Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘విద్యా పక్షోత్సవాలు విజయవంతం చేయండి’

$
0
0
విజయనగరం, జూన్ 19: విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అధికారులను ఆదేశించారు. ఈ నెల 22 నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు విద్యా పక్షోత్సవాలను నిర్వహించలన్నారు. బుధవారం రాత్రి ఆయన వివిధ అంశాలపై వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా పక్షోత్సవాలు, సీజనల్ వ్యాధులు, ఎరువులు, విత్తనాల పంపిణీ తదితర అంశాలపై సమావేశాలపై కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యతోపాటు వౌలిక సదుపాయాలు కల్పనపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలన్నారు. బాలకార్మికులు ఎక్కడా లేకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న పాఠశాలలను ఈ నెల 23న ప్రారంభించాలన్నారు. అదే విధంగా సంక్షేమ దినోత్సవం, మాతృభాష దినోత్సవం, కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాల దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా పక్షోత్సవాల కార్యక్రమాల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన ఇన్‌ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ విద్యా పక్షోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు విద్యాశాఖతోపాటు అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తామని తెలిపారు. మండల, గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి విద్యా ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో బాలకార్మికులను గుర్తించి వారిని బడుల్లో చేర్పిస్తామన్నారు. జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ కింద ప్రతిపాఠశాలలో కనీస అవసరాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం పార్వతీపురం, జూన్ 19: పట్టణం, పరిసర ప్రాంతాల్లో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోయాయి. భారీ వర్షం కారణంగా బైపాస్‌కాలనీ, వై కె ఎం కాలనీ, జనశక్తికాలనీ, ఎస్ ఎన్ పురం తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షానిక మెయిన్ రోడ్డులోని నీటి ప్రవాహం పెరిగిపోయింది. మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగునీటి కాలువలపై వ్యాపారులు ఆక్రమణలు చేయడంతో పాటు కాలువల్లో పూడికలు తొలగించని కారణంగామురుగునీరంతా వర్షం నీరంతా రోడ్డుపైనుండే ప్రవాహంలా పారుతోంది. అయితే అధికారులు ఈవిషయంలో కనీసం చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ‘పన్నుల లక్ష్యం రూ.66 కోట్లు’ పార్వతీపురం, జూన్ 19: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌కు రూ.66 కోట్లు వాణిజ్య పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వాణిజ్యపన్నుల విభాగం డిప్యూటీ కమిషనర్ ఎవి ఎం శర్మ తెలిపారు. బుధవారం ఆయన పార్వతీపురం వచ్చిన సందర్భంగా కమర్షియల్ టాక్సు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.66కోట్లు లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ఈనెలాఖరునాటికి రూ.53కోట్లు వసూలు లక్ష్యాలు చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పన్నులు వసూలు లక్ష్యాలకు వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. పన్నులు చెల్లించకుండా రవాణా చేస్తున్న వాహనాలపై నిఘా పెడుతున్నామన్నారు. విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం, శ్రీకాకుళం జిల్లాలోని పురుషోత్తమపురం వాణిజ్యపన్నుల చెక్‌పోస్టుల ద్వారా వాహనాల తనిఖీలు ముమ్మరం చేస్తూ పన్నుల వసూలు చేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పరిశ్రమలకు సంబంధించిన 5శాతం, డొమిస్టిక్ సరకులకు 14.5శాతం పన్నులు వసూలు చేస్తామన్నారు. రూ.10 లక్షల వ్యాపారలావాదేవీలు చేసిన వారికి ఎలాంటి పన్నులు వేయడం జరగదని ఆయన అన్నారు. ఇక్కడి సిటిఒ పి.సురేష్, డిసిటివో మారుతీరావు పాల్గొన్నారు. 