Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

2014 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితా సెప్టెంబరులో విడుదల

$
0
0
ఏలూరు, జూన్ 19 : రాష్ట్రంలో 2014 సాధారణ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా సెప్టెంబరులో విడుదల చేస్తామని రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఇరిగేషన్ అతిధిగృహంలో బుధవారం ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియపై రెవిన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 5.90 కోట్ల మంది ఓటర్లు నమోదయ్యారని 18 సంవత్సరాలు నిండిన వారందరి పేర్లను కూడా ఓటర్ల జాబితాలో పొందుపరచడానికి నిరంతరం ఓటర్ల చేర్పు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఒకే పేరుతో పలు చోట్ల ఓటర్లుగా నమోదైనట్లు కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా గుర్తించామని, ఇటువంటి పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల వరకు వున్నట్లు ప్రాధమికంగా గుర్తించామని, వాటి ఫొటో ఆధారాలతో సరిపోల్చి ఒకే వ్యక్తి పేరు మీద పలు చోట్ల ఓటు హక్కు ఉన్నట్లైతే పోలింగ్ బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన కార్యక్రమంలో అటువంటి వారికి ఒకే చోట ఓటు హక్కు ఎక్కడ ఉండాలో నమోదు చేసుకుని ఇతర ప్రాంతాలలో ఉన్న వాటి పేర్లను తొలగించడం జరుగుతుందని చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియగా సాగుతుందని, కావున 18 సంవత్సరాలు నిండిన యువత ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ లోగా పూర్తి చేయాలని, 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ప్రజలలో అవగాహన తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల పనితీరును పరిశీలించి శిధిలావస్థలో ఉన్న వాటి స్థానే కొత్త పోలింగ్ కేంద్రాల పేర్లను ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు వెంకటేశ్వరరావు చెప్పారు. ఇంటికి తిరిగి ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ లోగా పూర్తిచేసి వివరాలను జూలై 10వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 27,19,327 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఇంత వరకు ఇంటింటికి వెళ్లి ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఇంత వరకు 23,96,573 మంది ఓటర్ల వివరాలను పరిశీలించడం జరిగిందని, చనిపోయిన వారి పేర్లు, ఒకే పేరు మీదుగా ఓటర్లుగా నమోదైన వారి పేర్లు, నివాసం మార్పు కారణంగా మరలా ఓటర్లుగా నమోదైన పేర్లు, జాబితాలో ఫొటో లేని కారణంగాను 15485 పేర్లను పోలింగ్ బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితా నుండి తొలగించడం జరిగిందన్నారు. మిగిలిన ఓటర్ల వివరాలను ఈ నెల 24వ తేదీ లోగా పరిశీలించి ఓటర్ల వివరాలను జూలై 10వ తేదీ నాటికి ఆన్‌లైన్ పొందుపరచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పోలింగ్ బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నారని, అదే విధంగా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతున్నదన్నారు. 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేందుకు డిగ్రీ, ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అదే ప్రదేశంలో వారి నుండి ఓటర్ల నమోదు పత్రాలు స్వీకరించడం జరిగిందన్నారు. కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు మీ-సేవ, పోస్ట్ఫాసు, మండల తహశీల్దారు, ఆర్‌డివో తదితర కార్యాలయాలలోను, ఆన్‌లైన్ ద్వారా కూడా వీలు కల్పించడం జరిగిందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం మోహనరాజు, ఆర్‌డివోలు కె నాగేశ్వరరావు, వసంతరావు, సూర్యారావు, నిక్‌నెట్ సైంటిస్ట్ గంగాధర్, మండల తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా సాగర్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు పరిశీలన కేంద్ర పర్యావరణ కమిటీ, కేంద్ర జలవనరుల కమిషన్ సభ్యులు బుట్టాయగూడెం, జూన్ 19: పర్యావరణానికి అనుకూలంగా పోలవరం ఇందిరా సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన చర్యలు పరిశీలిస్తున్నట్టు కేంద్ర పర్యావరణ కమిటీ, కేంద్ర జలవనరుల కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను, ఇప్పటివరకు జరిగిన కొన్ని ప్రాజెక్టు నిర్మాణాలను కేంద్ర కమిటీ సభ్యులు బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వాల అభ్యంతరాలు సేకరణ నేపధ్యంలో కమిటీ సభ్యులు ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. పోలవరం మండలం రామయ్యపేట గ్రామ సమీపంలో నిర్మించిన స్పిల్‌వే నుండి గోదావరి నదికి అనుసంధానంగా తూర్పు, పశ్చిమల వైపు నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం హిల్‌వ్యూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పోలవరం ప్రాజెక్టు నమూనా చిత్రాన్ని ప్రదర్శిస్తూ ప్రాజెక్టు ప్రయోజనాలను, నిర్మాణం తీరుతెన్నులను ఇంజనీరింగ్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు కేంద్ర కమిటీ సభ్యులకు వివరించారు. రాక్‌ఫిల్ డ్యామ్, స్పిల్‌వే, టనె్నల్స్, కుడి, ఎడమ ప్రధాన కాలువలు, రెగ్యులేటర్, కనెక్టివిటి తదితర ప్రాజెక్టు నిర్మాణాలను సందర్శించారు. పోలవరంలో పెద దేవరగొంది గ్రామ నిర్వాసితులకు నిర్మించిన కాలనీలను పరిశీలించారు. నిర్వాసితులతో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల ఇళ్లల్లోకి వెళ్లి వారి జీవన విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. నిర్వాసితుల పిల్లలకు ఏర్పాటు చేసిన పాఠశాలల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితుల పునరావాసం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాసిత గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాలు, అంగ్‌న్‌వాడీ భవనం, పాఠశాల, పంచాయతీ కార్యాలయాలను సందర్శించారు. డ్వాక్రా మహిళలను కలిసి అమలు జరిగిన ప్యాకేజీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుడి, ఎడమ కాలువలను పరిశీలించి కాలువల కింద సాగయ్యే ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఏయే జిల్లాల్లో ఏమేరకు భూములు సాగు కిందకు వస్తాయో, ఎన్ని క్యూసెక్కుల నీరు నిల్వ సామర్ధ్యమో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో గురువారం కూడా కమిటీ సభ్యులు పర్యటిస్తారని తెలిసింది. కమిటీ సభ్యులు విలేఖరులతో మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా పోలవరం ఇందిరాసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో లేదో తెలుసుకోడానికి వచ్చినట్టు తెలిపారు. కేంద్ర పర్యావరణ కమిటీ సభ్యులు బిబి బర్మన్, కెకె శర్మ, కేంద్ర జలవనరుల కమిషన్ సభ్యులు ఎఎల్ బన్సాల్, బిఎస్‌వి సత్యనారాయణ, డాక్టర్ మైత్రేయి చౌదరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో జెసి టి బాబూరావు నాయుడు, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సుదర్శనం, ఎస్‌ఇ విజయభాస్కరరావు, ఇఇలు ఆర్ వెంకటరమణ, మోహనరావు, డిఇలు పేరయ్య, ఆర్ వెంకట్రావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో వి నాన్‌రాజ్, ఐటిడిఎ పిఒ ఆర్‌వి సూర్యనారాయణబాబు, జిల్లా అటవీశాఖాధికారి రామకృష్ణ, డిఎస్పీ టి రామకృష్ణ, తిరుమలేష్ తదితరులు ఉన్నారు. ఇక కొల్లేరు పంచాయతీ *22న ఉన్నతస్థాయి భేటీ*వివరాలతో యంత్రాంగం సిద్ధం *హాజరుకానున్న కలెక్టరు*రాజకీయ కోణంపై అనుమానాలు ఏలూరు, జూన్ 19 : అనూహ్యమైన రీతిలో కొల్లేరు అంశం తెరపైకి వస్తోంది. పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపధ్యంలో అ అంశం ఒక్కసారిగా చర్చల్లోకి