విశాఖపట్నం, జూన్ 19: అగ్నిప్రమాద రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమని జివిఎంసి కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ అన్నారు. విద్యా సంస్థల నిర్వాహకులు, వాణిజ్య సముదాయాల యజమానులు, వ్యాపారులతో జివిఎంసి పాత కౌన్సిల్ హాలులో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలను నియంత్రించే ముందు ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదాలు సంభివిస్తే వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. వాణిజ్య, వాణిజ్యేతర బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాద నివారణ పరికరాలను ఏర్పాటు చేసుకునే విధంగా యాజమాన్యాలు ముందుకు రావాలని స్పష్టం చేశారు. అగ్నిప్రమాదాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించేందుకు జివిఎంసి పరంగా పక్కా ప్రణాళికతో రంగం సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు తెలిపారు. నగర పరిధిలో అగ్నిప్రమాదాల నివారణ బాధ్యతను జివిఎంసికి అప్పగించినట్టు కమిషనర్ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నేషనల్ ఫైర్‌సేఫ్టీ ప్రమాణాల మేరకు అన్ని వాణిజ్య, వాణిజ్యేతర భవనాల్లో అగ్నిమాపక నివారణ పరికరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో సుమారు 4293 బహుళ అంతస్తుల భవనాలు ఉండగా, వీటిలో కనీస భద్రతా ప్రమాణాలు లేవని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో పలు వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాలను తనిఖీ చేయగా అత్యధిక శాతం భవనాల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తే తప్పించుకునే వీలులేని విధంగా నిర్మాణాలున్నాయన్నారు. నగర పరిధిలోని పలు సినిమా థియేటర్‌లలో కూడా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేనట్టు గుర్తించామన్నారు. ఇదే పరిస్థితి కల్యాణ మండపాల్లో కూడా ఉందని తెలిపారు. ఆస్తినష్టం జరిగితే తిరిగి పూడ్చుకోవచ్చని, ప్రాణనష్టం సంభవిస్తే ఎవరూ పూడ్చలేరని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యాలు ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ప్రతిజోన్‌కు రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ బృందాలు తమ పరిధిలోని వాణిజ్య, వాణిజ్యేతర భవనాలను తనిఖీ చేసి అగ్నిమాపక పరికారలు లేని భవనాల యజమానులకు నోటీసులు జారీ చేస్తారని తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలో పరికరాలు ఏర్పాటు చేసుకోని పక్షంలో భవనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. జివిఎంసి ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎస్‌వి నరసింహం మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వాటిని నియంత్రించేందుకు కనీస పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ ప్రమాణాలను పాటిస్తే కొంతలో కొంత ఆస్తి,ప్రాణ నష్టాలను నివారించవచ్చని అన్నారు. సమావేశంలో జివిఎంసి ముఖ్య ప్రణాళిక అధికారి ఎస్ బాలకృష్ణ, డిసిపి వెంకటసుబ్బయ్య, జివిఎంసి అధికారులు, వాణిజ్య భవనాల యజమానులు పాల్గొన్నారు.