1.5 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం గంట్యాడ, జూన్ 19 : జిల్లాలో ఈఏడాది లక్ష 50 వేల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపడుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతి అన్నారు. గంట్యాడ, ఎస్.కోట,వేపాడ, కొత్తవలస, జామి మండలాలకు చెందిన ఇందిరా కాంతి పధకం ఎపిఎంలు, సిసిలతో ప్రత్యేక సమావేశాన్ని బుధవారం కోటారుబిల్లిలోని ఐకెపి కార్యాలయంలో నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న డిఆర్‌డిఎ పిడి పధకాలకు సంబంధించిన పలు అంశాలపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. పొదుపు సంఘాల సభ్యులకు సకాలంలో స్ర్తి నిధి ఆర్ధిక సాయాన్ని అందించేలా చూడాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని పని తీరులో పారదర్శకతను ప్రతిబింబించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని 640 గ్రామాల్లో లక్షా 50 వేల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్నట్లు తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం కోసం 60 లక్షల రూపాయలు పిఓపి రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. 37 కోట్ల రూపాయల మేరకు వడ్డీ లేని రుణాలను సంఘాలకు అందజేయడం జరిగిందన్నారు. ఐకెపి ఏరియా కోఆర్డినేటర్ జయశ్రీ మాట్లాడుతూ రికార్డుల నిర్వహణ స్వయం సహాయ సంఘాల పని తీరు మెరుగు పరిచేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర విషయాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సమావేశంలో డిఆర్‌డిఎ ఎపిడి, గంట్యాడ ఐకెపి ఎపిఎం అనురాధతోపాటు ఎస్.కోట, వేపాడ, జామి,కొత్తవలస మండలాల ఐకెపి ఎపిఎంలు, సిసిలు పాల్గొన్నారు. ‘రజకుల సమస్యల పరిష్కారానికి హామీ’ విజయనగరం, జూన్ 19: రజకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అదనపు జిల్లా జాయింట్ కలెక్టర్ యుసిజి నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం తన చాంబర్‌లో రజకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏ రకమైన లబ్ధిపొందడానికి అవకాశం ఉందో వివరించారు. బీసీ కార్పొరేషన్ ఇడి శోభ ఈ ఏడాది రజక సంఘాలకు ఎంత మొత్తంలో సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నదీ వివరించారు. కాగా, ఈ సమావేశంలో ఎపి రజకవృత్తిదారుల సంఘం, ఝాన్సీలక్ష్మి రాష్ట్ర రజక సంఘం పలు డిమాండ్లను చేశారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వృత్తిదారులకు వెయ్యి రూపాయలు పింఛను మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. రజకవృత్తిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. తమ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. అలాగే రజకుల భద్రత కొరకు ప్రభుత్వం సామాజిక భద్రతా చట్టం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కమ్యూనిటీ బిల్డింగ్‌ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమాధికారి, ఇతర అధికారులు, ఎపి రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి ఎం.దుర్గారావు, ఇ.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10 వేల హెచ్‌ఐవి కేసులు నమోదు సీతానగరం, జూన్ 19: జిల్లాలో 10వేల హెచ్. ఐ.వి. కేసులు నమోదయ్యాయని ఎయిడ్స్, లెప్రసీ వ్యాధుల నిర్మూలన అధికారి పట్నాయక్ తెలిపారు. సీతానగరం మండలం సీతానగరం, బక్కుపేటలో ఉన్న పి.హెచ్.సి. సబ్ సెంటర్ పనితీరును బుధవారం పరిశీలించారు. ఈ సబ్ సెంటర్‌లో రికార్డులను తనిఖీ చేసిన అనంతరం రోగులకు సంబంధించిన పలు వివరాలను అడిగితెలుసుకున్నారు. వైద్యారోగ్య సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్. ఐ.వి. సోకిన వ్యాధిగ్రస్తులకు మందులందిస్తున్నామని పేర్కొన్నారు. 2015 నాటికి పూర్తిస్థాయిలో ఈ కేసులను నిర్మూలించేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వీరికి పి.పి.టి.సి. మందులు అందిస్తున్నామన్నారు. అలాగే జిల్లాలో 10వేలమందికి ఒకరు వంతున కుష్టు వ్యాధిగ్రస్తులున్నట్లు తెలిపారు. 250మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కొత్త కేసులు నమోదుకాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఉన్నవారు సకాలంలో మందులను వినియోగిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిజియోథెరపీ అధికారి జగదీష్, డి.