రావడం, అంతేకాకుండా దీనిపై ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించ తలపెట్టడం రాజకీయ పార్టీల్లో కూడా కొంత చర్చకు తావిస్తోంది. దాదాపుగా కొన్ని నెలల క్రితం ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు కొల్లేరులో జరుగుతున్న వ్యవహారాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రభుత్వంపైనే విమర్శలు సంధించిన నేపధ్యంలో కొల్లేరు అంశాన్ని పరిష్కరించేందుకు మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం గుర్తుండే వుంటుంది. అప్పట్లో ఈ కమిటీ రెండుసార్లు వరకు సమావేశం అయ్యింది. అయితే అప్పటి నుంచి ఈ కమిటీ ఊసే లేకుండా పోగా తాజాగా మరోసారి దీన్ని తెరపైకి తీసుకువచ్చి ఈ నెల 22న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశానికి రంగం సిద్ధం చేయడం గమనార్హం. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితుల్లో కొల్లేరు ప్రాంతం అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా నిలుస్తుందనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతం ఓట్లు దాదాపుగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రభావాన్ని చూపగలవన్నది బహిరంగ రహస్యమే. ఒకవైపు ఎన్నికల తరుణం ఆసన్నమవుతున్న సమయంలో ఈ అంశాన్ని మరోసారి చర్చనీయాంశం చేయడం వెనుక రాజకీయ కోణం కూడా లేకపోలేదన్న ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా కొల్లేరు వ్యవహారంలో పరిష్కారానికి నేపధ్యం ఏదైనా ఒక ప్రయత్నమంటూ జరగడం అభినందనీయమనే చెప్పుకోవాలి. కొల్లేరు ఆపరేషన్ జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు ఆ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్న దాఖలాలు లేవు. కనీసం దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందలేదనే చెప్పుకోవాలి. మరోవైపు కొల్లేరు ప్రజలు సుదీర్ఘకాలంగా అభయారణ్యం పరిధిని అయిదు నుంచి మూడుకు కుదించాలని డిమాండ్ చేస్తూనే వున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వం కాంటూరును కుదించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా ఆమోదించింది. అయినప్పటికీ దానిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన లేకుండా పోయింది. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున కాంటూరును కుదించే విషయంలో తగిన రీతిలో స్పందించకపోవడం వల్లే కేంద్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదని, దీనికి తోడు చిత్తడి నేలల జీవోను, ఎకో సెన్సిటివ్ జోన్‌ను తీసుకురావడంతో ఇప్పుడు కొల్లేరులో సాధారణ జనజీవనం కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి తలెత్తింది. వీటిపై కొల్లేరు ప్రజలు ఎంతో కాలంగా పోరాడుతున్నా దానికి తగ్గట్టు ప్రజాప్రతినిధుల నుంచి సహకారం లేకపోవడంతో వారి పోరాటం జిల్లాకు పరిమితంగా మిగిలిపోయింది. అయినప్పటికీ కొల్లేరు గ్రామాల ప్రజలు, అక్కడి సంఘాలు ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తుతూ పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లి ఉన్నత స్థాయి అధికారులను, మంత్రులను కలుస్తూ వచ్చారు. మరోవైపు తాజా పరిణామాల్లో ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం అంతకుముందు నుంచి ఆయన కొల్లేరు వాసుల పక్షాన పలుమార్లు గళం విప్పుతూ రావడంతో ఈ పరిణామం కొల్లేరు వాసులకు అనుకూలంగా మారుతుందన్న అంచనా కూడా వారిలో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో 22న జరగనున్న కొల్లేరు సమావేశం రాజకీయ కోణానికి పరిమితమవుతుందా? లేక సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందా అన్నది వేచి చూడాలి. శనివారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి జిల్లా కలెక్టరు డాక్టరు జి వాణిమోహన్, కృష్ణా జిల్లా కలెక్టరుతో పాటు