‘గ్రీన్ విశాఖ లక్ష్య సాధనకు
చర్యలు తీసుకోవాలి’
విశాఖపట్నం, జూన్ 19: సుందర విశాఖ నగరాన్ని కాలుష్యం బారినుంచి రక్షించేందుకు ఉద్దేశించిన గ్రీన్‌విశాఖ ప్రాజెక్టు లక్ష్య సాధనకు పరిశ్రమల యాజమాన్యాలు కృషి చేయాలని ప్రాజెక్టు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న వుడా విసి ఎన్. యువరాజ్ పిలుపునిచ్చారు. సాగరతీర నగరంగా, పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య, వ్యాపార, విద్యా, సాంస్కృతిక కేంద్రగా విలసిల్లుతున్న విశాఖను పర్యావరణ అనుకూల ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు పంచవర్ష ప్రణాళికగా 40 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధిగమించేందుకు అందిరి సహకారం అవసరమని అన్నారు. ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళిక అమలులో పారిశ్రామిక సంస్థల పురోగతిని సమీక్షించేందుకు వుడా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అమలు చేస్తున్న గ్రీన్‌విశాఖ ప్రాజెక్టు విషయంలో అలసత్వం కూడదని సూచించారు. మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి, ఆయా పారిశ్రామిక సంస్థలకు అప్పగించిన దృష్ట్యా నిర్ణీత గడువులోగా నిర్ధేశించిన సంఖ్యలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. వర్షాకాలం పూర్తయ్యేలోగా మొక్కలు నాటితే వాటి జీవితకాలం సురక్షితంగా ఉంటుందన్నారు. 2012-13 సంవత్సరపు లక్ష్య సాధనలో పోర్టుట్రస్టు, బ్రాండిక్స్, ఎల్‌జి పాలిమర్స్, గంగవరం పోర్టు, నేవల్‌డాక్ యార్డు, ఆంధ్రాపెట్రోకెమికల్స్, ఎస్సార్ స్టీల్స్, రెయిన్ కాన్సిలింగ్ సెంటర్, సినర్జీస్ కేస్టింగ్ సెంటర్ తదితర సంస్థలు 75 శాతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయగా, హెచ్‌పిసిఎల్, జింక్, నాల్కో, ఈస్ట్ ఇండియా పెట్రోలియం, రాంకీ ఫార్మా సంస్థలు 50శాతానిక పైబడి లక్ష్యాన్ని సాధించాయని ఆయన వివరించారు. మరికోన్ని సంస్థలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2013-14 సంవత్సరపు లక్ష్య సాధనలో స్టీల్‌ప్లాంట్, గంగవరం పోర్టు, పెరల్ బాట్లింగ్, తూర్పు నౌకాదళం మెరుగైన ఫలితాలతో ముందుండగా, మిగిలిన సంస్థలు పనితీరును మెరుగుపరచుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెల్లో పార్లమెంటరీ కమిటీ పర్యటించనున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ సారధ్యంలో ప్రాజెక్టు అమలుపై నివేదికను ఖరారు చేసి కమిటీకి అందిస్తామని తెలిపారు. సమావేశంలో వుడా డిఎఫ్‌ఓ రామ్మోహనరావు, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ రవికుమార్, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాల్గన్నారు.
రైల్వే రిజర్వేషన్ కార్యాలయంపై
సిబిఐ దాడులు
విశాఖపట్నం, జూన్ 19: విశాఖ రైల్వే రిజర్వేషన్ కార్యాలయంపై బుధవారం సాయంత్రం సిబిఐ అధికారులు దాడి చేశారు. రైల్వే రిజర్వేషన్ కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై ఎక్కువ మొత్తానికి టిక్కెట్లను విక్రయిస్తున్నట్టు సిబిఐ అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. అంతేకాకుండా సిబ్బంది, ఏజెంట్లు లాలూచి పడి రిజర్వేషన్ టిక్కెట్లలలో అవకతవకలు పాల్పడుతున్నట్టు ప్రయాణీకులు ఆరోపిస్తుండడంతో స్పందించిన సిబిఐ ఎట్టకేలకు బుధవారం దాడులకు పూనుకుంది. రిజర్వేషన్ కార్యాలయంలో పలు సోదాలు చేసి, రిజర్వేషన్‌కు సంబంధించిన పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్‌లలో ఉన్న నగదు కంటే ఎక్కువ నగదు ఉన్నట్టు సిబిఐ అధికారులు గుర్తించడంతో ఇద్దరు రైల్వే ఉద్యోగులను వారు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా దీనిపై మీడియా ప్రతినిధులు రైల్వే డిఎస్‌పి వి.్భమారావును ప్రశ్నించగా ఇవి రెగ్యులర్‌గా జరిగే దాడులేనని బదులిచ్చారు.