పి.టి. ఓ. మురళీకృష్ణ, వైద్యాధికారులు చందన, తదితరులు పాల్గొన్నారు. వీఆర్వో సప్పెన్షన్ బొండపల్లి, జూన్ 19 : మండలంలోని దేవుపల్లి గ్రామ రెవెన్యూ అధికారి రాజేటి మురళీధరరావును సప్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు డిప్యూటీ తహశీల్ధార్ రమణరాజు బుధవారం తెలిపారు. ఇటీవల పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరుకు 5వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఈమేరకు జిల్లా అధికారులు విఆర్వో మురళీధర్‌రావును సప్పెండ్ చేసిందన్నారు. ‘ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి’ విజయనగరం, జూన్ 19: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని పరిశ్రమలశాఖ కమిషనర్ రజత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వివిధ జిల్లాల పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్లతో వీడియో కానె్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న అంశాలపై ఆయన సమీక్షించారు. ఇక్కడి పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షం.. చల్లబడ్డ వాతావరణం విజయనగరం, జూన్ 19: దట్టమైన నల్లని మేఘాలు... ఉరుములు.. మెరుపులతో పట్టణంలో జోరున వర్షం కురిసింది. బుధవారం మధ్యాహ్నాం 3.30 గంటల నుంచి దాదాపు గంట సేపు వర్షం కురిసింది. విజయనగరంతోపాటు గంట్యాడ, గజపతినగరం తదితర మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. గంట్యాడలో 6సెంమీల వర్షం కురిసింది. ఈ వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా, జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు పిడుగులు పడటంతో గంట్యాడలోని ఆవు, కొండతామరాపల్లిలో 13 గొర్రెలు మృతి చెందాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రత పెరగడం, గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వంటి కారణాలతో జనం ఉక్కపోతకు గురయ్యారు. దీనికితోడు విద్యుత్ కోతలు ఉండటంతో జనం అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షం కురవడంతో ప్రజలు సేదతీర్చుకున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలో కురిసినవర్షాలకు రోడ్డుపై నీరు ప్రవహించింది. గూడ్స్‌షెడ్ వద్ద అడుగులోతులో నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ ఈ వర్షాలు సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగానికి దోహదపడగలవని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ‘నిరక్షరాస్యతను నిర్మూలించాలి’ విజయనగరం, జూన్ 19: జిల్లాలో నిరక్షరాస్యత నిర్మూలకు వివిధ శాఖల పరస్పర సహకారంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘీక సంక్షేమశాఖ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, స్ర్తి శిశు సంక్షేమశాఖ, విద్యశాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేసి నిరక్షరాస్యత నిర్మూలనకు కృషి చేయాలన్నారు. అలాగే నేరుగా విద్యను అందించడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రత్యేకాధికారులు మండలాలను దత్తత తీసుకొని బడిఈడు పిల్లలందరూ బడిలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శతశాతం బడిఈడు పిల్లలు బడిలో ఉండాల్సిందేనని అన్నారు. 14 అంశాలపై పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. విద్యా పక్షోత్సవాల్లో భాగంగా పిల్లలకు విజ్ఞాన పర్యటనలు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్నారు. పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేలా ప్రత్యేకాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బిఆర్ అంబేద్కర్, డిఇఒ కృష్ణారావు, రాజీవ్ విద్యా మిషన్ పిఒ కెవి రమణ, బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్, ఎస్సీ సొసైటీ ఇఇ ఆదినారాయణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యా పక్షోత్సవాలను విజయవంతం చేయాలని
english title: 
fortnight

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>