అటవీ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు ఈనెల 21వ తేదీన కలెక్టరు డాక్టరు వాణిమోహన్ బయలుదేరి వెళ్లనున్నారు. అస్తవ్యస్తం ఉండి, జూన్ 19: భీమవరం పట్టణం గుండా వెళ్తున్న లోసరి కాలువ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాలువలో నీరు ఆరకుండా బెడ్ కాంక్రీట్ వేయడం వలన నాణ్యతపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు దాహమని, గొంతెత్తి అరుస్తుంటే ఇంకా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సన్నాహాల స్థాయిలో ఉండటం అధికారుల తీరుకు అద్దం పడుతోంది. గొల్లవానితిప్ప వద్ద పనులు ఇంకా ఒకపక్క గ్రావెల్‌తో కాలువ బెడ్ పటిష్టం చేయటం, మరోపక్క బెడ్ కాంక్రీట్ వేయటం జరుగుతోంది. ఇంకా వెంకయ్య వయ్యేరుపై ఏలూరుపాడు సమీపంలో అన్నయ్యకోడు ఛానల్ వద్ద కూడా రిటెయినింగ్ వాల్స్ నిర్మాణం, తోకతిప్ప వద్ద కూడా కాలువ పనులు జరుగుతున్నాయని ఉండి సబ్ డివిజన్ ఇరిగేషన్ ఇఇ చెప్పారు. మైనర్ కాలువలపై సుమారు 20 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. వీటికి నీరు అధికారికంగా మరో నాలుగు రోజుల్లో అందిస్తామంటున్నా వారం రోజులు వరకు నీరు అందించే పరిస్థితులు కనబడటం లేదు. మూడు సంవత్సరాల క్రితం ఖరారైన టెండరు పనులు కూడా సకాలంలో పూర్తి చేయించలేకపోయారు. ఇది కంట్రాక్టర్ల జాప్యం అంటున్నారు. మే రెండవ వారంలో గాని పనులు ప్రారంభం కాకపోవటం వలన పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని రైతులు విమర్శిస్తున్నారు. వీటిపై మరో నాలుగు రోజులు వరకు కూడా నీరు అందించలేమని అధికారులు చెబుతున్నారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతాధికారులు వచ్చినా అంతంత మాత్రంగానే పరిశీలన జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పశ్చిమ డెల్టా కాలువల్లో వేసవి పనుల తీరు. జిల్లాలో ప్రధాన కాలువలపై ఒక నర్సాపురం కాలువ తప్ప మిగిలిన ఏ కాలువపైనా పనులు జరగడం లేదు. వాటి సామర్ధ్యం మేరకు నీటి విడుదల చేయడం లేదు. ఇది సామాన్యుడిని కాదు. ఇరిగేషన్‌శాఖ కింది స్థాయి అధికారులను వేధిస్తున్న ప్రశ్న. సబ్ డివిజన్ స్థాయి అధికారులకు, డివిజన్ స్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా గోదావరికి వరదలు వచ్చినా ప్రధాన కాలువలకు మాత్రం నీరు విడుదల చేయడం లేదని దిగువ స్థాయి అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. పశ్చిమ డెల్టా కాలువలను ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 10న నీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే 13వ తేదీ ఉదయం మాత్రమే నీటిని విడుదల చేశారు. అప్పటి నుండి బుధవారం ఉదయం వరకు అంచెంలంచెలుగా కేవలం 1500 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేశారు. బుధవారం ఉదయం నుండి ఒత్తిడి పెరగటంతో అంచెలంచెలుగా నీరు విడుదల పెంచారు. ఉదయం 1500 క్యూసెక్కులు ఉండగా మధ్యాహ్నానికి రెండు వేల క్యూసెక్కులు, సాయంత్రానికి మరో 500 క్యూసెక్కులు అదనంగా నీరు విడుదల అవుతుందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క రోజుకు లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. గ్రామాలలో మంచినీటి ఎద్దడి మరో పక్క నారుమళ్ళు బాగా జాప్యం జరుగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం గాని, ప్రజాప్రతినిధులు గాని స్పందించకపోవడం వలన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలకు 7500 క్యూసెక్కులు వరకు నీటి విడుదల సామర్ధ్యం ఉందని అధికారులు అంటున్నారు. నర్సాపురం ప్రధాన కాలువపై మార్టేరు వద్ద ఆర్‌అండ్‌బి అధికారులు రిటెయినింగ్ వాల్ నిర్మిస్తున్నారని, నీటి విడుదలకు మట్టి అడ్డంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఏలూరు కాలువపై నవాబ్‌పాలెం వద్ద ఆర్‌అండ్‌బి