దేశపాత్రునిపాలెంలో
దొంగల బీభత్సం
పరవాడ, జూన్ 19:్భర్యాభర్తలను తీవ్రంగా గాయపరిచి ఇంట్లో ఉన్న 80 తులాల బంగారు ఆభరణాలు, నగదును బుధవారం రాత్రి దోచుకుని ఆరుగురు దొంగల పరారయ్యారు. పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామ శివారులో జరిగిన ఈ సంఘటనపై ప్రత్యక్ష సా క్షులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దేశపాత్రునిపాలెం శివారు ఎస్సీ,ఎస్టీ కాలనీలో ఆర్టీసీలో రిటైరైన రావాడ శేషగిరిరావు, విశాఖ స్టీల్‌ప్లాంట్ పనిచేసే వాసశ్రీ నివాసం ఉంటున్నారు. గ్రామ శివారు ఉన్న వీరి ఇంటిని ఆరుగురు దొంగలు ఎంచుకుని బుధవారం రాత్రి వెళ్ళి తలుపుకొట్టగా శేషగిరిరావు తీశారు. వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో దాడి చేసి శేషగిరిరావును తీవ్రంగా గాయపరిచి ఇంట్లోకి తీసుకెళ్ళారు. ఈ అలికిడి విన్న భార్య వాసశ్రీ వంటింట్లో నుండి బయటకు వచ్చి పరిస్థితి గమనించి రక్షించమంటూ గట్టిగా కేకలు వేయడంతో ఆమెపై కూడా దాడి చేసి గాయపరిచారు. వీరిద్దరిని చేతులు, కాళ్ళు కట్టేసి ఇంట్లోని బీరువాలో ఉన్న వస్తువులను చిందరవందర చేసి లాకర్‌లో ఉన్న 80 తులాల బంగారు ఆభరణాలను, నగదును దోచుకుపోయారు. వెళుతూ ఇంటి బయట తాళం వేసి వెళ్ళిపోయారు. మోటార్ సైకిళ్లపై వచ్చిన దొంగల్లో ఇద్దరు ఘటన ప్రాంతం నుండి వెళ్ళిపోగా, వీరిలో ఇద్దరు ఊరి చివర తచ్చాడు. అదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని గ్రామస్థులు పట్టుకుని నిలదీయగా ఒకంతకు వివరాలు తెలపలేదు. గట్టిగా ప్రశ్నించి వీరి జేబులను తనిఖీ చేయగా బయటపడిన బంగారు ఆభరణాలను చూసి దేహశుద్ధి చేయడం అసలు విషయం బయటపడింది. శేషగిరిరావు, వాసశ్రీని ఇంటికి గ్రామస్థులు వెళ్ళి రక్తపుమడుగులో ఉన్న వారిని 108 వాహనంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వారిని విశాఖ సిటీలోని ప్రైవేటు ఆసుపత్రికి రాత్రికిరాత్రే తరలించారు.
ఇదిలా ఉండగా, పట్టుకున్న దొంగల ఘనకార్యం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే వారిద్దరి పరవాడ పోలీసులకు అప్పగించారు. పోలీసులను వీరిని విచారించగా, పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చింతకాయల శివాజీ, పెదగంట్యాడ మండలం అప్పికొండ ప్రాంతానికి చెందిన సూరాడ మహేష్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి నుండి కొంత బంగారు ఆభరణాలను, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగతనంలో పాల్గొన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరవాడ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.రామచంద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గిరిజనుల అవసరాలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ
* పట్టాలు, గ్యాస్ పంపిణీ
* మంత్రి బాలరాజు
గూడెంకొత్తవీధి, జూన్ 19: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు అన్ని విధాలుగా మేలు జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. గిరిజనాభివృద్ధికి తోడ్పడుతున్న కాంగ్రెస్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆయన కోరారు. బుధవారం మండలంలో యుకో బ్యాంకు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. ఇందిరాగాంధీ నుండి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఫలాలను అందిస్తూ గిరిజనుల మేలు కోరేది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి అభివృద్ధి పథకం ప్రజలకు నేరుగా చేరాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు బ్యాంకుల ద్వారా తీసుకునే అవకాశం సులువుగా ఇక్కడి ప్రజలకు దక్కుతుందన్నారు. బ్యాంకులను జాతీయం చేసినది కాంగ్రెస్ ఫ్రభుత్వమేనని మంత్రి గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటుచేయాలని ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్ధిక మంత్రుల సమావేశంలో ఇటీవల ముఖ్యమంత్రి విన్నవించుకున్నారని, ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాంకుల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలో బ్యాంకు కోసం స్థలం ఏర్పాటుకు నేను సిద్ధంగా ఉన్నానని, త్వరితంగా బ్యాంకు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. అందరికీ సమానంగా బ్యాంకు సేవలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. అందరికీ ఇళ్ళు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. బంగారుతల్లి పథకం ద్వారా ఆడబిడ్డ పుట్టినప్పటి నుండే దశలవారీగా నగదును చెల్లించేందుకు ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకువస్తుందని ఆయన అన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా గిరిజనులకు భూమి హక్కు పట్టాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటమే కాక, ప్రస్తుతం అనేక గిరిజన ప్రాంతాల్లో భూమి పట్టాలు పంపిణీ చేశారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి వై.నరసింహారావు, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి బాలరాజు సుడిగాలి పర్యటన
గూడెంకొత్తవీధి, జూన్ 19: గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు బుధవారం క్షణం తీరికలేకుండా సుడిగాలి పర్యటన చేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని క్షణం తీరిక లేకుండా గడిపారు. మం డలంలోని తీములబంద గ్రామానికి 98 లక్షల రూపాయలతో నిర్మించనున్న తారు రోడ్డుకు శంకుస్ధాపన చేశారు. తదనంతరం దుచ్చరిపాలెం, దేవరాపల్లి,యర్రవరం గ్రామాలకు మంచినీటి పథకాలకు శంకుస్ధాపన చేయగా పి.కొత్తూరు లో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. కోటి 50 లక్షలతో నిర్మించిన దుచ్చరిపాలెం, పారికెల రహదారిని ప్రారంభించారు. రామగెడ్డ, దేవరాపల్లి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. తదనంతరం మండల కేంద్రంలో అంగన్‌వాడీ కేంద్రానికి శంకుస్థాపన చేసి ఎలిమెంటరీ పాఠశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభించారు. నేరుగా గూడెంకొత్తవీధి కార్యాలయ సముదాయంలో నూతన యుకో బ్యాం కును ప్రారంభించారు.
మైనర్ శారదానది గండి
పూడ్చివేత పనులు పూర్తి
యలమంచిలి, జూన్ 19: రాంబిల్లి మండలంలోని నీలం తుఫాన్‌కు నారాయణపురం వద్ద మైనర్ శారదానదికి పడిన గండి పనులు పూర్తి చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది నవంబరులో వచ్చిన వరదలకు శారదానది పొంగి ప్రవహించింది. దీంతో అదుపు తప్పిన నీటి ప్రవాహం మైనర్ శారదానదికి నారాయణపురం వద్ద ఎడమ గట్టుకి భారీగా గండి పడింది. దీంతో సుమారు ఏడు గ్రామాలు జలమయం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పొలం నీట మునిగింది. ప్రజలకు యలమంచిలితో రాకపోకలు తెగిపోయాయి. వరద ఉధ్ధృతి తగ్గిన తరువాత అధికారులు రహదారిని పునరుద్దరించారు. కానీ ఇసుక బస్తాలతో కట్టిన గండిని నిన్నటివరకు వదిలేయడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీనిపై వైఎస్సార్ సిపి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో ఇరిగేషన్ అధికారులు గండి పనులకు శ్రీకారం చుట్టారు. పనులు వారం రోజులుగా చేపట్టి పూర్తి చేశారు. దీంతో రైతుల్లో నిన్నటివరకు వెంటాడిన భయాందోళనలు గండి పనులు పూర్తి కావడంతో సద్దుమణిగాయి. కాగా, గండిపడిన చోట కాంట్రాక్టు నాణ్యతమైన పనులు జరపలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండిని కొండ మట్టి(గ్రావిల్)తో పూడ్చవల్సి ఉండగా, చేడుమట్టితో పూడ్చారని రైతులు, స్థానికులు అంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పర్యావేక్షణ జరిపి విమర్శలకు తావులేకుండా ప్రకటన చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జూలై నుంచి అంగన్‌వాడీల్లో మధ్యాహ్న భోజనం
*ఆర్‌డిడి అనసూయ వెల్లడి
అరకులోయ, జూన్ 19: అంగన్‌వాడీ కేంద్రాల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుండి మధాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్టు స్ర్తి అభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఉత్తరాంధ్ర ప్రాం తీయ సంయుక్త సంచాలకులు పి.అనసూయ వెల్లడించారు. మండలంలోని పద్మాపురం నేచర్ సంస్థ ట్రైబల్ ఫౌండేషన్ సముదాయంలో ఆరోగ్యం, పోషకాహారంపై బుధవారం జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. చేతన ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాదిరిగానే అంగన్‌వాడీల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని పెట్టనున్నట్టు ఆమె చెప్పారు. కిచిడీలతో చిన్నారులకు కడుపునింపుతున్న ప్రభుత్వం కొత్త మె నూని తయారుచేసి ఇకనుండి ప్రత్యేక ప్రణాళికతో మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రస్తుతం చిన్నారులు, గర్భిణు లు, బాలింతలు, కిశోరీ బాలికలు పోషకాహారం పొందుతున్నారన్నారు. మూడు నుండి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు కేంద్రాల్లోనే స్వయంగా ఆహారాన్ని తయారుచేసి ఇస్తుండగా మిగిలిన లబ్ధిదారులకు ఇంటికి నేరుగా సరుకులను అందిస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రస్తుతం అనుకున్న స్థాయిలో పోషకాలు అందడంలేదని గుర్తించిన ప్రభుత్వం కొత్తమెనూని అమల్లోకి తీసుకువస్తుందన్నారు. నెలలో 15 రోజులపాటు ప ప్పు, ఆకుకూరలు, మిగిలిన పక్షంపాటు కూరగాయలతో సాం బారు ఇస్తారన్నారు. వారంలో గురు, శని మినహా మిగిలిన నాలుగురోజుల్లో కోడిగుడ్డు అందిస్తామన్నారు. జిల్లాలో ఎనిమిది ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టులుఉన్నాయని, ఈ ప్రాజెక్టుల పరిధిలో 1122 ప్రధాన అంగన్‌వాడీలు, 1100 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నట్టు ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 8 ,239 మంది గర్భిణులు, 9,200 మంది బాలింతలు ఉన్నారన్నారు. వీరిలో మారుమూల గ్రామాలకు చెందిన అనేక మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించామన్నారు. జిల్లాలో కొత్తగా 28 మంది సూపర్‌వైజర్లను నియమించినట్టు ఆమె తెలిపారు. కొత్త పోస్టుల నియామకాలు జరిగినప్పటికీ సూపర్‌వైజర్ల కొరత పట్టిపీడిస్తుందన్నారు. మరో రెండు నెలల్లో మరికొంతమంది సూపర్‌వైజర్ల నియామకాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో సిబ్బ ంది కొరత ఉన్నందున నేజర్ సంస్థ సిబ్బంది సహాయ సహకారాలను తీసుకుని అంగన్‌వాడీల సేవలను మెరుగుపరుచుకోవాలన్నారు.
