకు, అలాగే ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి సంబంధించి మొత్తం ఎనిమిదివేలకుపైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. మోడల్ స్కూళ్లలో ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు ఒక్కో తరగతిలో 80 సీట్లు, అలాగే ఇంటర్మీడియేట్‌లో వివిధ సీట్లకు సంబంధించి భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డిఇఒ బలివాడ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
తూ.గో, శ్రీకాకుళం క్రికెట్ మ్యాచ్ డ్రా
బలగ, జూన్ 19: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న సీనియర్ నార్త్‌జోన్ క్రికెట్ పోటీల్లో భాగంగా శ్రీకాకుళం-తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యతతో కొనసాగిన శ్రీకాకుళం జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. శ్రీకాకుళం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 101.1 ఓవర్లకు 388 పరుగులు చేసి అంతా అవుటయ్యారు. జట్టులో ఎం.ప్రణీత్ 137, ఆర్.సూరజ్‌ప్రీతమ్ 96 పరుగులు, ఎస్.ఎస్.శ్రీనివాస్ 73, ఎం.ఎస్.దీపక్ 33 పరుగులు చేశారు. తూర్పుగోదావరి జట్టులో బి.అయ్యప్ప నాలుగు వికెట్లు, స్టీఫెన్, సురేష్‌లు చెరో రెండువికెట్లు సాధించారు. అనంతరం జరిగిన తూర్పుగోదావరి రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేశారు. మూడవరోజు పూర్తికావడంతో అంపైర్లు డ్రాగా ప్రకటించారు. దీంతో శ్రీకాకుళం జట్టుకు మూడు పాయింట్లు లభించాయి.
జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా
english title:
fitness of school buses
Date:
Thursday, June 20, 2013