అధికారులు వంతెన నిర్మాణం జరుపుతున్నారని, అది నీటి విడుదలకు పెద్ద ఆటంకం కాదని అక్కడ అధికారులు పేర్కొన్నారు. భీమవరం పట్టణానికి నీరు అందించే జిఅండ్‌వి కెనాల్‌కు బుధవారం ఉదయానికి కేవలం 125 క్యూసెక్కులు మాత్రమే నీరు విడుదల చేశారు. పైన పనులు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. ఉండి ప్రధాన కాలువపై పనులు కూడా లేవు. అక్కడ కూడా ఉండి, వెంకయ్య వయ్యేరు కాలువలకు కలిపి కేవలం 500 క్యూసెక్కులు మాత్రమే నీరు విడుదల చేస్తున్నారు. ఇలా తక్కువ ఇవ్వడానికి అధికారులు ఈ నెల 13 నుండి ఒకే సమాధానం కాలువకు ఒక్కసారిగా నీరు విడుదల చేయకూడదని అంటున్నారు. ప్రధాన కాలువలపై పనులు లేకపోయినా నీరు విడుదల తగ్గించటానికి కారణం కిందిస్థాయి అధికారులు తమకు అర్ధం కావడం లేదని అంటున్నారు. ఒక్క ఉండి సబ్ డివిజన్‌లో లోసరి మెయిన్ ఛానల్, వెంకయ్య వయ్యేరు కాలువపై అన్నయ్య కోడు ఛానల్‌పై తప్ప ఎక్కడా పనులు జరగడం లేదు. అయినా ప్రధాన కాలువపై ఉండి అక్విడెక్టు వద్ద 4.5 అడుగుల స్థాయికి బదులు ఇంకా కేవలం 2.5 అడుగులు మాత్రమే నీరు విడుదల అవుతోంది. అధికారులు మాత్రం అన్ని కాలువలకు పూర్తి సామర్ధ్యంతో నీరు విడుదల ఎప్పుడు చేస్తారని అడిగితే అందుకు సరైన సమాధానం అందించలేక పోతున్నారు. గ్రామాలలో మంచినీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. రక్షిత మంచినీటి చెరువులకు నీరు లేక గ్రామాల్లో డెడ్ స్టోరేజి నుండి ఇవ్వటం వలన మట్టి వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఇఇ పరిధిలో ఇప్పటి వరకు 65 హేబిటేషన్లలో రక్షిత మంచినీరు ట్యాంకర్ల ద్వారా అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. నీరు విడుదల ఆలస్యం అయినందున బుధవారం నుండి మరో 15 హేబిటేషన్లకు ట్యాంకర్ల ద్వారా నీరు అందించవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల్లో పూర్తినీరు మరో రెండు రోజుల్లోజిల్లాలో అన్ని ప్రధాన కాలువలకు పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని ఇరిగేషన్ శాఖ ఎస్‌ఇ ఎం వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రధాన కాలువలపై అక్కడక్కడ ఇతర శాఖల పనులు కూడా జరగడం వలన నీరు ఎక్కువగా ఇవ్వటం సాధ్యపడలేదని వివరించారు. కాలువలకు ఒక్కసారిగా ఎక్కువగా నీరు ఇచ్చినా గట్లకు నష్టం వాటిల్లుతుందన్నారు. పశ్చిమ డెల్టా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రానికి నర్సాపురం కాలువకు నీరు అందిస్తామన్నారు. మిగిలిన కాలువలకు బుధవారం సాయంత్రం నుండి నీటి విడుదల పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు బంద్ విజయవంతం ఏలూరు, జూన్ 19 : స్థానిక ఫిల్‌హౌస్‌పేటలోని అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, అక్కడ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏలూరులో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నగర బంద్ విజయవంతమైంది. ఏలూరులో నిర్వహించే బంద్‌ను విజయవంతం చేయడానికి దళిత సంఘాలు జె ఎసిగా ఏర్పడి బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతం నుంచే బృందాలుగా విడిపోయి స్థానిక ఆర్‌టిసి బస్ గ్యారేజీ, జూట్‌మిల్లు ప్రాంతాలకు చేరుకున్నారు. బస్సులను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. అలాగే జూట్‌మిల్లు పనిచేయకుండా అడ్డుకున్నారు. బంద్ కారణంగా ఏలూరులోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, బ్యాంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, హోటళ్లు, సినిమాహాళ్లు మూతపడ్డాయి. ఈ కారణంగా పెద్ద మొత్తంలో లావాదేవీలు నిలచిపోయాయి. బంద్ కారణంగా వాహనాలు అందుబాటులో లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. బృందాలుగా విడిపోయిన దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు నగరంలో కలియతిరుగుతూ తెరచి వున్న దుకాణాలను, కళాశాలలు, పాఠశాలలు, బ్యాంకులను, హోటళ్లు తదితర సంస్థలను దగ్గరుండి మూయించి వేశారు. వీటితోపాటు నగరంలోని కలెక్టరేట్, నగరపాలక సంస్థ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం వంటి ఇతర ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళన కారులు మూయించి వేశారు. బంద్‌లో భాగంగా ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో స్థానిక పాతబస్టాండ్ వద్ద ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ నిలచిపోయింది. అంతకుముందు అక్కడున్న అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బంద్ కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ ఫిల్‌హౌస్ పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని, ధ్వంసం చేసిన అంబేద్కర్ విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బెజ్జం రాజేష్‌పుత్ర, జిజ్జువరపు జయరాజు, బయ్యారపు రాజేశ్వరరావు, పొలిమేర హరికృష్ణ, నోముల రాముడు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు తీర్పు అమలుకు ఎంప్లారుూస్ యూనియన్ యత్నం భీమవరం, జూన్ 19: సింగిల్ డ్రైవర్ విధానంలో ఆర్టీసీ బస్సులను నడపకూడదని డ్రైవర్ విధులను చేసే విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్టీసీలో అమలు చేసేందుకు ఎంప్లారుూస్ యూనియన్ ప్రయత్నాలు చేస్తోందని ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాకర్ తెలిపారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సింగిల్ డ్రైవర్ విధానాన్ని అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తాము హైకోర్టుకు వెళ్ళినట్టు చెప్పారు. తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సమానంగా వేతనాలు చెల్లించాలని, గతంలో తాము కోల్పోయిన 19 శాతం పెరుగుదలను 50 శాతంతో పిఆర్‌సి ఇవ్వాలని, కండక్టర్ క్యాష్ అండ్ టిక్కెటింగ్ విధానంలో టిక్కెటు తీసుకోకపోతే కండక్టర్‌ను బాధ్యుడ్ని చేయకుండా ప్రయాణీకుడ్ని బాధ్యుడ్ని చేయాలని, ప్రమాదం జరిగితే సంబంధిత డ్రైవర్‌కు కోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు ఉద్యోగం నుంచి తొలగించకూడదని, రాష్టవ్య్రాప్తంగా ఉన్న 18 వేల డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలనే డిమాండ్‌తో సమ్మె నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. దీనిపై మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయని, మరోదఫా ఈ నెల 21న యాజమాన్యం, లేబర్ కమిషనర్ సమక్షంలో జరుగుతుందని, అక్కడ సరైన స్పందనరాకపోతే జూలై మొదటి వారం నుండి అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మెలోకి వెళ్లాలని అనుకొంటున్నామని ఆయన అన్నారు. ఆర్టీసీలో ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకురావడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ ఎన్‌ఎంయుతో పొత్తు ఉన్నా లేకపోయినా ఎంప్లారుూస్ యూనియన్ విజయం సాధించేదన్నారు. దీనికికారణం ఎన్‌ఎంయు ఏకపక్ష విధానాలను కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మికులు విసిగిపోయారని, అందువల్లే తాము విజయం సాధించేవారమని ఆయన చెప్పారు. సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె సోమరాజు, వైవి రావు, కెవి చలపతిరావు, ఎస్‌ఎస్‌రావు, ఎఎస్ నారాయణ, ఎన్ సుబ్బారావు, ఎం సీతారామప్రసాద్, సిహెచ్ శ్రీనివాసులు, దీపి బెనార్జీ పాల్గొన్నారు. ఎంఇఒ కార్యాలయంలో పాము! భీమడోలు, జూన్ 19 : భీమడోలు ఎంఇవో కార్యాలయంలో బుధవారం పాము ప్రవేశించడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కార్యాలయం బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న భీమడోలు ఫైర్ ఆఫీసర్ ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఎంఇవో కార్యాలయానికి చేరుకుని పామును బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. నీటితో గానీ, పొగతో గానీ పామును బయటకు తేవాలంటూ అగ్నిమాపక సిబ్బంది తెలియజేయడంతో కార్యాలయంలో ఉపాధ్యాయుల సర్వీసు రిజిష్టర్లు, విలువైన రికార్డులు వుండటంతో అవి పాడవుతాయనే ఉద్దేశ్యంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. కొద్ది సేపటి తరువాత ఆ అలజడికి పాము వెనుతిరిగింది. అనంతరం బయట వేసిన రికార్డులను సిబ్బంది లోపలకు చేరవేసుకున్నారు. ఇటీవలి కాలంలో మండల పరిషత్ ఆవరణలో వున్న పలు కార్యాలయాల్లోకి పాములు రావడం సర్వసాధారణంగా మారింది. 40 వేల మందికి జనశ్రీ బీమాయోజన మెప్మా పిడి శేషారెడ్డి జంగారెడ్డిగూడెం, జూన్ 19: జిల్లాలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) క్రింద స్వయం సహాయ సంఘాలలోని 40 వేల మంది సభ్యులను జనశ్రీ బీమా యోజన (జెబివై) పథకంలో చేర్పించనున్నట్టు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.వి.శేషారెడ్డి తెలిపారు. స్థానిక నగర పంచాయత్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల సభ్యులకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి)తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ పథకం రూపొపించినట్టు తెలిపారు. ఈ నెల 29వ తేదీలోపు జిల్లాలోని పట్ణణ ప్రాంతాలలో పని చేస్తున్న స్వయం సహాయ సంఘాల సభ్యుల నుండి 40 వేల మందిని జనశ్రీ బీమా యోజన పథకంలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఇప్పటి వరకు 20 వేల మంది మహిళలను ఈ పథకంలో చేర్చినట్టు తెలిపారు. ఈ పథకం క్రింద బీమా ప్రీమియంగా ప్రతి సభ్యురాలు ఏటా 90 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా మరో 90 రూపాయలు లబ్ధిదారుల తరపున ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు. ఈ పథకంలో చేరిన మహిళ సహజ మరణం చెందితే 30 వేలు, ప్రమాద వశాత్తూ మరణిస్తే 70 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు లభిస్తుందని తెలిపారు. అంతేగాకుండా ఈ కుటుంబాలలో 9 నుండి ఇంటర్ వరకు, లేక ఐటిఐ చదివే పిల్లలు ఉంటే ఇద్దరికి వారి విద్యాభ్యాసం కోసం ఏటా 1,200 రూపాయల ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని తెలిపారు. స్వయం ఉపాధి సోపానం క్రింద జిల్లాలోని 9 మున్సిపల్ పట్టణాలలో లబ్ధిదారులకు 400 యూనిట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జరిగిన తరువాత 4 కోట్ల రూపాయల రుణాలు అందించనున్నట్టు శేషారెడ్డి తెలిపారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా 6,340 యూనిట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఈ యూనిట్లకు 47 కోట్ల రూపాయల రుణాలు అందించనున్నట్టు చెప్పారు. జిల్లాలో పట్టణ ప్రాంతాలలో 11వేల స్వయం సహాయ సంఘాలు ఉన్నాయని, ఈ సంఘాలకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో 87 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఎనిమిది కోట్ల రూపాయలు రుణాలు అందించినట్టు చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం క్రింద జిల్లాలో 3,430 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు జిల్లాలో 11 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు, ఈ కేంద్రాలలో వారు ఎంపిక చేసుకున్న ట్రేడులకు అనుగుణమైన శిక్షణ ఇచ్చి, శిక్షణ ఏజన్సీలే ప్రయివేటు ఉద్యోగాలు చూపించనున్నట్టు శేషారెడ్డి వివరించారు. ఈ సమావేశంలో నగర పంచాయత్ కమిషనర్ వి.నటరాజు, మెప్మా ప్రాజెక్ట్ రిసోర్స్ పర్సన్ జి.ఆదాం, కె.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు ముఖ్య ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు
english title: 
voters list

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>