సదస్సులో ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ ఎ.ఇ. రాబర్ట్ మాట్లాడుతూ స్ర్తి, శిశు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. స్ర్తి, శిశు మరణాలను నియంత్రించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్ధలు కృషి చేస్తున్నాయన్నారు. పేదరికం కారణంగా పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆహారంతోపాటు కోడిగుడ్లు సరఫరా చేస్తుందని చెప్పారు. కోడిగుడ్లలో పోషకవిలువలు పుష్కలంగా ఉం టాయని, చిన్న పిల్లల నుండి గర్భిణుల వరకూ పోషకాహార లోపంతో బాధపడే వారు గుడ్లు తినాలని వైద్యులు సలహా ఇస్తుంటారని ఆయన చెప్పారు. యూనిసెఫ్ న్యూట్రీషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎం.లక్ష్మీ భవానీ మాట్లాడుతూ ఆరోగ్యం, పోషకాహారంపై నేచర్ సంస్థ, చేతన ప్రాజెక్టు జాగృతి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. గిరిసీమలో పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భణులు, బాలింతలు, బాలబాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని ఆమె చెప్పారు. నేచర్ సంస్థ మన్యం ప్రగతి, గిరిజనుల సంక్షేమం కోసం శ్రమిస్తుండడం గర్వించదగ్గ విషయమని లక్ష్మీ భవానీ పేర్కొన్నారు. అనంతరం ఆరోగ్యం, పోషకాహారంపై అధికారులు, సంస్థల ప్రతినిధులు గోడపత్రికలను విడుదల చేశారు. అంతకుముందు సామూహిక సీమంతం నిర్వహించారు. నేచ ర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.బాలరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హెల్త్ కన్సల్టెంట్ మీనా, ఫుడ్ అండ్ న్యూ ట్రిషన్ బోర్డు ప్రతినిధి కె.ఆర్.వెంకటేశ్వర్లు, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ అధికారి ఇందిరాదేవి, సంస్థ ప్రతినిధులు జి.హైమావతి, టి.సుజాత, ఎం.లక్ష్మి, గౌరీశంకర్ పట్నాయక్, రామచందుర్, శ్రీనివాస్ రామారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సబ్బవరం డిటి, సర్వేయర్ సస్పెన్షన్
* ప్రభుత్వ భూములను ప్రైవేటుకు దారాదత్తంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం
* తహశీల్దార్‌కు చార్జిమెమో * సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలకు ఐజికి లేఖ
సబ్బవరం, జూన్ 19: సబ్బవరం డిప్యూటీ తహశీల్దార్ జె.రమేష్‌బాబు, మండల సర్వేయర్ శ్యామ్‌ను జిల్లాకలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వ బంజరుభూములను ప్రలోభాలకు లొంగి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలకు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని బుధవారం తహశీల్దార్ ఎం. నాగభూషణరావు ధ్రువీకరించారు. .కాగా ఇక్కడి తహశీల్దార్ ఎం.నాగభూషణరావు కింది సిబ్బంది రెవె న్యూ రికార్డులను నిబంధనలకు విరుద్ధంగా బయటి వ్యక్తులకు కాపీలు జారీతోపాటు ప్రభు త్వ బంజరుభూమిని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిగా నిర్ధారిస్తూ ఒక సర్వేయర్ స్వయంగా సర్ట్ఫికెట్ సబ్బవరం సబ్‌రిజిస్ట్రార్‌కు జారీచేయటం పట్ల స్పందించని కారణంగా ఆయనకు చార్జిమెమో ఇచ్చినట్లు రెవె న్యూ వర్గాలద్వారా తెలిసింది. ఇరువాడ రెవెన్యూ పరిధికి చెందిన ప్రభుత్వ బంజరుభూమిని తమ రికార్డుల్లో ప్రభుత్వభూమి అని పేర్కొన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకు ముందు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తహశీల్దార్‌కు ఎన్‌ఒసి కోసం దరఖాస్తుచేసినట్లు ఇక్కడి సబ్‌రిజిస్ట్రార్ రేవతి విచారణలో దొరికిపోవటంతో ఆమెపై రాష్ట్ర స్టాంపులు,రిజిస్ట్రేషన్లశాఖ ఐజికి ఫిర్యాదు చేసినట్లు తె లిపారు. ఆమెకు కూడా చార్జిమెమో జారీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సబ్బవరం సర్వేనెంబర్ 271లోగల ప్రభుత్వ బంజరు భూమి మొత్తం 88.02 ఎకరాల మేర రెవె న్యూ రికార్డు దాఖలా ఉన్నప్పటికీ ఆక్రమణలకు గురైందని వచ్చిన ఆరోపణలపై జిల్లాకలెక్టర్ స్వయంగా స్పందించి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్ట్ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఇచ్చిన రిపోర్టుపై జిల్లాజాయింట్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో పరిశీలనకు వచ్చిన జెసి 271 విస్తీర్ణం మొత్తం సర్వేచేసి సరిహద్దులు నిర్ణయించి తీగ కంచె నిర్మించాలని ఆక్రమణల తొలగింపులోప్రత్యేక పోలీసు బలగాలకోసం జిల్లా ఎస్పీని అభ్యర్ధించారు.ఎలాంటి ఆధారాలు లేని ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
అగ్నిప్రమాద రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అందరి
english title:
visakha
Date:
Thursday, June 20, 2013